|
భగవంతుణ్ణి విగ్రహాల రూపంలో పూజించడం ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండేది. కానీ పాశ్చాత్య దేశాల్లో మత వ్యవస్థ మారిన తర్వాత అట్టి పూజను ఒక అనాగరిక సంప్రదాయంగా చూడటం మొదలైంది. ప్రపంచమంతటా ఉన్నట్లే మన దేశంలో కూడా ఈ ఆచారం ఉంది. ఇది ఎలా ఆరంభమైంది ఎలా మార్పు చెందిందో పరిశీలించగలం.
వేదాల రచనా పద్ధతిని బట్టి వాటిలో విషయాన్ని మూడు స్థాయిల్లో చెప్పినట్లు విద్వాంసులు చెపుతారు. మొదటిది యజ్ఞాలు, కర్మలు, వాటిని ఎలా నిర్వహించాలి మొదలైనవి. దీనిని కర్మకాండ అంటారు. మనిషి ఒక పద్ధతిలో, క్రమశిక్షణలో నడవడం, యజ్ఞం, దానం మొదలైన వాటి ద్వారా మనసు పవిత్రం కావడం కోసం కర్మలు పనికి వస్తాయి. ఇది చాలా ముఖ్యమే కాని ఇదే పరమాత్మ జ్ఞానం కాదు. రెండవది ఉపాసనకాండ. కర్మల్లో మునిగితేలే వ్యక్తిని క్రమక్రమంగా దైవస్వరూపాన్ని గూర్చి ఆలోచింపజేయడానికి ఉపాసనలు చెప్పబడ్డాయి. ‘ఉప’ అంటే ‘సమీపంలో’, ‘ఆసనం’ అంటే ‘ఉండడం’. వేదమంత్రాలు వివిధ దేవతల స్వరూపాల్ని చెపుతాయి. ఈ దేవతలన్నీ ఒకే చైతన్యంలో వివిధ దృష్టికోణాల నుంచి చూడబడే శక్తులు. అయినా మనిషి తన అభిరుచి ప్రకారం ఒక్కొక్క శక్తిని ఇష్టపడతాడు. ఒకడు విద్యకోసం సరస్వతిని ఉపాసిస్తాడు. మరొకడు ధనం కోసం లక్ష్మీదేవిని ఉపాసిస్తాడు. రాజులు యుద్ధాలకు వెళ్లేటప్పుడు దుర్గాదేవిని ఉపాసించేవారు. అలాగ ఒక్కొక్క వ్యక్తి తన ఇష్టం మేరకు దేవతామంత్రాలను తీసుకుని అర్థాన్ని మననం చేస్తూ ధ్యానించే సంప్రదాయం వచ్చింది. దీని వల్ల రెండు లాభాలు. తను చేస్తున్న పనిపై శ్రద్ధ ఏర్పడటం, మనస్సు ఏకాగ్రం చేయగలగడం. కేవలం యాంత్రికంగా కర్మలు చేయడం కాకుండా అర్థం తెలుసుకుని చేయడం అనే స్థాయికి వస్తాడు. అర్థం తెలుసుకుని ఉపాసిస్తే ఫలితం అధికంగా ఉంటుందనేది ఉపనిషత్తుల మాట. కర్మలతో పాటు ఉపాసనలు చేయడం రెండవస్థాయి.
దీని తర్వాతి స్థాయి జ్ఞానకాండ. పై రెండింటి వల్ల కలిగిన పవిత్రత ఏకాగ్రత ద్వారా జ్ఞానానికై ప్రయత్నించడం. ఇది పూర్తిగా శాసీ్త్రయమైన పరిశీలన. ఈ వ్యాసంలోని విషయం కాదు.
ఉపాసనకు ఆధారమైంది మంత్రము, దాని అర్థము అని పైన చూశాం. ఈ మంత్రార్థాన్నే రేఖాగణితంలోని సంకేతాల వలె చిత్రీకరించి చూపితే యంత్రం అవుతుంది. శ్రీచక్ర ఉపాసన గూర్చిన పుస్తకంలో దేవీ స్వరూపాన్ని త్రికోణాలు, చతుర్భుజాలు వేసి వివరించడం చూస్తాం. వీటన్నిటికీ సాంకేతిక అర్థాలు చెప్పారు. సరిగ్గా ఇలాంటి అర్థాన్నే ఆంగ్లంలో ఇటీవల వచ్చిన నవల (హాలీవుడ్ సినిమా కూడా) ‘డావిన్సీ కోడ్’ లో చెప్పిన యంత్రంలో చూడగలం. ప్రాచీన యూర్‌పలోని సోలమన్ దేవాలయంలో ఉన్న చిహ్నంగా రచయిత చెప్పాడు. ఒక్కో తత్త్వాన్ని ఒక్కో దేవతగా భావించి మొదటగా దాన్ని వర్ణించే మంత్రం, దానికే ఒక యంత్రం, ఇలాగ తంత్రశాస్త్రం అనే పేరుతో ఒక శాస్త్రమే బయలుదేరింది. ఈ యంత్రాలు కూడా ఉపాసనకు ఒక ఆధారం.
తర్వాతి కాలంలో మంత్రార్థాన్ని సూచించే చిన్న బొమ్మను ఎదురుగా ఉంచుకోవడం, దానిపై మనస్సును కేంద్రీకరించి ధ్యానం చేయడం అనే ఆచారం వచ్చింది. ఇటి బొమ్మనే ప్రతీక అంటాం. ఇది రాను రాను దాన్ని తయారు చేసేవాడి నేర్పరితనాన్ని బట్టి అందమైన విగ్రహరూపంలోకి మార్పు చెందింది. ఈ విగ్రహాల ప్రమాణం కూడా పెరుగుతూ వచ్చింది. విగ్రహాలు వద్దన్న గౌతమబుద్ధుడికే మనవాళ్ళు అతి పెద్ద విగ్రహాల్ని చెక్కారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల ధ్వంసమైన బమియాన్ బుద్ధవిగ్రహాలు ప్రపంచంలో కెల్లా పెద్ద శిల్పాలని చదివాం. నిజానికి వేదకాలం నాటికి ఈ విగ్రహాలు లేవని పండితుల అభిప్రాయం.
ఈ విగ్రహాలలో కూడా సాంకేతికపరమైన అర్థం ఉంది. మంత్రంలో ఉన్న అర్థాన్నే యంత్రంగా మార్చాం. ఆ తర్వాత చిన్న ప్రతీకగా మార్చాం. దాన్నే విగ్రహంగా మార్చాం. అందుకే మంత్రాన్ని మొట్టమొదటి దేవాలయం అంటారు. మంత్రంలో ఉన్న అర్థాన్ని మనస్సులో భావన చేసినట్లే విగ్రహంలోని విశేషాల్ని కూడా భావన చేయవచ్చు. ఉదాహరణకు గాయత్రీదేవికి ఐదు తలలు అనే మాటకు సంకేతార్థం ప్రార్థనా శ్లోకంలోనే చెప్పబడింది. ఆమె చేతుల్లో ఉన్న ఆయుధాలు, పాశం, వరదముద్ర, అభయముద్ర మొదలైనవాటికి కూడా సాంకేతికార్థాలు చెప్పారు. అలాగే విష్ణువు చేతిలోని శంఖం, చక్రం మొదలైనవి దేన్ని సూచిస్తాయో భాగవతం వివరిస్తుంది. ప్రతి దేవతా రూపాన్ని ఇలాగే తెలుసుకోగలం.
విగ్రహం అనేది ఒక సాధనం మాత్రమే. మనం దాన్నే పూజించడం లేదు అని తెలుసుకోవాలి. దాని ద్వారా దేవతాతత్త్వాన్ని భావిస్తున్నాం. మనస్సును కేంద్రీకరించడానికి ఇదొక సాధనం మాత్రమే. అందుకే రామతాపనీయ ఉపనిషత్తులో ఇలా చెప్పారు- ‘‘చిన్మయస్య అద్వితీయస్య నిష్కలష్య అశరీరిణ:, ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనా’’. నిజమైన తత్త్వం ఒకే ఒక శుద్ధ చైతన్య రూపం. దానికి శరీరం లేదు. అవయవాలు లేవు. అయినా ఉపాసకులకు సులభంగా ఉండడానికై నిర్గుణమైన తత్త్వానికి ఒక రూపకల్పన చేయబడింది అని ఈ శ్లోకం అర్థం. విగ్రహం అనే మాటలో ‘వి’ అంటే ‘విశేషంగా’, ‘గ్రహ’ అంటే ‘గ్రహించడం’. విశేషంగా భగవంతుని తత్త్వాన్ని గ్రహించేది అని అర్థం. The idea of God becomes the idol of God అని చెప్పవచ్చు. ఇదొక ఆధ్యాత్మిక సాధనం. మూఢ నమ్మకం కాదు, శాసీ్త్రయంగా చేసుకున్న ఏర్పాటు. బ్రహ్మసూత్రాలు అనే పుస్తకం మూడు, నాలుగు అధ్యాయాల్లో వీటి శాసీ్త్రయతపై విచారణ చాలా విపులంగా ఉంది.
మరి మనందరం ఇలాగే శాస్ర్తీయంగా భావన చేస్తున్నామా అనేదే ప్రశ్న. మంత్రాలకు అర్థం తెలియకపోవడం వల్ల ఉపాసన క్రమక్రమంగా యాంత్రికమైన పూజగా మారింది. దీన్ని మనం రోజూ చూస్తూంటాం. ఏదో ఒక విశేష పూజను లేదా వ్రతాన్ని చేయడానికి పట్టుపంచ, పట్టుచీర కట్టుకుని కూర్చోవడం వరకునే మనవంతు. తర్వాత పురోహితుడు మన ఎదురుగా దేవతామూర్తిని కలశం రూపంలోనో, మరొక రూపంలోనో ఏర్పాటు చేస్తాడు. అప్పుడప్పుడూ మనల్ని ‘మమ అనుకోండి’ అంటూంటాడు. ఎక్కడెక్కడో తిరుగుతున్న మన మనస్సు ఆ మాటలకు ఉలిక్కిపడి ‘మమ’ అని అంటాం. తర్వాత మళ్ళీ మనస్సు దాని దారిలో అది పరిగెడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా అనాదిగా ఉన్న విధానమే మన సంస్కృతిలో ఇంకా నిలిచి ఉంది. యూరోపియన్ దేశాల్లో (ముఖ్యంగా ఇటలీలో) మూడవ శతాబ్దం వరకూ మిత్రాయిజం అనే మతం ఉండేది. మిత్ర అంటే సూర్యుడు. మనం ‘శంనో మిత్రః’ అనే మంత్రంలో చెప్పుకునే సూర్యుడే. అనేక దేవుళ్ళు, దేవాలయాలు ఉండేవి. నాల్గవ శతాబ్ది తర్వాత ఈ మతం పూర్తిగా అణచివేయబడింది. దేవాలయాలు చరిత్రలో అవశేషాలయ్యాయి. వారి సంప్రదాయంలో కూడా విగ్రహాలు శాసీ్త్రయంగా ఏర్పడినవా? లేదా అన్న విషయం చరిత్రకారులకే తెలియాలి.
ఈనాటికీ అన్ని మతాల వాళ్ళూ ఏదో ఒక చిహ్నాన్ని గౌరవిస్తారు, దానికి అపచారం జరిగితే ఉద్రిక్తతలు వస్తాయి. ఇలాంటి చిహ్నమే విగ్రహం కూడా. ఉపాసన యొక్క ఉద్దేశమే మనస్సును ఒక చోట నిలపడం, యాంత్రికమైన పూజ అనే స్థాయి నుండి ఆలోచన అనే స్థాయికి రావడం. ప్రవచనాలు చెప్పేవాళ్లు రోజూ దీన్ని గురించి చెబుతూనే ఉన్నారు. అయినా మనకు ఇంకా బోధ పడాల్సిన అవసరం ఉంది. కేవలం యాంత్రికమైన తంతు వల్ల ఆ పూజ పట్ల విశ్వాసం నశించే ప్రమాదముంది. ముఖ్యంగా ఈనాటి బాలబాలికలకు ఈ విషయాన్ని వివరించి చెప్పడం చాలా అవసరం.
డాక్టర్ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
|