|
మనందరి ఆత్మలకు మూలం ఆ పరమాత్మ. సృష్టిలో అధర్మం ప్రబలినప్పుడు దానిని పోగొట్టి, ధర్మాన్ని స్థాపించటానికి ఆ పరమాత్ముడు శ్రీరామావతారం ఎత్తాడు. సామాన్య మానవులకు దర్శనం ఇవ్వటానికి దివ్య మంగళమూర్తిని, దివ్యనామాన్ని వదిలివెళ్లాడు. ఆ రూపాన్నే మనం ఇప్పుడు ప్రతి రోజూ ఆరాధిస్తూ ఉంటాం.
మన దేశంలో రామాలయం లేని ప్రాంతం లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి రామాలయాలను ఎలా నిర్మించాలి? రాముడి విగ్రహాలు ఎలా ఉండాలనే విషయం- విష్ణుధర్మోత్తరంలో ఉంది.
రామో దాశరథ కార్యో రాజలక్షణలషితః
భరతో లక్ష్మణశ్చైవ శతృఘ్నశ్చ మహాయశాః
తదైవ సర్వేకర్తవ్యాః కిన్తుమౌలి వివర్జితాః
అంటే రామాలయంలో రాముని విగ్రహాన్ని రాజలక్షణాలతో ఉన్నట్లు నిర్మాణం చేయాలి. అలాంటి లక్షణాలతోనే భరత, లక్ష్మణ, శత్రుఘ్నలను కూడా శిల్పంగా చేయాలి. అయితే శ్రీరాముని శిరస్సుపై కిరీటం ఉండునట్లు భరతుడు మొదలగు వారి శిల్పాలకు కిరీటం ఉండకూడదు. ఆంజనేయుని శిరస్సుకు కూడా కిరీటం ఉండ కూడదు, అయితే ఆయనే ముఖ్యదేవతైన ఆలయంలో ఆంజనేయుడికి కిరీటం ఉండవచ్చు. వీటితో పాటుగా – ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు సీతారామ కల్యాణోత్సవం వైభవంగా జరపడం అనేది ముఖ్య ధర్మమని శాస్త్రం చెప్పింది. అయితే శ్రీరాముడిని ఎలా దర్శించుకోవాలనే సంశయం కలుగుతుంది. దేహోదేవాలయః ప్రోక్తః అనిశ్రతి- అంటే రాముడిని మన దేహమనే దేవాలయంలో ఉన్న ఆత్మారాముడిని దర్శించుకోవాలి. దేహంలో దర్శించుకోవటమనే విషయాన్ని- రామరహస్య ఉపనిషత్‌లో .
అకారక్షర సంభూత సౌమిత్రిః విశ్వభావనః
ఉకారాక్షర సంభూత శ్శత్రుఘ్నః తైజసః స్మృతః
ప్రాజ్ఞాత్మకస్తు భరతో మకారక్షర సంభవః
అర్థమాత్రాత్మకోరామో బ్రహ్మానందైక విగ్రహః
అని చెబుతారు. ఓంకారములో ‘అ’కార, ‘ఉ’కార, ‘మ’కారమను అక్షరాలుంటాయి. ‘అ’ కారముతో చెప్పబడినది మన మెలుకువ ఉపాధిగల విశ్వుడే లక్ష్మణుడని, ‘ఉ’కారముతో చెప్పబడినది మన కలలకు ఉపాధి గల తేజస్సుడే శత్రుఘ్నడని, ‘మ’కారముతో చెప్పబడినది మన గాఢ నిద్రకు ఉపాధిగా గల ప్రాజ్ఞుడే భరతుడని, ఈ మూడు కలిపిన ఓంకారమే బ్రహ్మానంద రూపుడైన శ్రీరామచంద్రుడని ఈ శ్లోకార్థం.
జీవితమే రామాయణం..
రామాయణం మానవ జీవితం నుంచి పుట్టినదే. మన పూర్వీకులు- మన దేహాన్ని- ‘‘అష్టాచక్రా నవద్వారా దేవానం పురయోధ్యా తస్యాగేం హిరణ్మయః కోశః.’’ అని నిర్వచించారు. అంటే ఎనిమిది చక్రాలతో తొమ్మిది రంధ్రాలతో కూడిన దేవతల పురమైన ఈ శరీరమే అయోధ్య అని అర్థం. ఆ అయోధ్యకు అధిపతి ఆత్మారాముడు. అంటే ఆ ఆత్మారాముడిని ప్రతి వ్యక్తి తమ హృదయంలోనే దర్శించుకోవచ్చు. ఇప్పటి దాకా మనం రాముడి గురించి చెప్పుకున్నాం. సీత గురించి చెప్పుకోకపోతే- రాముడు పూర్తి కాడు. సీత గురించి ఆధ్యాత్మ రామాయణంలో
రామం విద్దిపరం బ్రహ్మ సచ్చిదానందమద్వయం
మాం విద్ధి మూల ప్రకృతిం సర్గస్థిత్యన్త కారిణమ్
అని చెబుతారు. అంటే సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మమే రాముడు. సృష్టిస్థితి లయకారిణి అయిన మాయారూపిణే సీత, అందువలన పరమాత్ముని ఆశ్రయించిన శుద్ధ సాత్త్విక ప్రకృతియే అతని సన్నిధిలో సత్త్వ రాజస, తామస సృష్టిని చేస్తున్నది. అయితే మన భక్తి చేత శాంతి వృత్తితో కూడిన మనస్సు మంచి కర్మలు, ధ్యానం చేత శుద్ధ సాత్త్విక ప్రకృతిగా దర్శనమిస్తుంది. ఈ శక్తికే శాంతి అని పేరు. ఈ శాంతి వృత్తియే సీత, అంటే పరమాత్మ వైపు తిరిగిన మనస్సే శుద్ధ సాత్త్విక ప్రకృతి. అదే శాంతి అనే సీత. ఆమే మోక్షరూపిణి.
ఉపసంహారం
శ్రీరామనవమి అంటే శ్రీరాముడు అవతరించిన శుభదినం. అయితే ఆ రోజు కళ్యాణం ఎందుకు చేస్తాం? అనే ప్రశ్న కొందరిలో కలుగుతూ ఉంటుంది. భగవంతుడికి కల్యాణము అంటే అది లోక కళ్యాణం. పరమాత్మ అనే చైతన్యము, ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికమనే ఈ విశ్వముతో కూడిన ప్రకృతిల వల్ల ఈ ప్రపంచం పుట్టింది. దానిని ప్రతీకగా ఈ కళ్యాణాన్ని జరుపుతారు. సీతారామ కల్యాణోత్సవం దేవాలయాలలోనే గాక మన హృదయంలో కూడా జరగాలి. బయట గ్రామాల్లోను, పల్లెల్లోను, పట్టణాల్లోను జరగాలి. అలా జరిగితే కులబేధం లేని, వర్గపోరు లేని, మత ఆవేశం లేని జాతి అభిమానం లేని పరమాత్మ మనందరికి సొత్తుగా నిలిచిపోతాడు.
స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి
విశాఖ శారద పీఠాధిపతి
సెల్ : 9966669658
|