రసమయ కవితా శకటం రాళ్ళ బండి కవితా ప్రసాద్
ఆ చిరునవ్వు, ఆ ఆత్మీయ పలకరింపు ,ఆ గాఢాలింగనం చిన్నలపై అమితాసక్తి ,పెద్దల యెడ అపరిమిత గౌరవ మర్యాద ,మహాకవులెవరైనా పాదాభివందనం చేసే సంస్కారం ,కట్టులో బొట్టులో ,భాషలో ,చమత్కారం లో తనదైన హుందా తనం ,అధికారిననే గర్వం కిన్చిత్తు కూడా కానరాని భాషా సంస్కృతీ సేవా పరాయణం ,ఏ హోదాలో ఉన్నా ఆపదవికే గౌరవం సంతరించిపెట్టిన మూర్తి మత్వం స్వర్గీయ రాళ్ళ బండి కవితా ప్రాసాదీయం .ఆయన మనల్ని ఒక సారి చూస్తె చాలు మనసులో చిరస్థాయిగా నిలుపుకొనే జ్ఞాపకం ,మళ్ళీ కనిపిస్తే చక్కగా పేరు తో సంబోధించి ఆత్మీయతను కురిపించే సౌహార్ద్రత శ్రీ కవితా ప్రసాద్ సద్గుణ లక్షణం .ఆ చిరునవ్వు ఆగిపోయింది .ఆ సహృదయత మాసిపోయినది. ఆ కవితా శకటం ఆగిపోయింది .ఆ దరహాస ప్రసాదం కనుమరగైంది .ఒక మన కృష్ణా జిల్లాకే కాదు ,ప్రపంచం లోని తెలుగు వారందరికీ కడుపు కోతగా మిగిలి పోయింది .ఆ మహా కవి శ్రేస్టూని పాండిత్య ,ప్రకర్షకు నీరాజనాలు .’’జయన్తితే సుక్రుతా ‘’ అన్నదానికి సరైన నిర్వచనం కవితా ప్రసాద్ .
సుమారు ఇరవై ఏళ్ళ క్రితం బందరులో నా అనుంగు మిత్రులు, గురు తుల్యులు మా కుటుంబ మిత్రులు ,మార్గ దర్శి ప్రఖ్యాత రచయితా, అందునా కమ్మని తెలుగు కధల రాజనాలు పండించిన స్వర్గీయ ఆర్ ఎస్ కే మూర్తి గారి షష్టి పూర్తీ మహోత్సవానికి నన్ను నా శ్రీమతి ని ఆప్యాయం గా ఆహ్వానించి ,ఆ రోజు శ్రీ రాళ్ళ బండి కవితా ప్రసాద్ చేసే గణిత అష్టావధానానికి ఒక ప్రుచ్చకుడిగా కూడా నన్ను ఉండమని కోరారు .అలాగే మేమిద్దరం ఉదయమే బయల్దేరి బచ్చుపేటలో ఉన్న మూర్తి గారింటికి వెళ్లాం .అప్పటికే క్రతువు జరుగుతోంది .కాఫీ టిఫిన్లు అయిన తర్వాత అక్కడికి చేరిన నాలాంటి వారిని వారింటి దగ్గరలో ఉన్న డా. శ్రీ మాదిరాజు రామ లింగేశ్వర రావు గారింటికి వారి అబ్బాయిని నాకు తోడూ ఇచ్చిపంపారు .అప్పటికే అక్కడ శ్రీ రావి రంగారావు గారు మొదలైన వారంతా సమావేశమై కవితా ప్రసాద్ గారు మధ్యలో పరివేష్టించి ఉండగా కబుర్లు చెప్పుకొంటున్నారు అందరికి కాఫీలు ఇచ్చారు .అదే మొదటి సారి రావి వారిని కవితాప్రసాద్ గారిని రామలింగేశ్వర రావు గారినిచూడటం .ఒకరినొకరం పరిచయం చేసుకోన్నాం శ్రీ కవితా ప్రసాద్ తానూ అమ్మవారిపై రాసిన ‘’కాదంబినీ ‘’శతకం అందరి తో బాటూ నాకూ అందజేశారు .అందులో తానూ రాసిన పద్యాలను ఏంతో హృద్యం గా చదివి వినిపిస్తూ తానూ అందులో పొదిగిన లోకోత్తర భావాలను అలవోకగా విశదీకరిస్తున్నారు .ప్రతి పద్యానికి మేమందరం ఆనందించి కరతాళ ధ్వనులతో అభినందించాం . దాదాపు రెండుగంటలపాటు ఆ రసమయ భక్తీ చిన్ముద్రలో ఉండిపోయాం .తర్వాత తానూ చేసే గణితావధానం విశేషాలను ప్రుచ్చకులుగా ఎవరి పాత్ర ఏమిటి అన్న వివరాలను వివరించి ట్రయల్ గా అవదానం చేసిమాకు స్పూర్తికల్గించారు .ప్రుచ్చకులలో శ్రీ చింతలపాటి మురళీ కృష్ణ ,పూర్ణ చంద్ర రావు సోదరులు ,స్వర్గీయ కే వి ఎల్ యెన్ నరసింహా చార్యులు వగైరా లున్నట్లు జ్ఞాపకం .చింతలపాటి సోదరులతో అప్పటికే అయిదారేళ్ళనుంచి పరిచయం ఉంది ఉయ్యూరు సాహితీ మండలికి వారిద్దరూ వచ్చి ప్రస్సంగిమ్చటం కవి సమ్మేళనాలలో పాల్గొనటం జరిగింది. అందులో మురళీ కృష్ణ మూర్తిగారికి స్వయానా అల్లుడు .జూనియర్ తెలుగు పండిట్ గా ఉండేవారు .ఆయన వివాహానకి కూడా నేను వెళ్లాను . తర్వాత అందరం కలిసి నడుచు కొంటూ వెళ్లి మూర్తిగారింట షడ్రసోపేతమైన విందు ఆరగించాం .సాయంత్రం ఆరు గంటలకు కవితా ప్రసాద్ గారి అవధానం టౌన్ హాల్ లో ..కాసేపు మూర్తిగారి౦టనే విశ్రమించి మొహాలు కడిగి అవధానానికి హాజరయ్యాం .
మూర్తి గారి దంపతుల సమక్షం లో అవధానం జరిగింది .అందరూ వారికి పద్య రూప శుభా కాంక్షలు అందిస్తే నేను దీర్ఘమైన వచన కవితలో అభినందన సుమమాల అల్లి సమర్పించాను పద్యకవులకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో నాకూ అంతే అభినందన దక్కింది .కవితా ప్రసాద్ నుదుటిపై పెద్ద కుంకుమ బొట్టు తో పట్టు బట్టలు ధరించి ఆసీనులై మందస్మిత వదనార విందులుగా ఉన్నారు .రావి రంగారావు గారు నిర్వాహకులు .ఆయన ప్రసాద్ గారికి బి ఇ డికాలేజిలో గురువు ..ఆ గురు శిష్య బాంధవ్యం వర్ణనాతీతం .అమ్మవారిని స్తుతించి కవితా ప్రసాద్ గారు అవధాన ప్రక్రియ ప్రారంభించారు .ప్రశ్న అడగటం ఆలస్యం పద్యం వారి నోట ప్రవాహమై ప్రవహించింది .అప్రస్తుత ప్రసంగం నరసింహం గారు చేసిన జ్ఞాపకం .అందులో ఆయన ఆరితేరిన వారు .నల్లేరు మీద నడకలా హాయిగా అపరిమిత వేగం గా కవితా వర్షం కురిపించారు .ధారణ కూడా నిమిషాలమీద ,ఎక్కడా తడుము కోకుండా సాగించి అందరి ప్రశంసలను అందుకొన్నారు కవితా ప్రసాద్ గారు .ఇంత త్వరగా అవధానం పూర్తీ అవుతుందని నేనూహించలేదు .అదీ కవితా ప్రసాద్ సామర్ధ్యం .అందరం అవధానిగారిని ప్రశంసిమ్చాం ..మూర్తిగారు అవధానిగారికి గొప్ప సత్కారం చేసి ప్రుచ్చకులైన మాకు కూడా సన్మానం చేసి తృప్తి పరచారు .రాత్రికి ఉయ్యూరు తిరిగి వచ్చేశాం .అప్పటికి నాకు ఇది రెండవ అవధానం .అంతకు ముందు రెండేళ్ళ క్రితం నేను అడ్డాడ హెడ్ మాస్టర్ గ ఉన్నప్పుడు నూతులపాటి వారు శ్రీ వర్దపర్తి వారితో అవధానం చేయిస్తే చూడటానికి వెళ్ళిన నేను అప్రస్తుత ప్రసంగం చేయటానికి ఎవరూ ముందుకు రాక పొతే నేనే చేశాను .ఆ తర్వాత వర్ది పర్తివారి శాతావదాననికి చల్లపల్లి లో ప్రుచ్చకుడిని ఇది చింతలపాటి సోదరులు నిర్వహించిన కార్యక్రమం దీనికి చివరి రోజున శ్రీ మాడుగుల నాగ ఫణి శర్మ గారు కూడా విచ్చేసి ఆశీర్వదించారు .
ఆ తర్వాత చింతల పాటి సోదరులు భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యం లో కూచిపూడి మొవ్వ కోసూరు చల్లపల్లి అవనిగడ్డ మొదలైన చోట్ల అవధానాలు సాహితీ సదస్సులు నిర్వహించే వారు .రావి వారు ,ప్రసాద్ గారు తప్పక హాజరై ప్రోత్సహించేవారు .ఇలా చాలా సార్లు కవితా ప్రసాద్ గారిని కలుసుకోవటం జరిగింది .ఒక సారి శ్రీ రావి రంగారావు గారు శ్రీ కవితా ప్రసాద్ గారి చేత బందరులో శతావధానం చేయించారు .అందులో నన్ను ప్రుచ్చకునిగా నియమించారు .అందరికి టిఫిన్లు భోజనాలు లడ్డూలు తో పెళ్లి విందు .ఉదయం నుండి సాయంత్రం వరకు అవధానం .మర్నాడు ధారణా దీనికి శ్రీ ప్రసాద రాయ కులపతి గారు ప్రత్యేకం గా విచ్చేసి అవధాని ధారణకు అబ్బురపడి మనసారా ఆశీర్వదించారు .జ్ఞాపికలు అందజేశారు. రాత్రి భోజనం తర్వాత ఇంటికి వచ్చాను .రెండు రోజుల అవధానం లో కవితా ప్రసాద్ ఎక్కడా ఎప్పుడూ చిర్రు బుర్రూ ఆడింది లేదు .ఎంతటి కష్టతర సమస్య అయినా అతి సునాయాసం గా సమాధాన పద్యాలు అల్లి సెహభాష్ అని పించారు .అప్రస్తుతం శృతి మిన్చుతున్నా ఏమీ అనేవారు కాదు .తన ప్రియ సంభాషణ తో వారి నోటికి తాళం వేసేవారు .ఆ శతావధానం చాలా పేరు తెచ్చింది కవితా ప్రసాద్ గారికి .
దీని తర్వాత కవితా ప్రసాద్ గారి చేత ద్విశతావదానానికి రంగారావు గారు పూనుకొని ప్రుచ్చకులను ఎన్నుకొని రెండు సార్లు బందరులో సమావేశ పరచి అవధానం తీరు తెన్నులను వివరించి కర్తవ్యోన్ముఖులను చేశారు .ఈ ద్విశతావధానం విజయ వాడలో జరిగింది .ఆనాటి విద్యా మంత్రి శ్రీ కడియం శ్రీహరి మొదలైన ప్రముఖులు వచ్చారు.నేనూ మా ఆవిడా కూడా ప్రుచ్చకులుగా ఉన్నాం .మూడు రోజుల కార్యక్రమం అని గుర్తు .ఏర్పాట్లు ఘనం గా ఉన్నాయి. విందూ అదిరింది .రోజూ ఉయ్యూరు నుండి వచ్చి వెళ్ళేవాళ్ళం ఇద్దరం .మూడవ రోజు ధారణా రాక్షసులు సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహా రావు గారు విచ్చేశారు. వారి సమక్షం లో శ్రీ కవితా ప్రసాద్ పద్యాలను ధారణ చేసి నరసింహారావు గారితో సహా అందరినీ అమితాశ్చర్యం లో పడేశారు .గరికపాటి ఈ అవధానిగారిని మెచ్చుకొంటూ ఆశీస్సులను ప్రశంసలను పద్య రూపం లో చదివి కవితా విందు భోజనం పెట్టారు .దీనికిఏకాంబరాచార్యులు బేత వోలు వారు ,ఆశావాదివారు వగైరా కవి శ్రేస్టులు కూడా హాజరై నిండుదనం చేకూర్చారు .శత ద్విశత అవధానాల పుస్తకాలు కూడా రంగా రావు గారు తెచ్చిన గుర్తు . ఈ విధం గా కవితా ప్రసాద్ గారితో సాన్నిహిత్యం ఏర్పడింది .అప్పటి నుండి ఎక్కడ సభలో కనిపించినా ‘’మాస్టారూ బాగున్నారా ?అని ‘’అని పలకరించేవారు చిరు నవ్వుతూ. చిరు దరహాసమే ఆయన సొత్తు .
హైదరాబాద్ లో జరిగే సభలకూ వీలయితే వెళ్ళేవాళ్ళం. అక్కడా వారి అవక్ర కవితా విక్రమాన్ని ప్రదర్శించి మెప్పు పొందేవారు .కృష్ణా జిలా రచయితల సంఘం జాతీయ సదస్సు నిర్వహించినపుడు వారు వచ్చి పాల్గొన్నారని జ్ఞాపకం .మొదటి ప్రపంచ తెలుగు రచయితల సభకు ఊహ వ్యూహం నిర్వహణ ప్రభుత్వ సహకారం అందించటం లోను సభలు అద్వితీయం గా నిర్వహించేట్లు తోడ్పడటం లోను సాంస్కృతిక శాఖ కార్య దర్శిగా శ్రీ కవితాప్రసాద్ చేసిన సేవలు చిరస్మరణీయాలు .గొప్ప కార్య నిర్వాహకులు అనిపించారు .ప్రభుత్వం అందజేసిన ఆర్ధిక సాయాన్ని చెక్కు రూపం లో అందరి కరతాళ ధ్వనుల మధ్యా రెప రెప లాడిస్తూ వేదిక మీద చూపించి ఉత్సాహ పరచారు .ఆ దృశ్యం మరువలేము .దీని ఆధారం గా రెండో ప్రపంచ సభలూ మనవాళ్ళు నిర్వహించారు .ఇటీవల ఫిబ్రవరి లో జరిగిన మూడవ సభలలో శ్రీ కవితా ప్రసాద్ ను శ్రీ ఇనాక్ గారిని ,ఆచార్య శ్రీ శలాక శర్మగారు వంటి ప్రసిద్ధులను తప్పించే వ్యూహం చేసి గొప్ప అపఖ్యాతి పొందారు నిర్వాకం లో సింహ భాగం లో ఉన్న ఒక పంచ కట్టాయన, .దీనితో వీరికి తీవ్ర నిరాశా .నిస్పృహా ఆవేదనా కల్గింది .’’రచయితల సంఘం సూర్య చంద్రులు’’ చేస్ట లుడిగి తమ చేతుల్లోంచి సభా నిర్వహణ ఎవరో లాగేసుకొని తమను బైపాస్ చేసినట్లు పాపం దీన వదనులయ్యారు .మహా సాహితీ మూర్తులకు తెలుగు నేల మీద తీవ్ర నిరాదరణ జరగటం క్షంతవ్యం కాదు .జరిగిన తప్పు మళ్ళీ జరగరాదు .
ఇలాంటి మనస్తాపమే కాక తనను తెలంగాణా కేడర్ లో చేర్చటం తో శ్రీ కవితా ప్రసాద్ తీవ్రం గా కలత చెంది వ్యాకుల మనస్కులయ్యారు .సాంస్కృతిక శాఖ నుండి మార్చటమూ ఆయన్ను బాగా బాధించింది . ‘’బాస్ ‘’పెత్తనమూ నచ్చి ఉండదు .దీనితో ఆరోగ్యమూ దెబ్బ తిన్నది .మృతువుతో భీకరం గా ఇరవై రోజులు పోరాడి ఓడిపోయి దివిజ లోకం చేరారు .ఆ మహనీయునికి ఈ జాతి ఏంతో రుణ పడి ఉంది .వారికి గౌరవ స్మ్రుతి చిహ్నం ఏర్పాటు చేయాలి .వారి పేరిట ప్రభుత్వం పురస్కారాన్ని ఏర్పాటు చేయాలి .
అంతర్జాలాన్ని అద్భుతం గా ఉపయోగించుకొని సాహిత్యానికి గొప్ప ఊపు తెచ్చిన వారు శ్రీ కవితా ప్రసాద్ .తన ఫేస్ బుక్ కు ‘’గ్రంధ ముఖి ‘’గా నామకరణం చేసి ‘’లక్ష పద్యార్చనం ‘’చేయించిన కవితా సాహసి. దేశ విదేశాలలో ఉన్న కవులందరూ ఇందులో పాల్గొని విజయవంతం చేశారు అలాంటి గొప్ప వ్యూహ కర్త .విజయవాడ రేడియో కేంద్రం ద్వారా’’ రేడియో అవధానం’’ నిర్వహించిన బయటి ఊరివారు అడిగిన ప్రషణలు పద్య రూపం లో సమాధానాలు చెప్పేవారు .ముఖ్యం గా యువకవులకు యువ అవధానులకు ఆయన గొప్ప మార్గ దర్శి . దీనికి స్టేషన్ డైరెక్టర్ శ్రీ ఆదిత్య ప్రసాద్ గారి సహకారం బంగారానికి వన్నె తెచ్చినట్లయింది .ఆంద్ర ప్రాంతం లోనే కాక తెలంగాణాలోనూ అవధాన ప్రక్రియ నిరంతరం కొనసాగించి 500 అవధానాలు చేసిన ఘన కీర్తి సాధించారు .ఊరికే అవధానాలు చేసి ఊరుకోలేదు అవధాన ప్రక్రియ పై యువకులకు ఉత్సాహం కలిగించటానికి ‘’అవధాన విద్య –ఆరంభ వికాసాలు ‘’,మొదలైన గ్రంధాలు రాశారు .ఒంటరిపూల బుట్ట ,పద్య మండపం ,అగ్ని హంస ,ఇది కవి సమయం ,’’సప్త గిరి ధామ కలియుగ సార్వ భౌమ శతకం ,వేద విజ్ఞాన లహరి ,ఉపనిషత్ సుధాలహరి ,తాను జన్మించిన నెమలి గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీ వేణు గోపాల స్వామిపై ‘’నెమలి వేణుగోపాల శతకం ‘’మొదలైన రచనలు చేశారు శ్రీ కవితా ప్రసాద్ .వారిఅవదానలో అష్టావధానం గణితావధానం ,నవరసవధానం ,శతావధానం ద్విశతావధానం వంటి వైవిధ్య భరిత అవధానాలున్నాయి .ఎన్నో భువన విజయాలను ఆంద్ర దేశమంతటా ప్రదర్శించి తాను శ్రీ కృష్ణ దేవ రాయలుగా ఉండి సరస కవితా ఝరిని పారించి మిగిలిన కవులకూ తగిన ప్రాదాన్యతనిచ్చి భువన విజయాన్ని గ్రామోత్సవం చేసిన కార్య దక్షులు .అవధాన సరస్వతిని పూజించి ఊరేగించిన ఘన చరిత్ర శ్రీ కవితా ప్రసాద్ గారిది
స్నేహ శీలి సౌజన్య మూర్తి సాహసి రస హృదయులు ,అమితమైన ప్రేమాభిమానాలున్న వారు కర్తవ్య దీక్షా బద్దులు ,కార్య క్రమ విజయానికి అకుంఠిత దీక్ష తో కృషి చేసినవారు తెలుగు భాషకు సంస్కృతికి భారతీయ ఆత్మకు ప్రతీకగా నిలిచిన పుంభావ సరస్వతి శ్రీ రాళ్ళ బండి కవితా ప్రసాద్ అకాల మరణం ‘’నడి భానుడు’’ అకస్మాత్తుగా కుంగిపోయి కనుమరుగైనట్లు అనిపిస్తుంది ఆ దివ్య కవితాత్మ ఆత్మకు శాంతి చేకూరాలని ,వారి కుటుంబ సభ్యులకు వారు లేని లోటు క్రమంగా తీరాలని భగవానుని కోరుకొంటున్నాను.వారిఅంతర్ ముఖత్వానికి గొప్ప ఉదాహరణ గా నిలిచే ప్రసిద్ధ పద్యం తో ముగింపు పలుకుతున్నాను –
‘శ్రీ మాత్రు చిత్కళా శ్రీ వత్స లాంచన –ద్యుతి మణి ద్వీప ప్రయోగ సిద్ధి
శ్రీ చక్ర బిందు కేంద్రీయ సుదర్శన –చక్ర విభ్రమణ ప్రసార శక్తి
శ్రీంకార నాదవిస్తృత తరంగావ్రుత –శంఖాను నాద ప్రచండ గరిమ
శ్రీ పీఠ సంస్థిత సిత పద్మ సమ పాద –సందీప్త దివ్య ప్రశస్త శోభ
కలసి తిరు మంత్ర రూపమై వెలసితీవ –వైభవోద్దామ !శ్రీ దాస వార్ధి సోమ
ప్రణవ సుమ దామ !నిగమ పరాగ సీమ –సప్త గిరి ధామ !కలియుగ సర్వ భౌమ ‘’
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17 3-15 –ఉయ్యూరు