|
భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు బాసటగా నిలిచినందుకు సర్వోన్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. పదిహేనేళ్ళ క్రితం నాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66 ఎ రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రకటించి న్యాయస్థానం అనేకమందిని కాపాడింది. దీనిని ఆయుధంగా చేసుకుని, దఖలు పడిన విస్తృతాధికారాలతో ఇటీవలి కాలంలో పోలీసులు ప్రదర్శించిన దూకుడుతో ఎంతో వివాదం చెలరేగింది. సామాన్యుడి మనోభిప్రాయానికి సామాజిక మాధ్యమాలు ప్రధాన వేదికలుగా ఉన్న కాలంలో అతడికి ఉన్న మౌలికమైన హక్కును ఈ సెక్షన్ ఉల్లంఘిస్తోందని న్యాయస్థానం విస్పష్టంగా ప్రకటించడం సముచితం.
ఈ సెక్షన్ లేకపోతే సమాజం సంక్షోభంలో పడుతుందనీ, ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేయబోమనీ ప్రభుత్వం న్యాయస్థానానికి నివేదించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. 2009 నాటి చట్టానికి సవరణ చేసి ఈ సెక్షన్ చేర్చిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీకి కట్టుబడలేదు. దీనిని ఇప్పుడు సమర్థించుకు వస్తున్న బీజేపీ ప్రభుత్వం గత ప్రభుత్వం అడుగుజాడల్లో నడవదన్న నమ్మకమూ లేదు. అందుకే న్యాయమూర్తులు కూడా ప్రభుత్వాలు వస్తుంటాయ్, పోతుంటాయ్ అంటూ ఆ హామీని ఏమాత్రమూ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ సెక్షన్ అనేక పర్యాయాలు దుర్వినియోగం కావడం వల్లనే న్యాయస్థానం కొట్టివేయవలసి వచ్చిన మాట వాస్తవం. ఈ తీర్పుకు ఆధారంగా పనిచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి కారణం కూడా అవధులు దాటిన దుర్వినియోగమే. శివసేన అధినేత బాల్‌ఠాక్రే మరణించినప్పుడు ముంబైలో బంద్ పాటించడాన్ని ఒక యువతి ఫేస్బుక్లో ప్రశ్నిస్తే మరొకరు దానిని లైక్ చేయడంతో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. సాధారణ జనజీవనానికి ఇబ్బందులు కలిగించే బందులమీద చేసిన వ్యాఖ్యలోనూ, దానిని మరొకరు నచ్చి మెచ్చడంలోనూ ముంబై పోలీసులకు అవమానకరమైన, నేరపూరితమైన అంశాలు ఏం కనిపించాయో అర్ధం కాదు. ఇటువంటి సాధారణ వ్యాఖ్యలకు కూడా విస్తృతార్థాన్ని అన్వయించి, తాము తలుచుకున్నప్పుడు ఈ సెక్షన్‌ను ఎవరిమెడకైనా చుట్టగలిగే అవకాశమూ, అధికారాలు వారికి ఉండటమే ప్రధానమైన సమస్య. ప్రభుత్వాలకు, సమాజంలోని పెద్ద తలకాయలకు ఈ సెక్షన్ సునాయాసంగా ఉపకరిస్తుండటం మరింత భయపెడుతున్న అంశం.
‘స్వేచ్ఛను అడ్డుకోవడానికి అర్ధం లేని భయాలు కారణం కాకూడదు. అభిప్రాయాన్ని చెప్పనిస్తే విపత్తు ముంచుకొస్తుందని భావించడానికి కూడా బలమైన ప్రాతిపదికలు ఉండాలి కదా!’ అంటూ న్యాయమూర్తులు ఆర్.ఎఫ్. నారీమన్, జాస్తి చలమేశ్వర్‌లు చేసిన వ్యాఖ్యలు ప్రశంసనీయమైనవి. ఒక వ్యాఖ్య, ఒక కార్టూన్, ఒక లైక్ సమాజాన్ని అతలాకుతలం చేసేస్తాయంటూ వెంటపడి అరెస్టులు చేస్తున్నవారి భయాలకు సముచితమైన ఆధారాలు, అర్ధాలు లేవని న్యాయస్థానం భావించింది. బందులమీద వ్యాఖ్యానించి అరెస్టయిన షహీన్ ధద, రీను శ్రీనివాసన్‌లతో పాటు ఈ తీర్పు ఇంకా అనేకమందికి తప్పక సంతోషాన్ని కలిగించివుంటుంది. ‘వాద్రాకంటే కార్తి చిదంబరం ఎక్కువ ఆస్తి కూడబెట్టాడంటున్నారు’ అని ట్వీట్ చేసిన రవి శ్రీనివాసన్, పార్లమెంటును అవినీతి కేంద్రంగా కార్టూన్ వేసిన ఆసీమ్ త్రివేది, మమతా బెనర్జీని ఎగతాళి చేస్తున్న కార్టూన్‌ను మరికొందరితో పంచుకున్న జాధవ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంబికేశ్ మహాపాత్ర, ప్రధానమంత్రిమీద జోకులను మరొకరికి పంపిన ఇద్దరు ఎయిరిండియా ఉద్యోగులు, కొద్దిరోజుల క్రితమే సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజామ్ ఖాన్‌ను ఫేస్బుక్లో అవమానించినందుకు అరెస్టయిన ఇంటర్మీడియట్ కుర్రాడు వీరిలో మచ్చుకు కొందరు. పుట్టినరోజున ఒక అమ్మాయికి ఆమె ఫోటోను ముద్రించిన కేక్ బహుమతి ఇచ్చినందుకు కూడా 2012లో ఒక కుర్రాడిని అరెస్టు చేశారు. ఫేస్బుక్ నుంచి ఆ అమ్మాయి ఫోటోను డౌన్లోడ్ చేసినందుకు అతడు ఈ సెక్షన్ పరిధిలోకి వచ్చాడు. ఈ సెక్షన్లో ఉపయోగించిన భాష, పదజాలం ఏమాత్రమూ నిర్దిష్టంగా లేకుండా, అత్యంత అలవోకగా ఉండటంతో పోలీసులకు అవసరం మేరకు దాని విస్తృతిని పెంచుకోవడానికీ, నచ్చిన భాష్యం చెప్పుకొని, నచ్చిన చోట అమలులో పెట్టగలిగే అవకాశం లభించింది. తీవ్ర మనస్తాపం వంటి అనేక పదాలకు కచ్చితమైన నిర్వచనాలు చెప్పకపోవడం వల్ల తనకు నచ్చిన ఒక వాదననో, ఒక విశ్లేషణనో వాటితో విభేదించేవారికి పంపించడం కూడా నేరంగా మా రే ప్రమాదాలు ఏర్పడ్డాయి. న్యాయమూర్తి నారిమన్ స్వయంగా ఉదహరించినట్టు చెబుతున్న మతమార్పిడుల అంశాన్నే తీసుకున్నా దానికి అనుకూల, వ్యతిరేక వ్యాఖ్య లు చేసిన వారివురూ ఎదుటివారికి తీవ్ర మనస్తాపం కలిగించినవారే అవుతారు.
ఎమర్జెన్సీ నాటి రోజులను మళ్ళీ గుర్తుకు తెస్తూ మూడేళ్ళక్రితం అరెస్టయిన ఆ ఇద్దరు యువతులు దేశంలో ఒక విప్లవానికి కారకులైనారు. భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్ళు వేయడాన్ని సవాలు చేసిన న్యాయవాది ఘోషల్ సహా ప్రజాస్వామ్య పునాదిని పరిరక్షించడానికి పాటుపడినవారందరూ ఈ సందర్భంగా అభినందనీయులు. ఈ సెక్షన్‌లోని మిగతా రెండు భాగాలతో పాటు, నేరపూరితమైన వ్యాఖ్యలు, పరువు నష్టం ఇత్యాది అంశాలు అలాగే ఉన్నందున డిజిటల్ మాధ్యమాన్ని దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తపడటం ఎలాగూ తప్పదు.
|