‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-6(చివరిభాగం )
25-నవ్యాంధ్ర రాజధాని –శ్రీ కే .రవి కిరణ్ –విజయవాడ
రాజదానికేమి నిర్మింప బడవచ్చు భౌగోళికముగ-ఇపుడైనా నెపుడైన ఇచట చట నెచట నైన
రాజు ఉండేడిస్థానమే రాజధాని యని భావిస్తే –అధికారానికి ఆవశ్యకమయ్యే
ప్రజా హృదయమే కదా అసలు సిసలు రాజధాని
సుపరిపాలకుడై పొందాలి స్థానమచట
పాలకుడు పదికాలాలు పాలించ వలెనన్న
పరిమితమవరాదు అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికీ
రాజ్యమంతా చెందాలి ఒకే రీతిగా అభివృద్ధి
మారేకాలానికి ,,మారుతున్న భావాలకి తగురీతిగ
యోచించి చూపాలోయ్ పాలనలో నూతన శైలి
కావాలోయ్ ఆదర్శం ముందు తరానికి .
భాషా ప్రయుక్త రాష్ట్ర మెల్ల భౌగోళికముగా రెండై
నవ్యాంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏర్పరచుకోవాల్సిన క్లిష్ట పరిస్తితులలో
హుద్ హూద్ తుఫానూ !గోరు చుట్టుపై రోకటి పోటు
నీ పలకరింపూ ఇప్పుడేనా ?జతగా
అయినా ధైర్య స్తైర్యాలతో ఎదుర్కొని నిలిచాం
నేలమట్టమైన ఉద్యానాలను సుందరీకరిస్తాం
సంకల్ప బలం తో పునర్వైభవం సాధిస్తాం
మనో బలముంటే అసాధ్యమే లేదని రుజూ చేస్తాం
ఈ మన్మధ ఉగాది
నవ్యాంధ్ర రాష్ట్ర దివ్య యుగానికి నాంది
కవికోకిల కుహూ కుహూ నాదాలతో
పులకిస్తోంది ఎడద ఆశల చివురులేస్తోంది
శుభం భూయాత్ నవ్యాన్ద్రా శుభం భూయాత్ .
26-నవ్యాంధ్ర కు శుభాకాంక్షలు –శ్రీ పంతుల వెంకటేశ్వర రావు –విజయవాడ
సీ –ఒక్కటైనా ప్రజల నొక నుదయమ తుఫాను –రెచ్చి పోవుచు తాను రెండు చేసే
మిగుల ధనము నింక మింగుడు పడకుండ –హుద్ హూదేతెంచెను మహోద్రుతముగ
ఆర్ధిక ఇబ్బందు లాటు పోట్లను గూడి –గత వత్సరంబింక గడిచి పోయే
మన్మధ వత్సరమైన నిపుడు మన –బాధలు తీర్చేడు బాట వేసి
ఆ .వె .-ఆంద్ర రాష్ట్రమున కిపుడు హాయి నిచ్చి –సకల సంపద లిచ్చుచు సౌఖ్య మిచ్చి
భోగ భాగ్యములిచ్చేడు భుక్తి నిచ్చి –దేశమందున ఘనకీర్తి తెచ్చుగాక .
సీ –నవ్యాంధ్ర రాస్ట్రమ్ముభవ్యంబుగా నిల్చి –దేశంబునకు సందేశ మిచ్చి
కొత్త వత్సర మందు కొంగ్రొత్త యాశతో –ప్రజల కానంద సంపదల నిచ్చి
ప్రగతి పధంబున జగతి లో ముందుండి –భూ జనులందరు పొగడు చుండ
విశ్వ విఖ్యాతమౌ పేరు ప్రతిష్టలు –పొందుచు నీ నేలవిందు సేయ
ఆ.వె.-గాయక కవి నాయక నట బుధ జనులు –ఒక్కటై నిలబడి యొకరికొకరు
సాయ మిచ్చు చుండ సౌహార్ద్ర బుద్ధితో –మనదు రాష్ట్ర మింక వినుతి కెక్కు .
ఉత్పలమాల –మన్మధ నామ వత్సరము మానవ కోటికి మేలు సేయుచున్ –కన్మరుగౌ విశేష మగు గౌరవ సంస్కృతి ,సంప్రదాయముల్
చిన్మయ ముద్ర రీతిగాను చింతలు బాపుచు రక్ష నిచ్చుచున్ –జన్మలు సార్ధకంబయి
విచారము దూరము సేయు నిత్యమున్ .
ఆ .వె.-శుక పిక ముఖ రవము సుప్రభాతమ్ము పల్క –లేత మావి చివురు పూత పూయు
వలపు కులుకు చేర్చి వచ్చే వసంతమ్ము –ఆంద్ర రాష్ట్ర ప్రజకు యశము నిచ్చు .
27 –మన్మధ నామ వత్సరమా ! శ్రీ బందా వెంకట రామా రావు –విజయ వాడ
ఓ ఆంద్ర మాతా !నీకు వందన మంటూ చెపుతున్నా సమకాలీన వేదం –తలపులన్ని మూత పెట్టి –దూర దర్శనాన్ని కట్టి పెట్టి
నాయకులను నొక్కి పట్టి –ఒట్టు పెట్టి చీల్చారు మన భాగ్యాన్ని
నిన్నటి జయనామ వత్సరం లో –వచ్చిన అపజయాలకు సాక్షమిది
ముందు నుయ్యి ఒక పార్టి –వెనుక గొయ్యి మరో పార్టీ
నెత్తి మీద పిడుగు మరోపార్టీ –పక్కలో బల్లాలు మరికొన్ని పార్టీలు
గన్నుపాటు లేకుండా వెన్నుపోటు పొడిచారు –ఉన్నది ఊడ్చేసింది హూద్ హూద్
నవరాస్ట్ర నిర్మాణానికి వాగ్దానాలేకాని సాకారం కాని శుష్క ప్రియాలు
అన్నిటా వీర విజ్రుమ్భణమే –నవ్యాంధ్ర స్వర్నాన్ధ్రగా మారు తుందనే ఆశ సందేహమే
కోకిలమ్మ కూతలు చట్టసభలో బూతులు –భావిష్యవాణి గా సింగపూర్ ,జపాన్ ల కోతలూ
మారునా మన తల వ్రాతలు ?ఇదే మన్మధ వాదం ఈ కాల వేదం ఈ బందా నాదం .
28-నానవ్యాంధ్ర మాత –శ్రీమతి పి .పద్మావతీ శర్మ –విజయవాడ
నేనుకలలు కన్నా నా నవ్యాంధ్ర ప్రదేశ్ వచ్చేసింది
నాకలల కొత్త రాజ్యం సాకారమైంది
వలస పక్షుల్లా ఎగురుకొంటూ వెళ్ళిన అందరం
మళ్ళీ మా గూళ్ళకు స్వేచ్చను వెతుక్కొంటూ వచ్చేశాం
హైదరాబాద్ లో ఏముంది నా బొంద ?
హుసేన్ సాగర్ మురికి కంపు తప్ప?
అద్భుతమైన నవ్య రాజధానికి –పునాది వేసి ప్రపంచం అబ్బుర పడేలా
తీర్చి దిద్ది సేబాష్ అని పించు కొంటాం .
భద్రాద్రి రామన్న దూరం అయితేనేమి –తిరుపతి వెంకన్న మా దగ్గరే ఉన్నాడుగా
బాసర సరస్వతి ముఖం చాటేస్తే ఏం ?-అమ్మలగన్న యమ్మ దుర్గమ్మ మాకే స్వంతం
వేముల వాడ రాజన్న వెంట రాకు౦టేనేం?శ్రీశైలం మల్లన్న మాకున్నాడుగా
నల్లబంగారం మనకు నల్లపూసైనా –యెర్ర ,తెల్ల ,పచ్చ బంగారాలన్నీ మనవేగా
కృష్ణా గోదారీ గలగలలు ,మొనగాడు సాగరుడు మనవాడే
నలభై ఏళ్ళకితమే మన రాజ్యం మనకొచ్చి ఉంటె
బంగారు ఇటుకలతోనే రాజధాని కట్టి ఉండేవారం
అయినా మించిపోయిన్దేమీలేదు మిత్రమా
అందాల మన నవ్యాన్ధ్రకు నవ రత్న ఖచిత కిరీటాన్ని అలంకరిద్దాం
ఏడు వారాల నగలు దిగేసి ,కత్తుల బోనులో తిరిగి అలసిన
ఆ పాదాలకు నవనీతం రాసి అందంగా పారాణి దిద్దుదాం
కానివారికోసం చాకిరి చేసి చేసిఅరిగిన
ఆ చేతులకు యెర్రని గోరింటాకు పెడదాం
ఆలోచనలకు ఆంధ్రోడు కావాలి –ఆచరణకు ఆంధ్రోడుకావాలి
ఆవేశానికి విద్యకూ సంస్కారానికీ ఆంధ్రోడేకావాలి ,
మాటకు,సాయానికి మంచి సెబ్బరలకు ఆంధ్రోడేకావాలి ,రావాలి
కాని అక్కడి బిడ్డగా బతకటానికి మాత్రం ఆన్ద్రోడు వద్దు
ఇక్కడ మనకా భయమే లేదు –మనమే రాజూ మంత్రీ అన్నీమనమే
మనమే ప్రజా మనమే పిల్లాపాపా
అంతామనమే మనదే అంతా .మనకోసమే మనం .
సమాప్తం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-15 ఉయ్యూరు