ప్రామాణికము – మాండలికము – జి.ఎస్‌. రామ్మోహన్‌

ప్రామాణికము – మాండలికము – జి.ఎస్‌. రామ్మోహన్‌
కొన్ని అవసరాల కోసం వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువమంది కలుస్తున్న చోట ఎక్కువమందికి అర్థమయ్యే భాషే ప్రాచుర్యం పొందుతుంది. ‘శాస్ర్తీయ’ సంగీతంలో ఘరానాల మాదిరి ప్రత్యేకతలను కాపాడుకోవాలనుకుంటే కాపాడుకోవచ్చును కానీ దాన్ని ఆధిపత్య స్థానంలో నిలబెట్ట ప్రయత్నించరాదు. అసలు భాష అనే పరికరం లాగే దీనికి కూడా సామాజిక అవసరమే ప్రాతిపదిక.
అంచున నిలబడి మాట్లాడితే ఉండే తక్షణాకర్షణ మామూలుగా మాట్లాడితే ఉండదు. ఆకర్షణ ప్రాధమికంగా మారిన వర్తమాన సన్నివేశంలో ఏ రంగమూ దీనికి అతీతంగా మనలేకపోతున్నది. ప్రామాణికం-మాండలికం వంటి అంశాల్లోనూ ఈ పోకడ ప్రముఖంగా కనిపిస్తున్నది. ప్రామాణికానికి వ్యతిరేకమైన ధోరణి ప్రబలంగా కనిపిస్తున్నది.
బక్తిన్‌ భాషా పరంగా కార్నివాల్స్‌కు ఎలాంటి పురోగామి లక్షణాన్ని ఆపాదించారో అలాంటి పాత్రను ఇక్కడ రావిశాస్ర్తి, నామిని, అల్లం రాజయ్య వంటివారి రచనలు పోషించాయి. మాండలికం ఆ రూపంలో ఆ మేరకు తన పాత్రను నెరవేర్చింది. అంతమాత్రాన ప్రామాణిక భాష దానికది విలన్‌ అయిపోదు.
మాండలికం అందంగా ఉంటుంది. కాకపోతే అందం లాగే అందమైనవీ శాశ్వతాలు కావు. మార్పుకు అతీతం కావు. ఆ మాట కొస్తే ఆ అందం కూడా మనం భావనాత్మకంగా ఏర్పరుచుకున్నది మాత్రమే. అది స్థిరంగా ఉండదు. కాలంతో పాటు ప్రయాణిస్తుంది. రాజ్‌కపూర్‌ కాలంనుంచి రణబీర్‌ కపూర్‌ కాలానికి అందం మారిపోలేదా! భాష కూడా అంతే. మాండలికంలో సాహిత్యం రాయడం దానికదిగా గొప్పచేసి మాట్లాడే ధోరణి ఇటీవల పెరిగిపోయింది. అందులో రాయకపోతే గొప్ప రచన కాలేదేమోనన్న భయం రచయితల్లో కలిగించేంతగా పెరిగిపోయింది. ఇది రచయితల మీద అనవసరమైన భారం మోపుతోంది. ఈ రచనకు మాండలికం అవసరం అని రచయిత అనుకొని రాయడం వేరు. మాండలికం రాయకపోతే గుర్తింపు పొందదేమో అనుకోవడం వేరు. రెండో రకమైన వత్తిడి ఇపుడు సాహిత్య ఆవ రణంలో కనిపిస్తోంది.
తెలుగులో వాడుకభాష కోసం ఉద్యమించినవారు తొల్దొలుత శిష్ట వ్యావహారికాన్ని ఆశ్రయించారు. దానికి పత్రికలను సాధనంగా మల్చుకున్నారు. శ్రీపాద వారి ఉద్యమ వేదిక ప్రబుద్ధాంధ్ర మొదలుకుని ఆంధ్రపత్రిక, కృష్ణా వరకు అనేక పత్రికలు తొలిదశలో దీనికి వేదికైనాయి. గురజాడ, గిడుగు, శ్రీపాద వంటి వారి కృషి ఉన్నది. అది ఆనాటి అవసరం. ఆ నాటికి అది పురోగామి అంశమే. నాగార్జున సాగర్‌, శ్రీశైలం నిర్మాణం జరక్కమునుపే శిష్ట వ్యావ హారికాన్ని ప్రామాణికంగా తీసుకున్నారని దాని కొనసాగింపే ఇవాళ మీడియాలో చూస్తున్న భాష అని గుర్తుంచుకోవాలి. ‘‘ఇప్పడు మహాపండితులైన బ్రాహ్మ ణులు మొదలుకుని కుటుంబ వ్యవహారాలు సరిపెట్టుకోవడానికి చాలిన ఏ కొద్ది మాటలు మాత్రమో బోధపర్చుకోగల నిమ్న జాతీయుని దాకా అందరూ అచిర కాలంలోనే నిమిషాల మీద విజ్ఞానవంతులు కావాలి…….అది పత్రికల వల్లనే సాధ్యమవుతాయి..’’ అన్న శ్రీపాద వారి సంపాదక వ్యాఖ్య విప్లవాత్మకమని భావించే రోజులు కాబట్టి ఆ ప్రామాణిక భాష మీద పరోక్షంగానైనా కులప్రభావం ఉన్నంతగా ప్రాంతీయ ప్రభావం ఉందనుకోలేము. సాహిత్యంపైనా దాని ప్రభావం బలంగానే ఉండింది. మాండలిక రచనలు అందులోని శిష్టత్వపు ఆధిపత్యాన్ని తీసేసి వర్కింగ్‌ క్లాస్‌ పలుకుబడులను వేదికనెక్కించాయి. బక్తిన్‌ భాషా పరంగా కార్నివాల్స్‌కు ఎలాంటి పురోగామి లక్షణాన్ని ఆపాదించారో అలాం టి పాత్రను ఇక్కడ రావిశాస్ర్తి, నామిని, అల్లం రాజయ్య వంటివారి రచనలు పోషించాయి. మాండలికం ఆ రూపంలో ఆ మేరకు తన పాత్రను నెరవేర్చింది. అంతమాత్రాన ప్రామాణిక భాష దానికది విలన్‌ అయిపోదు. ప్రామాణికము, మాండలికం రెండూ రైలు పట్టాల్లాగా విడివిడిగా ముందుకు సాగవు. జంక్షన్లలో కలిసినట్టుగా కలుస్తూ విడిపోతూ పరస్పరం ప్రభావితమవుతూ ఉంటాయి. ప్రజాస్వామికమవుతూ ఉంటాయి. తెలుగులో ప్రామాణిక భాష అనేదొకటి ఉన్నదా అని మరీ కడుపు చించుకోకుండా సాధారణ భాష అనుకుంటున్నదాన్నే ప్రామాణికం అని కనుక అనుకుంటే ఇవాళ వాడుతున్న ప్రామాణిక భాష గతం లో అదే పేరుతో కొనసాగిన భాష ఒక్కటి కావని సులభంగానే అర్థమవుతుంది. ప్రయత్నపూర్వకమైన సాహిత్యాన్ని పక్కనబెడితే నిత్య వ్యావహారికంలో ప్రామాణిక భాష అవసరం ఎక్కువ. ముఖ్యంగా పట్టణ జీవనంలో.
బాధిత దృక్కోణం నుంచి వేదికనెక్కే చాలా భావనలు అప్పటికి ఆధిక్యంలో ఉన్న ప్రమాణాలను సవాల్‌ చేయడానికి అవే ఆధిపత్య పదజాలాన్ని ఆశ్రయించడం, మాదే విశిష్టమైనది అనే వాదనను ముందుకు తేవడం చూస్తూ ఉంటాం. అది ఆ భావోద్వేగంలో చేసే పని తప్ప అందులో వాస్తవముండదు. ఏదీ విశిష్టమైనది కానక్కర్లేదు. మాండలికమైనా, భాషైనా. దేశ భాషలందు తెలుగు లెస్‌ కాకూడదు అనుకోవడం వరకూ అర్థం చేసుకోవచ్చు. కానీ లెస్స ఎందుకు కావలె? సమానమైనది, భిన్నమైనదనే పదజాలం ప్రజాస్వామికమైనది. విశిష్టమైనది, లెస్సైనది అనేవి ఆధిపత్యపరిభాష. మాండలికాలు వ్యాప్తి చెందక ముందు ’సాధారణ’ భాషలో రాయడమే ప్రామాణికంగా ఉన్న రోజున దాని ఆధిపత్యాన్ని సవాల్‌ చేయడానికి మాండలికానికి విలువల్ని ఆపాదించుకుంటూ పోతాం. ఆ తర్వాత అది ఇంతింతై వటుడింతై మన నెత్తిన మూడో పాదం మోపే స్థాయికి చేరుకుంటుంది. ఇపుడు అదే జరుగుతోంది. చివరకు భాషలో పలికే అన్ని ధ్వనులను లిపిలోకి తర్జుమా చేయడానికి వీరమాండలిక వాదులు ప్రయత్నిస్తున్నారు. ధ్వని ప్రాధమికమని, లిపి కేవలం దానికి సంకేతప్రాయమైన ద్వితీయ రూపం మాత్రమేనని మర్చిపోతున్నారు. భాష ప్రాధమికంగా వాగ్రూపం. ఆది యందు వాక్యము లేదు. శబ్దమే ఉన్నది. సంజ్ఞలు కూడా ఉన్నవి. స్థూలంగా శరీరభాష, శబ్ద రూపము కలగలిసిన వ్యక్తీకరణ రూపమే భాష. ఒక భాషా శాస్త్రవేత్త సైన్స్‌ ఆఫ్‌ సైన్స్‌(ఖిఛిజ్ఛీుఽఛ్ఛి ౌజ ఖిజీజుఽట) అన్నారు. తర్వాత వాళ్లు ఆధిపత్యం పాత్రను విశ్లేషించడంలో భాగంగా ‘ప్రొడక్షన్‌ ఆఫ్‌ మీనింగ్‌’ అంటూ చర్చను ఎంత దూరం తీసికెళ్లినా భాషకున్న ప్రాధమిక రూపాన్ని అయితే ధిక్కరించలేరు.
తమ తమ ప్రాంతాల్లో మాండలికాలు కరిగి పోతున్నాయని వగచేవారిని అయితే ఏంటి అని అడిగే వారు కరువైపోయారు. వాస్తవానికి వారి ఏడుపు మాండలిక ధ్వనులు పోయినవని కాదు. పాత సాధనాలు, వాటికి సంబంధించిన రాతలు పోయినవని. ఏది పోయినా ఏడవడమే. అటక పోయింది, అటకమీద ఉట్టిపోయింది. ఉట్టిలో సట్టిపోయింది. సట్టిలో పుల్నీరు పోయింది. కట్టెల పొయ్యిపోయింది. పొయ్యిపక్కనే పొంతబాన బోయింది. ఏమిరా నాయనా పోతే. అంతకంటే మెరుగైనదేదో రాబట్టే కదరా నాయనా అవి పోయినవి. ప్రయో జనము అంతరించిన సాధనములు పోవును. నీవు వాడని వాటికి నీకు అవసరం లేనివాటికి పోయినాయని వగచడమేమిట్రా నాయనా అనడానికి ఇంకా ఎక్కడో బెరుకు! పోయే ప్రతిదాని మీదా ఏడ్చేవాళ్లకు ఆంగ్లంలో ఒక పేరున్నది. కన్స ర్వేటివ్స్‌ అందురు. తెలుగులో మాత్రం పురోగామి ముసుగులోనే సంచరించు చున్నారు. అలాగని ప్రతి వేలంవెర్రి వయ్యారాన్ని ఆహ్వానించమని కాదు. కొంతమంది యాంకర్లు, రేడియో జాకీలకు కొట్టారు, తిట్టారు అనే చిన్నపదాలు కూడా పలకడం కూడా రాదు. అన్నింటికి చెట్టాపట్టాల ధ్వనే. తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు డబ్బింగ్‌లో బాగా పాపులర్‌ అయిన ఒక వనిత ఉచ్చారణలో తెలుగుదనం అస్సలే మాత్రం కనిపించదు. వ్యవహారికంలో భాగంగా ధ్వనినుంచి నుంచి ఉచ్చారణను నేర్చుకోకుండా లిపినుంచి అర్థం చేసుకోవడం వల్ల వచ్చిన తిప్పలవి. అది సామాజిక అవసరం కాదు. ఆ పరిణామాల్లో భాగంగా వచ్చిన మార్పు కాదు. పిడికెడు మంది అశక్తత, అజ్ఞానం అందలమెక్కడం వల్ల కనిపిస్తున్న వికృత రూపం మాత్రమే. ప్రతి మార్పును శాస్ర్తీయమైన పద్ధతిలో చూడాలి. ఇరానీ చాయ్‌ దుకాణాలు అంతరిస్తూ ఉండడాన్ని హైదరాబాద్లో రియల్‌ ఎస్టేట్‌ వాల్యూ పెరగడంలో భాగంగా, మనుషుల సమయపాలనలో వచ్చిన మార్పుల్లో భాగంగా చూస్తామా లేక కేవలం సాంస్కృతిక దాడిగా చూస్తామా అనేది నీ దృక్కోణం మీద ఆధారపడి ఉంటుంది. రాడికల్‌గా కనిపించడం కోసం మాట్లాడతామా నిజంగా రాడికల్‌గా ఆలోచిస్తామా అనేదాన్ని బట్టి ఉంటుంది. భౌతిక పరికరాల విషయంలోనే కాదు, సాంస్కృతిక పరికరాల విషయంలో కూడా మార్పు తథ్యం. భాషలోనూ మాండలికాల్లోనూ ఉచ్చారణల్లోనూ మార్పు వస్తుంది. కాకపోతే భౌతిక పరికరాలలో వచ్చినంత వేగంగా కనిపించదు. నెమ్మదిగా జరుగుతుంది.
మనుషులు తమ అవసరాల కోసం వలసలు పోతూ ఉంటారు. వలస అనేది లేకపోతే మానవ పురోగతే లేదు. కోట్లు సంపాదించే వలసా, కూడు సంపా దించుకునే వలసా అని దీర్ఘాలు తీసి స్ఫూర్తి విషయంలో మొత్తంగా వలసలకే వ్యతిరేకంగా మాట్లాడనక్కర్లేదు. కూడు సంపాదించుకునే వాళ్లకే వలసలు ఎక్కువగా అవసరం. ఇప్పుడున్న సమాజంలో వలసలెక్కువ. ప్రయాణాలెక్కువ. మనుషుల కలయికలెక్కువ. వేలఏళ్లుగా చలనం లేకుండా గడ్డకట్టుకుని పోయిన రూపంలోనే ఇపుడు సమాజం లేదు. అవసరాలకోసం నిరంతరం ప్రవహిస్తున్నది. సామాజిక, వైయక్తిక అవసరాల కోసం మనుషులు పెద్ద ఎత్తున కలుస్తున్నపుడు భాషలో కూడా ఒకరకమైన సాధారణ రూపం ఏర్పడుతుంది. ఏకశిలా సదృశ్యం చేస్తున్నారు, వైవిధ్యాన్ని చంపేస్తున్నారు అని ఓ బాధ పడిపోనక్కర్లేదు. భిన్నత్వం భిన్నత్వం కోసం కాదుకదా! అవసరమైన భిన్నత్వం మిగులుతుంది. అంతరించా ల్సిందేదో అదే అంతరిస్తుంది. దైనందిన వ్యవహారాల్లో భాష అప్రయత్నంగా అర్థం కావడం అవసరం. ప్రయత్నంతో కూడిన సాహిత్యం కథ వేరే.
కొన్ని అవసరాల కోసం వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువమంది కలుస్తున్న చోట ఎక్కువమందికి అర్థమయ్యే భాషే ప్రాచుర్యం పొందుతుంది. ‘శాస్ర్తీయ’ సంగీతంలో ఘరానాల మాదిరి ప్రత్యేకతలను కాపాడుకోవాలనుకుంటే కాపాడుకోవచ్చును కానీ దాన్ని ఆధిపత్య స్థానంలో నిలబెట్ట ప్రయత్నించరాదు. అసలు భాష అనే పరికరం లాగే దీనికి కూడా సామాజిక అవసరమే ప్రాతిపదిక. ఏర్పడతది అనే వారికి కూడా కనిపిస్తుంది అనేది అర్థమైనపుడు కనిపిస్తుంది అనేదే మిగులుతుంది. సొమ్మలు, బేపి అనేవారికి కూడా ఆవులు, కుక్క అనేవి అర్థమవుతున్నపుడు ఎక్కువ ఏది అర్థమవుతున్నదో అదే వ్యావ హారికంలో మిగులుతుంది. ‘లెక్కియ్యక పోతే మెట్టుతో గొడ్త నా బట్టా’ అంటే అందంగానే ఉండొచ్చు. కానీ లెక్క బదులు డబ్బు, మెట్టు బదులు చెప్పు ఎక్కువమందికి అర్థమవుతున్నపుడు అవే మిగులుతాయి. అందులో బాధపడాల్సిందేమీ లేదు. అందరికీ అర్థం కావడం అనేదాంట్లో కూడా ఆధిపత్య రాజకీయాలు లేవా, మీడియా పాత్ర లేదా అని ప్రశ్నించొచ్చు. అవన్నీ పాక్షికంగా సత్యాలే. ఇవన్నీ చర్చించాల్సిన అంశాలే కానీ మొత్తంగా పిడుక్కీ బియ్యానికీ ఒకటే సూత్రం అంటే కుదరదు. బలవంతుల ప్రభావం భాషపై కూడా ఉంటుం దన్న జనరల్‌ సూత్రం కొంతవరకు వాస్తవమే కానీ వారి భాషే ప్రామాణి కమవుతుంది అనే బండ సూత్రీకరణ అంతిమ సత్యం ఏమీ కాదు. అదే నిజమైతే ఆ ఆధిపత్య ప్రాంతం వారి ‘ఎదర’ వారి ఎదరే ఎందుకు ఉండి పోయింది. మనందరిలో ఎందుకు భాగం కాలేకపోయింది? వారి ఎనకమాల వారి ఎనకమాలే ఎందుకు ఉండిపోయింది? వాస్తవానికి వారు మాట్లాడే పద్ధతి ఇవాళ సాధారణ భాషగా సాహిత్యంలో రాస్తున్న పద్ధతి ఒకటి కాదు. రాజకీయ కోపాన్ని మనం భాషలోకి తెచ్చి చాలా సార్లు అలాంటి తీర్మానాలు చేసేస్తుంటాం.
టీవీ ఇంటర్‌నెట్‌ శకం తర్వాత అన్నీ అందరూ పంచుకుంటున్న తరుణాన మన ప్రాంతానికే ప్రత్యేకమైనదేదో మార్పు లేకుండా యథాతథంగా మిగులుతుందనుకోవడం, మిగలాలనుకోవడం అచారిత్రకమైన ఆశావాదం కూడా కాదు, అనవసరమైన ఆశావాదం. తిండీ తిప్పలు, ఆటా పాటా, మొబైళ్లు, బీర్లు, బార్లు అన్నీ ఒకటైపోవాల. భాష ఒక్కటి అలాగే నిలిచిఉండాలంటే ఎలా! ఒకనాటి కోయిలకుంట్ల, జమ్మికుంట్లలో తిండితిప్పలు, ఆచారవ్యవహారాలు ఇవాళ ఉన్నట్టు లేవు. మనకు సుఖంగా అనిపించినవి, అవసరమనిపించినవి మార్చుకుంటూ వస్తున్నాం. అందులో మార్పు ఉన్నదని సైలెంట్‌గా మర్చిపోతున్నాం. కానీ భాష గురించి మాత్రం బాధపడిపోతూ ఉంటాం.
ఒకనాడు కొన్ని ప్రాంతాలను కొన్ని మాండలికాలను కళారూపాల్లో కించపరుస్తున్నారని భావించడం వల్ల ఆయా మాండలికాలకు మద్దతుగా మాట్లాడడం అవసరమై ఉండొచ్చు. ఆ మాటకొస్తే తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర మాండలికాలను పనికట్టుకుని అవమానపరిచే సన్నివేశాలు చాలా సినిమాల్లో ఉన్నాయి. అందులో పెట్టుబడితో పాటు వచ్చి చేరిన ఆధిపత్య భావ జాలంతో పాటు దేన్నైనా కేరికేచరింగ్‌ చేసే తెలుగు సినిమా థర్డ్‌ రేట్‌ ధోరణి కూడా కలగలసి ఉన్నది. ఇవన్నీ చర్చించొచ్చు. ఆ ఆవేదనతో కాళోజీ లాంటి వారు రెండున్నర జిల్లాల భాష అనేదాన్ని నిందావాచకం చేసి ఉండొచ్చు. ప్రాంతీయ ఉద్యమాల్లో దాని పాత్ర అది పోషించి ఉండొచ్చును. అదొక రాజకీయ అవసరం అయి ఉండవచ్చును. దాన్ని ఆ పరిమితుల్లో చూడాలి తప్పితే సర్వకాల సర్వావస్థలయందునూ వర్తించే శాశ్వతసత్యంగా భావించరాదు. ఇవాళ నగరాల్లో పట్టణాల్లో వాడుతున్న భాష ఏ ప్రాంతానిదీ కాదు. అన్నీ కలిసిపోయి కరప్ట్‌ అయిపోయింది సార్‌ నా భాష అని నిందార్థంలో వాడుతుంటాం. అది సరదాగా అయితే ఓకె అనుకోవచ్చును కానీ, వాస్తవానికి అది కరప్ట్‌ కావడమేమీ లేదు. విభిన్న ప్రాంతాలనుంచి ఎక్కువమంది పనుల నిమిత్తం పోగయ్యే చోట అందరికీ సులభంగా అర్థమయ్యేదేదో రూపొందుతుంది. అందులో లేశమాత్రం కించపడాల్సిందేమీ లేదు. గ్రామాల్లో కూడా పనుల కోసం వేర్వేరు చోట్లకు వెళ్లాల్సినవారికీ, సోషల్‌ లైఫ్‌ తక్కువగా ఉండి చలనం కరవైన వారికీ భాషలో తేడా తెలుస్తుంది. ఇది ఏ ప్రాంతానికీ పరిమితం కాదు. అందరికీ వర్తిస్తుంది. వాస్తవానికి తెలుగునాట ప్రామాణిక భాష కోసం ఇంతవరకూ నిర్దుష్టమైన కృషి జరగలేదు. పత్రికల ద్వారా ప్రాచుర్యం పొందిన సాధారణ భాషనే ప్రామాణిక భాషగా భావిస్తూ వస్తున్నాం. ‘‘అన్ని సీమల పలుకుబళ్లూ, బోధపరుచుకుని అన్ని సీమల జీవశక్తీ పూడ్చుకుని స్వస్వరూప జ్ఞానంతో ధృఢంగా నిలవగల భాష’’ కోసం 80 యేళ్ల క్రితం మన పూర్వీకులు కన్న కల ఇవాల్టికీ తీరలేదు. ఆ అవసరమైతే మునుపెన్నటికంటే ఎక్కువగా ఉన్నది.
జి.ఎస్‌. రామ్మోహన్‌

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.