దొరకునా… ఇటువంటి సినిమా ! ‘శంకరాభరణం’

దొరకునా… ఇటువంటి సినిమా !

Sakshi | Updated: March 15, 2015 00:14 (IST)
దొరకునా... ఇటువంటి సినిమా !

ఆ సినిమాలో కథానాయకుడి పాత్ర వయసు అరవైకి దగ్గర! సినిమాలో డ్యూయెట్లు లేవు… ఫైట్లూ లేవు. అంతా సంగీతం… అదీ సంప్రదాయ సంగీతం! కానీ, ప్రాంతమేదైనా ప్రేక్షకుల అభిరుచి గొప్పది. బాక్సాఫీస్ సూత్రాలకు విరుద్ధమైన ఆ తెలుగు సినిమా… భాషల ఎల్లలు దాటి 35 ఏళ్ళ క్రితమే దేశాన్ని జయించింది. ప్రపంచాన్ని ముక్కున వేలేసుకొనేలా చేసింది. ఎందరెందరో కళా ఋషుల తపఃఫలమైన ‘శంకరాభరణం’ ఇన్నేళ్ళ తరువాత తమిళంలోకి

డబ్ అయి, మొన్న శుక్రవారమే జనం ముందుకొచ్చింది. మూడున్నర దశాబ్దాల విరామం తర్వాత ఒక భాష నుంచి మరో భాషలోకి డబ్బింగైన తెలుగు సినీ స్వర్ణాభరణంగా ఇప్పుడు మళ్ళీ చరిత్రకెక్కింది.

– డాక్టర్ రెంటాల జయదేవ

అది 1980… మద్రాసు (ఇప్పటి చెన్నై) మౌంట్ రోడ్ అణ్ణా ఫ్లై ఓవర్‌కు సమీపంలోని సత్యం సినీ కాంప్లెక్స్… అప్పటికి 20 వారాలుగా అందులో ఒక సినిమా విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది. అయినా సరే  కొత్త రిలీజ్‌లా తమిళ ప్రేక్షకులు ఉత్సాహంగా వస్తూనే ఉన్నారు. అదేమీ ఏ తమిళ సూపర్ స్టార్ సినిమానో కాదు. ఆ మాట కొస్తే అసలు తమిళ సినిమానే కాదు. పదహారణాల తెలుగు సినిమా. మాటలూ, పాటలూ కూడా తమిళంలోకి అనువాదం చేయని పక్కా తెలుగు సినిమా. అయితేనేం… ఉత్తమ కళా సృజనకూ, ఉత్తమ సంగీతానికీ భాష, ప్రాంతం అడ్డుగోడలు కావని మరోసారి నిరూపితమైంది. తమిళ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్న ఆ సినిమా… ప్రపంచ మంతటా తెలుగువారు ఇవాళ్టికీ శిరసెత్తి సగర్వంగా చెప్పుకొనే సినీ చిరునామా… జాతీయ అవార్డుల్లో ‘స్వర్ణ కమలం’ (ప్రత్యేక విభాగంలో) అందుకున్న ఒకే ఒక్క తెలుగు సినీ ఆణిముత్యం…. పేరు – ‘శంకరాభరణం’.

అప్పట్లో మద్రాసులో 20 వారాలు ఆడిన ఆ తెలుగు కళాఖండం మదురై, సేలమ్ లాంటిచోట్ల శతదినోత్సవాలు జరుపుకొంది. మాటలు మాత్రం మలయాళంలోకి డబ్బింగ్ చేసి, పాటలు అలాగే తెలుగులోనే ఉంచేసి, రిలీజ్ చేస్తే కేరళలో 25 వారాలు ఆడింది. లక్షల్లో లాభాలు తెచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ చిత్ర రంగాల్లో కనీవినీ ఎరుగని ఘట్టంగా చరిత్రకెక్కింది.

మూడున్నర దశాబ్దాల తరువాత… మళ్ళీ అదే మద్రాసు. మొన్న శుక్రవారం మార్చి 13న మన ‘శంకరాభరణం’ మరోసారి విడుదలైంది. అయితే, ఈసారి నవతరం తమిళులకు కూడా దగ్గరయ్యేలా పూర్తిగా తమిళంలో..! తెలుగు నుంచి అనువాదమైన తమిళ మాటలు, పాటలతో!! ఆధునిక డిజిటల్ సాంకేతికతను వినియోగించుకొని, కలర్ కరెక్షన్లన్నీ చేసుకొని, సంగీతాన్ని డిజిటల్ మాస్టరింగ్ చేసుకొని సరికొత్త హంగులతో..!!

నిజానికి, 1979లో రికార్డింగ్, షూటింగ్ జరుపుకొని, అదే ఏడాది సెన్సారై, కొనుగోలుదార్ల కోసం వారాల కొద్దీ వేచిచూసి, చివరకు 1980 ఫిబ్రవరిలో విడుదలయ్యాక సంచలనం రేపిన కళాఖండమిది. ‘‘అలాంటి క్లాసిక్ ఇన్ని దశాబ్దాల తర్వాత… మరో భాషలోకి అనువాదం కావడం విశేషం. అదీ మాతృక రిలీజై విజయం సాధించేసిన చోటకే మళ్ళీ డబ్బింగై, రిలీజవడం మరీ విశేషం. చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా ఇలా జరగలేదు’’ అని ప్రముఖ సినీ, సంగీత, కళా విమర్శకుడు వి.ఏ.కె. రంగారావు అన్నారు.

మొన్న మార్చి 13న ఏకంగా ఏడు తమిళ చిత్రాలు, 4 ఇంగ్లీష్ సినిమాల కొత్త రిలీజులతో పోటీ మధ్య వచ్చిందీ తమిళ ‘శంకరాభరణం’. ప్రస్తుతం తమిళనాట చెన్నైతో పాటు మదురై, కోయంబత్తూరు సహా వివిధ ప్రాంతాల్లో, 18 థియేటర్లలో ఈ తమిళ ‘శంకరాభరణం’ అభిరుచి గల ప్రేక్షకుల ఆదరణతో ఆడుతోంది. మరో విశేషమేమిటంటే, ఇప్పుడు చెన్నైలో తమిళంతో పాటు కొన్ని థియేటర్లలో తెలుగు వెర్షన్‌నూ విడుదల చేశారు. ఈ కొత్త రిలీజ్‌ను కళ్ళారా చూస్తున్న ఎనిమిది పదుల తమిళ సినీ చరిత్ర కారుడు ‘ఫిల్మ్‌న్యూస్’ ఆనందన్‌కు మూడున్నర దశాబ్దాల క్రితం ‘శంకరాభరణం’ సృష్టించిన సంచలనం ఇప్పటికీ గుర్తే. ‘‘అప్పట్లో ఈ చిత్రానికి తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా చూసేందుకు సినీ, రాజకీయ, కళా రంగాల ప్రముఖులు ఉవ్విళ్ళూరారు.

నిర్మాత ఏడిద నాగేశ్వరరావు దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర సంగం)లో ప్రత్యేకంగా ఒక ప్రింటే ఉంచేశారు. దాదాపు ప్రతిరోజూ సాయంత్రం ప్రముఖుల కోసం అక్కడ చిత్ర ప్రత్యేక ప్రదర్శన జరిగేదంటే, అప్పట్లో ఆ చిత్రం అందుకున్న గౌరవాన్ని అర్థం చేసుకో వచ్చ’’ని అప్పట్లో ఆ చిత్రానికి తమిళ పత్రికా సంబంధాలు చూసిన ఆనందన్ అన్నారు. భాషాభేదం లేకుండా ‘శంకరాభరణం’ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు అంతగా ఆదరించడా నికి విభిన్నమైన కథ, దర్శకత్వ ప్రతిభ, కట్టిపడేసే సంప్రదాయ సంగీతం, పాటలు – ఇలా అనేక కారణాలు కనిపిస్తాయి. అప్పుడందరూ కూనిరాగం తీసిన ఓంకార నాదాను సంధానమౌ గానమే… అన్న తెలుగు పాట ఇప్పుడు తాజా డబ్బింగ్ వెర్షన్‌లో ‘ఓంకార నాదంగళ్…’ అంటూ అదే గాయకుడు ఎస్పీబీ నోట తమిళంలో వినిపిస్తోంది. ఇంతకీ, ఇన్నేళ్ళ తరువాత ఈ సినిమాను ఎందుకు డబ్ చేసినట్లు?

ఈ తమిళ అనువాదం వెనుక అప్పటి తెలుగు చిత్ర ప్రదర్శన తాలూకు తీపి జ్ఞాపకాలెన్నో చోదకశక్తిగా పనిచేశాయి. చెన్నైలో బి.ఏ (తమిళ సాహిత్యం) చదువుకున్న నేటి తమిళ నిర్మాత ఎన్. రత్నంకి అప్పట్లో తమ తమిళ ప్రొఫెసర్ స్టూడెంట్స్ అందరినీ ‘సత్యం’ థియేటర్‌కు తీసుకెళ్ళి తెలుగు ‘శంకరాభరణం’ చూపించిన రోజులు ఈ 54 ఏళ్ళ వయసులోనూ గుర్తే. ‘‘అప్పటి నుంచి ఈ చిత్రానికీ, దర్శకులు విశ్వనాథ్ గారికీ నేను వీరాభిమానిని. ఆ తరువాత సినీ రంగంలోకి వచ్చి, రెండు చిత్రాలకు దర్శకత్వం వహించా. ఆ పైన ఇంగ్లీషు చిత్రాల దిగుమతితో మొదలుపెట్టి, దాదాపు వెయ్యి దక్షిణ భార తీయ భాషా చిత్రాలను హిందీలోకి అనువదించా. డబ్బు సంపాదించా. అయితే, ఆత్మతృప్తి కోసం ‘శంకరాభరణం’ డబ్బింగ్ చేశా’’ అని ఈ తాజా తమిళ డబ్బింగ్ చిత్ర సారథి – నిర్మాత ఎన్. రత్నం ‘సాక్షి’కి వివరించారు.

నిజానికి, అప్పటి ఈ చిత్రానికి ఇప్పుడు ఒరిజినల్ పిక్చర్ నెగటివ్ దొరకలేదు. సౌండ్ నెగటివూ పాడై పోయింది. కానీ, రత్నం – తమిళ డబ్బింగ్ ‘శంకరాభరణం’లో ఆయనకు భాగస్వాములైన ఇతర మిత్రులు పట్టుదలగా ఢిల్లీ వెళ్ళి, అక్కడ ఉన్న ఒకే ఒక్క ప్రింట్‌ను తీసుకొన్నారు. దాన్ని డిజిటైజ్ చేశారు. కొత్త నెగటివ్‌ను సిద్ధం చేశారు. పాడైపోయిన సౌండ్ నెగటివ్‌నూ పునరుద్ధరించారు. ‘‘అప్పట్లో ఈ సినిమాను ప్రదర్శించిన ఢిల్లీ తమిళ సంఘం దగ్గర ఈ సినిమా ప్రింట్ ఉంది. ఒకే ఒక్క ప్రదర్శన తరువాత ఆ ప్రింట్ అక్కడే భద్రంగా ఉండిపోయింది. ఆర్కైవ్స్‌లోని ఆ ప్రింట్‌ను తీసుకొని, కొత్తగా డి.ఐ (డిజిటల్ ఇంటర్మీడి యట్) చేసి, కలర్ కరెక్షన్ జరిపాం. తమిళంలో పాటలు రాయించి, రికార్డింగ్ చేశాం’’ అని రత్నం వివరించారు.

తెలుగు మాతృకలో పాడిన ఎస్పీబీ, ఎస్. జానకి, వాణీ జయరామ్‌లతోనే మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత అవే పాత్రలకు తమిళంలోనూ పాటలు పాడించడం విశేషం. ఈ ప్రాజెక్ట్ మీద గౌరవంతో ఆ ఉద్దండు లందరూ దాదాపు పారితోషికం తీసుకోకుండానే పాడడం మరో విశేషం. ‘ఏ తీరుగ ననుదయ చూచెదవో’, ‘మానస సంచరరే’ లాంటి సంప్ర దాయ కీర్తనల్ని అలాగే ఉంచేసి, తెలుగులో వేటూరి రాసిన మిగిలిన పాటలన్నీ తమిళంలో కొత్తగా రాయించుకొన్నారు (రచన: రాజేశ్ మలర్ వణ్ణన్, డాక్టర్ నావేంద్రన్). ఓ సంగీత దర్శకుడి (రాఘవ్) సారథ్యంలో కొత్తగా రికార్డింగ్ చేశారు. రత్నం మాటల్లో చెప్పాలంటే, ‘‘దాదాపు 30 రోజుల డబ్బింగ్, డి.టి.ఎస్‌లో రీరికార్డింగ్ – ఇలా అన్ని చేసేసరికి ఒక కమర్షియల్ సినిమాకయ్యే ఖర్చు అయింది.

అయితేనేం, తమిళ (డైలాగ్స్: రామకృష్ణన్) ‘శంకరా భరణం’ ఈ తరంవారికి కొత్త తమిళ సినిమా చూస్తున్న అనుభూతినిస్తుంది.’’ ‘పి.ఎక్స్.డి’ లాంటి ఆధునిక డిజిటల్ ప్రదర్శన విధానంతో ప్రింట్ల ఖర్చు లేకపోవడం, వారు కూడా ఈ కళాఖండాన్ని తక్కువ రుసుముకే డిజి టల్‌గా చూపడం కలిసి వస్తున్నాయి. వెరసి కాసుల కోసం కాక కళ కోసం చేసిన ఈ డబ్బింగ్ విదేశాలకూ వెళుతోంది.

భాష తెలియకపోయినా, తమిళనాట ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన ఈ చిత్రానికి అప్పట్లో జరిగిన అభినందన సభలో సంగీత దిగ్గజం సెమ్మంగుడి శ్రీనివాస య్యర్ మాట్లాడుతూ, ‘‘కర్ణాటక సంగీతాన్ని ప్రోత్సహించ డానికి నూరేళ్ళలో మా మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ చేయలేని పనిని ఒక్క ‘శంకరాభరణం’ చేసింది’’ అని ప్రశంసించారు. అందుకే, సినీ చరిత్రలోనే ‘శంకరా భరణం’ ఒక చరిత్ర. ఆ సినిమా ఇప్పుడు కొత్త రూపంలో రావడం మరో కొత్త చరిత్ర. ఈ కొత్త చరిత్రకు దోహదపడ్డ తమిళ నిర్మాత రత్నం అన్నట్లు, ‘‘కావ్యాలూ, ఇతిహాసాలూ ఎన్నేళ్ళయినా నిత్యనూతనం. వెండితెర కావ్యం ‘శంకరాభరణం’ సరిగ్గా అలాంటిదే!’’
అందుకే, దొరకునా… ఇటువంటి…సినిమా!

‘‘అప్పట్లో ‘శంకరాభరణం’ చిత్రం ఇంత గొప్పగా రావడానికి ఎంతోమంది కారణం. ఈ సినిమా కోసం అందరూ ఓ కుటుంబంలా కష్టపడి పనిచేశారు. కొన్ని సినిమాలు రీమేక్ చేయలేం. మళ్ళీ నన్నే ఈ సినిమా తీయమన్నా ఇంత అద్భుతంగా వస్తుందా అన్నది సందేహమే. మనకున్న ఘన సంగీత వారసత్వం గురించి ఈ తరానికి తెలియజెప్పడానికే ఈ చిత్రం తీశాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా చాలామంది ‘శంకరాభరణం’కి ముందు, ‘శంకరా భరణం’కి తర్వాత అంటారు. ఇప్పుడు ‘శంకరాభరణం’ తమిళ రూపం చూస్తుంటే, మళ్ళీ ఆ రోజులన్నీ గుర్తుకొచ్చాయి. ఈ సినిమా గురించి మాట్లాడడానికి, చెప్పడానికి ఎన్నెన్నో విషయాలున్నాయి.’’
– ‘పద్మశ్రీ’ కె. విశ్వనాథ్, ‘శంకరాభరణం’ చిత్ర దర్శకుడు

‘‘ఆ రోజుల్లో అందరూ నిరుత్సాహపరిచినా మా ప్రయత్నం తెలుగు రూపంలోనే తమిళ నాటా అద్భుత ఆదరణ పొందింది. ఉత్తమ చిత్రం, సంగీతం, గాయనీ, గాయకుల (మహదేవన్, వాణీ జయరామ్, ఎస్పీబీ) విభాగాల్లో జాతీయ అవార్డులందుకున్నాం. ఇప్పుడీ చిత్రాన్ని తమిళ మాటలు, పాటలతో చూసి, ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా.’’
 – ఏడిద నాగేశ్వరరావు, ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత  

‘ముప్ఫై అయిదేళ్ళ క్రితం ‘శంకరాభరణం’ తెలుగు చిత్రానికి మద్రాసులో రికార్డింగ్ ఎక్కడ జరిపామో (అప్పట్లో విజయా డీలక్స్. ఇప్పటి పేరు ఆర్.కె.వి. స్టూడియో), సరిగ్గా అక్కడే ఇప్పుడీ తమిళ డబ్బింగ్ వెర్షన్ పాటలు విడుదలయ్యాయి. నేను 33 ఏళ్ళ వయసులో ఉండగా, తెలుగులో ఈ పాటలు పాడి, రికార్డ్ చేశా. సుమారు ముప్ఫై అయిదేళ్ళ విరామం తరువాత 68 ఏళ్ళ వయసులో ఇప్పుడీ తమిళ గీతాలు ఆలపించా. ముప్ఫై అయిదేళ్ళ నాటి సినిమా ఇప్పుడు డబ్బింగ్ చేయడమే ఒక విశేషమైతే, అప్పుడు పాడిన నేనే మళ్ళీ ఇప్పుడివీ పాడడం మరో విశేషం. ఇలాంటి భాగ్యం ప్రపంచంలో నా ఒక్కడికే దక్కిందనుకుంటా. అన్నీ అనుకొని చేసేవి కాదు. ‘శంకరాభరణం’ లాంటి కొన్ని అద్భుతాలు అలా జరుగుతాయి… అంతే!’’
– ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ‘శంకరాభరణం’ చిత్రానికి జాతీయ అవార్డందుకున్న నేపథ్య గాయకుడు

ఎల్లలు దాటిన బాక్సాఫీస్ విజయం

⇒తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్టీఆర్ సినిమాలు అయిదింటి (‘లవకుశ’, ‘దానవీరశూర కర్ణ’, ‘అడవి రాముడు’, ‘యమగోల’, ‘వేటగాడు’) తరువాత రూ. కోటి వసూళ్ళు సాధించిన తొలి సినిమా ‘శంకరాభరణ’మే!
⇒తెలుగు నాట 4 (విజయవాడ, విశాఖ, తిరుపతి, హైదరాబాద్) కేంద్రాల్లో నేరుగా రజతోత్సవం జరుపు కొంది. మరో 5 కేంద్రాల్లో నూన్‌షోలతో పాతికవారాల పండుగ చేసుకుంది. విజయవాడ ‘అప్సర’లో 181 రోజులు, హైదరాబాద్‌లో షిఫ్టులతో 350 రోజులాడింది.
⇒హీరోల సినిమాలుగా తెలుగు, తమిళాల్లో వర్గీకరణ వచ్చాక మన సినిమాలు తమిళనాట ఆడడం పెద్ద విశేషం. కమలహాసన్ నటించిన కె. బాలచందర్ చిత్రం ‘మరో చరిత్ర’ (1978) మద్రాస్‌లో ఒకే థియేటర్ (సఫైర్)లో, ఉదయం ఆటలతో  596 రోజులు ఆడి, చెరగని రికార్డ్‌గా నిలిచింది. ఆ తరువాత ‘శంకరాభరణం’ (1980) ఒక్క మద్రాస్‌లోనే కాక, తమిళనాడు అంతటా బాగా ఆడింది.
కన్నడ సీమలో బెంగుళూరులోనే ఏకంగా 6 థియేటర్లలో తెలుగు ‘శంకరాభరణం’ శతదినోత్సవం జరుపుకొంది. ఇప్పటికీ మరే తెలుగు సినిమాకూ దక్కని రికార్డు.
⇒ అప్పట్లో తమిళనాడు, కేరళ హక్కుల్ని తమిళ నటులు మనోరమ, మేజర్ సౌందరరాజన్ కొన్నారు. ‘ఏ.వి.ఎం’ చెట్టియార్‌కు సమీప బంధువైన ఒక డిస్ట్రిబ్యూటర్ కేరళ వరకు హక్కుల్ని మనోరమ వాళ్ళ నుంచి కొన్ని వేలకు కొనుగోలు చేశారు. మలయాళ డైలాగులు, తెలుగు పాటలతో రిలీజై కోట్లలో లాభం తెచ్చింది. ఇవాళ్టికీ, శబరిమల వెళుతుంటే మలయాళ సీమలో ‘శంకరాభరణం’ ఆడియో, వీడియోలు పలకరిస్తూనే ఉంటాయి.

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.