|
బర్ వన్ పుడింగి’ నామిని రాసిన ‘మూలింటామె’లో బూతు పురాణపు సంగతులేవీ లేవు! లేవు!. తిరుపతి పరిసర ప్రాంతపు పల్లెటూళ్ళో ఆడోళ్ళు మాట్లాడే పలుకులను పలికించాడే తప్ప, ఇంకిత జ్ఞానం లేకుండా కావాలని రాసి బిల్డప్ కొట్టలేదు మా మిట్టూరబ్బోడు. ఆడవాళ్ళను అనైతికంగా, అభాసుపాలు చెయ్యడానికి ‘పందొసంత’ను సృష్టించలేదు. ‘ప్రపంచీకరణ’, వంటి పెద్ద పెద్ద పదాలకు అర్థం చెప్పేందుకు ‘నామిని’ వల్ల కాదు. అసలు ఈ ‘మూలింటామె’ దేనికి ప్రతీకగా నిల్చిందనేది నా ప్రశ్న. ఓ పాఠకుడిగా ఇదీ నా పరిశీలన.
మూలింటామె ‘మనుమరాలు’ కిందిస్థాయి వర్గపు వ్యక్తితో లేచిపోతుంది. బంగారం లాంటి బిడ్లను, దేముడు లాంటి భర్తను, ఒద్దిగా సాగుతున్న ‘కాపురాన్ని’ ఉన్నపలంగా వదిలేసి పోతుంది. అది ‘ఊరి సమస్య’గా అమ్మలక్కలు, ఊర్లోవాళ్ళు ‘భజనగుడి’ కాడ మద్దిస్తం పెట్టి ‘చర్చల రచ్చలు’ జరిపి ఆ ‘మూలింటామె’ కుటుంబాన్ని వీధిలోకి పెట్టతారు. సహజంగానే తమ తప్పులను దాచిపెట్టి పక్కవాళ్ళ విషయాలను, వాళ్ళు చేసిన తప్పులను భూతద్దంలో చూసి, అంతకు ముందు చేసిన మంచి పనులను పక్కన నెట్టి లేని ‘చెడ్డ’ను బయటపెడతారు. ఇందులోనూ అంతే ! గుట్టుగా సాగె ‘మూలింటి’ సంగతులను బట్టబయలు చేస్తారు- ‘మూలింటామె’ మనుమరాలు తప్పు మూలంగా!
చుట్టూ ఉన్న ఆడవాళ్ళు సంగతులు అదే పనిగా చెప్పాలా, వాళ్ళ వివరాలు పూసగుచ్చినట్లు చెప్పాల. అంతేకదా! మా ‘నామిని’కి పుట్టి పెరిగిన, పెంచిన నేల ఇచ్చిన వరమే ‘స్వచ్ఛమైన యాస’. అంతేకానీ ‘యాస’ల కోసం ఎటువంటి ‘ప్రయాసలు’ పడలేదు. ఆడజనం- తిట్లతో, బూతులతో, మాట్లాడుకున్న ‘అసభ్య పదజాలాన్ని’ చూస్తే ఎట్లా? మూలింటామె మూగ రోదన – యాతన గమనించకపోతే ఎట్లా? ఇంతకీ ఈ పెద్ద కథో, నవలో, ఏమోగానీ, నాకు మాత్రం – వయస్సు ఉడిగిన ముసలితనంలో, చితికిన మట్టి మనిషి మనస్సు-నరక యాతనను చూసినాను. ఇక్కడ ఆడజనులకు, వాళ్ళ ‘ఆడతనం’కు అగౌరవం జరగలేదని తెలుస్తుంది. ఈ ‘మూలింటామె’లో కేవలం ఆ వూర్లో ‘మూలింటి’ కుటుంబంలో జరిగిన సంఘటనల ఘటనలను మాత్రమే చిత్రీకరించడం జరిగింది. ‘మూలింటామె’ ఇంటి పరిస్థితులను ఎదిరించే శక్తి లేక అనాథ అబలగా, అమాయక అమ్మతనమునకు ప్రతీకగా, కొడుకు మరో పెళ్ళి చేసుకొని రెండో పెళ్లాం ‘మాయ’ ఉచ్చులో చిక్కుకొని ‘తల్లి’ని గుర్తించలేక పోయాడనే తల్లడిల్లే ‘తల్లి’గా, మూగజీవులు (పిల్లులు) సాకే ‘మాతృమూర్తి’గా చివరకు ఆడదాని ‘ఆత్మగౌరవం’ను బలిపెట్టకుండా తనకుతానే ‘ఆత్మహత్య’ చేసుకొని ‘సబల’ కాని ‘అబల’గా మిగిలిపోతుంది.
‘మూలింటామె’తో మాట్లాడే ఆడోళ్ళలో ‘అసభ్య పదాల’ను వెతికి చూసారే! బంగారు దేముళ్ళురా! మచ్చుకు మూలింటామె మాటలో దాగిన మూగరోదన, నరకయాతన చూడండి! గుండె తడిని గుర్తించండి! లేచిపోయి, ఇక తనను కలుసుకోదని కుములుతూ – మూలింటామె ‘మనుమరాలు ఫోటో’ను తడుముతూ!-
‘నీ యంత నాణ్ణిగత్తె యీ నాలుగూళ్లలో వుంటాదా.. నా కూతరా! పచ్చి పసుపు గొమ్మును తుంచి చూస్తే ఎట్టూంటాదో ఆ వర్నంతో వుంటావే!’…
‘ఎంత ఆస్తయిన ఆడదానివి నువ్వు! నీ యీపు మింద గంపవొడ్లు ఆరబెట్టుకోవచ్చునే!’
‘ఏ శుక్రోరం నీ కోసరమన్జెప్పి కూకుడుకాయాలు కొట్టాలా నేను! నా చేతులు నొప్పులు బుట్టేటట్లు నీ బారడు పొడుగు యెంటికల్ని ఎట్టా పులిమేదాన్ని! అగ్గి పెంకులో సాంబ్రాణీసి యెంటికలకు పొగ బెట్టుకొని ఆర్చుకునే దాకా నేను వొక్క పూటన్నా వొప్పుకున్నానా?’
‘మొగోడు దినానికి రాగ్గింజంత పెరిగితే, ఆడది వడ్ల గింజంత పెరిగితింది గదా, బిడ్డి బిరబిరా పెద్ద మనిసైపోతే కొడుకు ఇచ్చి చేసుకుందామని నీకు నేను ఎన్ని రకాలుగా చేసి పెట్టుంటా!’
‘నాయమ్మా, నా కూతరా! నా కొడుకు ముందు నీకు తండ్రి, మళ్ల మేనమామ, మళ్లనే మొగుడు! కానీ నువ్వు తండ్రని తలిచినావా, మేనమామ అని తలిచినావా,మొగుడని లెక్కలోకి యేసుకున్నావా!’
‘ఒక మొగబిడ్డి, వొక ఆడబిడ్డి – చాల్లే బెమ్మాళం అనుకున్నాము. తల్లి పోలికిన మొగబిడ్డా. తండ్రి పోలికన ఆడబిడ్డ పుట్టినారు బలే అదురుష్టమంతుళ్లు అనుకున్నాము. ఏమి అదురుష్టమంతులు! దిక్కులేని బిడ్డిలైపోతురి, నువ్వు బూమ్మింద వుండీ!’
‘యీ మిట్టూరు మొత్తానికి మడికాడికి పోయ్ పచ్చి కసువు పెరకని ఆడదీ, శెనిగి చెట్టు తొవ్వని ఆడదీ, వరికోతలు కొయ్యని ఆడదీ-వొక్కదాన్ని చూపించు! బాపనోళ్ల బిడ్డి మాదిరిగా చూసుకుంటిమిగదా!’..
‘నీయంత రాణి వాసం జేసిన ఆడది రాయల్ చెరువు పాయకట్టు మొత్తానికీ లేదు.న అయినా ఈ ఇల్లు నీకు జెమినీ అయింది!’..
‘నీ మొగుడు వొకావొకడే… తొడి కోడలి పోటుకు నీకు వుండిందా, ఆడబిడ్డ పోటుకు నీకు వుండిందా? ఏమి సంకటమొచ్చిందని యీ పొద్దు నా యిల్లొదలి ఎలబారి పోయ్నావు?…’
‘ఎంత వదనంగా కాపరం చేసుకుంటా వుంటిమి… నీ వొంటికి సెగ దగలని పన్లే గదా నువ్వు చేస్తావుంటివి.. అట్టాంటి కాపరం నీకు ఎద్దును మోసినట్టూ గువ్వను పట్టినట్టూ అనిపిచ్చిందా!…’
‘సరిమొగోళ్లల్లోకి యింక నీ మొగుడు ఎట్టా బోవాలనుకుంటివి? కర్ములారా, అసలికి యీ యిల్లొదలి పోయ్యేదానికి నీకు మనసెట్ట నొప్పిందే యీనురాలా!’
‘కడంతగాలంలో నాగొంతులో అన్నినీళ్ళు పోస్తావనిగదా నాకొడుక్కి నిన్ను చేసుకొనింది! నేను చచ్చి నన్ను యెల్లాలకల బెంచీ మింద పండబెట్టుండినా నాపైనా పక్కలా పడి ఏడవ గలగతావా యింక నువ్వు’….
రెయ్యీ తెల్లవారులూ యిదే వాటం మూలింటామెది. ఇంకా.. ఎన్నో ఎన్నో ‘అమాయక ప్రేమ’కు ఉదాహరణలు చూడొచ్చు.
మనుమరాలు మరల తిరిగొస్తుందని దేముళ్లకు మొక్కడం-యెంగటేస్పరసామి పటానికి, చెంగల్రాయ పటానికి, ఉత్తరకొండకి, దచ్చినకొండకీ దండాలు పెట్టుకోవడం, అగలాండంలో కేజీ కర్పూ రం యేస్తానని, వుండీలో నూట పదార్ల దుడ్లేస్తానని-ఉత్తర సామికీ మొక్కోవడం… ‘అమాయక భక్తి’ని పరిశీలించవచ్చు.
‘వూరికేందో శీనాగతి పట్టిందనీ, వూళ్లో గంగమ్మ జాతర జరక్క పదేండ్లు కావస్తుండడంతో గంగమ్మ చానా కోపంతో కండ్లు తెరవబట్టే యీట్టా కత జరిగిందనీ, శాంతం జెయ్యాలంటే ఈసారి జాతర జరపాలని బజిన గుడికాడ తీరు మానమైన సంఘటన’ చిత్రీకరించిన తీరులో, ‘పల్లె యొక్క మూఢ భక్తి’ని చూపడంలో రచయిత తన శైలిని ప్రదర్శించారు.
తలకాయ నెప్పికి మాత్ర తెప్పించుకొని, మాత్ర వేసికొని, కాగితం ను నమిలి మింగేసిన విధానాన్ని చూపడంలో ‘మూలింటామె’ యొక్క ‘తెలివి’ని గమనించవచ్చు.
కొడుకు ‘నారాయుడు’కి రెండో పెళ్ళి చెయ్యడంలో ఎదురు చెప్పే శక్తి లేక తన వాళ్ళకే పగరాలైన వైనాన్ని గమనించినపుడు- ఆమెను ‘నిస్సహాయురాలు’కి నిదర్శనంగా నిలుపుతారు రచయిత.
కొత్త కోడల్ని చూసి ‘యింకెట్ట యీ కొంపలో నీళ్ళు తాగబొయ్యేది తల్లా’ అని మూలింటామె పలికిన మాటలో రానున్న తన బతుకు శూన్యంలోనికి నెట్టబడుతుంది- అని అమె నోటనే రచయిత పలికించాడు.
ఇక చెప్పాలంటే.. ‘మూలింటామె’ తన కుటుంబాన్ని చక్కబెట్టే, స్థితి లేక ‘నిస్సహాయురాలు’గా నిల్చి పోతుంది. కొడుకు నారాయుడు రెండో పెళ్ళాంకు, ఆమె సావాసగాడు గుడుగుడు చెందురుడుకి, కీలు బొమ్మగా మారడం, తల్లిని పట్టించుకోకపోవడం వంటి పరిస్థితులు- మారుతున్న కాలానికి, ఆర్థిక గతులుకు, మనుషుల యొక్క మాయలు, లీలలకు ఈ పల్లె కథ ఉదాహరణ.
తను వ్రాసిన పుస్తకాలను తానే వాడవాడల తిరిగి అమ్మే ‘పుస్తకాల కొట్టు’గా తిరుపతి మిత్రులు (సాహితీ సన్నిహితులు), అభిమానులు – ‘నామిని’ని చూసారు. ఆ రోజు, ఈ రోజు… ఎప్పటికీ రచనలో- తనదైన శైలిలో నామిని ‘నెంబర్వన్ పుడింగి’గా నిలబడతారు.
నేటి మోడ్రన్ టెక్నాలజీ కాలంలో ‘స్మార్ట్ ఫోన్’లు వుపయోగించడంలో జనులు తెలివిమీరి ‘బ్లూటూత్’లో ‘బూతు’లను స్వీకరిస్తూ.. వీక్షిస్తూ.. అనుసరించడంతో పోలిస్తే ఇది ఏ పాటిది? మూలింటామె – వూళ్లో ఆడోళ్ల ‘బూతులు’ పెద్దవి చేసి చూడబల్లాల్సిన అవసరం లేదులే! ప్రపంచీకరణ- ఆధునికీకరణ- సరళీకరణల- ‘పరుగు పందెం’ లో ‘పల్లె జనులు’ ఎక్కడకనీ? ఎంత దూరానికి పయనిస్తారు?
ముద్ద సంగటి, శెనక్కాయలు, వూరిపిండి, మునగాకు పొరుటు, నోటికి కమ్మగా అందించి పల్లె జీవితానికి ప్రతిబింబంగా నిలుస్తుంది ‘మూలింటామె’- ‘కథ’.
చివరిగా ఒక మాట-
మూలింటామె చీమంతమ్మకు చెప్పిన చెవిలో రహస్యం లాగానే…
నామిని- నడుస్తున్న పల్లె జీవితాలతో స్వీయానుభవాలతో పచ్చనాకు సాక్షిగా కలంతో కలకాలం నిల్చే రచనలు చేస్తారు! అంతేగానీ, కుయ్యో, అయ్యో, మొర్రో అంటూ మోడ్రన్ ముతుక అతుకుల- ఇం(టిం)గ్లీషు కాపీ, కల్తీ కథలు రాయరు! వాస్తవికతకు విరుద్ధంగా, సహజత్వానికి దూరంగా ఎప్పటికీ రాయరు గాక!’
– చిట్టి
|