|
మానవుని నిర్లక్ష్య ధోరణి వలన టీబీ ఒక భయంకరమైన ప్రాణాంతక వ్యాధిగా రూపాంతరం చెందింది. అదే ఎండీఆర్/ఎక్స్‌డీఆర్/టీడీఆర్ టీబీ. ఎండీఆర్ అంటే సాధారణ మందులకు లొంగని/ ప్రభావితం కాని టీబీ. ఎక్ ్సడీఆర్, టీడీఆర్ అంటే అన్ని మందులకూ లొంగని/ ప్రభావితం కానీ టీబీ ఇది. టీబీ మందులు సక్రమంగా వాడకపోవడం/మధ్యలోనే మందులు మానెయ్యడం వలన సాధారణ టీబీ కాస్తా ప్రాణాంతకమైన టీబీగా పరిణామం చెందుతుంది. ఇదంతా స్వయంకృత అపరాధమే.
ట ముప్పై మూడు సంవత్సరాల క్రితం (1882, మార్చి 24) నాటి మాట… జర్మనీ రాజధాని బెర్లిన్.. ఆ మహానగరంలోని జీవ ధర్మ శాస్త్ర పరిశోధనా సంస్థ సమావేశ మందిరం.. వైద్యశాస్త్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అది. ఎందుకంటే -వేల సంవత్సరాలుగా మానవుడితో దాగుడుమూతలాడుతూ, మనిషి మనుగడను శాసిస్తూ, అప్పటివరకు అంతుపట్టకుండా ఉన్న ఒక భయంకర వ్యాధికి కారణమైన ‘సూక్ష్మక్రిమి’ని రాబర్ట్ కోచ్ (1845-1910) అనే జర్మన్ శాస్త్రవేత్త కనుగొన్నారు. రాబర్ట్‌కోచ్ పరిశోధన ఆధునిక యుగ జీవ, వైద్యశాస్త్ర పరిశోధనా రంగంలో ఒక ప్రధాన మైలురాయి అని ప్రముఖ శాస్త్రవేత్త పాల్ ఎర్లిచ్ అభివర్ణించారు. ఒక భయంకర వ్యాధి కారక సూక్ష్మ క్రిమిని కనుగొన్నందుకు గాను రాబర్ట్ కోచ్‌కు 1905లో వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. ఆ సూక్ష్మక్రిమి కలుగజేసే వ్యాధి ఆ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడుగురిలో ఒకరిని బలిగొనేది. ఆ వ్యాధే క్షయ (ట్యూబర్క్యులోసిస్-టీబీ).
మైకోబ్యాక్టీరియమ్ ట్యూబరిక్లోసిస్ అనే సూక్ష్మ క్రిమి క్షయ వ్యాధిని కలగచేస్తుంది. రాబర్ట్ కోచ్ పరిశోధన ఫలితంగా క్షయ వంశపారంపర్యంగా కాక, ఒక బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుందని ప్రయోగాత్మకంగా, శాసీ్త్రయంగా నిర్ధారితమయింది.
క్షయ వ్యాధికి సంబంధించిన కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకుందాం. క్షయ రోగి మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, ఉమ్ము ఊసినప్పుడు వెలువడే గాలి తుంపరల ద్వారా చుట్టుపక్కల వారికి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి సోకినవారికి రెండు వారాలుగానీ, అంతకు మించిగానీ బాగా దగ్గు వస్తుంది. సాయంత్రం/రాత్రిపూట జ్వరం వస్తుంది. జ్వరంతోపాటు చెమటలు పడతాయి. రోగి బరువు తగ్గుతాడు. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులకు సోకే వ్యాధి. శరీరంలోని ఇతర అవయవాలకూ క్షయ సోకుతుంది. రోగి నుంచి ఇతరులకు వ్యాపించేది ప్రధానంగా ఊపిరితిత్తుల క్షయే.
క్షయ ప్రాణాంతకవ్యాధా అంటే నూటికినూరుపాళ్ళూ కాదని చెప్పవచ్చు. ఎందుకంటే సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ, ఖచ్చితమైన మోతాదులో శాసీ్త్రయమైన వైద్యం అందించగలిగితే క్షయ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. కనీసం ఆరు నెలల పాటు నిర్ణీత సమయంలో క్రమం తప్పకుండా మందులు వాడితే క్షయ వ్యాధి నుంచి బయటపడడం అంత కష్టమేమీకాదు. ఈ మందుల్ని దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లోను కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. గ్రామ పంచాయతీల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘డాట్స్’ కేంద్రాల వద్ద ఈ మందులను ఉచితంగా పొందవచ్చు.
ఒక యథార్థ విషాదగాథను తెలుసుకుందాం. లక్ష్మికి ఇరవై ఏళ్ళ వయస్సులో వివాహమయింది. పెళ్ళయిన ఆరు నెలలకే భర్తకు క్షయ సోకినట్టు తెలిసింది. గ్రామంలోని డాట్స్ సెంటర్‌కు వెళ్ళితే కళ్ళె పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. రెండు నెలల పాటు మందులు వాడగా వ్యాధి లక్షణాలలో గణనీయమైన మార్పు వచ్చింది. దీంతో వ్యాధి నయం అయిందని భావించి వైద్యుల్ని కూడా సంప్రదించకుండా లక్ష్మి భర్త మందులు వాడడం మానేసాడు. ఆరునెలల పాటు ఎటువంటి సమస్యా రాలేదు. ఆ తరువాత క్షయ లక్షణాలు మళ్ళీ బయటపడ్డాయి. రోజురోజుకీ ఆరోగ్యం క్షీణించింది. ప్రభుత్వ ఛాతీ వైద్యశాలలో పరీక్షలు నిర్వహించగా ఎమ్‌డీఆర్ టీడీ అని తేలింది. అప్పటికే రెండు ఊపిరితిత్తులూ పాడయ్యాయి. మందులు ప్రారంభించినప్పటికీ శరీరంలో అన్ని అవయవాలు క్షీణ దశకు చేరడంతో లక్ష్మి భర్త కొద్దిరోజుల్లోనే మరణించాడు. లక్ష్మి అప్పుడు ఆరునెలల గర్భవతి. భర్త సరిగా మందులు వాడకపోవడం వలన లక్ష్మికి కూడా ఎమ్‌డీఆర్ క్షయ సోకింది. కాన్పు అయిన నెలలోనే ఆమె కూడా మరణించింది. ‘మందులు మానెయ్యడం’ అనే ఒక చిన్న తప్పు ఒక చిన్నారిని తల్లిదండ్రులు లేని అనాథను చేసింది.
ఇప్పుడు క్షయ వ్యాధిని జయించిన ఒక యువతి స్ఫూర్తిదాయక గాథను తెలుసుకుందాం. అనూష (పేరు మార్చబడినది) వయస్సు 17 సంవత్సరాలు. తండ్రి ఆటో డ్రైవర్. ఇంటర్ చదువుతుంది. ఏడాది క్రితం అనూష నానమ్మ క్షయ వ్యాధితో మరణించింది. ఇంటర్ పరీక్షలకు కొద్దిరోజుల ముందు విపరీతమైన దగ్గు, జ్వరం ప్రారంభమయ్యాయి. దగ్గుతోపాటు రక్తంకూడ పడ్డది. వెంటనే దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఛాతీ వైద్యశాలలో వైద్యుల్ని సంప్రదించగా పరీక్షలు నిర్వహించి ఎమ్‌డీఆర్ టీబీ అని నిర్ధారించారు. రెండు సంవత్సరాల పాటు మందులు వాడాలని వైద్యులు సూచించారు. అనూష ఏమాత్రం నిరాశ చెందక, క్రమం తప్పకుండా మందులు, ఇంజెక్షన్లు తీసుకుంది. ఎంత కష్టమయినా టీబీ మందులు వాడడం ఆపలేదు. రెండేళ్ళ అనంతరం ఆమె క్షయ నుంచి బయటపడడమే గాక ఇంటర్లో కళాశాల టాపర్‌గా నిలిచింది.
మానవుని నిర్లక్ష్య ధోరణి వలన టీబీ ఒక భయంకరమైన ప్రాణాంతక వ్యాధిగా రూపాంతరం చెందింది. అదే ఎండీఆర్/ఎక్స్‌డీఆర్/టీడీఆర్ టీబీ. ఎండీఆర్ టీబీ అనగా ‘మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ’ – ఇది సాధారణ మందులకు లొంగని/ ప్రభావితం కాని టీబీ. ఎక్ ్సడీఆర్ టీబీ అంటే ‘ఎక్స్ట్రీమ్లీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ’ అని, టీడీఆర్ టీబీ అంటే ‘టోటల్లీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ’ అని అంటారు. అన్ని మందులకూ లొంగని/ ప్రభావితం కానీ టీబీ ఇది. టీబీ మందులు సక్రమంగా వాడకపోవడం/మధ్యలోనే మందులు మానెయ్యడం వలన సాధారణ టీబీ కాస్తా ప్రాణాంతకమైన ‘ఎండీఆర్/ఎక్స్‌డీఆర్/టీడీఆర్ టీబీ’గా పరిణామం చెందుతుంది. ఇదంతా స్వయంకృత అపరాధం వల్లనే సంభవిస్తుంది.
క్షయ వ్యాధి గణాంకాలను పరిశీలిస్తే భయపడకుండా ఉండడం అసాధ్యం. ఏటా ప్రపంచంలో 90 లక్షల మంది క్షయ వ్యాధి బారిన పడుతున్నారు. వీరిలో మూడింట ఒక వంతుమంది భారతీయులే. మన దేశంలో ప్రతి సెకనుకు ఒకరికి క్షయ సోకుతోంది. ప్రతిరోజూ మూడు నిమిషాలకు ఇద్దరు, సుమారుగా ఒక్కరోజులోనే 1000 మంది క్షయ వ్యాధితో మరణిస్తున్నారు. 2013 గణాంకాల ప్రకారం ఏటా ఎనిమిది లక్షల మంది మన దేశంలో క్షయ వ్యాధితో మరణిస్తున్నారు.
ప్రతి క్షయ రోగి తాను చనిపోయే ముందు లేక చికిత్స పూర్తయ్యేలోపు పదిహేనుమందికి ఆ వ్యాధిని వ్యాప్తి చేస్తున్నాడు. కాబట్టి క్షయ నివారణ మందులు మధ్యలోనే అర్థాంతరంగా మానెయ్యడం ఆత్మహత్యా సదృశమే కాక పదిహేను-ఇరవైఐదు మంది ప్రాణాలకు ముప్పు కలుగచేస్తున్న వారవుతున్నారు. సంతానలేమితో బాధపడుతున్న చాలా మంది సీ్త్రలలో గర్భాశయ క్షయ బయటపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షల మంది ఎమ్‌డీఆర్ (సాధారణ మందులకు లొంగని) క్షయ రోగులు ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో మన కర్తవ్యమేమిటి? ప్రతి వ్యక్తి క్షయ గురించిన ప్రాథమిక విషయాల్ని సమగ్రంగా తెలుసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత, సాంఘిక స్పృహ కలిగివుండాలి. ముఖ్యంగా రోగులు చేయాల్సినవి: వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. డాక్టర్ల సలహా మేరకు మందుల్ని క్రమం తప్పకుండా కనీసం ఆరు నెలలు వాడాలి. మందులు వాడుతున్నప్పుడు ఏవైనా ఇతర సమస్యలు (వాంతులు, కామెర్లు లాంటివి) తలెత్తినట్లయితే వైద్యుల్ని సంప్రదించాలి. మందుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరాదు. బహిరంగ ప్రదేశాలలో తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతిరూమాలు తప్పనిసరిగా వాడాలి. బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. ధూమపానం, మద్యసేవనం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.
డాక్లర్లూ తమ బాధ్యతలు విస్మరించకూడదు- ఏమిటవి? ప్రతి క్షయ వ్యాధ్రిగస్తుడికి వ్యాధి గురించి సంపూర్ణ అవగాహన కల్పించాలి. దీర్ఘకాలిక చికిత్స కొరకు రోగిని మానసికంగా సిద్ధపరచాలి. మందులు మానెయ్యడం వల్ల కలిగే నష్టాలను గురించి వివరించాలి. ప్రతి వైద్యుడు తన వద్దకు వచ్చే రోగుల గురించి ప్రభుత్వానికి తెలియపరచాలి. ఇది ప్రభుత్వ నియమం.
ఇక ప్రభుత్వ కర్తవ్యమేమిటో చూద్దాం. క్షయ వ్యాధి గురించిన అవగాహన సదస్సులను విస్తృతంగా నిర్వహించాలి. గ్రామపంచాయతీలలోని ‘డాట్స్’ కేంద్రాల ద్వారా అందిస్తున్న ఉచిత సేవల గురించి ప్రజలందరికీ తెలియపరచాలి. క్షయ రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేయాలి.
క్షయవ్యాధికి కారణభూతమైన సూక్ష్మ క్రిమిని కనుగొన్న తేదీని అంటే మార్చి 24న ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘వరల్డ్ టీబీ డే’ (ప్రపంచ క్షయ నివారణ దినం)గా ప్రకటించింది. ఈ ఏడాది టీబీ డే సందర్భంగా అందరికీ క్షయ నివారణ చికిత్సలు, ఔషధాలను అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చింది. ‘క్షయను గుర్తించండి, చికిత్స చేయండి, వ్యాధిని పూర్తిగా నిర్మూలించండి, జీవితాల్ని కాపాడండి’ అనే సందేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చింది. ఈ సందేశ స్ఫూర్తితో క్షయ వ్యాధి గురించిన అవగాహనను పెంచుకుంటూ క్షయరహిత భారతదేశ నిర్మాణం దిశగా అడుగులేద్దాం. స్వచ్ఛ భారత్! ఆరోగ్య భారత్!!
|