భిన్న ధ్రువాల సంకీర్ణం – కవయిత్రి రాజేశ్వరికి ఆర్థిక సాయం విడుదల – మాట మరిచావా మోదీ?

కవయిత్రి రాజేశ్వరికి ఆర్థిక సాయం విడుదల
అంగవైకల్యాన్ని అధిగమించి కవయిత్రిగా రాణిస్తున్న రాజేశ్వరికి రూ.10లక్షల ఆర్థికసాయాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. నిరుపేద వికలాంగ చేనేత కార్మికురాలైన కవయిత్రి రాజేశ్వరికి ఆర్థికసాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం వన్‌టైమ్‌ గ్రాంట్‌ కింద పదిలక్షలను విడుదల చేస్తూ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. పదిలక్షల ఆర్థికసాయాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేసి వచ్చే వడ్డీతో ప్రతినెలా 10వేల రూపాయలను రాజేశ్వరికి సాయంగా అందించనున్నారు
మాట మరిచావా మోదీ?
అన్నను అన్నావు.. అనాథను కానివ్వను అన్నావు
ఢిల్లీ చిన్నబోయేలా రాజధాని నిర్మిస్తానన్నావు
సీమాంధ్రను నెంబర్‌ వన్‌ చేస్తానన్నావు కానీ
అధికారంలోకి వచ్చాక తొండిచేయి
2 బడ్జెట్లలో పైసా కూడా నిధుల్లేవు
మరో ‘కర్నూలు’ తప్పదా అన్న ఆందోళన!
నాటి మోదీ మాట..
తిరుపతిలో…
నా కళ్లముందు వెంకటేశ్వర స్వామిని చేరుకునే కాలిబాట భవ్యంగా కనిపిస్తోంది. సీమాంధ్ర స్వర్ణాంధ్రగా కావాలంటే చెప్పండి. నేను మీతోనే ఉంటాను. మీకోసం ఏమైనా చేస్తాను. ఢిల్లీ చిన్నబోయేలా సీమాంధ్ర రాజధాని నిర్మించుకుందాం!’’
గుంటూరులో…
‘కాంగ్రెస్‌ మిమ్మల్ని అనాథలుగా మార్చిందనే ఆవేదన వద్దు. మీకు అన్నగా, అండగా నేనుంటాను. మీ కలలను నా కలలుగా భావిస్తా. మీ కష్టాలను నా కష్టాలుగా భావిస్తా. అధికారంలోకి రాగానే అండగా ఉంటా!’
‘ఒక్కడంటే ఒక్కడు కూడా మా మొర ఆలకించలేదు’ అనే ఆక్రోశం! నిరసనలు, ఆందోళనలు ఎన్ని చేసినా కన్నెత్తి కూడా చూడలేదని ఆగ్రహం! రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని ఆవేదన! కాంగ్రెస్‌పై అంతులేని కసి! ఈ అనిశ్చితి నుంచి బయటపడేసేదెవరు? మమ్మల్ని ఆదుకునేదెవరు? అనే ప్రశ్నలు! ఈ సమయంలో… మోదీ అనే నాయకుడు వారి కళ్లకు ‘మెసయ్య’ (రక్షకుడు)లాగా కనిపించారు. ఆయన మాటలు సూటిగా వారి హృదయాలను తాకాయి. ‘మీరు అనాథలు కాదు. అన్నలా నేనున్నాను’ అని మోదీ చెప్పగానే భావోద్వేగంతో కళ్లు తడుపుకొన్నారు. ‘ఢిల్లీ చిన్నబోయేలా రాజధాని నిర్మిస్తాం’ అని ప్రకటించగానే… ‘నిజమే కాబోలు’ అని అనుకున్నారు. మోదీ ప్రధాని అయ్యారు. ఒక బడ్జెట్‌ ముగిసింది. ‘ఇది పూర్తిస్థాయి బడ్జెట్‌ కాదులే!’ అని సరిపెట్టుకున్నారు. నిన్నటికి నిన్న మరో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. కానీ… నవ్యాంధ్రకు ఇచ్చింది ఏమీ లేదు. ‘విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేస్తాం’ అంటూ మరో హామీ తప్ప! విభజన చట్టంలో ఏముంది? మోదీ ఏం చెప్పారు? నవ్యాంధ్రకు చేయాల్సింది ఏమిటి? ఇప్పటిదాకా ఏం చేశారు? ఇవీ ప్రశ్నలు! ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న వరుస కథనాలు నేటి నుంచి…
(హైదరాబాద్‌ – ఆంధ్రజ్యోతి)  అది.. 2014 మే ఒకటో తేదీ! మండే ఎండాకాలం.. ఆపై రోళ్లు పగిలే గుంటూరు.. రాష్ట్ర విభజన నిర్ణయంతో మండిపడుతున్న సీమాంధ్ర ప్రజలను ఉద్దేశించి ఒక గంభీర స్వరం అంతకంటే ఉద్రేకంగా ప్రసంగిస్తోంది. ‘‘ఆంధ్రులని అవమానించడం కాంగ్రెస్‌ పార్టీకి మొదటి నుంచీ ఉన్నదే. అప్పట్లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి (రాజీవ్‌ గాంధీ) మీ ముఖ్యమంత్రిని ఎయిర్‌పోర్ట్‌లో అవమానించారు. ఇందిరా గాంధీ తెలుగువారైన నీలం సంజీవ రెడ్డిని పోటీకి నిలిపి వెన్నుపోటుతో ఓడించారు. ఇప్పుడేమో అమ్మా కొడుకుల పాలన మిమ్మల్ని అనాథలుగా వదిలేసింది. రాష్ట్ర విభజన జరిగిన తీరు, తల్లీ కొడుకుల (సోనియా – రాహుల్‌) వ్యవహారం మీకు ఆవేదన కలిగించింది. మీరు అనాథలు కాదు. మీ అన్నను నేను, మీకు అండగా ఉంటాను. మిమ్మల్ని ఏనాటికీ అనాథలను చేయను. మీ భవిష్యత్‌కి భరోసా ఇస్తున్నా. మీకు అండగా ఉంటాను. సీమాంధ్ర కోసం పార్లమెంటులో పోరాడి సాధించిన హామీలన్నీ అమలు చేస్తా’’ అంటూ ఆ గంభీర స్వరం మరింత గంభీరంగా ప్రజలకు కొండంత భరోసా ఇచ్చింది. ఆ స్వరం పేరు నరేంద్ర మోదీ. ఒక్కసారి ఎన్డీయే కూటమికి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌కు అద్భుత భవిష్యత్‌ ఇస్తామని ఎన్నికల ప్రచార సభల్లో మోదీ స్పష్టమైన హామీ ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీ సైతం చిన్నబోయేలా సీమాంధ్ర రాజధానిని నిర్మించుకుందామని మోదీ పిలుపునిచ్చారు. ‘‘మీ కలలను నా కలలుగా భావిస్తా. మీ కష్టాలను నా కష్టాలుగా భావిస్తా. మీ కలలని నెరవేరుస్తా. అధికారంలోకి వస్తే అండగా ఉంటా. ఢిల్లీ మీ వెంట ఉంటుంది. మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేనా.. హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల కలిగిన బాధను అర్థం చేసుకోగలనని, హైదరాబాద్‌ నుంచి రావడమంటే తల్లిని వదిలి బిడ్డ రావడమేనని కూడా అన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి సంబంధించి తన మస్తిష్కంలో ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, సీమాంధ్రలో టీడీపీ-బీజేపీ, ఢిల్లీలో ఎన్డీయే సర్కారు ఏర్పడిన తర్వాత వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ‘‘ఇవి ముఖ్యమంత్రిని, సర్కారును ఏర్పాటు చేసే ఎన్నికలు కావు. సీమాంధ్రను నిర్మించుకునే ఎన్నికలు. మీరు మంచి నిర్ణయం తీసుకోకుండా… సీమాంధ్రను స్కామాంధ్రగా మార్చే వారి చేతికి ఇస్తే ఢిల్లీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. సీమాంధ్ర అసెంబ్లీలో టీడీపీ-బీజేపీ పూర్తి మెజారిటీ ఇవ్వండి. ఎంపీ సీట్లన్నీ గెలిపించండి. సీమాంధ్ర నెంబర్‌ వన్‌ అవుతుందో, లేదో చూడండి!’’ అంటూ నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి ఆంఽధ్రావని స్పందించింది. అప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి సరైన పునాది కూడా లేకపోయినా.. ఏకంగా రెండు ఎంపీ, నాలుగు అసెంబ్లీ సీట్లను కట్టబెట్టింది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ, టీడీపీ కూటమికి పట్టం కట్టింది. అయితే, ఎన్నికలకు ముందు ఆశల పల్లకిలో ఊరేగించిన ఆ స్వరం ఇప్పుడు మూగవోయింది. ఏ జిల్లాలో అయితే ఆయన ‘మీరు అనాథలు కారు.. అన్నగా అండగా ఉంటా’ అన్నారో అదే జిల్లాలో ఏర్పాటవుతున్న నవ్యాంధ్ర రాజధానికి మాత్రం తొండి చేయి చూపించారు. ఢిల్లీ చిన్నబోయేలా రాజధానిని నిర్మిస్తామని భరోసా ఇచ్చిన ఆయన ఇప్పుడు.. అందుకు కనీసం ఒక్కపైసా నిధులను కూటా బడ్జెట్లో కేటాయించలేదు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నిటినీ అమలు చేస్తామని పదే పదే స్పష్టం చేసిన మోదీ ఇప్పుడు చంద్రబాబు పదే పదే కోరుతున్నా పట్టించుకోవడం లేదు. సీమాంధ్రులను కాంగ్రెస్‌ అనాథలను చేసినట్లే.. బీజేపీ కూడా అదే బాటలో పయనించింది. ఆంధ్రప్రదేశ్‌ ఆశల్ని కృష్ణా నదిలో కలిపేసింది. దిక్కూ మొక్కూ లేకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ అనాథగా మిగిలింది. ఒకవైపు తెలంగాణ, మరోవైపు కర్ణాటక, ఇంకోవైపు తమిళనాడు రాష్ట్రాల రాజధానులు దేశంలోనే అత్యుత్తమ రాజధానుల్లో ముందు వరుసలో ఉన్నాయి. అదే సమయంలో, ఏపీ రాజధాని మాత్రం ఏమవుతుందో ఎవరికీ అంతుపట్టని పరిస్థితి నెలకొంది.
చట్టంలో స్పష్టంగా ఉన్నా…
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో రాజ్‌భవన్‌, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసన మండలి, శాఖాధికారుల కార్యాలయాలు, సిబ్బందికి క్వార్టర్లు, ప్రభుత్వ అతిథి గృహాలు తదితరాలను నిర్మించడానికి ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని అందజేస్తుందని విభజన చట్టంలో స్పష్టం చేశారు. ఆ మేరకు నవ్యాంధ్ర రాజధాని కోసం కేంద్రం నిధులు ఇచ్చి తీరాలి. రాజధాని నిర్మాణం అంటే నాలుగు భవన సముదాయాలు కట్టడం కాదు. భవిష్యత్‌ అవసరాలకు సరిపడా మౌలిక సదుపాయాలను కల్పించుకోవాల్సి ఉంటుంది. కానీ, తాజా పరిస్థితిని చూస్తుంటే కర్నూలు చరిత్ర పునరావృతమయ్యే ప్రమాదం కనిపిస్తోందని సీమాంధ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రులకు రాజధాని లేదని, గుడారాల్లో ఉన్నారంటూ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ తదితరులు పదే పదే ఎద్దేవా చేశారని, భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి పునరావృతమయ్యేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి, సీమాంధ్రుల్లో ఇటువంటి మనోభావాలను గుర్తించే.. అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నడుం బిగించారు. దాదాపు 40 వేల ఎకరాలను సేకరించడమే కాకుండా సింగపూర్‌ సహకారంతో ఆ దేశాన్నే తలదన్నేలా రాజధానిని నిర్మిస్తామని శపథం చేశారు. రైతులను బతిమలాడి, బామాలి, ఒప్పించి భూ సమీకరణను అయితే పూర్తి చేశారు. కానీ, కోట్ల రూపాయల నిధులు ఎక్కడినుంచి తెస్తారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఇప్పటికి రెండు బడ్జెట్లను కేంద్రం ప్రవేశపెట్టింది. కానీ, రెండింటిలోనూ పైసా కూడా కేటాయించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సీమాంధ్ర నేతల్లోనూ కేంద్ర సాయంపై ఆశలు అడుగంటుతున్నాయి. అదే సమయంలో, ఏపీ ఇప్పటికే రెవెన్యూ లోటుతో సతమతమవుతోంది. రుణ మాఫీని అమలు చేయడానికే తలకిందులవుతోంది. ఈ పరిస్థితుల్లో అత్యుత్తమ సదుపాయాలతో ప్రపంచ శ్రేణి రాజధానిని నిర్మించాలంటే అథమ పక్షం లక్షా పదివేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ కూడా దానికంటే తక్కువే. నాలుగైదేళ్లలో రాజధానిని నిర్మించాలంటే ఏటా కనీసం పాతిక వేల కోట్లను కేటాయించాల్సి ఉంటుంది. వాటిని బడ్జెట్లో కేటాయిస్తే ఉద్యోగులకు జీతాలు, సంక్షేమ పథకాలు కూడా ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణానికి కేంద్రమే దిక్కు. కానీ, తాజా బడ్జెట్‌తో రాజధాని నిర్మాణానికి కేంద్రం ఒక్క పైసా కూడా విదల్చబోదని స్పష్టం కావడంతో రాష్ట్రం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

 

భిన్న ధ్రువాల సంకీర్ణం

 

జమ్మూ-కశ్మీర్‌లో బీజేపీ-పీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఏడువారాల పాటు చర్చోపచర్చలు జరిపిన తరువాత, ఇరుపక్షాలూ తాము అత్యంత ప్రధానమైనవిగా భావించిన వాటిని ‘వివాదస్పద’ అంశాలుగా నిర్ణయించి అటకెక్కించడంతో అధికారం పంచుకోవడం సాధ్యపడింది. ఏకాభిప్రాయం సాధ్యం కాని అంశాల జోలికిపోకూడదన్న ఏకాభిప్రాయంతో ఉత్తర, దక్షిణ ధృవాలు రెండూ ఏకమయ్యాయి. అధికారంలోకి వచ్చిన కొద్దిగంటల్లోనే వివాదస్పద వ్యాఖ్యలు నిప్పురాజేస్తున్నప్పుడు, ఇరుపక్షాలూ ఎదుటివారి వ్యాఖ్యలతోనూ, చర్యలతోనూ తమకు సంబంధం లేదంటూ ఎంతకాలం నెట్టుకురాగలవో చూడాలి.
ఆదివారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం ఒక చక్కని దృశ్యాన్ని ఆవిష్కరించింది. వేర్పాటువాదుల పట్ల ఒకింత సానుభూతిగా ఉండే ఒక ప్రాంతీయ పార్టీ, హిందూ జాతీయవాదాన్ని బలంగా వినిపించే ఒక జాతీయపార్టీ ఒక సరిహద్దు రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్నాయి. ఇంతకాలమూ తాము తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన జమ్మూకశ్మీర్‌ రాజ్యాంగానికి విధేయులమై ఉంటామంటూ బీజేపీ మంత్రులు ప్రమాణం చేశారు. మాజీ వేర్పాటువాద నాయకుడు, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు సజ్జాద్‌ లోన్‌ తన రాష్ట్రంలో బీజేపీ కోటాలో మంత్రిగా ప్రమాణం చేశారు. ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిన బీజేపీ, పీడీపీలు ఈ పొత్తుకు సిద్ధపడటానికి రాజకీయంగా ఏ లెక్కలు కట్టుకున్నాయో, భవిష్యత్తుమీద ఏ అంచనాలకు వచ్చాయో తెలియదు కానీ, ఆ పరిమితులూ, పరిధులతో పనిలేని దృశ్యం అక్కడ కనిపించింది. దీనితోపాటు, రాష్ట్రంలోని రెండు ప్రధాన ప్రాంతాల్లోనూ ఆధిక్యం ఉన్న పార్టీలు అధికారాన్ని పంచుకోవడం జమ్మూ, కశ్మీర్‌ ప్రాంతాల అభివృద్ధికి మేలు చేస్తుంది. ఇంతకాలమూ అధికారంలో ఉన్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ కూటమిని తిరస్కరిస్తున్నప్పుడు ఈ రెండు ప్రాంతాలవారూ ఊహించినట్టుగానే భిన్నదారులు ఎంచుకున్నారు. హిందువుల ఆధిపత్యం ఉన్న జమ్మూలో బీజేపీకి అత్యధిక స్థానాలు వస్తే, ముస్లిం ఆధిపత్యం ఉన్న కశ్మీర్‌లో పీడీపీకి ఆధిక్యత లభించింది. కశ్మీర్‌లో బీజేపీ అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోతే, ఒకే ఒక్క స్థానంలో ఆ పార్టీ బలపరచిన స్వతంత్ర అభ్యర్థి సజ్జాద్‌ లోన్‌ గెలిచారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించారంటూ కొత్త ముఖ్యమంత్రి నేరుగా హురియత్‌కూ, ఉగ్రవాదులకు, సరిహద్దు ఆవల దేశానికీ కృతజ్ఞతలు చెప్పుకోవడం వివాదం రేకెత్తించినా క్షేత్రస్థాయి వాస్తవం అదేనని ముఫ్తీకి తెలుసు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా మోదీ ప్రభంజనంతో బీజేపీ బలమైన శక్తిగా, 44 ప్లస్‌ అంటూ లక్ష్యం పెట్టుకుని రాష్ట్రంలో కాలుమోపినప్పుడు, అక్కడి అంచనాలు, లెక్కలు ఒక్కసారిగా తారుమారైపోయాయి. ఈ తరుణంలో, తొలిసారిగా హురియత్‌ ఎన్నికల్లో పాల్గొనవలసిందిగా కశ్మీరీలకు విజ్ఞప్తి చేసింది. బీజేపీ విస్తరణభయం మిలిటెంట్లూ, హురియత్‌ ఈ ఎన్నికల్లో సానుకూలంగా ఉండేట్టు చేసింది. కశ్మీర్‌లో అన్ని దశల్లోనూ ఓటింగ్‌ అధికంగా జరగడమే ముఫ్తీ ముఖ్యమంత్రి కావడానికి వీలు కల్పించింది. తన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలన్నీ లోక్‌సభనుంచి వాకౌట్‌ చేసినా, బీజేపీ ఆగ్రహించినా ఆయన ఏమాత్రం వెనక్కు తగ్గకపోవడానికి అప్పట్లోనే కాదు, భవిష్యత్తులోనూ ఆ విధమైన సహకారం తనకు అవసరమని ఆయన భావిస్తుండటమే కారణం.
నిత్యం ఉద్రిక్తంగా ఉండే ఈ సరిహద్దు రాష్ట్రంలో సుస్థిర ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రశాంతత కొనసాగాలని రాష్ట్ర ప్రజలే కాదు, దేశమంతా కోరుకున్నది. కేంద్రంలో బలంగా ఉన్న ఒక జాతీయపార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకభాగస్వామి కావడం ఆ రాష్ట్ర సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బలమైన బంధాలు ఏర్పడతాయి. అధికారంలో ఉన్న బీజేపీ పనితీరు చూడటానికి కశ్మీర్‌ ప్రజలకు, అక్కడి ప్రజల పట్లా, సమస్యల పట్లా ఒక అవగాహన కలగడానికి బీజేపీకీ ప్రత్యక్షంగా అవకాశం కలుగుతుంది. ఇది ఇంతకాలమూ ఇరువైపులా పేరుకుపోయి ఉన్న అనుమానాలు, అపోహలూ తొలగిపోయేందుకు వీలు కల్పిస్తుంది. కరడుగట్టిపోయి ఉన్న అభిప్రాయాలను కరిగించుకోవడానికీ, వీలైనచోట్ల మార్చుకోవడానికీ దోహదం చేస్తుంది. అలాగే, జమ్ము, కశ్మీర్‌ ప్రాంతాల మధ్య సయోధ్యకు మరింత దోహదం చేస్తుంది. ఎన్నికల బరిలో కత్తులు దూసుకున్న ఈ రెండు పార్టీలూ, కలసి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి కొన్ని అంశాలపై కఠినమైన వైఖరులను సడలించుకున్నాయి. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు చెల్లవంటూ నినదించిన పార్టీ ఇప్పుడు 370వ అధికారణ విషయంలో మారుమాట్లాడవద్దని నిర్ణయించుకుంది. సైనికదళాల ప్రత్యేకాధికారాల చట్టం ఎత్తేయాలంటూ ప్రచారం చేసి, మేనిఫెస్టోలో పెట్టిన పీడీపీ ఇప్పుడు మెట్టుదిగింది. ఒకే ఒరలో ఇమిడిపోవడానికి సిద్ధపడిన ఈ రెండు కత్తులూ ఇకముందు అనవసరపు వ్యాఖ్యలకు, వివాదాలకు స్వస్తిచెప్పి, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా అభివృద్ధే లక్ష్యంగా కలసి పనిచేయడం ఆరంభించాలి. తమకు అధికస్థానాలు కట్టబెట్టిన జమ్ము, కశ్మీర్‌ ప్రాంతాలతో పాటు లద్దాఖ్‌ను కలుపుకోవాలి. రాష్ట్రాన్ని గుజరాత్‌ తరహాలో అభివృద్ధి చేస్తానంటున్న ముఫ్తీకి తన రాష్ట్రం ఇప్పుడు దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఎక్కడ ఉన్నదో తెలియంది కాదు. ఉగ్రవాదం మాత్రమే ఆ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సమస్య కాదు. అపారమైన వనరులు ఉన్న ఆ రాష్ట్రాన్ని ప్రధాన స్రవంతితో మమేకం చేసి, అభివృద్ధికి బాటలు వేసినప్పుడు ఉగ్రవాదం సహా అనేక వివాదాలు చల్లారిపోతాయి.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.