రాచపాళెం వారి రాచబాటలో ప్రమాదాలు- మేడసాని మోహన్‌ (16-Mar-2015)

రాచపాళెం వారి రాచబాటలో ప్రమాదాలు- మేడసాని మోహన్‌ (16-Mar-2015)
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు నిగర్వి. నిరాడంబరుడు. విశేషించి నాకు చాలా ఆత్మీయుడు కూడా. వారు ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైనారన్న వార్త మీడియా ద్వారా తెలిసిన వెంటనే ఆనందపారవశ్యాన్ని పొందిన రాచపాళెం వారి మిత్రకోటిలో నేను కూడా ఉన్నాను. కాని కిన్నెర శ్రీదేవిగారు రాచపాళెం వారిని గూర్చి మార్చి 9వతేదీ వివిధలో ప్రకటించిన వ్యాసం చదివిన తర్వాత, ఆ వ్యాసంలో వారు అవధాన ప్రక్రియను కించపరుస్తూ ‘‘అవధానాలు బూర్జువా సంస్కృతి అవశేషాలని చెప్పారు’’- ‘‘రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వాన్ని అంచనా వేసే క్రమంలో జరిగిన లోటుపాట్లకు కార ణం అవధానాలను వదిలించుకోలేని సాహిత్య వారసత్వమే కారణమని ఎంతో నిష్పాక్షికంగా తన అభిప్రాయాన్ని ఆవిష్కరించారు’’- వంటి అంశా లు చూచిన తర్వాత సముచితంగా స్పందించడం నా బాధ్యతని భావించాను.
కిన్నెర శ్రీదేవిగారు ‘అవధానానికి పెట్టనికోటైన రాయలసీమలో’- అని పేర్కొనడం విడ్డూరంగా ఉంది. అవధాన ప్రక్రియకు బంగారు బాటలు వేసి ఆబాలగోపాలాన్ని అలరింపజేసిన తిరుపతి వేంకటకవులు, కొప్పరపు కవులు రాయలసీమవారా? పోనీ, వారి తరం తరువాతనో, కొంత సమకాలికులు గానో వచ్చిన గాడేపల్లి వీరరాఘవ శాసి్త్ర, గడియారం వేంకటశాసి్త్ర మొదలగు మహానుభావులు రాయలసీమవారనుకున్నా, అప్పుడు కూడా వేలూరి శివరామశాసి్త్ర, పిశుపాటి చిదంబరశాసి్త్ర వంటి దిగ్గజాలు కోస్తా జిల్లాలలో ఉన్నవారే. నాడైనా, నేడైనా అవధాన ప్రతిభామూర్తులు అన్ని ప్రాంతాలలో ఉన్నారు. ఈ విధంగా ఆలోచిస్తే అవధాన ప్రక్రియకు సంబంధించిన ప్రాంతీయ విశ్లేషణ పట్ల సత్యదృష్టితో కూడిన అవగాహన రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారి విమర్శలో లేదన్నది స్పష్టంగా తెలుస్తూ ఉంది.
ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి అవధాన ప్రక్రియను గూర్చి రసజ్ఞపాఠకులకు నేను ఒక అంశాన్ని మనవి చేస్తున్నాను. ప్రస్తుతం యావత్‌ ప్రపంచంలో అత్యధికులు క్రికెట్‌ వరల్డ్‌ కప్‌కు సంబంధించిన క్రీడావిశేషాలు చూస్తూ ఉంటారు. ఎవరైనా ఒక క్రీడాకారుడు సిక్సరో, ఫోరో కొట్టినప్పుడు ప్రేక్షకుల నుంచి హర్షధ్వానాలు చూస్తూ ఉంటాం. కాని ఒక అవధాన ప్రతిభామూర్తి చమత్కార బంధురమైన పద్య కవితా శిల్పధోరణితో ఒక సమస్యాపూరణమో, ఒక దత్తపది పూరణమో నిర్వహించినప్పుడు కూడా ఆయా అవధాన సభలలో హర్షధ్వానాలు వ్యక్తమౌతూ ఉంటాయి. అయితే క్రికెట్‌ క్రీడాకారుని ప్రతిభ టి.వి., ఇతర మాధ్యమ ప్రసారాల వల్ల జగద్వ్యాప్తమై శోభిస్తూ ఉంది. అవధాన ప్రతిభకు కూడా అంతగా ప్రసారమాధ్యమాల ప్రోత్సాహం లభిస్తే ఈ ప్రక్రియ కూడా తప్పక జగద్వ్యాప్తం కాగలదు. ఇది కేవలం నా అభిప్రాయం కాదు. నేను అమెరికా వంటి దేశాలలో పర్యటించి అవధాన సాహిత్య సభలు నిర్వహించిన సభలలో పాల్గొ న్న రసజ్ఞులైన అక్కడి విశ్వవిద్యాలయ ఆచార్యులలో కొందరి అభిప్రాయం. ఇటువంటి సదభిప్రాయాలతో కొందరు ఆచార్యులు, సెనేటరులు లిఖితపూర్వకంగా ఇచ్చిన ప్రశంసాపత్రాలు కూడా నా వద్ద ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్పవలసివస్తూ ఉందంటే ప్రపంచభాషలలో ఏ భాషకూ లేని ప్రత్యేకత తెలుగుభాషామతల్లికి అవధాన ప్రక్రియవల్ల లభించిన గౌరవం- అని ప్రపంచ భాషావేత్తలందరూ గుర్తిస్తున్న సత్యం.
తెలుగుభాషకు ప్రాచీన హోదాను సాధించుకోవడంలో కొంతకు కొంత మనం కృతకృత్యులం కాగలిగాం- అనుకోవచ్చు. కాని తమిళ సోదరుల లాగా, కన్నడ సోదరుల లాగా మనం సంపూర్ణ కృతకృత్యులు కాలేకపోయాం. కారణం అక్కడి భాషాభిమానులలో ప్రాచీన హోదాను సాధించుకోవాలనే తపనతోపాటు ప్రాచీన సాహిత్య సంప్రదాయాల పట్ల అపారమైన ఆరాధన, తాత్పర్యం కూడా ఉన్నాయి. ఏమి దురదృష్టమో గాని తెలుగుసీమలో ప్రాచీన హోదాను సాధించుకోవాలనే తపన ఉన్న స్థాయిలో ప్రాచీన సాహిత్య సంప్రదాయాల పట్ల ఆరాధన లేదని స్పష్టమౌతూ ఉంది.
‘విమర్శలో రాచబాట’ అన్న వ్యాసారంభంలోనే కిన్నెర శ్రీదేవిగారు అతిసాహసంతో కూడిన ఒక వాక్యం రాశారు. అందులో రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారిని అలనాటి విమర్శక దిగ్దంతులు కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, ఆర్‌.ఎస్‌. సుదర్శనం-వంటి మహామహులతో సమానంగా ప్రజ్ఞాప్రాభవాలు కలిగిన గొప్పవ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అందులో పూర్తిగా ఔచిత్యం లోపించింది. ఎందుకంటే, పూజ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు గాని, ఆర్‌.ఎ్‌స.సుదర్శనం ప్రభృతులు గాని వారివారి విమర్శనా రచనలలో ఎక్కడా అవధాన ప్రక్రియను కించపరిచే అంశాలు ప్రస్తావించలేదు. పైగా వారీ ప్రక్రియను ఎంతో ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి. ‘శిల్పప్రభావతి’ అన్న రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారి సిద్ధాంత గ్రంథం తెలుగు ప్రబంధాలపై పరిశోధనలు చేసేవాళ్ళకు శిల్పసంబంధమైన చర్చ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందన్న మా గురువుగారు జి.యన్‌.రెడ్డిగారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అయితే ఆ సిద్ధాంతగ్రంథం అంత సైద్ధాంతిక శిల్పశోభితం కావడానికి కారకులు, ప్రేరకులు రాచపాళెం వారికి పీహెచ్‌డీ పర్యవేక్షకులైన ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావుగారు- అన్న అంశాన్ని రాచపాళెం వారు కూడా త్రోసి పుచ్చలేరు.
‘ఆవేశానికి ఆస్కారం ఉన్న సందర్భాలలో కూడా బ్యాలెన్స్‌ కోల్పోకుండా విమర్శ రాయగలగటం ఆయన ప్రత్యేకత’- అన్న కిన్నెర శ్రీదేవి మాటల్లో సత్యం ఉన్నట్లు నేను భావించలేను. ఎందుకంటే, అవధాన ప్రక్రియను కించపరిచే రాచపాళెం వారి విమర్శనా ధోరణిలో పూర్తిగా బ్యాలెన్స్‌ లోపించింది. ఇక్కడ నేను మరొక అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాను. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అధునాతన కవితా ప్రకియలను నిబద్ధతతో అధ్యయనం చేసిన పరిశోధక విమర్శకునిగా నేను మనఃపూర్వకంగా అంగీకరిస్తాను. కాని ప్రాచీన సంప్రదాయ సాహిత్యాన్ని, సంప్రదాయాలను అంతే నిబద్ధతతో వారు అధ్యయనం చేయలేదు- అనడానికి వారి విమర్శన గ్రంథాలలోనే నేను చాల ఉదాహరణలు చూపగలను. రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారు సహృదయంగా ముందుకు వస్తే వారితో నేను ఈ విషయికంగా ముఖాముఖి చర్చకు కూడా సంసిద్ధంగా ఉన్నానని పత్రికాముఖంగా రసజ్ఞ విమర్శకలోకానిక మనవి చేస్తున్నాను.
మేడసాని మోహన్‌
99089 77763

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.