|
నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్ళీ నెత్తికెత్తుకున్న ‘సాగరమాల’ ప్రాజెక్టు అనుకున్న ప్రకారం అమలు జరిగితే దేశాభివృద్ధి జోరందుకుంటుందనడంలో సందేహం లేదు. ఈ అత్యంత భారీ ప్రాజెక్టును కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా ఆమోదించి, పథక రచనకు పచ్చజెండా ఊపడం కేంద్రమంత్రి గడ్కరీ చెప్పినట్టు విప్లవాత్మకమూ, చారిత్రాత్మకమే. ఈ ఒక్క ప్రాజెక్టువల్లే స్థూలదేశీయోత్పత్తి రెండు శాతం పెరుగుతుందని ఆయన హామీ ఇస్తున్నారు. ఈ ఓడరేవుల అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రత్యేక ఆర్థిక మండళ్ళనూ, స్మార్ట్‌సిటీలనూ, పర్యాటక దీవులనూ చేర్చి ఆయన ఉజ్వలమైన భవిష్యత్తును ఆవిష్కరించారు.
అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్న దశాబ్దం నాటి ఆలోచన కనుక, అప్పట్లో స్మార్ట్‌సిటీలూ, సీఈజడ్‌లు ఈ సాగరమాలలో లేవు. తీరప్రాంతంలో ఓడరేవులను అభివృద్ధి చేసి, రైలు మార్గాలతో వాటిని అనుసంధానించి వాటి సామర్థ్యాన్ని బాగా పెంచడం మాత్రమే అప్పటి ఆలోచన. ఇంకాస్త వెనక్కు వెడితే, అసలు సాగరమాల పుట్టినదే సామాన్యుడి ప్రయాణం గురించి. సముద్ర మార్గాలను సంధానించి, ఓడ ప్రయాణాలను పెంచి, మిగతా ప్రజారవాణా వ్యవస్థల మాదిరిగానే దీనిని కూడా సగటుమనిషికి అందుబాటులోకి తీసుకురావడం. సరుకు రవాణాతో పాటు ప్రజారవాణాకూ పెద్దపీట వేయాలన్న ఈ ఆలోచన కార్యదర్శుల స్థాయివే కనుక దాని గురించి ఇప్పుడు అనవసరం. ఆధునిక సాగరమాల అసలు స్వరూప స్వభావాలు ఆరునెలల తరువాత కానీ స్పష్టంగా తెలియవు. పాలకులు చెబుతున్న ప్రకారం సాగరమాల ప్రాజెక్టు కేవలం ఓడరేవుల అభివృద్ధికి మాత్రమే పరిమితం కావడం లేదు. అది ఈ దేశ తీరప్రాంత ముఖచిత్రాన్ని సమూలంగా విప్లవాత్మకంగా మార్చివేయబోతున్నది. ఒట్టి ఓడరేవుల అభివృద్ధి కాదు, ఓడరేవులు కేంద్రంగా జరిగే గట్టి అభివృద్ధి తన లక్ష్యమని ప్రధానమంత్రి గతంలో చేసిన ప్రకటనకు అనుగుణంగానే పథకరచన సాగుతుంది. ఒక్క గుజరాత్‌లోని కాండ్లా పోర్టు ఆధీనంలోనే రెండు లక్షల ఎకరాలుందని అంటున్నారు కనుక, తీరప్రాంత సెజ్‌లకు ఇక భూమి బాధ ఉండదు. పన్నెండు స్మార్ట్‌సిటీలకు ఆరులక్షల కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా. కేబినెట్ సెక్రటరీ సారఽథ్యంలో అరడజనుకుపైగా మంత్రిత్వశాఖల కార్యదర్శులు, రైల్వేబోర్డు, నీతిఆయోగ్ ఇత్యాది సంస్థల అధిపతులు సభ్యులుగా ఉండబోతున్న సాగరమాల సమన్వయ కమిటీ ఈ భారీ ప్రాజెక్టుకు ఆర్థిక వనరులు సాధించిపెట్టే పనిలో పడుతుంది. పెట్టుబడులు, నిర్మాణాలు, నిర్వహణలు పీపీపీలో ఎలా సాధ్యం చేయాలో చూసుకుంటుంది. మొత్తంమీద ఈ ఏడాది ఓ ఆరువందల కోట్ల ఆరంభపు కేటాయింపుతో సాగరమాల సాధన దిశగా అడుగులు పడ్డాయి.
అనుసంధానాన్ని అభివృద్ధికి ఊతంగా, సమగ్రత మూలాధారంగా భారతీయ జనతాపార్టీ భావిస్తున్నది. జాతీయ రహదారులు, నదులు, ఓడరేవుల అనుసంధానం ఒక విధానంగా ముందుకు తెస్తున్నది. స్వర్ణచతుర్భుజి సాధ్యపడినా, నదుల అనుసంధానానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. సాగరమాల ప్రాజెక్టు ఓడరేవుల అనుసంధానికీ, అభివృద్ధికి సంబంధించి దేశచరిత్రలో ఎన్నడూ లేనంత సమన్వయం సాధించబోతున్న మాట వాస్తవం. భారీ ఓడరేవులు కేంద్రం చేతుల్లోనూ, మిగతావి రాష్ట్రాల చేతుల్లోనూ ఉంటూ, వేరువేరు అభివృద్ధి విధానాలు ఇప్పటిదాకా అమలు జరుగుతున్నాయి. వాటి అభివృద్ధిలోనూ, మౌలిక సదుపాయాల కల్పనలోనూ, ఎగుమతి దిగుమతుల్లోనూ, సరుకును ఒడ్డుకు చేర్చే విషయంలోనూ భాగస్వాములైన సంస్థలు కూడా వేర్వేరుగానే ఉన్నాయి. రెండు విభిన్న నిర్వహణ విధానాల వల్ల ఓడరేవుల గరిష్ఠ వినియోగం జరగడం లేదని భావించిన కేంద్రం గతంలో రాష్ట్రాల గుప్పిట్లో ఉన్న చిన్న, మధ్యతరహా ఓడరేవుల్లో వేలుపెట్టబోయి చేతులు కాల్చుకుంది. అత్యంత ప్రధానమైన ఈ రంగంమీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కేంద్రానికి పెత్తనం ఇవ్వడానికి రాష్ట్రాలు అంగీకరించలేదు. తమకు నచ్చిన విధానంలో, తాము మెచ్చిన పెట్టుబడులతో ఆ అభివృద్ధి ఏదో తామే చూసుకోవాలని, చేసుకోవాలన్నది రాష్ట్రాల అభిప్రాయం. ఇప్పుడు గతంలో మాదిరిగా కాకుండా, రాష్ట్రాలకు నొప్పి తెలియకుండా ఒక సమగ్ర విధానం సాధించాలని కేంద్రం ప్రయత్నిస్తున్నది. రాష్ట్ర పాలకుల మాటకు విలువనిస్తూనే సమగ్రత సాధించడానికి వీలుగా ముఖ్యమంత్రుల సారథ్యంలో రాష్ట్రకమిటీలు కూడా ఏర్పడి కేంద్ర కమిటీకి ఇతోధికంగా సహకరిస్తాయి. అమలులో ఉన్న విభిన్న నియంత్రణలు, సుంకాలు ఇత్యాది విషయాల్లో ఏకరూపత సాధించడానికి కేంద్ర, రాష్ట్ర స్థాయి కమిటీలు కృషిచేయవచ్చు.
మనదేశ ఎగుమతి దిగుమతులు 90శాతం ఓడరేవుల నుంచే జరుగుతున్నప్పటికీ, స్థూల దేశీయోత్పత్తిలో దీని వాటా 42 శాతం మాత్రమే ఉంది. రైలు, రోడ్డు మార్గాల్లో సాగే సరుకురవాణాతో పోల్చినప్పుడు బాగా తక్కువగా ఉంది. యూరోపియన్ యూనియన్, జర్మనీ వంటి చోట ఓడరవాణా వాటా 70శాతం పైబడే ఉన్నది. ఇప్పుడు దేశం మొత్తానికి ఉన్న ఏడువేల కిలోమీటర్ల తీరాన్ని పది ప్రాంతాలుగా విభజించి, ప్రతి ప్రాంతంలోని పెద్దాచిన్నా ఓడరేవుల అభివృద్ధికి సమగ్ర పథకరచన జరగాలన్నది ఆలోచన. రేవులను తీర్చిదిద్దడంతోపాటు, వాటి కేంద్రంగా ఆ ప్రాంతం మొత్తాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా కళకళలాడించేందుకు విధానాలు ఆవిష్కరించాలన్నది ఉద్దేశం. ఓడరేవుల సమర్థతను పెంచాలన్న దశాబ్దం క్రితం నాటి ఆలోచనకు కొన్ని అదనపు హంగులను కూడా చేర్చాలనుకుంటున్న ప్రభుత్వం దానిని ఆచరణ సాధ్యం చేయడానికి చాలా అవరోధాలు అధిగమించవలసి ఉంది. ఇక, అసలు లక్ష్యానికి ప్రాధాన్యం తగ్గి అదనపు అంశాలకు ప్రాధాన్యం పెరిగే ప్రమాదం లేకుండా కూడా చూడటం ముఖ్యం.
|