కృష్ణుడితో సంభాషణ

కృష్ణుడితో సంభాషణ

మనలో చాలా మంది ఏదైనా సమస్య ఎదురయినప్పుడు భగవంతుడికి మొర పెట్టుకుంటారు. కొన్ని సార్లు ఆ భగవంతుడు కరుణిస్తాడు. కొన్ని సార్లు కరుణించడు. అసలు మన రోజువారి జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లకు సమాధానాలున్నాయా? వాటికి గీతాకారుడు కృష్ణుడు ఎలాంటి పరిష్కారాలు సూచిస్తాడనే ఆలోచనకు ఊహాజనిత రూపమిది..
ఆధునిక జీవి (ఆ.జీ): నాకు అస్సలు ఖాళీ ఉండటం లేదు. జీవితం చాలా బిజీ అయిపోయింది. దీనికి పరిష్కారమేమిటి?
కృష్ణుడు: పని ఎప్పుడూ మనని బిజీగా ఉంచుతుంది. కానీ దాని నుంచి వచ్చే ఫలితం మనకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది.. ఒత్తిడిని తగ్గిస్తుంది.. అందుకే సానుకూల ఫలితాలు వచ్చినప్పుడు ప్రపంచమంతా విశాలంగా అనిపిస్తుంది.
ఆ.జీ: అసలు ఈ జీవితం ఎందుకింత సంక్లిష్టంగా తయారయింది?
కృష్ణుడు: మన జీవితాన్ని మనమే సంక్లిష్టంగా తయారుచేసుకుంటాం. ప్రతి విషయానికి ఆందోళన చెందటం ఒక అలవాటుగా మారిపోయింది. అందుకే జీవితంలో ఆనందం ఉండటం లేదు..
ఆ.జీ: ఆనందం విషయం పక్కన పెడితే- అసలు మంచివాళ్లకే కష్టాలెందుకు వస్తాయనిపిస్తూ ఉంటుంది..
కృష్ణుడు: సాన పెట్టకపోతే వజ్రానికి కాంతి రాదు. అగ్నిలో కాల్చకపోతే బంగారానికి కాంతి రాదు. అందుకే మంచివాళ్లకు రకరకాల సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. వాటి వల్ల వారి జీవితం బాగా మెరుగుపడుతుంది. ఆ సవాళ్లను కష్టాలనుకోకూడదు..
ఆ.జీ: అంటే ఆ అనుభవాలు మనకు ఉపయోగపడతాయంటావు?
కృష్ణుడు: అవును. కచ్చితంగా ఉపయోగపడతాయి. అనుభవం చాలా గొప్ప ఉపాధ్యాయురాలు. అయితే ఆమె ముందు పరీక్ష పెడుతుంది.. ఆ తర్వాతే పాఠాలు చెబుతుంది..
ఆ.జీ: జీవితంలో ఆనందం.. అనుభవాల విషయం వదిలేద్దాం.. ఎటు చూసినా కష్టాలు, ఆందోళనలే కనిపిస్తున్నాయి.. అసలు మన ప్రయాణం ఎటువైపు? అనే అనుమానం కూడా వస్తూ ఉంటుంది..
కృష్ణుడు: జీవితం ఒక బస్సు ప్రయాణంలాంటిది. కిటికీలో నుంచి చూస్తే- బయట విషయాలే కనిపిస్తూ ఉంటాయి. నీ ప్రయాణం ఎక్కడికనే విషయం నీకు మాత్రమే తెలుస్తుంది. అంతర్ముఖుడివై గమ్యం ఏమిటో నీ హృదయాన్ని అడుగు. సమాధానం లభిస్తుంది..
ఆ.జీ: అది అంత సులభం కాదు. గమ్యాన్ని నిర్దేశించుకొని.. దానిని చేరుకోలేకపోతే ఓడిపోతాననే ఆలోచన నన్ను భయపెడుతూ ఉంటుంది..
కృష్ణుడు: విజయం అంటే ఏమిటి? అనే విషయాన్ని నిర్దేశించేది ఇతరులు. ఒకరికి విజయం- మరొకరికి పరాజయమే కదా.. వీటి గురించి ఆందోళన చెందటం కన్నా- ఆత్మ సంతృప్తి ముఖ్యం. ఇది ఉన్నప్పుడు- జయాపజయాల గురించి చింత ఉండదు.
ఆ.జీ: అలా ఉండటం కూడా కష్టమే.. ఎప్పటిప్పుడు మనకు మనమే స్ఫూర్తిని ఎలా పొందుతాం?
కృష్ణుడు: జయాపజయాలకు మన జీవిత ప్రయాణానికి చాలా దగ్గర సంబంధం ఉంది. జీవితంలో అపజయాల గురించి మాత్రమే ఆలోచిస్తుంటే చాలా నిరాశ కలుగుతుంది. ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. అందువల్ల- మనం ఎంత దూరం ప్రయాణించాం? అనే విషయాన్ని మాత్రమే గమనిస్తూ ఉండాలి. మనకు లభించిన సౌఖ్యాలు, ఆశీస్సులను మాత్రమే గమనించాలి.
ఆ.జీ: నువ్వు ఇన్ని సమాధానాలు చెబుతున్నావు కదా.. ఇప్పుడో ప్రశ్న అడుగుతా… మానవుల్లో నీకు ఆశ్చర్యం కలిగించే లక్షణమేమిటి?
కృష్ణుడు: ఎప్పుడైనా కష్టాలు వస్తే- ‘‘నాకు మాత్రమే ఈ కష్టాలు ఎందుకొస్తున్నాయి?’’ అని దేవుడిని ప్రశ్నిస్తారు. వారికి సుఖాలు, సంపద వచ్చినప్పుడు మాత్రం- ‘‘నాకు మాత్రమే ఈ సుఖాలు, సంపద ఎందుకు లభిస్తున్నాయి?’’ అని ప్రశ్నించరు.
ఆ.జీ: నాకు జీవితంలో ప్రతి క్షణాన్ని అనుభవించాలని ఉంది.. ఎలా?
కృష్ణుడు: గతాన్ని తలుచుకొని ఎప్పుడూ బాధపడకు. వర్తమానంలో ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో చేయి. భవిష్యత్తు గురించి బెంగపడకు. దానిని ఎదుర్కోవటానికి ధైర్యంగా ఉండు.
ఆ.జీ: ఆఖరిగా ఒక ప్రశ్న అడుగుతా.. తప్పకుండా సమాధానం చెప్పాలి.. కొన్ని సార్లు నా ప్రార్థనలను నువ్వు ఎందుకు పట్టించుకోవు?
కృష్ణుడు: ఫలితం లేని ప్రార్థన ఎప్పుడూ ఉండదు. నాపై నమ్మకాన్ని ఉంచి ధైర్యంగా ముందుకు వెళ్తే ఎలాంటి ఆటంకం రాదు. జీవితం ఒక ప్రహేళీ. అంతే తప్ప అదొక సమస్య కాదు. ఈ విషయం తెలుసుకుంటే- జీవితం ఆనందమయమవుతుంది..

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.