మనోమథన ‘మన్మథ’ ఉగాది
- -సుధామ
- 21/03/2015

కాలచక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది… ఈ మాట మన తెలుగువారి కాలగణన బట్టి వచ్చిందే. ఆంగ్ల సంవత్సరాలు ‘చక్రనేమి’యుతాలు కావు. 2015 సంవత్సరం వెళ్లిపోతే- మళ్లీ ఆ అంకెగల ఏడాది ఎప్పటికీ తిరిగిరాదు. కానీ, మానవ జీవనపు జనన మరణ చక్రం ఆత్మ- ‘ఒక శరీరాన్ని వదిలి మరో శరీరంలోకి ప్రవేశించడం’ అనే పునర్జన్మ విశ్వాసాల ఆధారంగానే మన ‘కాలగణనం’- ‘కాలచక్రం’గా సంభావింపబడుతోంది. అందుకే తెలుగు సంవత్సరాలన్నీ (అరవై) చక్రభ్రమణంలా నిరంతరాయంగా సాగుతూంటాయి. 1955లో వచ్చిన ‘మన్మథ’ నామసంవత్సరం ఈ ఏడాది మళ్లీ ప్రవేశించింది. చైత్రశుద్ధ పాడ్యమితో మొదలయ్యే తెలుగు సంవత్సరం ఫాల్గుణమాసంతో ముగుస్తుంది. మన్మథ తర్వాత ‘దుర్ముఖి’ వస్తుంది. అరవయ్యవ సంఖ్యగల సంవత్సరం ‘అక్షయ’ ముగిశాక మళ్లీ కాలచక్రంలో ‘ప్రభవ’ నుండి ఆ వృత్తం మొదలవుతుంది. అలా 29వ సంఖ్యగల ‘మన్మథ’ నామసంవత్సరం మళ్లీ 2075లో వస్తుంది. ఈ ‘కాలమానచక్రం’ మన భావన! కానీ, ఆంగ్లేయుల కాలమానమే నేడు ప్రపంచ వ్యాప్తంగా అధికంగా పరిగణనలో వుండడంవల్ల, ఉగాది సందర్భంగా ఈనెల 21న నూతన సంవత్సరంగా భావించి శుభాకాంక్షలు తెలుపుకోవడమన్నది చిత్రంగా తోచే తరం వచ్చేసింది.
తెలుగువారందరికీ ఈ ‘ఉగాది’యే ‘అసలు సిసలు కొత్త సంవత్సరం’ అన్న భావన నేటి తరంలో గాఢంగా పాదుకోవాల్సిన అవసరం వుంది. హిందూ శాస్త్రాల ప్రకారం అరవై తెలుగు సంవత్సరాలు క్రమంగా వస్తాయి. ప్రభవ నుండి అక్షయ దాకా కాలచక్రం అరవై రేకులతో తిరుగుతూ వుంటుంది. సుఖదుఃఖాలు, జనన మరణాలు అన్నీ కూడా అలా వస్తూపోతూండేవే!
బ్రహ్మ తన సృష్టిని చైత్రశుద్ధి పాడ్యమి నాడు ప్రారంభించాడు కనుక- ‘యుగాది’యే ఉగాది అయింది. మన భారతీయ గణిత శాస్తవ్రేత్త భాస్కరాచార్యులు ఈ రోజునే సూర్యోదయకాలానికి కొత్త సంవత్సరం, కొత్త నెల, కొత్త రోజు వస్తాయని గణన చేశాడు. మన కాలమానంలో కనురెప్పపాటు కాలము- ఆంగ్ల కాలగణనపు ఒక సెకను.
అసలు కొత్త సంవత్సర భావన ‘ఉగాది’ అనీ, వసంత ఋతువు ప్రారంభమై, బీడువడిన భూమిపై సస్యాలు మొలకెత్తి, కొత్త జీవితానికి నాందిలా ప్రకృతి పచ్చదనాన్ని సంతరించుకునే కాలమనీ, పచ్చని పంట పొలాలతో, విరగకాసిన చెట్లతో ఫల,పుష్ప భరితంగా సౌభాగ్య చిహ్నంగా కానవచ్చే కాలమనీ నేటితరానికి తెలిసేదెలా? పర్యావరణ పరిరక్షణ మందగిస్తున్న నేటి రోజుల్లో సంప్రదాయం చిగురులు వేసేదెలా?
ఉగస్య ఆదిః ఉగాదిః
‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది అంటే.. సృష్టి ఆరంభమైన దినమే ‘ఉగాది’. సంవత్సరం మనకు ఉత్తరాయణ, దక్షిణాయనాలుగా ‘ఆయనద్వయ’ సంయుతం కనుక ‘యుగం’ అనే పదంతో ‘యుగాది’ అని కూడా వ్యవహరించుకుంటాం. యుగాది అన్నా ఉగాది అన్నా ఒకటే. సోమకాసురుడు వేదాలను అపహరించగా శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో వాటిని తిరిగి బ్రహ్మకు అప్పగించిన శుభతరుణమే ‘ఉగాది’ అని పురాణ ప్రతీతి. అలాగే, శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి రోజున పట్ట్భాషేకం చేసుకుని, తాను యుగకర్తగా భాసిల్లిన కారణం వలన, ఆ శుభ సందర్భమే ఉగాది అయిందని ఒక చారిత్రక భావన. ఏమైనా జడప్రాయమైన జగతి నవ చైతన్య దీథితులను ప్రసరింపచేసే కాలరాంభ సూచి- ఉగాది. ఆంగ్ల సంవత్సరాది ఆరంభంలో డిసెంబర్ 31 అర్ధరాత్రి జరిగే కోలాహలం మనకు తెలుసు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అని చెవులు దిమ్మతిరిగేలా అరుచుకోవడం తెలుసు. కానీ, తెలుగు సంవత్సరాది ఉగాది రోజు ఏం చేయాలన్నదీ తెలియడం లేదు నేటి ఆధునిక కాలంలో కొందరికి.
‘్ధ్వజప్రతిష్ఠాపన’ విశిష్టాచారం..
ఉగాదినాడు ‘్ధ్వజప్రతిష్ఠాపన’ ఒకప్పుడు విధిగా ఆచరించేవారు. ఒక పట్టువస్త్రాన్ని వెదురుగడకు జెండాలాగా కట్టి, దానిపై కొబ్బరి కాయ వున్న కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడాకులు, నిమ్మ ఆకులు, పూల తోరణాలు కట్టి, ఇంటి ప్రాంగణంలో ప్రతిష్ఠించి ఆరాధించేవారు. ఉగాది రోజే- ఆ నిజమైన ‘జెండాపండుగ’ కూడాను. అయితే ఇప్పటికీ కలశ స్థాపన చేసి, పూర్ణకుంభదానం చేయడం కొందరిలో ఆచారంగా నిలిచి వుంది. రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా రంగులతో తీర్చిదిద్ది అందులో మామిడి, నేరేడు, మోదుగ, అశోక, వేప అనే పంచ పల్లవాలు సుగంధ చందనంతో కలిపి, పుష్పాక్షలతో ఆవాహనం చేసి, పూజించి ఆ కలశానికి నూతన వస్త్రాన్ని చుట్టి, పాత్రపై పసుపు, కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బొండాం పెట్టి, ఎవరైనా పెద్దలకు ‘పూర్ణకుంభదానం’ ఇచ్చి వారి ఆశీస్సులు పొందడం- ఏటికేడాదికీ శుభ ఫలితాలను ఇస్తుందని ప్రతీతి వుంది. ఇది ఉగాది నాటి విశిష్టాచారం.
కాలపురుషుడికి అర్చన..
‘పంచాంగశ్రవణం’ ఉగాది రోజు విశేష ఫలితం ఇస్తుందని విశ్వాసం. ‘పంచాంగస్య ఫలం శృణ్వన్ గంగాస్నాన ఫలం లభేత్’- ఉగాది రోజున పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేసినంతటి పుణ్యం లభిస్తుందట! ఈరోజు ‘పంచాంగ శ్రవణం’ చేసినవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని సంపదను, రాహువు బాహుబలాన్ని, కేతువు వంశాధిక్యతను కలిగిస్తారట! ఇప్పుడంటే పంచాంగాలు పుస్తకరూపంలో అందుతున్నాయి. ఒకప్పుడు తాళపత్రాలపై వుండేవి కనుక ఉగాది నాడు దేవాలయంలో గానీ, గ్రామ కూడలిలోగానీ, పండితులో,సిద్ధాంతులో అందరికీ వినిపించేవారు. అందరూ వారి చెంత చేరి, కందాయ ఫలాలు తెలుసుకుని, సంవత్సరం పొడుగునా నడుచుకునే జీవనసరళికి ప్రాతిపదికలు వేసుకునేవారు. ఉగాది నాడు పంచాంగాన్ని పూజించడం, పంచాంగ శ్రవణం, కాల స్వరూప నామార్చనకు గుర్తు. ‘కాలాయ తస్మై నమః’ అని కాలపురుషుడిని పూజించడం అంటే- జరామరణాలూ, ఆద్యంతాలు లేని ఆదిశక్తి స్వరూపాన్ని ఆవాహనం చేసుకుని, ‘కాలాతీత వ్యక్తులు’గా నిలిచిపోయేందుకే!
మనం- మనం జన్మించిన నామ సంవత్సరాన్ని జీవితంలో ఒక్కసారి చూడగల్గడం అయినా మళ్లీ సంభవిస్తే ఆ ఆనందంతో చేసుకునేదే ‘షష్టిపూర్తి’ (60 ఏళ్లు) పండుగ. కాలచక్ర పరిభ్రమణం ఒక్కసారైనా చూడకుండానే కనుమరుగయ్యేవారున్నారు. ఇక, తాము పుట్టిన నామ సంవత్సరాన్ని రెండోసారి చూడగలగడం అంటే- సంపూర్ణ ఆయుష్షుతో 120 సంవత్సరాలు జీవించడం అన్నమాట! ఆయుః పరిమాణం అనేది జన్మాంతర సుకృతాన్ని బట్టి నిర్ణయింపబడేదని ఆర్యోక్తి. నిత్య వ్యవహారాల కోసం అంతా ఇంగ్లీష్ క్యాలెండరే వాడుతున్నా- శుభకార్యాలకూ, పూజా పునస్కారాలకూ ‘పంచాంగం’ ఇంకా ఉనికిలో ఉన్నందుకూ ఆనందించాల్సిందే! తెలుగువారి విశిష్టతకు కనీస నిదర్శనంగా పంచాంగం ఇంకా అమలులో వుంది. కాగా, ఉగాది రోజున శక్తి ఆరాధనతో బాటు శ్రీరాముడిని ఆరాధించడం కూడా విశిష్టంగా చెబుతారు. దక్షిణాయన, ఉత్తరాయన సంవత్సర జీవన గమనానికి ఆదర్శం కనుకనే- ‘రామాయణం’ అని, ‘రాముడు నడిచినదారి’కి కూడా విశేష ప్రాధాన్యం ఇచ్చిన జాతి మనది! శ్రీరామనవమి ఉగాది వచ్చిన వారానికే వస్తూంటుంది కూడాను.
ఈ రోజు ప్రవేశించిన ‘మన్మథ’ నామ సంవత్సరం 1955లో వచ్చింది. ఆ మన్మథనామ సంవత్సరంలో తెలుగువారంతా కలిసి ‘విశాలాంధ్ర’గా ఏర్పడి రాజకీయ సంరంభం సాగితే, నేటి మన్మథ నామ సంవత్సరం నాటికి అదే తెలుగువారు రెండు రాష్ట్రాలుగా ప్రత్యేక అస్తిత్వాలలోకి పరిణమించారు.
కవి సమ్మేళనాలు
ఉగాదికి కవి సమ్మేళనాలు నిర్వహించడం ఓ ఆనవాయితీ. ఉగాది పచ్చడిలానే- షడ్రచుల సముపేతం అన్నట్లుగానే కవుల కలాల్లో ఉగాది ప్రకృతిపరంగా, రాజకీయపరంగా, సామాజిక జీవన పరంగా, వాణిజ్యపరంగా రకరకాలుగా పోకడలు పోతుంది. నానారుచుల ప్రతిఫలనంగా సాగుతుంది ఉగాది కవి సమ్మేళనం.
ఆ మాటలు నేడూ వర్తిస్తాయ…
కాగా, 1955 మన్మథ ‘ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక’లోని ‘ప్రస్తావన’లో సంపాదకులు ఉటంకించిన విషయాలలో కొన్ని అరవై ఏళ్ళ తర్వాత వచ్చి నేటి ‘మన్మథ’ కాలానికీ ఔచితీయుతంగా భాసిస్తున్నాయి.
‘నేటితో మన్మథ వత్సర వసంతోదయం ప్రారంభం అయింది. సంవత్సరారంభం మనకొక ప్రత్యేకమైన మహోత్సవం. ఈనాడాంధ్రులందరూ గత జీవిత ఘట్టాలొకసారి సుస్మరించుకొని, భవిష్యజీవన గమనంలో బంగారు కలలు కంటారు. ఎలాంటి వాస్తవికులకైనా కొంతవరకిది సహజమే. మానవుని మనోనిర్మితిలోనే ఈ విచిత్ర విన్యాసాలున్నాయి. పిన్నలు, పెద్దలు, యువకులు, ప్రజలు, నాయకులు, అందరూ అంతరాంతరాల్లో ఈనాడుత్సాహ డోలికల్లో ఉవ్విళ్ళూరుతుంటారు. మన్మథ సంవత్సరాది మహోత్సవ సమయంలో వీరందరికీ మా అభినందనాలందజేస్తున్నాము.’- అని అందులో పేర్కొన్నారు.
‘కేవలం రాజకీయ నినాదాలనే రచనా వస్తువులుగా స్వీకరించి, తాత్కాలిక లక్ష్యాల వాగుర
లలో చిక్కిన రచనలకు సారస్వత గౌరవం చేకూరదని స్పష్టపడింది. సాహిత్యానికీ రాజకీయ ప్రచారానికీ హస్తిమశకాంతరం వున్నదనీ, రాజకీయ ప్రచార రచన ఆయా లక్ష్యాల ఆవశ్యకతలు తీరిపోగానే అంతరించిపోగలవనీ తేలిపోయింది. సాహిత్యంలో సాంఘిక సమస్యా దృక్పథానికీ, ప్రచార వాఙ్మయంలో సాంఘిక సమస్యా దృక్పథానికి గల అంతరువులు కూడా ఈ చర్చలవల్ల విస్పష్టంగా వెల్లడి అయ్యాయి. బలీయమైన రాజకీయాధికార ముద్రవల్ల సారస్వతం ఏదయినా సన్నగిల్లి నిర్జీవమైపోగలదనీ, స్వతంత్య్ర వాతావరణంలోనే సజీవ సాహిత్యం వర్థిల్లగలదనీ రచయితలనేకులు సోదాహరణంగా ప్రతిపాదించారు. అంతేగాక ప్రతి జాతికీ సజీవమైన సంస్కృతి, సంప్రదాయము ఉన్నాయనీ, ఇవి విడిచి వ్యవహరించడం రచయితలకు కేవలం నేల విడిచిన సాముగా పరిణమించగలదనీ స్పష్టపడింది. ఈ చర్చలవల్ల ఆంధ్రదేశంలో సారస్వతంలో ఒక నూతనాధ్యాయానికి నాందీప్రస్తావన జరిగినదని అనవచ్చును. త్వరలోనే ఈ ఆశాభావం వాస్తవ రూపం ధరించగలదనీ మన ప్రభుత్వం ఆయా ఆర్థిక వ్యవసాయికాది రంగాలలోనే కాక భాషా సాహిత్యాది సాంస్కృతిక రంగాలలో కూడా తగినంత దోహదం కలిగించగలదనీ ఆంధ్ర ప్రజ సర్వతోముఖంగా అభివృద్ధి పొందగలదనీ ఆశిస్తున్నాము’’- అని కూడా పేర్కొన్నారు.
అరవై ఏళ్ళ క్రితం నాటి ఆశావహ దృక్పథమే ఈనాటికీ మన మనోనిర్మితిలో వుండడం విడ్డూరమేమీ కాదు కదా! ఆనాటి రాయప్రోలు సుబ్బారావుగారి మంగళ వాచకంతోనే స్వస్తి!
‘మంగళంబోయ్ మన్మథా! జయ
మంగళంబోయ్ మన్మథా! నవ
వత్సరాది మహోత్సవార్పిత
వాద్యగీత స్వరసుధా!
మంగళంబోయ్ మన్మథా,
జయమంగళంబోయ్!
నీదు తరుణ స్నేహ విరహము
నిలుపరాని దురాతపంబున
దిగులుపడి చెడి సొగసు మాసెను
తీగెలును పూలును వగన్, మంగళంబోయ్!
ఎన్ని యేండ్లో నడిచినవి మా
యింటిలో నీ వాడి కూడీ
పక్వకదళీ గస్తనీ ఫల
పాయసము భుజియించీ, మంగళంబోయ్
మంగళంబోయ్ మన్మథా!
జయమంగళంబోయ్!
…………………………..