ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -17
9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్ ఎడ్డీ -1
అమెరికాలో న్యు హాంప్ షైర్ లో బౌ అనే చోట 16-7-1821 న జన్మించిన మేరీ బేకర్ ఎడ్డీ జీవితం పై ఎన్నో అభూతకల్పనలు అసంబద్ధ రాతలు వచ్చాయి .అన్నిటిని ధైర్యం గా ఎదుర్కొని తాను నమ్మినదానినే చెప్పి ,రాసి ,ముందుకు సాగిన జీవితం ఆమెది .సత్యాన్వేషణలో మూలాలను తరచిన సూక్ష్మ బుద్ధి ఆమెది .మార్క్ ట్వేన్ ఆమె పై ఒక పెద్ద పుస్తకమే రాశాడు .ఆమె రాసిన క్రిస్టియన్ సైన్స్ ను హంబగ్ అని ఈసడించి రెచ్చిపోయి రాసిన వారూ ఉన్నారు .నిరు పేద జీవితం గడిపి కానీకి ఠికాణా లేని స్తితిలోంచి ,కోట్లకు పడగలెత్తిన ఐశ్వర్య సంపన్నురాలైంది .అదీ క్రిస్టియన్ సైన్స్ అనే వినూత్నవిధానం తో .ఆధునిక ప్రపంచ నిర్మాతలలో తానూ ఒకరి చరిత్ర సృష్టించింది .
ఈమె పూర్వీకులు స్కాట్ లాండ్ ,ఇంగ్లాండ్ దేశీయులు .తల్లి విద్యావంతురాలు .రుజు ప్రవర్తన ఉన్న మహిళ.మగవారి తో సమానం గా కస్టపడి పని చేసే ఓర్పూ నేర్పూ ఉండేది తల్లికి .తండ్రి చాలా పవిత్రుడైన కాన్గ్రిగేషనలిస్ట్ .అంటే వ్యక్తిగత శుద్ధత ద్వారానే ఉన్నత స్తితిని ,దైవ సాన్నిధ్యాన్ని పొందవచ్చు అనే మెథడిస్ట్ పద్ధతికి దగ్గర భావాలున్న వాడు .మత ధర్మాలను చాలా నిద్ధతతో పాటించేవాడు .
మేరీ చిన్నతనం నుంచి ఏదో ఒక జబ్బుతో బాధపడేది .మూర్చలు వచ్చేవి అకస్మాత్తుగా .తీవ్ర స్వభావం ఉండటం వలన ఈ ఫిట్స్ ఆమెకు ఒక శాపమే అయింది .బాల్యం నుండి మత విషయాలలో చురుకుగా ఉండేది .’’ఎవరో నన్ను పేరు పెట్టి మూడు సార్లు పిలిచినట్లుఅంతరాత్మలో అనిపించింది ‘’అని తన అనుభవాన్ని రికార్డ్ చేసింది .తనను ‘’జోన్ ఆఫ్ ఆర్క్’’ గా భావించుకొనేది .ఆమెతో బంధుత్వం ఉన్నట్లు ఊహించుకోనేది .పన్నెండవ ఏట నే బాల యేసు లాగా తానూ చర్చి పెద్దలతో వాదించానని చెప్పుకొనేది .కాని యవ్వనం వచ్చేసరికి వీటికి విరుద్ధం గా ఆమె సంచరించింది .
పిల్ల ఆరోగ్యం కోసం తండ్రి కుటుంబాన్ని ఈ నాడు సాన్ బారంటన్ బ్రిడ్జ్ అని పిలువబడే టిల్టాన్ కు మార్చాడు .మేరీ ఆరోగ్యం కొంత మెరుగైంది .తానూ ఒకకవిని అని ఊహించుకొని ఏకాంతం లో కవిత్వం రాసేది .అందులో మంత్రాలనూ కలిపి రాసేది .19 వ ఏట సోదరుడు ఆల్బర్ట్ చనిపోవటం తో డిప్రెషన్ కు లోనైంది .రెండేళ్ళ తర్వాత ఆల్బర్ట్ స్నేహితుడు అయిన ఒక తాపీ పని వాడిని పెళ్లి చేసుకొన్నది .భర్త స్టోన్ మేసన్ గా వ్యాపారమూ చేసేవాడు .సౌత్ కరోలినలోని చార్లేస్టన్ కు నవ వధువును తీసుకొని వెళ్లి కాపురం పెట్టాడు .అతనితో ఎన్నో సార్లు బిజినెస్ ట్రిప్ లలో పాల్గొనేది .భర్తకు ఎల్లో ఫీవర్ వచ్చి అకస్మాత్తుగా చనిపోయాడు .చేతిలో పెన్నీ కూడా లేని గర్భ దరిద్రం లో అప్పుడు మేరీ ఉంది .పుట్టింటికి చేరి ఒక కొడుకును కని తండ్రిపేరు పెట్టుకొన్నది .
చిన్నతనం లోనే గర్భం దాల్చటం వలన పిల్లాడు పుట్టే లోపే ఆమె ఆరోగ్యం మరీ క్షీణించి ఇక బతకదేమో ననిపించింది .అందువల్ల పసిపిల్లాడిని సాకే పని కూడా చేయలేక పోయేది .నరాల బలహీనత ఆమె ఆరోగ్యాన్ని తరచుగా దెబ్బ తీసేది .కుటుంబ సభ్యుల తోడ్పాటు తో ,ఆసరా తో ఆమె బతికింది .ఇలాంటి స్తితిలోకూడా కవిత్వం రాసి౦దివీలైనప్పుడల్లా .పిల్లాడిని పెంచలేననే అధైర్యం ఆమెను కమ్ముకొంటే విలేజ్ బ్లాక్ స్మిత్ భార్య చేతిలో కుర్రాడి సంరక్షణ బాధ్యత పెట్టింది .ఇరవై ఏళ్ళకు తల్లి చనిపోయింది .తండ్రి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .తండ్రి ఇంట ఇప్పుడుకూడా ఒంటరి జీవి అయిపోయి౦ ది .మగ వారి విషయం లో ఆమె చాలా దురదృష్ట వంతురాలు .బార్లేట్ అనే అతన్ని ప్రేమిస్తే ,అతను కాలిఫోర్నియా కు వెళ్లి చనిపోయాడు .ఆ దుఖమూ కుంగ దీసింది .కొడుకును మారుటి తండ్రి దూర ప్రాచ్యానికి తీసుకెళ్ళిపోయి దూరం చేశాడు పుత్రప్రేమకు .కొడుకు తనకే దక్కాలన్న అరాటమూ ఆమెలో లేదు .కారణం తన పొట్టనే తాను పోషించుకోలేని దైన్యమే .కొడుక్కి 35 ఏళ్ళు వచ్చి భార్యా ఇద్దరు పిల్లలతో ఉన్నాడని తెలిసి ‘’మదర్స్ డార్లింగ్ ‘’అనే కవిత రాసింది .’’Thy smile through tears ,as sunshine over the sea –Awoke new beauty in the surge;s roll –Oh !life is dead ,bereft of all,with theee –Star of my earthly hope,babe of my soul ‘’అని తన ఆవేదనను వెళ్ళ గక్కింది .
ముప్ఫైలలో మళ్ళీ వివాహ సన్నాహాలలో పడింది .డేనియల్ పాటర్సన్ అనే డెంటిస్ట్ ను పెళ్లి చేసుకొన్నది .ఆమె అనారోగ్యం గురించి అతనికి పూర్తిగా తెలుసు ,కానీ అతని అభిరుచులు వేరు .జీవన వైవిధ్యాన్ని ఆమె కోరుకోలేక పోయింది .అతని పాశవిక చేష్టలకు తట్టుకోలేక పోయింది .వైట్ మౌ౦టే న్స్ దగ్గరున్న నార్త్ గ్రాటన్ లో ఉన్నారిద్దరూ .అక్కడా ఒంటరిదైపోయి౦దిమళ్ళీ .నిరంతరం సంచార వైద్యం లో ఉండే ఆతను ఇంటిదగ్గర భార్యను వదిలేసి వెళ్ళిపోయేవాడు .ఆమె ఇతరులేవరితోనూ స్నేహం చేసేదికాదు
నలభై వ ఏట .పోర్ట్ లాండ్ లోని మైమ్ లో ఫినియాస్ పి.క్విమ్బి అనే ఆయన మెస్మరిజం తో వ్యాధులు నయం చేస్తున్నాడని విన్నది .ఆయనే తన వ్యాధికి దిక్కు అని నమ్మి అక్కడికి చేరింది. మొదటి సెషన్ లోనే క్విమ్బి- మేరీ శారీరక ఆరోగ్యాన్నేకాదు మానసిక ఆరోగ్యాన్నీ బాగు చేశాడు .ఆమెలో ఉన్న అసాధారణ ప్రజ్న ఆసక్తికి ముచ్చటపడి ఆయన తనకు వచ్చిన సర్వ విద్యనూ ఆమెకు నేర్పించాడు .కొద్ది కాలం లోనే ఆయనతో బాటు సమాన మైన విద్య నేర్చి చాంపియన్ అని పించింది .ఆయన రాసిన గ్రంధాలన్నీ చదివింది .ఆయన ప్రతిభావిశేషాలను పత్రికలో వ్యాసాలుగా రాసి ప్రచారం చేసి౦ది మేరీ బేకర్.ఆయన హిప్నటిజం తోకాని లేక ‘’యానిమల్ మాగ్నేటిజం ‘’తో కాని రోగుల వ్యాధులను నయం చేయటం లేదని ఒక శాస్త్రీయ మైన ఎవరికీ తెలియని విధానం లో నయం చేస్తున్నాడని తెలియ జేసింది .శిష్యురాలి అకు౦ఠిట దీక్షకు మద్దతునిచ్చి ఆమెను తీర్చిదిద్దటం లో క్విన్బీ ఎక్కువ సమయం గడిపాడు .ఆమె రాసిన వాటిని ‘’సైన్స్ అండ్ హెల్త్ ‘’పేరిట ముద్రించింది .
మేరీ ఆరోగ్యం బాగుపడటమేకాదు ,ధైర్యం సాహసం ,ఆలోచన ,మనో నిబ్బరం యేర్పడి మానసిక వ్యాధులను కూడా నయం చేయగలిగే స్తితిలోకి వచ్చింది .వీటిని స్మ్రుతిగీతాలుగా రాసి ‘’lines on the Death of Dr .P .P. Quimby ,who healed with the Truth that Christ Taught in contra distinctions to all Isms ‘’పేర వెలువరించింది .కొంతకాలానికి ఆమె నడుస్తూ పడిపోయి విపరీతంగా గాయాలైనాయి .అప్పుడు జీసస్ చెప్పిన ‘’physician heal thy self !’’వాక్యాలను మననం చేసుకొని రెండు రోజుల్లోనే లేచినిలబడి నడవటం ప్రారంభించింది .దీనినే క్రిస్టియన్ సైన్స్ అన్నది .1866 ఫిబ్రవరిలో తనకు ‘’డివైన్ మెటా ఫిజికల్ హీలింగ్ ‘’అబ్బిందని దీనినే ‘’క్రిస్టియన్ సైన్స్ ‘’అన్నాని రాసి౦దిమేరి .అన్ని శారీరక బాధలకు మనసేకారణం అని అన్నిటికి ప్రధానం మైండ్ అనీ నిర్ణయించింది .ఇక్కడి నుండి ఆమె జీవితం మలుపు తిరిగి ఉచ్చ స్తితికి చేరింది .
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -18
9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్ ఎడ్డీ -2
తన కొత్త మతాన్ని సంస్థాపించటానికి ముందు మేరి బేకర్ ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నది .డాక్టర్ పాటర్సన్ నుండి ఏడాదికి రెండు వందల డాలర్ల పెన్షన్ తప్ప ఇంకే ఆదాయమూ లేదు .ఉండటానికి స్వంత ఇల్లే లేదు .ఎవరో ఒక ఇల్లాలి మానసిక స్థితిని సరిచేసి వారింట్లో ఆ రోజు ఆతిధ్యం పొందుతూ సంచారి జీవితం గడిపింది .ఇలా ఉంటున్నా క్విమ్బీ జీవిత విశేషాలను రాస్తూనే ఉంది .నాలుగేళ్ళు బాధ దుఖం ,బీదరికం ఒంటరితనం లో జీవించి చివరికి మొదటి డ్రాఫ్ట్ ‘’extracts from doctor P.P.Quimby ;s writings ‘’ పూర్తీ చేసింది .ఇది బాధా నివృత్తి చేసేదేకాక భరించలేని మానసిక సంక్షోభానికి పరిష్కారం గా కూడా ఉన్నది .దీనితో ఆమె అసలైన క్రిస్టియన్ సైన్స్ ఆవిర్భావానికి మార్గం సుగమమైంది .దీనితో బాటు ప్రేమించటం గురించి బోధించేది .
మొదటి సారిగా ఆమె శిష్యులు బాధా నివారణ చేయటం లో ప్రసిద్దులవటం తో ఆమె కీర్తి నెమ్మదిగా ప్రపంచమంతా పాకింది అదే ఆమె విజయానికి తొలి మెట్టు అయింది .వారికి బోధించటానికి ఫీజు వసూలు చేసేది .దీనితో అనేక సంస్థ లేర్పడ్డాయి వారిలో భేదాలు తారా స్థాయికి చేరాయి .57 ఏళ్ళ వయసులో పాటర్సన్ కు విడాకులిచ్చి గిల్బర్ట్ ఎడ్డీ ని పెళ్ళాడింది .456పేజీల ఉద్గ్రంధాన్ని పూర్తీ చేసి 1875 లో విడుదల చేసింది .క్విమ్బీ పద్ధతిని ‘’ది సైన్స్ ఆఫ్ హెల్త్ “’అన్నది దానికి ‘’విత్ కీ టు స్క్రిప్చర్స్ ‘’ అని జోడించింది .పది హేనేళ్లు దానిని ఎప్పటికప్పుడు కొత్తవి చేస్తూ ఆధునీకరిస్తూనే ఉంది .ఆ పుస్తకం లక్షా యాభై వేల కాపీలు అమ్ముడు పోయి రికార్డ్ సృష్టించింది .తన స్వంత చర్చిలోని ప్రతి వ్యక్తీ ఒక కొత్త కాపీ కోనేట్లు చేసింది.అమ్మకాలపై ప్రతి పుస్తకానికి ఒక డాలర్ రాయల్టీ పొందింది .
పదార్ధం పై మనసు ఆధిక్యతను ఆధారం గా రాసిన పుస్తకం అది .చెడు అనేది లేదని అంటు౦దిమేరి .చెడు అనేది భయం వలన ఏర్పడే ఒక మానసిక స్థితి అన్నది .ఆమె రాసిన పుస్తకం లో విరుద్ధ విషయావులెన్నో ఉన్నాయి .కాని శిష్యులపై ఆమెకు గొప్ప పట్టు ఉండేది .55 వయసులో ‘’క్రిస్టియన్ సైన్స్ అసోసియేషన్ ‘’ఏర్పాటు చేసింది .మూడేళ్ళ తర్వాత ‘’ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ,సైంటిస్ట్ ‘’ను స్థాపించింది .రెండేళ్ళ తర్వాత ఇందులోని ఎనిమిది మంది చార్టర్ సభ్యులు రాజీనామా చేశారు .61 వయసులో తన చర్చ్ ని బోస్టన్ నగరానికి మార్చింది .ఆమె ప్రతికదలికా ఒక వార్తా సంచలనమే అయింది .దాన్ని బాగా కాష్ చేసుకొందికూడా .తన మాటకు, చేష్టకు ఆమె పురాణ గ్రంధాలనుండి ఆధారాలు చూపి అప్రతిభులను చేసేది .అపోక లిప్స్ చెప్పిన ‘’ and there appeared a great wonder in heaven ,a woman clothed with the sun and the moon under her feet ,and upon head a crown of twelve stars ‘’అనే మాటలను తనకే అన్వయి౦చు కొనేది
క్రిస్టియన్ సైన్స్ కొద్దికాలం లోనే గొప్ప వ్యాప్తి పొందింది .ఈ అతి వ్యాప్తిని చూసి మహా రచయితా మార్క్ ట్వేన్ ‘’ఇలా అయితే క్రిస్టియన్ సైంటిస్టులు 1920కి పది మిలియన్లు ,1930కి వారంతా బలమైన శక్తి గా రూపొంది ప్రతి రాజకీయ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తారు .1940 నాటికి రిపబ్లిక్ అధికారాలు చేబట్టి అధికారం లో పాతుకు పోయే అవకాశం ఉంది ‘’అని రాశాడు .ట్వేన్ మాటలు పూర్తిగా ఉత్ప్రేక్షలే అభూతకల్పనలే అయ్యాయి .1950 నాటికి మేరీ స్థాపించిన మదర్ చర్చ్ బ్రాంచీల సంఖ్య మూడు వేలు అని ఎన్ సైక్లో పీడియా బ్రిటానికా తెలియ బర్చింది .అందులో రెండు వేలరెండొందల బ్రాంచీలు అమెరికా ,కెనడాలలో ఉన్నాయి .
ముసలితనం మీదా పడుతున్నకొద్దీ ఎడ్డీ బలం, అధికారం మరీ పెరిగింది .ఒక యునిటేరియన్ మినిస్టర్ సాయం తో తన పుస్తకానికి తుది మెరుగులు దిద్ది తన అనుచరులకు బైబిల్ కు ప్రత్యామ్నాయం అయేట్లు చేసింది .దేశం లో లో సంచారం చేస్తూ ఉపన్యాసాలిస్తూ తన మతం లోకి జనాలను చేర్పిస్తూ మదర్ చర్చ్ ను బలీయం చేసింది .ఒక భారీ సంస్థకు ఆర్గనైజర్ గా ఎదిగిపోయింది అత్యంత సంపన్నుల జాబితాలో చేరిపోయింది .మగ పురుషులతో అంత సఖ్యతగా లేక పోయినా సంస్థా గత విషయాలకు వారిపైనే ఆధార పడాల్సి వచ్చేది ..డెబ్భై వ పడిలో 41ఏళ్ళ ఒక హోమియో పతి డాక్టర్ ను చేర దీసింది అయిదేళ్ళ తర్వాత అతన్ని విసర్జించింది .అల్లాగే ఎవరినో దగ్గరకు తీయటం ,కొద్దికాలానికే వారికి గుడ్ బై చెప్పటం అలవాటైపోయింది ఆమెకు . ఆమె శీలాన్ని శంకించారు .చనిపోయిన వారి మరణానికి ఆమె చికిత్స వికటించే అనే ప్రచారమూ బాగా బలపడింది .పూర్తిగా ఆమె పై వ్యతి రేకత కాదు .ఆమె చుట్టూ ఉన్న కోటరీ పై వ్యతిరేకతే అది .సంస్థాగత వ్యవహారాలపై ఆమె పట్టు కోల్పోయిందనే ప్రచారం సాగింది.ఆమె స్వచ్చ ప్రవర్తనపై అపనమ్మకం కలిగింది .ఆమెను ఒంటరి దాన్ని చేసి పిచ్చిదానికిందా కట్టేశారు .86 ఏళ్ళ వయసులో కూడా ఆమె తనసంస్త్ర్హ ను పూర్తీ నియంత్రణలో ఉంచుకో గలిగింది .తొంభై ఏళ్ళు వచ్చాయి వృద్ధాప్యం వలన నే మేరీ బెకర్ ఎడ్డీ 3-12-1910 న తను నమ్మిన క్రీస్త్ ను చేరుకొంది .పేదరికం లో అతి సాధారణ రైతు కుటుంబం లో పుట్టిన ఆమె చనిపోయేసరికి ఒక పెద్ద సువిశాల సంస్థకు అధికారిణిఅయి మూడు మిలియన్ డాలర్ల ఆస్తికి వారసురాలై చరిత్ర సృష్టించింది .ఈ ఆస్తి అంతా ఆమె తను పెంచిపోషించిన చర్చి కే దక్కేట్లు చేసి ,భౌతికవాదాన్ని రూపుమాపి ,పదార్ధ వాదాన్ని లేకుండా చేసేందుకే వినియోగించేట్లు చేసింది మేరీ బేకర్ ఎడ్డీ .
భారతీయ వేదాంతానికి క్రిస్టియన్ సైన్స్ కు అవినాభావ సంబంధం ఉందని మేరీ 33 వ ఎడిషన్ లో చెప్పింది .భగవద్గీతలోని అనేక శ్లోకాలను అందులో చేర్చింది .తర్వాత తీసేశారు .తర్వాత కాలం లో భారతీయ మైన అన్నివిషయాలను ఆ పుస్తకం నుండి తొలగించారు .ఎడ్డీ జీవితాంతం మార్ఫిన్ వాడుతూనే ఉందని ఒక రిసేర్చర్ తెలిపాడు .ఆమె చర్చి బ్రాంచీలు 76దేశాలలో వ్యాపించి ఉన్నాయి ఆమె శత జయంతికి ఆమె జన్మించిన బౌ గ్రామం లో 100టన్నుల గ్రానైట్ పిరమిడ్ ను నెలకొల్పి ఘనం గా నివాళులర్పి౦చారు .దాదాపు 16 పుస్తకాలు రాసింది మేరీ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-3-15- ఉయ్యూరు
మరో ప్రముఖునితో కలుద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-3-15 ఉయ్యూరు