ప్రతిపక్షం ఒక మిథ్య – ఎ. కృష్ణారావు

ప్రతిపక్షం ఒక మిథ్య – ఎ. కృష్ణారావు

కీలక ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటీకరణ విషయంలో రాజకీయ పార్టీల మధ్య ఏ విభేదాలుండవన్న వాస్తవానికి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరిగిన తీరే నిదర్శనం. రాజకీయ నాయకులకూ పారిశ్రామిక వేత్తలకూ మధ్య ఉండే సాన్నిహిత్యం కూడా రోజురోజుకూ బలపడుతోందని, అదే సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తోందని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి.
పార్లమెంట్‌లో ఒక పూట అధికార విపక్షాల మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం జరుగుతుండడం చూసి, మరో రోజు ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను స్తంభింప చేయడం చూసి దేశ రాజకీయాలను అంచనా వేయడం కన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. అసలు ప్రతిపక్షాలు ఈ సభను సాగనిస్తాయా, ప్రభుత్వం అత్యంత కీలకమైన బిల్లులను సభలో ఆమోదింపచేయ గలుగుతుందా? రాజ్యసభలో మెజారిటీ లేకుండా నరేంద్రమోదీ సర్కార్‌ ఎన్నడు తన ఎజెండాను ఎప్పుడు పూర్తి చేయగలదు? అన్న ప్రశ్నలతో బుర్రల్ని వేడెక్కించుకోవడం అనవసరం అని కూడా చెప్పక తప్పదు. గాలివానల మధ్య ప్రారంభమై, తుఫానుతో హోరెక్కినట్లు సాగే పార్లమెంట్‌ తీరా సమావేశాలు పూర్తయ్యే సరికి ప్రశాంతంగా ముగియడం, అంతా కలిసి రాత్రి పొద్దుపోయే వరకూ ఉండి అనుకున్న బిల్లులను ఆమోదించుకోవడం చూస్తే ఇన్నాళ్లూ ఎందుకంత ఉత్కంఠకు గురయ్యామా అనిపిస్తుంది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు తొలివిడత పూర్తయ్యే సరికి ఊహించని విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెదవులపై చిరునవ్వు తళుక్కుమని మెరుస్తుంది. మరునాడు ఆయన భూసేకరణ బిల్లు వల్ల రైతాంగానికి ఎంత ఉపయోగమో చెప్పేందుకు రేడియోలో ప్రజలనుద్దేశించి తన మనసులో మాటను వివరించారు. ఉరితీతకు గురైన స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌ సింగ్‌, రాజగురు, సుఖ్‌దేవ్‌లకు నివాళి అర్పిస్తూ పంజాబ్‌లో జరిగిన ర్యాలీలో కూడా ఆయన భూసేకరణ బిల్లు గురించే మాట్లాడారు.
పార్లమెంట్‌ ఉభయ సభల సమావేశాలు కేవలం 19 రోజులే జరిగాయి. ఈ 19 రోజులు ముగిసే సరికి దేశ ఆర్థిక సామాజిక వ్యవస్థపై చెపకోదగ్గ ప్రభావం చూపే అనేక నిర్ణయాలపై చట్టాలు జరిగాయి. బీమారంగంలో విదేశీ పెట్టుబడిని పెంచే బిల్లుపై ఎలాంటి రణగొణ ధ్వనులు లేకుండా కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు కలిసి ఆమోదించాయి. దేశంలోని బొగ్గుగనులు, ఖనిజవనరుల మైనింగ్‌ను పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ ఆమోదించిన బిల్లులు కూడా కొద్ది పాటి అలజడి మధ్య ఉభయ సభలు ఆమోదించాయి. ఒక్క భూసేకరణ చట్టం సవరణ బిల్లుపై తప్ప నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన అన్నిఆర్డినెన్స్‌లకూ సభ ఆమోద ముద్ర వేసింది. ‘కావాలంటే భూసేకరణ బిల్లుపై మరో సారి ఆర్డినెన్స్‌ జారీ చేసుకోండి.. ’అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాదే సలహా ఇవ్వడం ద్వారా సంకేతాలు అందించారు. అవసరమైతే ఉభయ సభల్ని మరో వారం పొడిగిస్తాం.. అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు చేసిన బెదిరింపుతో దారికి వచ్చిన ప్రతిపక్షాలు అప్పుడప్పుడూ సభలను నాటకీయంగా స్తంభింపచేయడం మినహాయిస్తే ప్రభుత్వ ఎజెండాను అమలు చేసేందుకు సహకరించాయి.
’దేశ, విదేశాలనుంచి బడా మైనింగ్‌ కంపెనీల ప్రతినిధులు ప్రస్తుతం ఢిల్లీలో మోహరించారు.. ’అని మోదీ సర్కార్‌లో ముఖ్యుడైన ఒక కేబినెట్‌ మంత్రి సెంట్రల్‌ హాలులో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. పార్లమెంట్‌ ఆవరణలో అనేక కంపెనీల ప్రతినిధులు తచ్చాడడం ఆయన మాటలకు బలం చేకూర్చింది. ‘ఇక్కడ బిజూ జనతాదళ్‌ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం ఎక్కడ?’ అని ఒక విదేశీయుడు దారిన వెళుతున్న విలేకరులను అడగడం కూడా అసాధారణ దృశ్యం కానే కాదు. ‘మన పార్లమెంట్‌ సభ్యులే ఆయా కంపెనీల తరఫున ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు..’ అని ఆ కేబినెట్‌ మంత్రి వాపోయారు. ఈ నేపథ్యంలో ఎంపిలంతా కలిసికట్టుగా కూర్చుని, పార్టీలకు అతీతంగా దేశంలో సంస్కరణలను వేగవంతం చేసేందుకు పూనుకుంటే ఇక పార్లమెంట్‌లో అధికార విపక్షాలకు మధ్య తేడాను ఏ విధంగా చూడగలం?
విచిత్రమేమంటే నరేంద్రమోదీ సర్కార్‌ ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఒకరోజు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్రపతి భవన్‌ వద్దకు ప్రతిపక్షాలతో కలిసి ఊరేగింపుగా వెళితే అదేదో భూమిదద్దరిల్లే వార్తగా భ్రమింపచేసే ప్రయత్నాలు జరిగాయి. పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదురుగా సోనియాగాంధీతో పాటు 14 పార్టీలకు చెందిన 26 మంది నేతలు, వందమందికి పైగా ఎంపిలు పోగై, వడివడిగా నడుచుకుంటూ రాష్ట్రపతి భవన్‌ వద్దకు ఊరేగింపుగా వెళుతుంటే వందలాది టీవీ ఛానెల్స్‌ ప్రతినిధులు, విలేకరులు వారి వెంట పరుగులు తీయాల్సి వచ్చింది. గత ఏడాది చిత్తుగా ఓడిపోయిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష సభ్యులు ఏకం కావడం ఒక చారిత్రాత్మక ఘటనగా కాంగ్రెస్‌, వామపక్ష, తదితర నేతలు తీర్మానించారు. దీనితో మోదీ సర్కార్‌ పడిపోయినంత హంగామా సృష్టించారు. ‘ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామ్య, అగ్రగామి దృక్పథం కల వారంతా మోదీ ప్రభుత్వ సమాజ వ్యతిరేక నిర్ణయాలను ప్రతిఘటించేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు..’ అని సోనియాగాంధీ ప్రకటించారు. కాంగ్రెస్‌, జనతాదళ్‌ (యూ), సమాజ్‌వాది పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఐ(ఎం), డీఎంకే, ఆర్‌జేడీ, ఎన్‌సీపీ, ఆప్‌, ఐఎన్‌ఎల్‌డీ తదితర పార్టీల నేతలంతా దాదాపు కిలోమీటర్‌ నడిచి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.
సరిగ్గా మూడురోజుల తర్వాత పార్లమెంట్‌ సమావేశాలు ముగిసేసరికి ఈ 14 పార్టీల మధ్య ఐక్యత బూటకమని రుజువైంది. రాజ్యసభలో గనులు, బొగ్గు బిల్లులను ఆమోదించేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఉత్సుకత ప్రదర్శించాయి. తృణమూల్‌, ఎస్‌పీ, బీఎస్‌పీ, ఎన్‌సీపీ, అన్నాడీఎంకే, బీజేడీ, జేఎంఎం, డీఎంకే తదితర పార్టీలన్నీ ప్రభుత్వానికి మద్దతు నిచ్చాయి. అకాలీదళ్‌, శివసేన, టీడీపీ వంటి మిత్రపక్ష పార్టీలు సరే సరి. ఆఖరుకు జేడీ (యూ) కూడా ఓటింగ్‌లో పాల్గొనకుండా బిల్లులను పరోక్షంగా సమర్థించాయి. చివరకు రాష్ట్రపతి భవన్‌ వద్దకు ఊరేగింపుగా వెళ్లిన 14 పార్టీల్లో కాంగ్రెస్‌, వామపక్షాలే బిల్లులను వ్యతిరేకించిన పార్టీలుగా మిగిలాయి. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఎంపిలు కొందరు గైరు హాజరు కావడంతో ఆ పార్టీ కూడా ప్రతిపక్షాల ఐక్యతకు పరోక్షంగా తూట్లు పొడిచినట్లు స్పష్టమైంది. నరేంద్రమోదీ, అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడు, పీయూష్‌ గోయెల్‌ మొదలైన ముఖ్యనేతలంతా గత కొద్ది కాలంగా వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో స్వయంగా మాట్లాడుతూ నయాన, భయాన అందర్నీ దారికి తెచ్చుకోగలిగారనడంలో అతిశయోక్తి లేదు. సమావేశాలు జరుగుతుండగానే మమతా బెనర్జీ పార్లమెంట్‌కు వచ్చి మోదీ, వెంకయ్యలను కలిశారు. ఒడిషా భవన్‌లో ీజైట్లీ, పీయూష్‌ గోయెల్‌ నవీన్‌ పట్నాయక్‌తో మంతనాలు జరిపారు. ప్రధానితో మాట్లాడించారు. బొగ్గు, గనుల బిల్లులు ఆమోదం పొందితే రాషా్ట్రలకే (మీకే) ఆదాయం పెరుగుతుందని ఆశ చూపించారు. గతంలో వేలాన్ని వ్యతిరేకించిన బీజేపీ పాలిత రాషా్ట్రలు, పశ్చిమబెంగాల్‌, ఒడిషా సర్కార్లు ఇపడు కిమ్మనకుండా ఉండిపోయారు. ఇక కాంగ్రెస్‌తో బీజేపీ నేతలు మాట్లాడలేదని చెప్పలేం. ఎవరు మాట్లాడినా, మాట్లాడకపోయినా, గనుల కంపెనీల ప్రతినిధులు అందరితోనూ మాట్లాడుతూనే ఉంటారు కదా.. అయినా కాంగ్రెస్‌ నేతల్లో భూఆక్రమణ జరపని, మైనింగ్‌ వ్యాపారం చేయని, వ్యాపారాలు చేసుకోని వారెందరు? ఒకవైపు బొగ్గు, మైనింగ్‌ బిల్లులపై పార్లమెంట్‌లో చర్చలు జరుగుతున్న తరుణంలోనే కాంగ్రెస్‌ ఎంపి నవీన్‌ జిందాల్‌ బొగ్గు గనుల వేలంలో పాల్గొనడం ఇందుకు నిదర్శనం.
విచిత్రమేమంటే తాము కొత్తగా ప్రవేశ పెట్టిన విధానం ద్వారా గనుల వేలం పారదర్శకంగా జరుగు తుందని,కాంగ్రెస్‌ హయాంలో జరిగినట్లు కొందరికే మైనింగ్‌ ప్రయోజనాలను కట్టబెట్టే ప్రసక్తి లేదని మోదీ సర్కార్‌ చెపకుంటున్న సమయంలోనే జిందాల్‌, బాల్కో కంపెనీలు నాలుగు బొగ్గు గనులను కొత్త విధానంలోకూడా లొసుగులను ఉపయోగించుకుని అతి చవక ధరకు వేలం పాడగలిగాయి. టన్నుకు వేయికిపైగా పలికే ధరను వందల రూపాయల్లోనే చేజిక్కించుకున్నాయి. కొన్ని కంపెనీలు కూడబలుక్కుని తమలో తాము రహస్యంగా మాట్లాడుకుని, నీకది, నాకది (క్విడ్‌ప్రోక్యూ) పద్దతిలో కుమ్మక్కు (కార్టెలైజేషన్‌)అయినట్లు తెలియడంతో సర్కార్‌ ఉలిక్కిపడి ఈ వేలం చెల్లనేరదని ప్రకటించింది. ఇదే కాంగ్రెస్‌ ఎంపి కంపెనీకి కాక బిజెపికి సన్నిహితంగా ఉన్న కంపెనీ చేసి ఉంటే వేలం చెల్లదని ప్రకటించేవారా? ఏమైతేనేం ప్రభుత్వ నిర్ణయంతో జిందాల్‌ కంపెనీ సుప్రీంకోర్టుకెళ్లాల్సి వచ్చింది. ఏమైనా ఏ విధానం ప్రకటించినా అది పూర్తిగా పారదర్శకం కాదని, ఎందులోనైనా లొసుగులు ఉంటాయని, అస్మదీయులకు ఏ పద్దతిలోనైనా అగ్రతాంబూలం ఇచ్చే అవకాశం ఉంటుందని స్పష్టమవుతోంది.
కీలక ఆర్థిక సంస్కరణలు, విస్తృతంగా ప్రైవేటీకరణ విషయంలో రాజకీయ పార్టీల మధ్య ఏ విభేదాలుండవని పార్లమెంట్‌ బడ్డెట్‌ సమావేశాలు జరిగిన తీరే నిదర్శనమైతే, రాజకీయ నాయకులకూ పారిశ్రామిక వేత్తలకూ మధ్య ఉండే సాన్నిహిత్యం కూడా రోజురోజుకూ బలపడుతోందని, అదే సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఒక కంపెనీ, రాజకీయ నాయకులను, అధికారులను ఏ విధంగా ప్రలోభపెడుతూ తన ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నదో చెప్పేందుకు ఈ-మెయిల్స్‌ను సాక్ష్యాలుగా ప్రవేశపెడుతూ సుప్రీంకోర్టులో తాజాగా ఒక పిల్‌ దాఖలైంది. ప్రభుత్వ విధానాలను మార్చేందుకు, పార్లమెంట్‌లో తమకు ప్రయోజనం చేకూర్చే ప్రశ్నలు లేవనెత్తేందుకు, ప్రభుత్వ అంతర్గత డాక్యుమెంట్లను, కేబినెట్‌ పేపర్లను డాక్యుమెంట్లను సంపాదించేందుకు పారిశ్రామికవేత్తలు తమ ధనబలాన్ని ఉపయోగించుకుంటున్నారని ఈ పిటీషన్‌ పేర్కొంది. సుప్రీం ఈ అంశంపై సిబిఐ, సర్కార్‌లకు నోటీసైతే జారీ చేసింది. కానీ వ్యాపార వర్గాలే సర్కార్‌ను నడిపించడం సహజంగా మారినపుడుసుప్రీం కోర్టు అయినా ఏమి చేయగలదు?
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఎ. కృష్ణారావు  

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.