శ్రీ వారి దర్శనం లో రెండు విభిన్న అనుభూతులు
మంచీ మర్యాదా లతో అనుభూతి
మేము అంటే గబ్బిట దుర్గాప్రసాద్ ,మా శ్రీమతి ప్రభావతి మా బావమరది టి వి ఎస్ బి ఆనంద్ ,భార్య రుక్మిణి కలిసి 6-3-15 శుక్రవారం తిరుమలలో శ్రీవారి దర్శనానికి ముందే ఏర్పాట్లు చేసుకోన్నాం .మేమిద్దరం సీనియర్ సిటిజన్ లం .టికెట్లు అక్కర్లేదు ..వాళ్ళిద్దరూ ౩౦౦ రూపాయల టికెట్ పై దర్శనానికి వచ్చారు .సీనియర్ సిటిజెన్స్ అయిన మా ఇద్దరినీ బాటరీకార్ పై దర్శన క్యూ ప్రదేశానికి చేర్చి ఏంతో ఆనందాన్నికల్గించారు దేవస్థానం వారు .అక్కడ మా ఐడెంటిటి చెక్ చేసి ,లెఫ్ట్ హాండ్ చూపుడు వ్రేలు ప్రింట్ తీసుకొని ,ఫోటో తీసుకొని కంపార్ట్ మెంట్ లో చాలా మర్యాదగా కూర్చోబెట్టారు .మధ్యాహ్నం 1-30 కు అక్కడ కు చేరాం .ఇంతలో వాలంటీర్లు అందరికి చల్లని మంచినీళ్ళు అడిగి అడిగి అందజేశారు .తర్వాత సాంబారు అన్న ప్రసాదాన్ని ప్లేట్ లలో పెట్టి అందించారు .అది రుచికరం గా శుచిగా ఉంది .కడుపార తిన్నాం .కావాలంటే మళ్ళీ పెట్టారు .కొద్ది సేపటి తర్వాత వేడి వేడి పాలను గ్లాసులలో ప్రతి వొక్కరి దగ్గరకు వచ్చి ఆప్యాయం గా అందించారు .మళ్ళీ మళ్ళీ అడిగి అవసరమైన వారికి అందజేశారు. చాలా ముచ్చటేసింది దేవాలయం మర్యాదలకు .2-45 కు దర్శనానికి గేట్ తీశారు .పై నుండి కిందికి స్లోప్ మీద దిగి క్యూ లో నెమ్మదిగా కదిలాం. మా బాచ్ లో వికలాంగులు ,అసలే నడవ లేని వారు దేకుకొంటూ వెళ్ళేవారుకూడా ఉన్నారు .వారికేవ్వరికి ఇబ్బందికలుగాకుండా అందరూ జాగ్రత్తపడ్డారు .ఎగుడు దిగుడులు లేని సమతల ప్రదేశం మీదనే నడక హాయిగా ఉంది .బంగారు వాకిలి వరకు వెళ్లాం .అక్కడి నుండి లోపలి కొద్దిగా రష్ గా ఉంది. ఒక పండుముసలాయన వీల్ చైర్ లో అక్కడికి వచ్చారు .వారికి కదిలే శక్తి ఏడూ అయినా శ్రీవారి దర్శనం తో ధన్యం అవాలని వచ్చారు .వారి అబ్బాయిలు అక్కడినుండి చేతుల మీద మోసుకొని వెళ్లి లోపలి బంగారు వాకిలి ద్వారా లోపలి తీసుకొని వెళ్లి అత్యవసర దర్శనం చేయించి ఆ ముసలిప్రణానికి గొప్ప ఆనందాను భూతి కలిగించారు .దేవాలయ సిబ్బంది కూడా ఎంతో సహకరించారు .నాకు వారందరిలో మానవత్వం పరిమళించినట్లని పించింది .ముప్పావుగంటలో మాకు శ్రీవారి దివ్య దర్శనం మహా వైభవం గా లభించి మనసునిండా సంతృప్తి తో బయటికి వచ్చాం .౩౦౦ రూపాయల టికెట్ తీసుకొన్న మా బావమరది భార్య కూడా హాయిగా దర్శనాను భూతి పొంది బయటికి మాతో పాటే వచ్చారు .ఈ అనుభూతి మరువ రానిదిగా మరచిపోలేనిదిగా సంతోష సంతృప్తి కరం గా నిలిచి పోయింది .దీనికి మహా విరుద్ధం గా మర్నాటి దర్శనం కల్లోలం రేపి దారుణం గా బాధగా నిలిచింది .
వి ఐ పి దర్శనం కాదు వి పి .దర్శనం
మా తిరుపతి పెళ్ళివారు 7-3-15 శనివారం ఉదయం 6 గంటల బ్రేక్ దర్శనానికి ఒక్కొక్కరికి 500 రూపాయల టికెట్లు కొని మా ఇద్దరికీ ,మ బంధువులావిడ రమాబాయి అనే 85 ఏళ్ళ వృద్ధురాలికి 65 ఏళ్ళ ఆమె కుమార్తెకూ మాతో పాటు రిజర్వ్ చేయించారు .తెల్లవారుజ్హామున రెండున్నరకే లేచి స్నానాలు చేసి నాలుగు గంటలకు పెళ్ళివారు ఏర్పాటు చేసిన ఇండికా కారులో బయల్దేరి అయిదింటికే దర్శనం క్యూ దగ్గరకు చేరుకొన్నాం .మాకు ఇబ్బందికలుగాకుండా మానిటర్ చేయటానికి ఇద్దరు ఉద్యోగులనూ మావాళ్ళు మాతో పంపారు .నాలుగైదు చోట్ల మేడమేట్లు ఎక్కి ,దిగి ముసలీ ముతకా నానా ఇబ్బందిపడ్డారు .కంపార్ట్ మెంట్ లలో కూచుని కూచుని విసుగు కూడా పుట్టింది .అక్కడేమీ శ్రీవారి నామ స్తోత్రాలు కాని ఏవీ పెట్టలేదు .పవిత్రమైన మనసు ఆందోళనకు గురైంది .అలాగే బాధ పడి చివరికి గేటు దగ్గరకు చేరాం .సెక్యూరిటీ చెక్ పూర్తీ చేసుకొని గుంపులో గోవిందలాగా నడకే నడక .ఈ వయసులో ఇంత దూరం నడవాల్సి వచ్చిందని పెద్దవాళ్ళు లబో దిబో .వాళ్ళను బైపాస్ చేసి ముందుకు తీసుకొని వెళ్ళమని ప్రాధేయపడ్డా ససేమిరా అన్న వాలంటీర్లు .చచ్చీ చెడి బయటి బంగారు వాకిలి దాటాము ముసలివాళ్ళతో .అక్కడ తోపులాట .ఇంకేరకమైన దర్శనం లేకపోయినా సరైన అవగాహన తో అధికార్లు పని చేయక పోవటం తో తీవ్ర ఇబ్బంది .కంపార్ట్ మెంట్ ఖాళీ కాగానే రెండో దానిలోకి వెడితే ముందు వెళ్ళిన వారికే సీటు దక్కింది మిగాతా వాళ్ళందరూ స్టాండింగ్ .ఇది మరీ కలచి వేసింది .చివరికి లోపలి బంగారు వాకిలి దాటి శ్రీవారి సన్నిధికి చేరాం .అది బాగా స్లోప్ గా ఉండటం తో ముసలివారు చేతిలో కర్ర సాయం తో నడిచేవాళ్ళు చాలా ఇబ్బందిపడ్డారు .మాతో వచ్చిన ముసలావిడను అక్కడి వాలంటీర్లు పక్కి లాగడం తో ఆమె కిందపడి కళ్ళ జోడు జారి పడిపోయి స్వామివారిని చూడలేక పోయింది కళ్ళజోడు కోసం వెతుక్కుంటుంటే వాలంటీర్లు కస్సు బస్సూ .వాళ్ళంతా దడి కట్టి స్వామివారి దర్శనానికి తీవ్ర అవరోధం గా నిలిచారు .వారి సంభాషణ ,ప్రవర్తన అత్యంత హేయం గా అవహేళనగా ,జుగుప్సగా ఉంది .పెద్దలను చేయిపట్టుకొని ముందుకు తీసుకు వెళ్లి దర్శనం చేయించి సాయపడటం పోయి ,జర్మన్ నాజీ కాంపులలో చూపిన దారుణమైన ట్రీట్మెంట్ జుగుప్సను కలిగించింది.అప్పటికీ ముసలావిడ కళ్ళ జోడు జారింది అది పెట్టుకొని దర్శనం చేసే దాకా ఓపిక పట్టండి అనిబతిమిలాడినా వినలేదు ‘’ఇక్కడ అంతే .ఎవరూ ఏమీ చెయ్యలేరు .అంత ఇష్టం లేక పొతే పొండి ‘’అన్నారు .మా శ్రీమతి పొట్టి ఆవిడ కనుక ఆవిడకూ దర్శనం బాగా జరగలేదు. అందరూ దడి కట్టి నట్లు నుంచుని వాలంటీర్లే దర్శనానికి తీవ్ర విఘాతం కలిగించారు .మొదటి నుంచి వీరి తీరు చాలా అమర్యాదకరం గా ఉంది .వి ఐ పి లను ‘’వి పి ‘’లను చేసి అవమాన పరచారు ఈ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఆలయ అధికారులకు ,పర్య వేక్షకులకు ఉంది .నిన్నటి సీనియర్ సిటిజెన్ దర్శనం పరమానందం గా ఉంటె ,ఇది పరమ ఘోరం గా ఉంది .అసలు ఆమాటలు, వాళ్ళ చేష్టలు మానవత్వాన్ని మరచి రాక్షస ప్రవ్రుత్తి ప్రవేశించిన వారి లాగా ఉన్నాయి ‘’షేం టు టి టి డి’’.
సీనియర్లయినా వికలాన్గులైనా బయటికి వచ్చిన తర్వాత ఏంతో దూరం వెడితెకాని లడ్డూ కౌంటర్లు కనపడవు .అంత దూరం వెళ్ళలేని వారి గతి ఏమిటి ?వారిని అనుసరించేవారు లేకపోతె లడ్డూలు అందవుకదా.కనుక సీనియర్, వి ఐ పి దర్శనాలవారికి లైన్ లోనే లడ్డూలు ఇచ్చే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ..
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-3-15 .