|
అరవై పుటల కాలపత్రికలో
పుట తిప్పినప్పుడల్లా
ప్రకృతిలో పరవశం ప్రసవిస్తుంది
పండుటాకు రాలిన ప్రతిసారీ
కొత్త చివురు మొలుస్తూనే ఉంది.
ఆకురాలటం విధ్వంసంలాగా ఉన్నా
చిగురు మొలవటం జన సృజన విస్ఫోటనమే!
దానికిష్టం లేకపోతే
మనమొక గడ్డిపరకను మొలిపించగలమా?
అన్నం పెట్టే రైతన్న కళ్ళలో మొలుస్తున్న ఆశల అడవుల్ని
ఎవరు నీళ్ళు పోసి పెంచారు?
సెలయేళ్ళులా ప్రవహించేవాళ్ళు
అడవుల్నేం కర్మ, కీకారణ్యాలనే సృష్టిస్తారు.
ఎడారుల్లో చీకటిలా వ్యాపించేవాళ్ళు,
కీకారణ్యాలై పుట్టలేరు.
నిద్రపోతున్న గింజ భూమిని చీల్చుకొని, మొక్కై పుట్టాలంటే
ఉక్కు సంకల్ప వజ్రాణువు విస్ఫోటనం చెందాలి.
మనలోపల ఎండిపోయిన నదుల్ని
మళ్ళీ గట్లు ఒరుసుకొంటూ ప్రవహింప చేసే
కుండపోత వాన
మనమిక్కడ కూర్చుని కలలు కంటుంటే కురుస్తుందా?
కాళ్ళారజాపుకొన్న భూదేవికి
సారెపెట్టి, చీరకట్టే సోదరులు నీరసిస్తే
పంటేం పండుతుంది? కడుపేం నిండుతుంది?
గుళ్ళో దేవుణ్ణి పెట్టి, గుడికి తాళం వేసే జనం
సొంత గుండె గుడి తలుపులు తెరవకపోతే
ఏం ఆరాధిస్తారు? ఏం సాధిస్తారు?
నెత్తిమీద గంపలో సద్దినీ
కొడవల్నీ మోస్తున్న తల్లి
కలుపుమొక్కల్ని పెకలించటమేకాదు
కడుపు పండిన పంటభూమి పేగునుకూడా మోస్తుంది.
వీధుల్లో తిరుగుతున్న అరుపుల ములుకులు గుచ్చుకోకపోతే
సూర్యుడు కూడా ఉదయించటానికి బద్దకిస్తాడు.
పురోగతిని నిరోధించమని
ఈ మూకలకు కేకలెవరు నేర్పారు?
ఆకలేకాదు, అసమానతలు తొలక్కపోతే
దారులన్నీ గోదారులై గంగలో కలుస్తాయి.
పంచవర్ష, పంచవర్ణ పతాకాలు
సోదరతా సూత్రంతో ఎగరకపోతే
మనిషి నిలిచే చోటెక్కడ?
మనుగడ మిగిలే రోజెప్పుడు?
మనకు తెలియటంలేదు కానీ,
మనం నిశ్శబ్దంగా చరిత్రను నిర్మిస్తున్నామనటం సత్యం.
మనం వచ్చిన తోవలో
దాన్ని నిర్మించిన శ్రామికుల
ఆరని చెమటను తొక్కివచ్చాం.
కాళ్ళు కడుక్కొనే మనం
కన్న కొడుకుల్ని కడుక్కొనేదెప్పుడు?
ప్రేమకోసం
ప్రపంచం కార్చిన కన్నీటి సముద్రాలమీద
దేశాలన్నీ తేలుతున్న తెప్పలని
మనకు తెలియొద్దూ!
చుక్కాని పట్టొద్దూ!
నిన్న ఉండేవన్న పాపానికి
నేడవసరం లేని గుదిబండలు లాగలేం!
మురికి బట్టలతో ఎంతోకాలం వేగలేం!
మెడకొక డోలు కట్టుకొని
ఎల్లప్పుడు వాయించుకొంటూ ఊరేగలేం!
వీళ్ళ పుర్రెల్లోని పుళ్ళను,
వాళ్ళ కళ్ళల్లోని కుళ్ళును
ఎంతకాలం భరించటం?
బాజాభజంత్రీలు వాయించటం?
అన్నదమ్ములు విడిపోతే నెత్తిన గుడ్డేసుకొచ్చిన అన్న
కొంప కట్టుకోవటం అనివార్యమేకదా!
అది ఇంద్రభవనమో, చంద్రభవనమో, అతని అదృష్టం.
అన్నదమ్ములు వేరైనా అమ్మానాన్నల రక్తం రంగుమారదు
ఏ జాతీ ఎల్లకాలం పరాభవం పొందదు.
బిడ్డ గుక్కపట్టి ఏడవటం
ఆకలయ్యేకాదు,
అమ్మ ఎత్తుకోలేదని కూడా.
ఏడ్చేబిడ్డనెత్తుకోని తల్లేంతల్లి?
వైరుద్ధ్యాల సమన్వయ సాధనే సమర్థత.
సమర్థులే చరిత్రను నిర్మిస్తారు
భవిష్యత్తును శాసిస్తారు.
– కొలకలూరి ఇనాక్
9440243433
(మన్మథనామసంవత్సర ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన కవి సమ్మేళనంలో
అధ్యక్షస్థానం నుంచి చదివిన కవిత)
|