|
వాస్తవాల భూమికపై వీలయినన్ని వివరాలు విశ్లేషించి చెప్పగలిగేలా రచనల్ని ప్రదర్శనలుగా మలచగలగాలి. రంగస్థలాన్ని ప్రదర్శన పద్ధతుల్ని నిబద్ధతతో వేదికపైకి తేవాలి. వేదికపై వారి అభినయం ప్రదర్శన ప్రక్రియలు పద్ధతుల్ని తేరిపార చూసే ప్రేక్షకులు మంచి ఆలోచనాపరులుగా ఆయా రచనల స్ఫూర్తిని అందిపుచ్చుకునేలా చేయాలనే కళాత్మక సందేశాన్ని ఈ ఏడాది పోలెండ్ నాటక రంగ ప్రముఖులు వర్లికోవస్కీ అందించారు.
రెండు తెలుగు రాషా్ట్రల ఆవలివైపు జరుగుతున్న రంగస్థల కార్యకలాపాలపై అంతగా పట్టింపులేని మన నాటక సంస్కృతిలో 64 ఏళ్ళు గడిచిపోయాయి. యునెస్కో సౌజన్యంతో నూరు పైచిలుకు దేశాలు వాటిల్లో మన దేశంలోని ఇతర రాషా్ట్రల వారు పాలుపంచుకుంటున్నా తెలుగు నాటకాల వారిలో ప్రపంచ రంగస్థల దినోత్సవ స్ఫూర్తి కొరవడింది. కొద్దిమందికి మాత్రమే అంతంతమాత్రం తెలిసిన అంతర్జాతీయ నాటకరంగం పోకడలు అందరికీ తెలిసేలా చూసే ప్రయత్నాలు ఏ మాత్రం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. వేల వేదికలపై ఏటేటా ప్రపంచ నాటక దినోత్సవ వేడుకలు జరిగే సందర్భాలు, ఆయా వేదికలపై చోటు చేసుకుంటున్న ప్రదర్శనలపై ఏ మాత్రం ఆసక్తి, సమాచారం లేకుండానే తెలుగునాట నాటకాల వేడుకలు ఎవరికి తోచిన తీరులో వారునిర్వహిస్తూ సంబరపడిపోతున్నారు. తెలుగు నాటక దినోత్సవం కావాలని చాలా ప్రయత్నాలు చేసి ఉమ్మడి రాష్ట్రంలో సాధించుకున ్న స్టేట్ ఫెస్టివల్ హోదా వేడుకలు కూడా అస్తవ్యస్తం అయిపోయాయి. రెండు రాషా్ట్రలుగా విడిపోయాక తెలుగు నాటకరంగంలో తప్పటడుగులు పెరిగిపోయాయి. ఆంధ్ర ప్రభుత్వంలో పలుకుబడి గల నాటక ప్రేమికుల వల్ల నాటక నంది ఉత్సవాలు మళ్ళీ గాడిలో పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం ఇంకా దృష్టి సారించకపోవటంతో నాటక రంగ ఉత్సవాలు ప్రదర్శనలు ఆంధ్ర నాటకరంగ ప్రభావంలోనే తారట్లాడుతున్నాయి. నంది బహుమతులు, ఆ పురస్కారాలు గుర్తించమని, అవి మాకొద్దు అని తెలంగాణ ప్రభుత్వం, అక్కడి మంత్రులు పలుమార్లు ప్రకటించారు. అయినా తమ ప్రత్యేకతను చాటే పురస్కారం అందుకు సంబంధించిన ప్రతీకలు ఆ ప్రభుత్వం ఎంచుకోలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ వారు రాషా్ట్రల విభజన ఉద్యమాల వల్ల అంతరాయం కలిగిన నాటక నంది పోటీలను క్రమబద్ధీకరించుకుంటూ రాజమండ్రిలో ఉత్సవాల నిర్వహణకు తెరతీశారు. భారీ వ్యయ ప్రయాసలతో అందుకు తగిన సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఆ ఊపులోనే తెలుగు నాటకరంగ దినోత్సవం నిర్వహణకు తగిన ఏర్పాట్లు ఆంధ్ర నాటక రంగ అభివృద్ధి సంస్థలో చురుకందుకున్నాయి. ఏప్రిల్ 16న కందుకూరి వీరేశలింగం పుట్టిన రోజును తెలుగు నాటకం పుట్టిన రోజుగా 1996లో ప్రభు త్వం ఖరారు చేసింది. నందమూరి తారకరామారావు పుట్టిన రోజున నంది నాటక ఉత్సవాలు బహుమతి ప్రదానం జరిగేలా 1998లో ఆనవాయితీకి శ్రీకారం చుట్టారు. అప్పటి తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరం కావటంతో కాంగ్రెస్ పెద్దలు నాటక నందిని అస్తవ్యస్తం చేశారు. రాషా్ట్రల విభజన తరువాత ఆంధ్రలో మళ్లా అధికార పగ్గాలు చేపట్టిన తెలుగు దేశం ప్రభుత్వంలో మాగంటి మురళీమోహన్ అలనాటి నాటకనంది ఒరవడి మళ్లా తమ పద్ధతిలో జరిగేలా అన్నింటిని సరిదిద్దారు. మే నెలలో రెండుసంవత్సరాలకు చెందిన పోటీలు ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలతో ముగిసేలా కార్యక్రమాన్ని ఖరారు చేసారు. తెలుగు నాటకరంగ దినోత్సవ కార్యక్రమాలలో పెద్ద గందరగోళం సృష్టించిన గత ప్రభుత్వం తీరును స్వయం ప్రకటిత నాటకరంగ పెద్దల జోక్యం అవగాహన లేని అధికారుల పెత్తనం నుంచి మొత్తంగా తప్పించేలా విధాన నిర్ణయం చేశారు. సాంస్కృతిక శాఖ వారి అవకతవకల నిర్వహణ తెలుగు విశ్వవిద్యాలయం అనవసరపు పాత్రను మొత్తంగా మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రంగస్థల కళాకారులు సమష్టిగాచేసుకునే వేడుక ఇప్పటి స్థితిలో కుచించుకుపోయింది. ఆంధ్రప్రాంతంలో అయినవారికి కానివారికి సన్మానాలు చేసి నగదు బహుమతులిచ్చి సరిపెట్టుకోవటం తప్ప స్పష్టమైన ప్రణాళిక పద్ధతిలేని తీరును పైరవీలతో భ్రష్టుపట్టిన నాటక దినోత్సవం నిజంగా అర్థవంతంగా జరిగేలా చేయాలన్న సంకల్పం మాత్రం అధికారికంగా చెప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాటకరంగ వికాసం కోసం చాలా చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంచాలకులు చేసిన ప్రకటనలు విధాన కల్పన అధికారిక ఉత్తర్వులు దశ దాకా రానేలేదు. నాటకరంగానికి నిర్ణయాత్మక అధికారానికి సన్నిహితంగా రెండు రాషా్ట్రల ప్రభుత్వాలను ప్రభావితం చేయగలిగిన మురళీమోహన్, కె.వి. రమణాచారిల ప్రయత్నాలు రెండు ధ్రువాలుగా మారాయి.
తెలంగాణ కళాకారులు ఆంధ్ర ప్రభుత్వం వారి నందుల కోసం దరఖాస్తు చేసుకుని వెంపర్లాడే దశ వచ్చింది. విశ్వవిద్యాలయాల్లో ఉన్నవారి ప్రమేయం ఆ విద్యార్థితరం వారిలో తప్ప తెలుగునాటక రంగ కళాకారుల్లో ప్రపంచ రంగస్థల దినోత్సవం పట్ల ఆసక్తి, అవగాహన లేవు. 1961 నుంచి ప్రతి ఏటా క్రమం తప్పకుండా అంతర్జాతీయ నాటక రంగ ప్రముఖులతో సందేశం ఇప్పిస్తున్న ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్ వారి కార్యకలాపాలపై తెలుగు కళాకారులలో అవగాహన చైతన్యం పెంచే ప్రయత్నాలు అధికారికంగా కాని నాటకాలు నిర్వహించే సాంస్కృతిక సంస్థల ద్వారా గానీ జరిగినవి శూన్యం. తెలుగు నాటక రంగం నుంచి ఫ్రాన్స్‌లో గల అంతర్జాతీయ నాటక సంస్థతో పరిచయం పెట్టుకున్న ఏకైక ప్రయోక్త పద్మభూషణ్ ఎ.ఆర్. కృష్ణ కృషిని కూడా స్మరించుకోవటం పలుచబారి పోయింది. మరుపుమరకల్లో మలిగిపోయింది. మనం 64 ఏళ్ళుగా నాటక రంగంలో ప్రముఖుల్ని గుర్తిస్తున్న ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్ జాబితాలో కన్నడ రాష్త్రం నుంచి గిరీష్ కర్నాడ్ ఒక్కడు మాత్రమే చోటుచేసుకున్నారు. 2002లో ఆయన ద్వారా వందకు పైగా ప్రపంచ దేశాలవారికి రంగస్థల సందేశం ఇప్పించారు. ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు ఏటేటా ప్రదానం చేస్తున్న ఆ సంస్థవారికి మన ప్రాంతీయుల సృజన ప్రదర్శనల సంగతులు తెలియచెప్పే ప్రయత్నమే జరగలేదు. 22కు పైగా భాషల్లో అనువాదంతో పాటు ప్రపంచరంగస్థల దినోత్సవం జరిగే అన్ని వేదికలపై కళాకారులు ప్రేక్షకులు అందిపుచ్చుకునే సందేశం మన దేశంలో హిందీ, బెంగాలీ, గుజరాతీ, ఒడియా, కన్నడ భాషల్లో అధికారికంగా అనువాదంతో పాటు ప్రాచుర్యం పొందుతున్నాయి. 2015 ఏడాదికి గాను పోలెండుకు చెందిన డైరెక్టర్ క్రిష్టోప్ వర్లికోవస్కీ వెలువరించారు. అసలుసిసలు ప్రయోక్తలు రంగస్థలంనుంచి ఎంత ఎడంగా ఉన్నా మంచి ప్రదర్శనలు ప్రక్రియలు రూపొందించి ప్రేక్షకుల అభినందనలు అభిరుచులు ప్రామాణికంగా పెంచుతూనే ఉంటారన్న వివరణల సందేశం ఆయన వెలువరించారు. వార్సాలోని న్యూథియేటర్‌ను నిర్వహిస్తూ షేక్స్‌పియర్ నాటకాలను నృత్య రూపాలుగా మలచటంలో ఆయన ప్రపంచ ఖ్యాతి గ డించారు. ఆఫ్రికన్ టేల్స్, ఏ ఉమన్ విథవుట్ ఏ షాడో, కింగ్ రోజర్ రిటర్న్స్ వంటి నాటకాలతో అంతర్జాతీయ స్థాయి నాటకకర్తల్లో అగ్రస్థానంలో నిలిచారు. వాస్తవాల భూమికపై వీలయినన్ని వివరాలు విశ్లేషించి చెప్పగలిగేలా రచనల్ని ప్రదర్శనలుగా మలచగలగాలి. రంగస్థలాన్ని ప్రదర్శన పద్ధతుల్ని నిబద్ధతతో వేదికపైకి తేవాలి. వేదికపై వారి అభినయం ప్రదర్శన ప్రక్రియలు పద్ధతుల్ని తేరిపార చూసే ప్రేక్షకులు మంచి ఆలోచనాపరులుగా ఆయా రచనల స్ఫూర్తిని అంది పుచ్చుకునేలా చేయాలనే కళాత్మక సందేశాన్ని ఈ ఏడాది ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా పోలెండ్ నాటక రంగ ప్రముఖులు వర్లికోవస్కీ అందించారు.
జీఎల్‌ఎన్ మూర్తి
(నేడు ప్రపంచ రంగ స్థల దినోత్సవం)
|