వీర్రాజీయ శీలం -2

వీర్రాజీయ శీలం -2

”ఒక అసంబద్ధ నిజం ”-కవితా సంపుటి

 

‘’ఈ నాడు ఏమనిషిని దులిపినా –బొటబొటా రాలేవికన్నీళ్ళే-ప్రతికన్నూ ఒక కొలనే మరి –ఏడాదిపోడవునా రాల్చే కన్నీటి చుక్కలు –వేల కొట్లలో ఉన్నాయి ‘’వీటిని అక్కున చేర్చుకోనేవి మేఘాలే .కన్నీళ్ళే కాదు  చెమట చుక్కలూ అంతే –ఎక్కడెక్కడో పని చేసే శ్రమ జీవుల చెమట బిందువులు ఆవిరై మేఘాల్లో కే చేరతాయంటారు వీర్రాజు గారు .అవి ఒక్కొక బి౦దువులాగానే కనపడతాయి కాని  అవికాలువలు కట్టి పారి –వాగులూ వంకలై ఏరులై పొర్లి –నదీనదాలై ప్రవహించి –చివరికి సముద్రం లోనే సంగమిస్తాయి .అందుకే సముద్రం ఏడాదికేడాది బలుపెక్కి పోతోంది .ఉన్న చోటు చాలక కొత్త జాగాల వైపు –కెరటాల్ని చాచుకొని విస్తరిస్తోంది ‘’అని వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపి సునామీ సృష్టికి కారణం మానవ  అత్యాసేనని ,మానవ పీడనమూ సహేతుకం కాదని కార్మిక  పక్ష పాతిగా  పర్యావరణ వేత్తగా హెచ్చరించారు ‘’ఒక అసంబద్ధ నిజం ‘’కవితలో .ఇదే సంపుటికీ శీర్షిక అయింది .సార్ధకతా తెచ్చింది .

‘’అక్ష రానికి ఆమడ దూరం లో ఉన్నవారికి –ముఖమే కవిత్వ వేదిక ‘’అన్నారు .’’చూపుల్లో తన్మయత్వమే కవిత్వాభి వ్యక్తీ –మాటల్లో పరవశత్వమే –కవిత్వ వాహిక ‘’అని ఏంతో అద్భుతం గా కవితాత్మకం గా చెప్పారు .ప్రతిదానికీ  యంత్రాలపై ఆధారపడ్డ నేటి మనిషి సున్నిత హృదయ స్పందనలకు దూరమవుతున్నాడని గుర్తు చేశారు .బలమైన సంఘటనలు పెద్ద శబ్దాలను  మాత్రమె మనిషి స్పందిస్తున్నాడు .దీనితో రాతి కట్టు హ్రుదయామేర్పడి చెవుల్లో సీసం తో మూసుకుపోయి కుంచించుకు పోతున్నాడు .సున్నితత్వం లోపించి జీవన మాధుర్యం కరువైపోతోంది .అందుకే ఇప్పుడు ‘’ఎటు చూసినా కనిపించేవి –ఏ అభి వ్యక్తీ లేని –ఏ స్పందనా లేని –వట్టి రక్త మాంసాల రోబోలె ‘’అని నేటి ఆధునిక మానవుని కృత్రిమత్వాన్ని వదిలి౦చు కోమని  యదార్ధ జీవిత మాధుర్యాన్ని అనుభవించ మని ఒక రకం గా ఆదేశిస్తున్నారు .కవి ‘’అన్ ఎక్నాలేడ్జేడ్ లెజిస్లేటర్ ‘’అన్న సత్యాన్ని రుజువు చేశారనిపిస్తుంది .

వీర్రాజీయం గా కొన్ని జీవిత సత్యాలు చెప్పారు .’కష్ట సుఖాల  కల నేత ఉన్నప్పుడే –జీవన మాధుర్యం తెలిసి వస్తుంది ‘’అన్నది ఆయన అనుభవ సారం నిజ జీవిత విధానం కూడా .శ్రీ శ్రీ ‘’కవితా ఓకవితా ‘’లోను తిలక్ ‘’నా అక్షరాలు ‘’లోను తమకవితా లక్షణాలను వివరిస్తే వీర్రాజుగారు ‘’అక్షరాయుదుల కత్తి సాము ‘’రాసి తన మనోభావాలు వెలిబుచ్చారు .’’కష్ట జీవుల కన్నీటి లో తడిసి –బరువెక్కిన అక్షరాలూ నావి –ఎక్కడ తడిమినా తడి తగుల్తుంది ‘’అన్నారు పాఠ కుల గుండె బరువేక్కిస్తాయి .’’ఈ సత్యమే తన అక్షర మాలికలో దారం ‘’అన్నారు .తమ ఇంటికి ఆహ్వానించారు ‘’మీ లాంటి అభిమానుల రాకల్తోనే మా పేరు ప్రతిష్టలను కొలుచుకోనేది ‘’అని వ్యంగ్యం గుప్పించారు .అయితే తనను ఎలా గుర్తు పట్టాలి ఎక్కడ కనిస్తారు ?.రాజకీయ నాయకుడిలాగా చీపిరి చేత్తోపట్టుకొని ఫోటో దిగాటానికో ముస్ష్టివాడికి  కుంటివాడికీ సాయం చేస్తున్నట్లు ఫోటోలు దిగే చోట ,బారు  బీరులలో తను కనిపించనని చెప్పి ‘’నేను బహువచనానికి ఏక వచన సంకేతాన్ని –ఈ తెలుగు  గడ్డమీద అక్షర ధారుల కులానికి ప్రతినిధిని –అత్యాధునిక శాఖీయుడిని.కలం నా ఆయుధం –కవిత్వం నా యుద్ధ భూమి –నా కీర్తినామం ‘’కవి ‘’అని చిరునామా ఇచ్చారు .తాను  అందరి ప్రతినిధినని గుర్తు చేశారు మళ్ళీ .

బాల్య జ్ఞాపకాల్ని అపురూపంగా దాచుకొన్న అమ్మ వెంట పుట్టిన ఊరికి వెళ్ళారు .అక్కడ పొడి పలకరింపులే దక్కాయి .ఆత్మీయ స్పర్శ లేనే లేదు .ఇప్పుడు ఆ ఊళ్ళో ‘’ప్రతి ఇల్లూ ఓ టంక శాల –ప్రతి హృదయమూ ఓ డబ్బుల మూట’’అంత బలిసిపోయింది ఆ ఊరు .’’పక్క నున్న అర్ధాంగి బాహువులే –ఇల్లు చేరే వరకు వెచ్చని దుప్పటి నాకు ‘’అంటారు ఇల్లాలిచ్చే సౌఖ్యాన్ని గుర్తు చేసుకొంటూ .’’ఏడుపైనా నాకు నవ్వులు పరచిన పూల తివాచీయే ‘’అన్నారు .బిడ్డ పుట్టినప్పుడు ఏడుపుతోనే పలకిస్తు౦ది  అని సామెత చెప్పారు .ఆ ఏడుపే మధుర సంగీతం అని ‘’ తొలినాదం మరీ అద్భుతం ‘’అని మురిసిపోయారు .

ఒక రైతు రంగయ్య పొలం చెక్క తడపతానికి బావి తవ్వుతూ మూడులోతుల నేలని తవ్వినా చెమ్మతగలక –మరో నిలువు లోతుకు దిగినా నీరుకాక బండరాయి తగిలినప్పుడు –కారడానికి కన్నీళ్లు లేక పొతే కవి మనస్సు చివుక్కుమన్నది .అయిదేళ్ళ తర్వాత వచ్చి చూస్తె పొర్లుతున్న బావినీళ్ళు చూసి పొంగిపోవాలో అతని పెళ్ళాం మెళ్ళో కనిపిస్తున్న పసుపు కొమ్ము చూసి బాధ పడాలో తెలియ లేదు .ప్రకృతిని అంచనా వేయటం లో తానూ రంగయ్యా పొరబాటు పడ్డామని ఒప్పుకొన్నాడు .తప్పంతా తనదే అన్నాడు .రంగయ్యలో ఆశలు రేకెత్తించి తప్పుడు సలహా ఇచ్చి అప్పుల ఊబిలో రంగయ్యను తోసేసినందుకు సిగ్గుతో కుమిలిపోయాడు .ఇది ఒక పోయిట్రీ కద.గొప్పగా చెప్పారు .

జీవితాన్ని చెట్టుతో పోల్చుకొని తనకు అన్వయంచుకొని చెప్పిన సత్యాలు అసంబద్దాలుకావు నిజమైన నిజాలే .’’చెట్టు పచ్చగా ఉన్నప్పుడు –ముఖ పరిచయస్తులు కూడా –ప్రాణ మిత్రులై పలవరించారు .-ఎగి రొచ్చిమరీ పలకరించారు ‘’కాని తానూ అన్నీ కోల్పోయి మోడిన చెట్టులా అగుపిస్తే ‘’ఆకుల్ని రాల్చుకుని అస్తిపంజరంయ్యాక –ఆత్మీయులైన వారు సైతం –కనిపించనంత దూరానికి  వలస పోయారు .’’నిజంగా ఇది పారడాక్స్ ఇన్ లైఫ్ .తాను  ఇంకా ఆశా జీవి కనుక ఏ కాస్త చిగురైనా కనిపిస్తుందేమోనని ఎదురు చూస్తున్నాడు .మరో జీవిత సత్యం చెప్పారు ‘’చేసిన సాయానికి –ప్రతిఫలాన్ని ఆశించటం తప్పే౦  కాదు –అప్పుడు నువ్వుమానవుడివి –ఆశించక పొతే –పరిపూర్ణ మానవుడివి ‘’ఇదే వేద వేదాంగాల సారం .బాగా ఒంట పట్టింది కవిగారికి ..ఎన్ని తప్పులు చేసినా మనిషికి ‘’ప్రకృతి ఒక్కటే సరైన చికిత్స శాల ‘’అన్న సత్యమూ తెలిపారు .’’నెటిజన్ల’’ ను దృష్టిలో పెట్టుకొని ఒకమ్మాయి ఆంతర్యాన్ని చక్కగా ఆవిష్కరించారు –‘’నెట్ లో నా ఫోటో పంపటానికి –అభ్యంతరం లేదుకాని –ఎదురు పడి కలుసుకోవటం – ఇష్టమేకాదు ముఖ్యం నాకు ‘’అని నిష్కర్షగా తెలిపిందిందా అమ్మాయి .చివరికి’’ నెట్ నిజం ‘’తెలియ జేస్తూ ‘’అక్షరాల్లో జారని ఆంతర్యాన్ని –ఒకరికొకరు తెలుసుకోన్నాకే –ఫోటోల్లోపడని మనసుల్ని –పరస్పరం చదువుకున్నాకే –ఏదైనా ఒక నిర్ణయం తీసుకొందాం- ఫోటోల నైనా మరింక దేనినైనా –అప్పుడే ఇచ్చి పుచ్చుకుందాం ‘’అని కరాఖండీగా చెప్పిందా అమ్మడు .ఇది వీర్రాజు గారి’’ నెట్ వేదం ‘’.వేదం అందరికీ శిరో దార్యమే కదా. అందరూ పాటించాల్సిందే .

మరోసత్యం ‘’దృశ్యమైనా శబ్దమైనా –అందంగా కనిపించేది –ఆకలి తీరాకే ‘’అని ఆకలి ఉపనిషత్ ఆవిష్కరించారు .’’కళకి జీవితాన్నిఅద్దడం కాదు –జీవితానికి కళను   అద్దాలి ‘’అంటారు అప్పుడే అస్తవ్యస్త జీవితమైనా గజిబిజి చిత్రమైనా ప్రజా మోదం పొందుతాయని భరోసా ఇచ్చారు .గ్లిజరిన్ కన్నీళ్లను రంగస్థలానికి పరిమితం చేసి నిజమైన కన్నీళ్లను నిజ జీవితం లోకి మిగుల్చుకోమని ‘’హితవు .రచయిత కాని కవికాని రంగుల కలల్లో మిగిలి పోవద్దన్నారు.’’నిజాన్ని నిజం గా చూపు –అది నేరం కాదు –నిన్ను నిన్నుగా ఆవిష్కరించుకో –అది వంచన కాదు –భ్రమల్లో బతకటం –ఖరీదైన కళల కోసం వెతకటం –ఆరోగ్యం కాదు –నీకూ –నీ చుట్టూ ఉన్న మాకూ ‘’అని గొప్ప హితోపదేశం చేశారు .

దానగుణం గల దాన శీలురను ‘’దానం చేయండి –ఒక బుక్కు అచ్చేసుకొంటాను ‘-మీ పేరు చెప్పుకొని ఓ పుస్తకం  వెలుగు లోకి తెచ్చుకొంటాను ‘’అని తమాషాగా అన్నారనిపిస్తుంది .అంటే డబ్బును సార్ధకం చేసుకొని కవిని కవిత్వాన్ని రచయితను రచనలను బతికించమని కోరారని భావించాలి .వాతావరణ పాఠం చెబుతూ ‘’కళ్ళ జోడు అతని ఆత్మరక్షణ కవచం –దాని వెనక దాక్కున్న అతని మనసులో –బాధా ,కోపం ఏదైనా ఉండచ్చు ‘’అన్నారు .మిత్ర లేఖ లో ‘’అక్షరాల్లో  దట్టిం చాల్సింది  –ఆగ్రహమే కాని ద్వేషం కాదు –కవికి ఉండాల్సింది –సంయమనమే కాని ఆవేశం కాదు ‘’అని అక్షరోపదేశం గా అక్షర సందేశం ఇచ్చారు .బిరుదులూ ఫ్లేక్సీలు  బేనర్లూ కీర్తికి కొల బద్దలు కావని ‘’కీర్తికి పెద్ద పీటవేసినంత కాలం –నీ ప్రతిభకు జేజేలు పలకరు –నువ్వు నిరాడంబరుడ వైతేనే –నీకూ నీ వ్యక్తిత్వానికి గౌరవం –నీ మాటకూ నీ రాతకూ అప్పుడే విలువ ‘’నిరాడంబరతకు పెద్ద పీట వేశారు వీర్రాజుగారు. తాను  అనుసరించిన బాట ఇదే .ఆచరించి చెప్పిన మాట కనుక గొప్ప విలువ ఉంది .

‘’మరణ భయం చుట్టుముట్టి –నత్తలా మనసు ముడుచుకు పోయినా –‘’అది తనకు తాత్కాలికమే కాని శాశ్వతం కాదని చెప్పారు .అలాంటి సమయాల్లో భజనల వైపు ,బాబాల వైపు,పూజా పునస్కారాల్లోకి  జారిపోకుండా నిలబడతానన్నారు .’’నా రంగుల ప్రపంచం –నన్ను కాపాడుతూనే ఉంటుంది –నా అక్షర ప్రాంగణం –నన్ను ఆదు కొంటూనే ఉంటుంది –నా జీవన చరమాంకం చివరిక్షణం వరకు –నా రంగుల ప్రపంచమే నావిహార స్థలి –నా అక్షర ప్రాంగణమే’’నా చిర్నామా ‘’అని వీర్రాజుగారు అటు అక్షరం ఇటు రంగులే తన నేస్తాలని మార్గ దర్శకాలని ఘంటా పధం గా చెప్పారు .ముదిమి మీదపడ్డా చెదరని ధైర్యం ఆయనది .ఆ అక్షర ,చిత్రజీవి  మరింత అక్షర రాశిని  మరిన్ని రంగుల చెలువములను   వర్షించాలని ఆశిద్దాం  .

శ్రీరామనవమి శుభాకాంక్షలతో

మీ– గబ్బిట దుర్గాప్రసాద్ -27-3-15- ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.