అవకాశాలను ఒడిసి పట్టుకునే వ్యక్తే జీవితంలో రాణిస్తాడు. కృష్ణాజిల్లా గంపలగూడెం సమీపంలోని గానుగపాడు (కొణత మాత్కుర్)లో జన్మించిన కవితా ప్రసాద్ అవకాశాలను ఒడిసి పట్టుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి. ఏడవ తరగతి నుంచే పద్య రచనకు శ్రీకారం చుట్టారు. ఇంటర్మీడియట్లోనే చిరు కవితలు, గణితం చేయడంలో అద్భుత ప్రావీణ్యత సాధించి అధ్యాపకుల చేత శభాష్ అనిపించుకున్నారు. మచిలీపట్నంలో బీఈడీ పూర్తిచేసి గణితం మాస్టార్‌గా ఖమ్మం జిల్లా భద్రా చలం నెల్లిపాకలో వెలిశారు. సివిల్స్‌పై దృష్టిపెట్టిన రాళ్లబండికి పీఐబీలో ఉద్యోగం లభించడంతో ఉపాఽ ధ్యాయ వృత్తికి రాజీనామా చేసి హైదరాబాద్‌కు చేరారు. 1991లో ప్రకాశం జిల్లా డీఎస్‌డబ్ల్యుఓగా నియమితులై ఆ జిల్లాలోని హాస్టళ్లలో ప్రతి విద్యార్థికి సుపరిచితులే. 1994 డిప్యూటీ డైరెక్టర్ (విజిలెన్స్)లో పనిచేసిన కాలంలో రాష్ట్రంలో అనేక సంచలనాలు సృష్టించి పలువురు అవినీతి అధికారుల నుంచి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేసి అసెంబ్లీలో ప్రశంసలు అందుకున్న అధికారి రాళ్లబండి. 1995లో రెసిడెన్షియల్ పాఠశాల సొసైటీకి డిప్యూటీ సెక్రటరీగా, 1996 వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రభుత్వంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
18వ ఏటనే భద్రాచలంలో అష్టావధానం చేయడం ప్రారంభించారు. దేశ విదేశాల్లో 450కి పైగా అవధానాలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 100కు పైగా ఆయన రచనలు ఉన్నాయి. అవధానాల్లో ఎన్నో వైవిధ్యాలు సృష్టించారు. అష్టావధానం, నవరస నవావధానం, అలంకార అష్టావధానం, సాహిత్య ప్రక్రియావధానం, అపూర్వ దశావధానం, విచిత్ర అవధానం, శతావధానం, ద్విశతావధానం, ఆశు కవితా ఝురి (గంటకు 300 పద్యాలు అశువుగా చెప్పడం), భువన విజయం, 2002లో కృష్ణా మహోత్సవంకు కన్వీనర్‌గా, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పాయ్ ఇంట్లో ఆశు కవితా (ప్రదర్శన), అనేక మార్లు దూరదర్శన్, ఆకాశవాణిలో పలు పుష్కరాలు కళ్యాణాలకు ప్రత్యక్ష వ్యాఖ్యాన కర్తగా వ్యవహరించారు. ఏడు తరాల తెలుగు భాష వారసులుగా నిలిచిన చివరి తరం వ్యక్తి కవితా ప్రసాద్. అవధాన విద్యా వాచస్పతి, ఆశుకవితా సమ్రాట్, అష్టదశావధాని, ద్విశతావధాని తదితర బిరుదులు ఉన్నాయి. 2005లో ప్రతిభ పురస్కారం (అవధాన విద్యకు), 2000లో ముఖ్యమంత్రి పురస్కారం, విజయవాడలో స్వర్ణ కంకణం, విశ్వదాత -200 అవార్డు, మచిలీపట్నంలో కనకాభిషేకం, గుంటూరులో శ్రీనాథ పీఠం డాక్టర్ ప్రసాదరాయ కులపతిచే కనకాభిషేకంతోపాటు అనేక అవార్డులు లభించాయి. తన చివరి సేవ తిరుపతిలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభకు నిర్వాహకులుగా వ్యవహరించి అత్యున్నతమైన గౌరవం పొందారు. రాళ్లబండి వెంకటేశ్వర ప్రసాదరాజే నేటి కవితా ప్రసాద్‌గా పెదబాబుగా ఽధ్రువతారగా నిలిచి నేటి యువతరానికి మార్గదర్శకులుగా నిలిచారు.
– సరస్వతి చలపతిరాజు
ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్