జానకిరాముల సౌశీల్యం.. జగతికి ఆదర్శం
- -కె.లక్ష్మీ అన్నపూర్ణ
- 27/03/2015

తండ్రి ఆమోదించిన వధువు కనుక రామునికి సీతమీద ప్రేమ
కలిగింది. ఆమె లోకోత్తర సౌందర్యం వలన, సద్గుణ సంపత్తి వలనా ఆ ప్రేమ అనేక రెట్లయింది. భర్త అనే ఒక్క కారణం చేత రాముడికి తనపై వున్న ప్రేమ కంటే- సీతకు రామునిపై రెట్టింపు ప్రేమ వుంది. ఆ ప్రేమ ఎంతటిదంటే
వారిరువురూ హృదయంతో మాట్లాడుకునేవారు. దేవతా స్ర్తిలా, రూపుదాల్చిన లక్ష్మీదేవిలా వున్న సీతని రాముడు మరింత ప్రేమతో హృదయంలో
నిలుపుకున్నాడని అంటాడు ‘రామాయణం’లో వాల్మీకి. అంటే వారి
పరస్పర ప్రేమాభిమానాలు భాషకందనివి. కన్యాదాన సమయంలో
‘ ఛాయ వలే సీత నీ వెన్నంటి వుంటుంద’ని రాముడితో జనకుడు చెప్పిన మాట- వనవాసం సందర్భంగా నిరూపించబడింది.
కౌసల్యాదేవి నోముల పంట, దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగ పుణ్యఫలం- శ్రీరాముడు. చైత్రమాసంలో పునర్వసు నక్షత్రంతో కూడిన నవమి తిథిలో కౌసల్యకు ఇక్ష్వాకు వంశవర్థనుడిగా రాముడు జన్మించాడు. జనక మహారాజు యజ్ఞం చేయడానికి భూమిని దున్నుతుండగా నాగటిచాలులో లభించిన దైవ ప్రసాద సంప్రాప్త సీతామాత. జనకుడు సీతను గురించి విశ్వామిత్రుడికి చెబుతూ ఆమె ‘వీర్యశుల్క’అని చెప్పాడు. స్వయంవరంలో శివధనుర్భంగం గావించినవానికి సీతను ఇచ్చి పెండ్లి చేయాలన్న తన సంకల్పాన్ని జనకుడు వివరించాడు. గురువు ఆజ్ఞ మేరకు శివధనుస్సును విరిచాడు రాముడు. వీరుడైన రాముడ్ని విజయంతో పాటు సీత వరించింది. తండ్రి అనుమతితో సీతను చేపట్టాడు రాముడు. ‘అలకలల్లలాడగ గని ఆ రాణ్ముని ఎటు పొంగెనో’ అన్నట్లుగా రాముణ్ణి చూసి ముగ్ధుడై మురిసిపోయాడు విశ్వామిత్రుడు. ‘మా జానకి చెట్టాపట్టగ మహరాజువైతివి’ అని చనవుతో రాముని గురించి త్యాగయ్య అంటాడు. సీతామాత మహామహిమాన్విత కాబట్టి ఆమెను చేపట్టి రాముడు శ్రీరాముడైనాడని త్యాగయ్య భావన. ఈ జంట లోకానికి ఆదర్శప్రాయమై నిలిచిపోయింది. వనవాసం, అగ్నిప్రవేశం మొదలైన ఘట్టాలు సీతాదేవి పట్ల మొగ్గుచూపేలా చేసినప్పటికీ, ధర్మపక్షపాతి అయిన రాముని పట్ల కూడా వుండే భక్తికి కొదువ ఏమీ లేదు.
శ్రీరామనవమిని ఓ పండుగగా జరుపుకుంటూ సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించడం ఆచారమైంది. ఇది భక్తులకు సీతారాములపై గల భక్త్భివానికీ, అభిమానానికీ నిదర్శనం. రాముణ్ణి భగవంతుడిగా, తారకరాముడిలా భావించి ఆరాధించేవారికన్నా, సీతారాములను మనవారే అన్నంత సన్నిహితతత్వంతో ఆత్మీయులుగా భావిస్తారు తెలుగువారు. కనె్నలంతా రాముని వంటి భర్త లభించాలని, తల్లులంతా రాముడి లాంటి కొడుకు కలగాలని కోరుకుంటారు. సీతారాముల గుణగణాలను సర్వదా స్తుతిస్తుంటారు. రామనామాన్ని జపిస్తారు,లిఖిస్తారు. రాముణ్ణి మనసులో నిలుపుకుంటారు. ఏ మంచి పనికైనా శ్రీకారం చుట్టదలిస్తే ముందుగా ‘శ్రీరామ’ అని రాసే అలవాటు చాలామందిలో వుంటుంది. పెండ్లి శుభలేఖలన్నింటిలో సీతారాముల తలంబ్రాల ఘట్టాన్ని వర్ణించే శ్లోకం తప్పకుండా వుంటుంది. సీతారాముల కష్టాలను తలచుకుని సానుభూతి చెంది, ఎంతో బాధపడతారు. రామనామం వినగానే పారవశ్యం చెందుతారు. ఇలా తెలుగువారితోపాటు సమస్త భక్తజనానికీ ఆరాధ్య దైవం శ్రీరాముడు.
సౌందర్యము, సుగుణాలు, ధర్మము రాశి పోసినట్లుగా వున్న సీతారాముల చరితం లోకానికి ఆదర్శాన్ని, ధర్మాన్ని చాటి చెప్పింది. వీరి అన్యోన్య దాంపత్యం జనులందరి చేతా కొనియాడబడింది. వీరి నడవడి అందరికీ ఒరవడి అయింది. సీత హృదయం నిండా రాముడే వుండేవాడు. రాముడి హృదయం నిండా సీతే వుండేది. అలా అన్యోన్యానురక్తులై వారు చాలాకాలం గడిపారు.
తండ్రి ఆమోదించిన వధువు కనుక రామునికి సీతమీద ప్రేమ కలిగింది. ఆమె లోకోత్తర సౌందర్యం వలన, సద్గుణ సంపత్తి వలనా ఆ ప్రేమ అనేక రెట్లయింది. భర్త అనే ఒక్క కారణం చేత రాముడికి తనపై వున్న ప్రేమ కంటే- సీతకు రామునిపై రెట్టింపు ప్రేమ వుంది. ఆ ప్రేమ ఎంతటిదంటే వారిరువురూ హృదయంతో మాట్లాడుకునేవారు. దేవతా స్ర్తిలా, రూపుదాల్చిన లక్ష్మీదేవిలా వున్న సీతని రాముడు మరింత ప్రేమతో హృదయంలో నిలుపుకున్నాడని అంటాడు ‘రామాయణం’లో వాల్మీకి. అంటే వారి పరస్పర ప్రేమాభిమానాలు భాషకందనివి. కన్యాదాన సమయంలో ‘ ఛాయ వలే సీత నీ వెన్నంటి వుంటుంద’ని రాముడితో జనకుడు చెప్పిన మాట- వనవాసం సందర్భంగా నిరూపించబడింది. సీత ఎంతటి సుకుమారో అంతటి ధీర. వనవాసానికి వెళ్లేందుకు భర్త,అత్తలను తన వాక్చాతుర్యంతో మెప్పించి తన కార్యాన్ని సానుకూలపరచుకున్న నేర్పరి.
రాముడు ఎంతటి పరాక్రమశాలియో సీతపట్ల అంతటి హృదయ మార్దవం కలిగినవాడు. బంగరుజింకను కోరుకున్న సీత మాటను కాదనలేక ‘అలాంటి మాయలేడి వుంటుందా? వుండదా?’ అని సందేహించకుండా ఆమె కోరికను నెరవేర్చేందుకు సిద్ధపడిన ఆర్ద్రహృదయుడు. సీత తన పాతివ్రత్యంతో అనసూయ మెప్పును కూడా పొందింది. అనసూయ సీతకు పతివ్రతా ధర్మాలను బోధించి కానుకలను సమర్పించిన సందర్భంగా శ్రద్ధగా ఆమె మాటలను విని, తన తల్లి,అత్త కౌసల్య కూడా పతివ్రతా ధర్మాలను బోధించారని చెబుతుంది. వారికి విలువనిస్తుంది. అత్తమామల పట్ల, భర్తపట్ల భక్తిప్రపత్తులు కలిగిన వినయశీల సీత. శ్రీరాముడు కూడా సీతను ‘జానకి, వైదేహి, మైథిలి’ వంటి పేర్లతో సంబోధిస్తూ ఆమె పట్ల, ఆమె పక్షం వారిపట్లకూడా అభిమానాన్ని చూపేవాడు. రాముని ఆజ్ఞకు లోబడి అగ్నిప్రవేశం చేసిన సీతాదేవి సాధువర్తన దేవ,ముని గణాలను కూడా సంభ్రమానికి గురిచేసింది. సీత ‘నిష్కళంక’ అని లోకానికి చాటదలచి అగ్నిప్రవేశానికి ఆజ్ఞాపించిన ధర్మతత్పరత శ్రీరామునిది. సీతారాముల చరితం, ధార్మిక వర్తన ప్రజలకు శిరోధార్యమై నిలిచింది. వారి సౌశీల్యం శ్లాఘనీయమైనది. ఉదాత్తమైనది.
‘శ్రీరామచంద్రః శ్రీతపారిజాతాః సమస్త కల్యాణ గుణాభిరామ
సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు’
శ్రీరాముడు సర్వ జనులకూ సకల శుభాలనూ ప్రసాదిస్తాడు