లేదు… లవకుశకు సాటి
- 27/03/2015
- -లోకనాథం సత్యానందం

అర్థ శతాబ్దం దాటినా చెక్కు చెదరని రికార్డు -లవకుశది. ఉత్తర రామాయణ గాధ ఇతివృత్తంతో నిర్మితమైన సినిమా -ప్రేక్షకులను భక్తిపారవశ్యంలో ఎంత ఓలలాడించిందో.. కమర్షియల్‌గా అంత వసూళ్లు అందించి రికార్డుల శిఖరంపై స్థానాన్ని పదిలపర్చింది. వాణిజ్యపరంగా లవకుశ సాధించిన విజయం -్భరత సినీ చరిత్రలో ప్రత్యేక ఘట్టం. సినిమా విడుదలైన సమయంలో -్థయేటర్లలో టిక్కెట్టు ధరలు పావలా నుంచి రూపాయి. అప్పటి లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా -మూడు కోట్లు. అలాంటి తరుణంలో ‘లవకుశ’ వసూలు చేసిన మొత్తం -కోటి రూపాయిలు. అంతేకాదు -75 లక్షల జనాభావున్న వంద కేంద్రాల్లో 1.98 కోట్ల టిక్కెట్లు అమ్ముడైనట్టు లెక్కలున్నాయి. అంటే ఉన్న జనాభాకు మించి మూడురెట్లు టిక్కెట్లు అమ్ముడయ్యాయి. సరాసరిన -ఒక్కొక్కరు సినిమాను మూడుసార్లు చూశారన్నమాట. ఇదీ లవకుశ అసాధారణ రికార్డు. ముక్తాయింపు ఏమిటంటే -ఇప్పటి లెక్కలను అప్పటి ‘లవకుశ’కు అన్వయిస్తే -వసూళ్ల మొత్తం వెయ్యి కోట్లు. గుండెలమీద చెయ్యి వేసుకోవాలనిపిస్తోంది కదూ! -శ్రీరామనవమి సందర్భంగా ‘లవకుశ’ ట్రాక్ రికార్డులు ప్రత్యేకవ్యాసంగా -పాఠకుల కోసం. అలనాటిమేటి చిత్రం -లవకుశ. 50ఏళ్లు పైబడినా వనె్నతగ్గని సినీకావ్యం. మునికుమారుల రూపాల్లో లవకుశలు గానం, అభినయంతో ఆకట్టుకుంటూనే -శ్రీరాముడినే ఎదిరించిన సన్నివేశాలను ఆనందించని ప్రేక్షకుడుండడు. రామాయణం ఇతివృత్తంతో ఎనె్నన్నో సినిమాలు వచ్చాయి. కానీ -లవకుశకు సాటి లవకుశే. ప్రతి ఫ్రేము తెలుగువాడి గుండెల్లో గూడుకట్టుకుంది. శ్రీరాముడు ఇలాగే ఉంటాడన్నంతగా ఎన్టీఆర్, సీతమ్మ ఈమేనేమో అన్నంతగా అంజలీదేవి.. ఆయా పాత్రలకు మిగిలిన నటులూ జీవం పోశారు. శ్రీరామనవమి వస్తేచాలు.. ఏదోక ఛానెల్‌లో ‘లవకుశ’ ప్రసారమవుతుంది. అజరామర రామకథను చూసి భక్తులు పరవశించిపోతారు. మొదటగా లవకుశను బెంగాలీలో తీశారు. దర్శకుడు దేవకీబోస్. రాముడు పృథ్వీరాజ్‌కపూర్. ఇది ఒక స్టేజ్ నాటకం ఆధారంగా నిర్మితమైంది. తెలుగులో రామాయణ నాటకానికి ఆదరణ లభించటంతో -దర్శకుడు సి పుల్లయ్యకు సినిమాగా మలచాలన్న ఆలోచన వచ్చింది. మొట్టమొదటి తెలుగు లవకుశకు రచయిత బలిజేపల్లి లక్ష్మీకాంతం. రాముడిగా పారుపల్లి సుబ్బారావు, సీతగా సీనియర్ శ్రీరంజని.. ఇలా 1934లో చిత్రం విడుదలై అఖండ విజయం సాధించింది. నిర్మాత శంకర్‌రెడ్డి చరణదాసి (1956)లో ఒకచోట రామారావు, అంజలీదేవి సీతారాముల్లా కనిపిస్తారు. అప్పుడే శంకర్‌రెడ్డికి ‘లవకుశ’ను దర్శకుడు సి పుల్లయ్యతో తీయాలన్న ఆలోచన వచ్చింది. లవకుశకు -ఉత్తర రామచరితాన్ని కథావస్తువుగా తీసుకున్నారు. రావణసంహారం చేసి సీతాసమేతుడై వచ్చిన రామయ్య తండ్రినిచూసి ఆనందపరవశంతో అయోధ్య సంబరాలు చేసుకుంటుండగా -లవకుశ సినిమా ఆరంభమవుతుంది. లవకుశకు కథానాయకుడు శ్రీరాముడు -నందమూరి తారక రామారావు. రాముడంటే అతనేననే భావన తెలుగు ప్రజల్లో కలకాలం ఉండేంత గొప్పగా ఆ పాత్రను పోషించారు ఎన్టీఆర్. అప్పట్లో ఆయన పోస్టర్లకు పూజలు చేశారంటే -రాముడిగా ఆయన ఎంతగా ముద్రవేశారో ఊహించుకోవచ్చు. సీతాదేవి పాత్ర పోషించిన అంజలీదేవి ఒక సందర్భంలో ఇలా చెప్పారు. ‘శ్రీరాముడి వేషంలోవున్న ఎన్టీఆర్‌ను ఒక్కోసారి కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయేదాన్ని. సినిమా చివర ఒక సన్నివేశంలో ఆయన సీతా, సీతా అని విలపిస్తుంటే -మాకు తెలియకుండానే కన్నీళ్లుపెట్టేశాం. ఎన్టీఆర్ గురించి చెప్పడానికి కూడా యోగ్యత కావాలి’. ఇక -అప్పట్లో అంజలీదేవిని సీతమ్మగానే చూశారు తెలుగు ప్రేక్షకులు. తొలి లవకుశలో నటించిన సీనియర్ శ్రీరంజని సైతం సీతగా చెరగని ముద్రవేశారు. అప్పట్లో శ్రీరంజని పోస్టర్లను కత్తిరించి గోడకు అతికించి పూజలు చేసేవారట. అలాంటి సీత పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన అంజలీదేవి మరింతమంది అభిమానులను ప్రోదిచేసుకున్నారు. అప్పట్లో ఆమెను ప్రజలు భూదేవి బిడ్డలాగే చూసేవారు. తమ పొలాల్లో కాలుపెట్టాలని రైతులు కోరేవారు. ఆమె పాదాలవద్ద వరి కంకులుంచి నమస్కరించేవారు. మహిళలు హారతులు పట్టారు. పసుపుకుంకుమలు ఇచ్చేవారు. ఇలా అంజలీదేవి సీతమ్మదేవిగా చెరగని ముద్రవేసుకున్నారు. ఇక లవకుశుల ఎన్నిక కూడా పుల్లయ్యగారిదే. వాళ్లిద్దరూ చిత్ర విజయంలో ప్రధాన పాత్రధారులయ్యారు. కాకినాడ సమీపంలోని గొల్లపాలెంలో రంగస్థల నటుడు సుబ్బారావు, ఇద్దరు కొడుకులతో ఒక క్లబ్‌వారు నాటకం వేయించారు. ఆ నాటకంలో కుశుడి పాత్రను సుబ్రహ్మణ్యం అనే కుర్రాడు చేశాడు. అది పుల్లయ్యగారు చూసి తన సినిమాలో కుశుడిగా ఎంపిక చేసుకున్నారు. లవకుశ చిత్రంలో గొప్ప పేరు తెచ్చుకున్నా -తర్వాత అవకాశాలు లేక టైలర్‌గా స్థిరపడిపోయారు కుశుడి పాత్రధారి సుబ్రహ్మణ్యం. ఇక లవుడు పేరు నాగరాజు. ఇతని తండ్రి ఏవీ సుబ్బారావు సినిమా ఆర్టిస్టు. ఈ కుర్రవాడు ‘్భక్తరామదాసు’ చిత్రంలో తొలిసారి చేశాడు. అలా పుల్లయ్యగారి దృష్టిలోపడి లవుడుగా పేరు సంపాదించుకున్నాడు. ఇతని ఇంటి పేరు లవకుశ నాగరాజుగా స్థిరపడిపోయింది. ఇక లక్ష్మణుడిగా కాంతారావు, భరతుడిగా కైకాల సత్యనారాయణ, కౌసల్యగా కన్నాంబ, శత్రుజ్ఞుడుగా శోభన్‌బాబు, వాల్మీకిగా చిత్తూరి నాగయ్య, రేలంగి, రమణారెడ్డి, వరలక్ష్మి, గిరిజ వంటివారు తమతమ నటనతో అలరించారు. తెలుగు, తమిళంలో ఒకేసారి తీయటంతో తమిళంలో లక్ష్మణుడి పాత్ర జెమినీ గణేశన్ పోషించారు. లక్ష్మణుడి పాత్రకు కాంతారావు ఆశపడ్డారని తెలిసి -తెలుగులో కాంతారావుకే ఆ పాత్రను ఇచ్చారు. తమిళంలో లవుని పాత్రకు బేబీ ఉమ, కుశుని పాత్రకు మురళిని ఎంపిక చేశారు. ఈ లవకుశ చిత్రానికి కథా రచన శివసుబ్రహ్మణ్యం, సంగీతం ఘంటసాల, పాటలు సముద్రాల రాఘవాచార్య, సదాశివబ్రహ్మం, కొసరాజు అందించారు. వాల్మీకి ఆలపించిన సీస గీతం, సీతాదేవి భూదేవిని ప్రార్థించే శ్లోకం కంకంటి పాపరాజు వ్రాసినవి వాడుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరి సమష్టి ఫలితంగా చిత్రరాజం రూపుదిద్దుకుని, ఎన్నో రికార్డులు నెలకొల్పింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. నటీనటులకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. దిగ్గజాలయిన దర్శక, నిర్మాతలు ‘లవకుశ’ చిత్రానికి దర్శకునిగా చిత్తజల్లు పుల్లయ్యను నిర్మాత అల్లాడి శంకర్‌రెడ్డి ఎన్నుకున్నారు. ఇదివరకే ‘లవకుశ’ సినిమా తీసి హిట్ దర్శకుడు అనిపించుకున్న పుల్లయ్యకు -ఈ కథమీద అపారమైన ప్రేమ. అందుకే ఎన్నిసార్లయినా డైరక్ట్ చేస్తానన్న విధంగా ఒప్పుకున్నారు. లవకుశ నిర్మాణం కొంతసాగిన తర్వాత పుల్లయ్యగారికి ఆరోగ్యం బాగులేదు. షూటింగుకు రావడమే కష్టమైంది. మిగిలిన సినిమాను ఎవరు పూర్తిచేస్తారు? అన్న ప్రశ్నతో కొందరు పుల్లయ్య తనయుడు సిఎస్ రావు పేరు ప్రతిపాదించారు. మరికొందరు బిఎన్ రెడ్డిగారి పేరు ప్రతిపాదించారు. సిఎస్ రావు కూడా అలాగేనని బిఎన్ రెడ్డిగారిని కలిసి సినిమాను తీయమని కోరారు. ఆయన సున్నితంగా తిరస్కరించి ‘అది మీ నాన్నగారి సొత్తు. నాడు నేడు కూడా మీకే చెందాలి’ అంటూ సిఎస్‌ఆర్‌ను ఆశీర్వదించి పంపారు. బాగున్నప్పుడల్లా మధ్యమధ్యలో పుల్లయ్య వచ్చి చూసి నిర్మాణానికి సంబంధించిన సలహాలిచ్చేవారు. ఇక ఇంతటి గొప్ప చిత్రరాజం తీసి, తెలుగువారు, విదేశీయుల ప్రశంసలు అందుకున్న ఘనుడు, నిర్మాణ సాహసి అల్లారెడ్డి శంకర్‌రెడ్డి. ఈయన లవకుశ సినిమాను సాదాసీదాగా తీయాలని తలచలేదు. కొత్తదనంతో ఎక్కువ ఖర్చుతో అద్భుత కావ్యంగా తీయాలని నిశ్చయించుకున్నారు. ఉత్తరాదిలో రంగుల వైభవాన్ని తీసుకొచ్చినవారు మహబూబ్‌ఖాన్ అయితే, దక్షిణాదిలో పూర్తిరంగుల చిత్రంగా తీయాలని ఆలోచించి గేవా కలర్ సినిమాగా దీన్ని నిర్మించారు. ఈవిధంగా తెలుగింటి మహబూబ్‌ఖాన్‌గా శంకర్‌రెడ్డి పేరుగాంచారు. ఇక శంకర్‌రెడ్డి లవకుశ సినిమాకోసం పడిన కష్టాలు, సీతాదేవి పడిన కష్టాలుగా చెప్పుకోవచ్చు. 1958లో ప్రారంభమైన ‘లవకుశ’ నిర్మాణం 1963 వరకూ కొనసాగింది. మధ్యలో అనేక అవాంతరాలు. పుల్లయ్య అనారోగ్యం, నటీనటులు కాల్షీట్లు అయిపోవటం, చేతిలో డబ్బులేకపోవటం లవకుశులుగా నటించిన పిల్లలు పెద్దవాళ్లయిపోవటం, వీటితో సినిమా సాగటం చాలామందికి నమ్మకం లేదు. కానీ శంకర్‌రెడ్డి మాత్రం పట్టువదలని విక్రమార్కుడు. అలాగే అతనికి మంచి మిత్రులు తోడయ్యారు. అలాంటి సమయంలో వజీర్‌చంద్ జబక్, చిట్టూరి గాంధి, చమ్రియా ఫిలింస్ అధినేత సుందర్‌లాల్ నహతా నైతికంగా, ఆర్థికంగా హామీ ఇవ్వటంతో మళ్ళీ ‘లవకుశ’ కదిలింది. అలా అతని కష్టాలన్నీ అధిగమించి అప్పటిలో ఈ సినిమాకు వెచ్చించింది 30 లక్షలు. తెలుగు సినిమా రంగం నోరెళ్లబెట్టే భారీ బడ్జెట్ అది. ఇక ఆ సినిమా ఆర్జించింది ఎంతో తెలుసా? దక్షిణాదిలో కోటి రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రమది. అన్నీ ప్రత్యేకతలే! ‘లవకుశ’ సినిమా బాలారిష్టాలన్నీ అధిగమించి రిలీజ్ అయ్యాక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 1963 మార్చి 29న 26 కేంద్రాల్లో విడుదలై అన్ని కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. తెలుగులో తొలి కలర్ సినిమా. ఐదేళ్ల నిర్మాణం జరుపుకున్న సినిమా. అప్పట్లో 30 లక్షలు వెచ్చించి తీసిన సినిమా. మొత్తం 72 కేంద్రాల్లో శత దినోత్సవం, 16 కేంద్రాల్లో రజతోత్సవం, 10 కేంద్రాల్లో 250 రోజులు, హైదరాబాద్‌లో 67వారాలు ఆడిన సినిమా. పత్రికల్లో వసూళ్లు ప్రకటించిన తొలి దక్షిణాది సినిమా. ఈ సినిమా వంద రోజులకు పాతిక లక్షలు వసూలుచేసి, 365 రోజులకు కోటి దాటింది. (అప్పటి సినిమా టికెట్ రేట్లు పావలా నుంచి రూపాయి వరకు). అప్పటి రాష్ట్ర జనాభా 3 కోట్లు. సినిమా 60 వారాల ప్రకటన వివరాల ప్రకారం 100 కేంద్రాల్లోనే కోటి 98 లక్షల మంది చూశారట. 100 కేంద్రాల్లో జనాభా 75 లక్షలకు మించిఉండదు. అంటే ఒకొక్కరు మూడుసార్లు చూసి ఉంటారని విశే్లషణలు చెపుతున్నాయి. లవకుశ సినిమాకు గ్రామీణప్రాంత ప్రజలు బళ్ళు కట్టుకువచ్చి సినిమా చూసేవారట. సికిందరాబాద్ క్లాక్‌టవరంతా ఆరోజుల్లో యాత్రలాగ ఉండేదట. మాట్నీకి టిక్కెట్టు దొరక్కపోతే పార్కులో పడుకుని తర్వాత ఫస్ట్ షో చూసుకుని వెళ్ళేవారట. బెజవాడలో ఈ సినిమా మారుతీ టాకీస్‌లో వచ్చింది. లవకుశ ఆడినన్నాళ్ళు తారాపేట గూడ్సు షెడ్డునుంచి కాళేశ్వరరావు మార్కెట్టు వరకూ ఎడ్ల బళ్ళు బారులుతీరి ఉండేవట. ఇలా ఎనె్నన్నో విశేషాలు. అర్ధ శతాబ్దం దాటినా సినిమా ఈనాటికీ ఆబాల గోపాలాన్ని అలరిస్తుంది. కాకపోతే ఇప్పుడు టీవీలలో అందరినీ ఆనందింపచేస్తుంది. అందలి నటులకు, దర్శకులకు, నిర్మాతకు, సాంకేతిక నిపుణులకు ఎనలేని యశస్సు సమకూర్చిన లవకుశకు మరొక్కమారు హ్యాట్సాఫ్.