అమరావతి స్ఫూర్తి
- 26/03/2015
అవశేష ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరానికి ‘అమరావతి’ అని నామకరణం జరపుతుండడం అద్భుతమైన చారిత్రక పరిణామం…అమరావతికి ఆంధ్రుల చరిత్రలో మాత్రమే కాదు, అఖిల భారతీయ సహస్రాబ్దుల చరిత్రలో అజరామర ప్రాధాన్యం ఉంది. ద్వాపరయుగం వస్తుండిన సమయంలో జరిగిన మహాభారత యుద్ధ సమయంలో ఆంధ్రుల రాజధాని ధాన్యకటకం…్ధన్యకటకం, ధరణికోట, అమరావతి తరతరాల చరిత్రలో పర్యాయ పదాలు. మహాభారత యుద్ధం జరిగిన తరువాత 5,142 సంవత్సరాలు గతించాయి. మన్మథ ఉగాది నుండి 5142వ సంవత్సరం నడుస్తోంది. కలియుగంలో ఇది 5117వ సంవత్సరం. ఈ సుదీర్ఘ గతానికి సజీవ జీవనస్మృతి అమరావతి. ‘కృష్ణాతరంగ పంక్తిన్ తొక్కి తుళ్లింత ఆంధ్రనౌకలు నాట్యమాడునాడు..’’ అని ఈ సజీవ స్మృతికి అక్షర రూపమిచ్చిన మహాకవులకు నిరంతర స్ఫూర్తి అమరావతి. ‘‘అమరావతీ నగర అపురూప శిల్పాలు’’ తెలుగుతల్లికి మహాకవి సమర్మించిన మల్లెపూదండకు పరిమళాలను అద్దిన మణిదీపాలు. ఈ దీపాల వెలుగులో బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతున్న దృశ్యం అమరావతి కథకు అద్వితీయ దర్పణం.. కృష్ణా నది ఆనాది జీవనది. ఆనాదిగా ఉన్న ఈ పునాదిపై వెలసిన అమరావతి ఆంధ్ర విభావానికి చెరగని సాంస్కృతిక పతాకం. అమర లింగేశ్వరుని నిలయం అమరావతి గరిమకు నూతన చిహ్నం. విభవం ‘వెలిసి’పోయింది. పతాకం పదేపదే పడిపోయింది. రాజధాని తరలిపోయింది. శిల్పాలు సాంస్కృతిక చిహ్నాలు విదేశీయుల అపహరణకు గురి అయ్యాయి. ఈ ఉత్థాన పతనాలకు ప్రభావితం కాని జీవనధుని కృష్ణవేణి. కృష్ణవేణి ఒడ్డున అవశేషమై ఉన్న అమరావతికి ఇది గత వైభవ పునరావృత్తి. అమరావతి మళ్లీ ఆంధ్రుల రాజధానిగా విలసిల్లబోతున్నది. అమరావతి వైదిక జీవన స్రోతస్విని, బౌద్ధ వాఙ్మయ హ్రాదిని…పక్కనే కృష్ణవేణి. త్రివేణీ సంగమ రూపానికి ఆంధ్రసీమపై ప్రతిరూపం అమరావతి ఇతిహాసం. కొత్తగా నిర్మించనున్న రాజధాని కేంద్ర బిందువు అవశేష అమరావతి 32 కిలోమీటర్ల దూరంలో ఉండవచ్చుగాక. ప్రాచీన అమరావతి ప్రభావం ఈ ఆధునిక కేంద్ర బిందువు వరకు విస్తరించడం చరిత్ర. రాజధానికి వచ్చివెళ్లేవారితోను, వర్తకుల రవాణా శకటాలతోను, పాలు పెరుగు కూరగాయలు మోసుకొని వెళ్లేవారితోను, పల్లెపడుచుల రాకపోకలతోను, చతురంగ బలాల ప్రతాప విన్యాసాలతోను, వేదనాద హర్షామోదాలతోను ఈ 32 కిలోమీటర్ల ప్రాంతం గతంలో ఆంధ్ర రాజధాని ప్రభావ పరిధిలోనిది. అందువల్ల రాజధాని ప్రాంగణం ప్రాచీన అమరావతికి వినూతన విస్తృతి…సింగపూర్, మోడల్‌ను పట్టుకొని ఎండమావులలోని మెరుగుల నీటి ప్రవాహం వెంట పరుగులు తీస్తున్న నవ్యాంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారిక పక్కనే ఉన్న తరగని నీటి ప్రవాహం స్ఫురించడం చారిత్రక పునరావృత్తికి మరో నిదర్శనం. సింగపూర్ చిహ్నం, న్యూ యార్క్ నమూనా, మలేసియా ముద్ర, టింబక్టూ తరహా..అన్న అనేక చిత్ర విచిత్ర పదజాలం ఆంధ్రుల నెత్తికెత్తి ఆడుతున్న సమయంలో అమరావతి మళ్లీ అవతరించడం శిశిరం ముగిసి వసంత శోభకు సంకేతం. అమరావతి మోడల్‌కు మళ్లీ ఆకృతిని కల్పించ వలసిని సమయమిది. అమరావతి నమూనా కాలుష్యం కొలువు తీరని స్వచ్ఛమైన ప్రగతికిబాట! అమరావతి ‘నమూనా’ ప్రాచీన భారత రాజధానుల నిర్మాణపు తీరునకు మచ్చుతునక! ధాన్యకటకం రాజధాని ఆంధ్ర రాజ్యాన్ని పాలించిన ఆంధ్రులు దాదాపు ఐదు వందల ఏళ్లపాటు యావత్ భారతదేశాన్ని పాలించడం చరిత్ర! ‘మగధ’ కేంద్ర బిందువుగా గిరివ్రజం రాజధానిగా క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్ది వరకు మొత్తం భారత దేశాన్ని పాలించిన ఎనిమిది రాజవంశాలలో ఆంధ్ర శాతవాహన వంశం చివరిది! ధాన్యకటకం రాజధానిగా మగధకు సామంతులుగా ఉండిన ఆంధ్ర శాతవాహనులు క్రీస్తునకు పూర్వం తొమ్మిదవ శతాబ్దిలో సామ్రాజ్య పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అప్పటినుండి క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో గ్రీకు దురాక్రమణకారుడు అలెగ్జాండర్ మన దేశంపై దండెత్తి వచ్చే వరకు ఆంధ్రులే యావత్ భారత్ సమ్రాట్టులు. ఈ ఐదు వందల ఏళ్ల పొడుగునా అమరావతి-్ధన్యకటకం-్భరత రాజ్యాంగ వ్యవస్థలో మరో ప్రధాన కేంద్రమైంది! అందువల్ల అవశేషాంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు విదేశీయ రాజధాని నిర్మాణపు నమూనాను విడనాడి, భారతీయ ప్రాచీన రాజధాని నగరాల నిర్మాణ రీతిని అధ్యయనం చేయడం మేలు! ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సింగపూర్ మోడల్ పనికి రాదేమోనన్న అనుమానాలు గత జనవరిలోనే వ్యక్తమయ్యాయి!
ఆంధ్రుల తొలి రాజధాని శ్రీకాకుళం అన్నది పురాణ ప్రసిద్ధమైన విషయం…శ్రీకాకుళం కృష్ణాజిల్లాలో మచిలీపట్టణానికి సమీపంలో ఉంది! శ్రీకాకుళ వల్లభుడైన ఆంధ్ర మహా విష్ణువు బహుశా పూర్వ యుగాల వాడు కావచ్చు! ఆయనను దేవతగా ఆరాధించడం కూడ సంప్రదాయమైంది! ‘చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావహత విమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవ’ అన్న స్తుతి జనం నాలుకలలో జీవిస్తోంది! ‘ఇమ్ముగ కాకుళమ్ము మొదల్ వరకున్ గల ఆంధ్ర పూర్వ రాజన్యుల పేరు తల్చిన హృదంతరమేలో చలించిపోవు…’ అన్న మహాకవి మాటల వల్ల కూడ శ్రీకాకుళం తొలి రాజధాని అన్నది ధ్రువపడుతోంది! కానీ ఈ యుగంలో మాత్రం గోదావరి తీరంలోని కోటి లింగాల కృష్ణా తీరంలోని అమరావతి తెలుగువారి అతి ప్రాచీన రాజధానులు. రాజమహేంద్రవరము, హంపీ విజయనగరం, ఏకశిలా నగరమైన ఓరుగల్లు వంటివి కూడ వివిధ సమయాలలో ఆంధ్రుల రాజధానులయ్యాయి, తెలుగు వెలుగులను ప్రసరించాయి! ఈ ప్రాచీన రాజధానుల నిర్మాణ రీతులను వాస్తు శిల్ప విన్యాసాలను విదేశీయ యాత్రికులు చరిత్రకారులు సైతం ప్రశంసించిపోయారు! రాబర్ట్ సీవెల్ అన్న చరిత్రకారుడు వ్రాసిన ‘ది ఫర్గాటెన్ ఎంపైర్’ అన్న గ్రంథంలో హంపీ విజయనగర నిర్మాణ రీతిని వివరించారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాజధానిని దర్శించిన క్రీస్తుశకం పదహారవ శతాబ్ది పాశ్చాత్య మేధావులు భారతీయుల నగర నిర్మాణాలను ప్రశంసించారు. విశ్వనాధ సత్యనారాయణ, అడివి బాపిరాజువంటి ఆధునిక సాహిత్యకారులు అమరావతి నమూనాను తమ రచనలలో వివరించి ఉన్నారు. వాటిని అధ్యయనం చేసి సమకాలీన అవసరాలకు అనువైన రీతిలో వాస్తు మార్పు చేసి స్వదేశీయ నమూనాను తయారుచేసుకోవచ్చు! ఆ నమూనా ప్రకారం స్వదేశీయ శాస్తవ్రేత్తలు, స్థపతులు, రూపకర్తలు,వాణిజ్యవేత్తలు కలిసి కొత్త రాజధానిని నిర్మించవచ్చు! ‘అమరావతి’ అన్న పేరునకు అప్పుడే సార్ధకత!
‘‘్ధన్యకటక నగరము కృష్ణానదీ తీరమున నాలుగు ‘గోరుతముల’పొడవున ఉన్నది. నదీ తీరము నుండి నగర గర్భమునకు ఒక గోరుతమున్నర యున్నది…వనములు, ఫలపుష్పోద్యాన వాటికలు…’’ అడివి బాపిరాజు ‘అమరావతి’ గురించి చెప్పిన మాటలివి! ‘గోరుతము’ అని అంటే దాదాపు రెండు కిలోమీటర్లు! ఎనిమిది కిలోమీటర్ల పొడవున మూడు కిలోమీటర్ల వెడల్పున ప్రాచీన అమరావతి విస్తరించి ఉండేది. ఇలాంటి ‘నాజూకు నగరం’-స్మార్ట్‌సిటీ-చిన్నది కాదు, మరీ పెద్దది కాదు!