వీర్రాజీయ శీలం
ప్రముఖ చిత్రకారులు ,కవి నవలా రచయితా శ్రీ శీలా వీర్రాజుగారికి గత ఏడాది సెప్టెంబర్ లో శ్రీమైనేని గోపాల కృష్ణ గారు ఏర్పరచిన ‘’బాపు –రమణ ల స్మారక పురస్కారం ‘’సరసభారతిద్వారా మచిలీపట్నం లో అందజేసినప్పుడు వారు అభిమానం గా ఇచ్చిన ‘’ఎర్ర డబ్బా రైలు ‘’,’’ఒక అసంబద్ధ నిజం ‘’రెండుకవితా సంపుటులను ఈ రోజు మాత్రమె చదివీ వీలు దొరికి చదివాను .మొదటిది 1981-93 కాలం లో రాసినకవితలైతే ,రెండవది ఆ తర్వాత రాసినవి .రెండిటిలోనూ వీర్రాజుగారి కవితాత్మ దర్శనమిస్తుంది .సమాజం పై వారికున్న అభిప్రాయాలు ,తనకున్న భావాలు ,తానూ నమ్మిన సిద్దాంతా లు ,సమాజం పట్ల బాధ్యతా ,తోటి వారిపై ఉన్న మానవ సంబంధాలు అన్నీ రాశీభూతమై వీర్రాజు గారి \నడవడిని ,ప్రవృత్తిని ,అంతరంగాన్ని వ్యతిత్వాన్ని కేరక్టర్ ను ఆవిష్కరిస్తాయి ఈ కవితలు .అందుకే ఈ వ్యాసాన్ని ‘’వీర్రాజీయ శీలం ‘’అన్నాను . ముందు ఎర్రడబ్బా రైలు లోని కవితా బోగీల సంగతి చూద్దాం .
ఎర్ర డబ్బా రైలు –కవితా సంపుటి
దూరమైపోయిన కొడుకు నుండి ఏదో ఒక రోజు ఉత్తరం వస్తుందని యెర్ర డబ్బా రైల్ కోసం ఎదురు చూస్తుంది ముసలితల్లి .ఆమెకళ్ళ ముందు అంతా చీకటే .చీకటికి ఎరుపూ ,వెలుగూ ఉండవు .కొడుకుతండ్రికి రాసే ఉత్తరం లో ‘’నాన్నా నేను క్షేమం ‘’అనే’’ ఆరక్షరాల’’ ఒక చిన్న మాటకోసం ఆతల్లి ఆరాటం .అదే ఆమెకు ఒక పెద్ద ఓదార్పు .ఆ ముసలి దంపతుల బతుకు మీది ఆశకు ‘’రేపటి ఉషస్సు ‘’.ఆ ఉత్తరం వస్తే ‘’కుతకుత లాడే కొడుకు గుండెల వేడి నెత్తుటిలో ఏ సర్కారు తుపాకి గుండూ తలస్నానం చేయలేదని ,కొడుకు గుండె లాకప్ చీకటిగదిలో కొట్టుకోవటం ఆగి పోలేదని ‘’ఉపశమనం .అందుకే ఆమెకు ‘’యెర్ర డబ్బా రైలంటే అంత ఇష్టం ‘’గుండెల్లోకి సూటిగా దూసుకు పోయే మాటల బాధా తప్త పల్లవి ఈకవిత .
మిత్రుడు ‘’బాధల కొలిమిలో కాలికాలి రాటు దేలిన ‘’వాడు .అతనికి ఓ సందేశమిస్తూ ‘’ఈ వ్యవస్థ మీద కోపం –నీ కుటుంబ శ్రేయస్సుకే పరిమతం చేయకు –నువ్వు చేసే త్యాగం –నీ ఇంటి ఆవరణ దగ్గరే ఆగిపోనివ్వకు ‘’అన్నారు. ఇది అందరికీ వర్తించే సూత్రమే .ప్రకృతి నేర్పే పాఠం గురించి చెబుతూ ‘’నాలుగు వైపులా నిర్బంధం చేసినంతమాత్రాన –ఎవరూ ఎవరిప్రాణాలు తీయరు –తన ప్రాణానికి నీచేతిలో ప్రమాదం పొ౦చి ఉన్నప్పుదు –మనిషేకాదు పిల్లికూన కూడా నిన్ను నమ్మదు .-తనను తానూ రక్షించుకోవటం –ప్రక్రుతి నేర్పే తొలిపాఠం’’అని మనప్రభుత్వాల ‘’అరణ్య కాండ ‘’పై చేన్నాకోల్ దెబ్బ .’’పగల ముగ్గిన నేరేడు పళ్ళు –ఊదా వడగళ్ళుగా ‘’ పడుతున్నాయన్నారు వీర్రాజుగారు .శిశిరం లో బాదం చెట్టు ఆయనకు ‘’పచ్చని ఆకుల్ని ఎర్రగా మార్చుకొని –సాయంత్రపు ఎండకు మరీ ఎర్రబడి –నిప్పులపోగై మెరుస్తున్నాయి ‘’ట .అద్భుతమైన భావ చిత్రం .అన్నిట్లోనూ బలిసిన వారి ‘’జీవితం నిండా ఎరుపు పరచుకుంటు౦ది –ఎరుపు వాళ్ళ అభిరుచుల నిండా అల్లు కుంటు౦ది .ఎరుపు వాళ్ళ ఒంటి నిండా ప్రవహిస్తుంది ‘’.కాని, వాళ్లకు ‘’జానెడు యెర్రని గుడ్డ ముక్క –మూరెడు కర్ర మీద జెండాగా మారి –గాలిలో రెపరెప లాడుతూ కళ్ళ ముందు కనిపిస్తే –ఒకటే భయం –పిచ్చిభయం ‘’అని తన ‘’ఎర్రజెండా ‘’అభిమానాన్ని దాచుకోకుండా చెప్పుకొన్నారు వీర్రాజుగారు .రక్తం మరిగే వారికి ‘’రక్తపు రంగు జెండా అంటే ‘’కాళ్ళకింది— కారిపోతుంది అని భావం .
తనఖా పత్రాన్ని గూర్చి ఏంతో కవితాత్మకం గా గుండె తడి తో ఇలా చెప్పారు ‘’మట్టిని పెకలించి పరిచి –ప్రక్రుతి కన్నేర్రే జేస్తే కండబలం నమ్ముకుని –కావిళ్ళు మోసి నీరు పోసి -గింజ గింజనీ ఆశలో తడిపి విత్తి –తమ సర్వస్వంగా కాపాడు కొంటున్న –ఒక్కగానొక్క మడిచెక్క తాలూకు –తనఖా పత్రం ‘’అదే కాగితమై షావుకారు గారి ఇనపబీరువాలో భద్రంగా ఉండి వాళ్ళ ఆశల్ని చిద్రం చేస్తోంది .పిడికిలి బలాన్ని గూర్చి ‘’అయిదు వేళ్ళూ ఒక చోట కలిసి –ఎముకలు సైతం పిండి అయి పోయెంతగా –దగ్గరగా బిగుసుకొని –ఆలోచనలోనిద్రుఢత్వానికీ నిర్భయత్వానికీ అద్దం పడతాయట – ‘’గుప్పెట్లో నీమనసు ఉంది –పిడికిలో మనసులోని నీ నిర్ణయం ఉంది ‘’అన్నారు .వేళ్ళు విడివిడిగా ఉంటె ఏమీ ఉండదు కలిస్తే కసి బిగి పెరిగి అనుకొన్నది సాధిస్తాయి .పిడికిలి పౌరుషానికి .మనస్సంకల్పానికి గుప్పెట ప్రతీకలు .
వీర్రాజు గారికి హంస బతుకు కంటే కాకి బతుకే ఇష్టం .కాకి సమిష్టి జీవితానికి ఉదాహరణ .హంస ఒంటరితనానికి గుర్తు .అందుకే ‘’పది మందితో కలిసి పంచుకొనే –సమిష్టి జీవితం నాది ‘’అన్నారు . .’’రెక్కలు రాని ఏ గూటి పిల్లో –రెక్కలొచ్చిన ఏ గూటి తండ్రో –కరెంటు తీగకు బలి నేలకూలితే –పది మందినీ పిలిచి కన్నీరు కార్చే –సంఘ జీవితం నాది ‘’అని తానూ సంఘజీవినని స్పష్టం గా చెప్పారు ‘’పది మంది తో జీవితాన్ని పంచుకోవటం –నా బతుక్కి ఆదర్శం ‘’అంటూ ఆదర్శాన్ని వివరించారు .అమెరికా నౌకాదళం ఇరాన్ పౌర విమానాన్ని కూల్చినప్పుడు చలించిపోయిన రాజుగారు మానవత్వం నశించిన పాశవత్వానికి కినిసి ‘ఆ పని చేసిన వారు మనుషులైతే క్షమాపణ కోరేవారని రాక్షసులైతే పొరబాటును ఒప్పుకొనే వారని కాని ‘’వీళ్ళెవరూ ‘’?అని వీళ్ళను ఏ జాతికింద కట్టాలో తెలియక నరరూప రాక్షసులని తేల్చారు .మానవత్వం లోపించిన ఈ జాతినేమని పిలవాలో ? మిలియన్ డాలర్ల ప్రశ్న .వీర్రాజుగారికి మానవత్వం అంటే ఉన్న అభిమానికి ఈ కవిత నిదర్శనం .మానవత్వానికి ఎత్తిన పతాక అనిపిస్తుంది .
బడాబడా వాళ్ళు ‘’సింహాల క్లబ్బుల్లోచేరి చెక్కు బుక్కుల్ని చించుతారు -దానాలతో పేపర్లు ఆక్రమిస్తారు .వాళ్ళు పదికాలాల పాటు పచ్చగా ,డబ్బాకలితో ఆవురావురుమనాలి –అప్పుడే ‘’పెళ్ళాం ,పిల్లల జబ్బులకో ,చదువు సంధ్యలకో –పుస్తేలతాడో చేతిగాజులో తాకట్టు పెట్టచ్చు .నూటికి పది రూపాయలకైనా డబ్బు తేవచ్చు –వాళ్ళ ఆకలి తీరకు౦డాలి –వాళ్ళ సంఘ సేవ –అలా అలా సాగాలి ‘’అని వ్యంగ్యాస్త్రాన్ని సంధించి’’ చెడేల్ ‘’మని వాయిస్తారు .ఏ ఇజం వారైనా ‘’స్వార్ధిజం ‘’ప్రాణాంతకం .వీరినీ వదలకుండా వాయిస్తూ ‘’మనకు కావలసింది ప్రజలు కాదు –మనమే –మన కీర్తి ప్రతిష్టలు ,మన సుఖ సంతోషాలు మన హోదాలు –ఆ తర్వాతే మనకు ప్రజలు ‘’అని సుతిమెత్తగా మెత్తని చెప్పుతో బాదేశారు .’’నీళ్ళల్లో నిప్పు ‘’కవితలో ‘’అలజడి రేగిన గుండేల్లోంచే అకస్మాత్తుగా –బడబాగ్ని లాగ నిప్పులు కురుస్తాయి .నువ్వింకా తేరుకోక ముందే –నిలువునా నిన్ను మసి చేస్తాయి ‘’అని ఘాటైన హెచ్చరిక చేశారు .అలజడే కదా అని ఉపేక్షిస్తే ఉపద్రవం గా మారుతుందని సూచన .
‘’వారం రోజులక్రితం వరకు ఆ గదిలో –అర్ధ రూపాయి మల్లెపూలు –అర్ధ రాత్రి వరకు మత్తేక్కించాయి-రూపాయి పకోడీ పొట్లం –రోజంతా లాలాజలాన్ని పారించిది.-యవ్వనం ఆ గదిగోడ మీద జీవితమై వేలాడింది ‘’అలాంటి జంట జీవితం లో భాగ్యనగరం అభాగ్యాన్ని కురిపించింది ‘’మతవిద్వేషం పూసిన ఏ పిడి బాకో ‘’భర్తను శవం గా మార్చింది .ఇప్పుడామె అదే గదిలో ‘’చిరిగిన జీవితాన్నే –చింకి చాపలా పరచు కొన్నది –గుండెల్ని పిండుకొని ఘోషిస్తూ –కల్లెలు కల్లెలుగా దుఖాన్ని కక్కు కొంటోంది ‘’.ఒక్క రాత్రిలో ఆమె జీవితాశ చితికిపోయింది దీనత తాండ వించింది.’’ఆమెపేరు ఏదయితేనేం ?అనాగరక ఆటవిక మత దురహంకారానికి గురైన –ఒక భాగ్య నగర అభాగిని ఆమె ‘’అని మతకల్లోలం ఎందరి జీవితాలను బలి తీసుకోన్నాయో తెలిపే ఒక ఉదాహరణ మాత్రమె ఇది .మనుష్యులుగా మనం ఆలోచించాల్సిన సమయం అని గుర్తు చేశారు కవి .’’అర్ధాంగి కూడా అమ్మలాగే ఓ స్త్రీమూర్తి కదూ ‘’అని మరోకవితలో చెప్పారు .
గుండె లక్షణం వివరిస్తూ ‘’కొండంత విశ్వాసం దానికి ఉండాలి –ఆకాశ మ౦త స్వేచ్చ –చిటికెడు ఊపిరిలో నిండాలి –దోసెడు ఒంటి రక్తం లో కరగాలి .అప్పుడే అది –ఊపిరి తాగుతున్న రూపం అనుకోగలం ‘’అన్నారు కాకపొతే అది మట్టిదో రాతిదో కర్రదో కంచుదో-శిల్పం లాగా అదికూడా రక్తమాంసాల బొమ్మే ‘’అన్నారు .రక్తం ,మాంసం చెమట ఓడుస్తూ రోళ్ళు తయారు చేసి ఇంటింటికీ తిరిగి అమ్ముకొనే వారు బాగ్యనగరం వచ్చి భయ పడ్డారట .ఎందుకు అంటే ‘’ఈ ఊరొచ్చాక మాకు జబ్బు భయం కన్నా కొత్తభయం పట్టుకొంది-ఎప్పుడొస్తుందో అకస్మాత్తుగా కర్ఫ్యూ –మా నోట్లో దుమ్ము కొట్టటానికి మా కడుపుల్లో చిచ్చు పెట్ట టానికి ‘’అని వాపోయారు ఆ బడుగు జీవులు .ఇంత చిన్న విషయాన్ని వీర్రాజు గారు గుర్తించి వారికి తనకవిత్వం లో చోటు కల్పించి వారి ఆవేదనను వినిపించటం ,కర్ఫ్యూ యెంత భయంకరం గా బడుగు జీవుల జీవితాలతో ఆటలాడుతుందో తెలియ జేసే మంచికవిత ‘’మా భయం ఒక్కటే ‘’.
ఓటు కోసం అభిమానం గా ఇంటికొచ్చే ‘’బిచ్చగాళ్ళు ‘’గురించి రాస్తూ ‘’నీ అభిమానం నామీదకాదు నా చేతిలోమి వోటు మీద –ఓటు వెనక గద్దె మీద –గద్దెపై కూచునే నీరూపం మీద ‘’ –అని నిర్మొహమాటం గా చెప్పారు .అందుకే ‘’నీ ఆతిధ్యం నాకొద్దు –మా ఇంటికి నువ్వు రానే రావద్దు ‘’అని ఖచ్చితంగా వోటు బిచ్చగాడిని తరిమేశారు వీర్రాజుగారు .రాగాల చెట్టును కలవరిస్తూ ‘’చెట్టే నా ఇల్లు –ఆకుల గుబుర్లె దిళ్ళు –కొమ్మలే ఊయలలు ‘’అన్నారు .కాని ఇప్పుడు తానూ ముని అయినా నిశ్శబ్దాన్ని ఆశ్రయించినా ‘’మౌనం లో కూడా సంగీతం వినడం నేర్చిన వాడిని –నీ రాగానికే కాదు నీ మౌనానికీ –ఇప్పుడు నేను శ్రోతను ‘’అని ప్రకృతిలో తానూ మమైక్యమయ్యే భావనకు అద్దం పట్టారు .ఎదురు ప్రవాహం లో బరువు పడవను లాగుతున్న కూలీలను కూడా వీర్రాజు గారు మర్చిపోలేదు ఇది రాజ మండ్రి అనుభవమే .’’ఎగుడు దిగుడు ల రాళ్లబాటలో –పిచ్చి డొంకల ముళ్ళ దారిలో –అలా ప్రవాహానికి ఎదురుగా –మెల్లగా –మెల్లగా –బరువుగా –లాగు కొంటూ –లాగు కొంటూ –లాగుకొంటూ ‘’అని దృశ్యమానం చేశారు .లాగుకొంటూ అనటం లో వాళ్ళ శ్రమా బడలికా అలుపు ,ఊపిరి అందని స్తితి అన్నీ చూపారు .ఆరుద్ర కూడా ‘’మోయ్యోయ్ మోయ్యోయ్ మోయ్యోయ్ తోయ్యోయ్ తొయ్ ’కవితలో ఇదే సీను ‘’త్వమేవాహం ‘’లో చూపించాడన్న సంగతి మనకు తెలుసు .హుసేన్ సాగర్ ‘’ఆత్మ హత్యాసాగరం ‘’కాక ముందు నీరు మలినం కాక ముందు నిర్మల తరంగాలు సేద తీర్చేవని ఇప్పుడు అదొక మృత్యు సాగారమయిందని ఆవేదన చెందారు .’’రేపటి మాతృమూర్తి ‘’దృశ్యమే ఆయన్ను వెంటాడింది .ఆ పసిపాప ముఖమే నీళ్ళలో ప్రతిఫలిస్తోంది .మాత్రుమూర్తికాకుండానే యా పసిపాప జీవితం భళ్ళున పగిలిపోలేదుకదా-హుసేన్ సాగర్ నీటిలో ఆమె భవిష్యత్ జలసమాధి కాలేదుకదా ‘’అని ఆ పాప జీవితం ఏమై పోయిన్దోనని ఆందోళన చెందారు .రోజూ ఇలాంటి దృశ్యాలు అక్కడ మామూలే కదా .
బాల్యాన్ని ఆదర్శం గా తీసుకోవాలన్న సూచన చేశారు .కాని ఎవరు వింటున్నారు దీన్ని? .అందుకే ‘’మనం బాల్యాన్ని ఆదర్శం గా తీసుకొన్న దెప్పుడు ‘’? అని ఒక దెప్పు దెప్పారు .’’తీసుకొని ఉంటె –మనం ఇలా ఎప్పటికీ ఉండం-ఇంత అసంబద్ధం గా ఇంత క్రుత్త్రిమంగా ఇంత రాక్షసంగా –జీవించం గాక జీవించం ‘’అని బల్ల గుద్ది మరీ చెప్పారు .బాల్యానికున్న ప్రాధాన్యతను కవితలో పాఠం గా చెప్పారు మన డొల్లతనాన్ని ఎండ గట్టారు ..కృత్రిమత విజ్రు౦భిస్తోందని అది నాగరక లక్షణం కాదని హితవు చెప్పారు .దీనిపై సెటైర్ గా ‘’మనం కాంక్రీటు చెట్లను అలంకరించుకొని –రస హృదయాల్ని ఆవిష్కరించు కొందాం –రకరకాల సెంట్లు స్ప్రే చేసుకొని –రోజుకొక విధం గా ఘుమ ఘుమ లాడి పోదాం ‘’అని చమత్కరించారు వీర్రాజుకవి .ఇంతవరకు వారి ‘’యెర్ర డబ్బా రైలు ‘’కవితా సంపుటి లోని కవితా సౌరభాన్ని ,వీర్రాజుగారి వ్యక్తిత్వాన్నకవితా గాఢతను తెలుసుకొన్నాం . తర్వాత వారి ‘’ఒక అసంబద్ధ నిజం ‘’సంపుటి లోని కవితా సౌందర్యాన్ని దర్శిద్దాం .
సశేషం
శ్రీరామనవమి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-3-15- ఉయ్యూరు