పిడికెడు పద్యాలు పట్టెడు ప్రసాదం

పిడికెడు పద్యాలు పట్టెడు ప్రసాదం
 
‘భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు’ అన్నాడు ప్రజాకవి వేమన. ఈ అద్భుతమైన పద్యభావాన్ని చాలా మంది ఈ చెవితో విని…. ఆ చెవిలో వదిలేశారు. కానీ… తుంగ సోమేశ్వరమ్మ మాత్రం ఈ అక్షర సత్యాన్ని ‘అరచేతులారా’ భక్తితో ఆచరిస్తోంది. దశాబ్ద కాలంగా ప్రజాకవి యోగి వేమన సమాధి వద్ద నిత్యదీపారాధనలో… భక్తుల సేవలో తరిస్తోంది. అనంతపురం జిల్లా కదిరి తాలూకా గాండ్లపెంట మండలం కఠారు పల్లిలో ఉన్న వేమన జీవసమాధి వద్ద సోమేశ్వరమ్మ ప్రస్తుతం మహిళా అర్చకురాలిగా అంకితమైంది…
‘‘దాదాపు 150 ఏళ్ల క్రితం వేమన రాయలసీమ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారని మా పూర్వీకులు చెబుతారు. ఊరూరూ తిరుగుతూ మూఢాచారాలు, కుటుంబ విలువలు, విగ్రహారాధన, కులతత్వం వంటి అంశాలపై ప్రజలను తన పద్యాల ద్వారా చైతన్యపరిచారు ఆ మహానుభావుడు. ఎక్కడికి వెళ్లినా సందర్బానుసారంగా ఆశువుగా పద్యాలు చెప్పి అందరినీ మెప్పించిన వేమారెడ్డి (వేమన) గారి వంశంలో పుట్టడం మా అదృష్టం. ఈ తరంలో వసంతరెడ్డి, వేమారెడ్డి, చండ్రాయుడు, వేమారెడ్డి, నాగిరెడ్డి, అయ్యవారు మొదలైన మూడు కుటుంబాలకు చెందినవారు ప్రధానంగా ఉన్నారు. నా భర్తపేరు వేమారెడ్డి. మాకు సంతానం లేదు. వేమన సమాధికి సమీపంలోనే ఉంది మా ఇల్లు. ఆలయంలోనే పూజలు చేస్తూ, భక్తులకు వేమన తత్త్వాన్ని చెబుతూ కాలం గడుపుతున్నాను. స్వామి సన్నిధిలో సేవలందిస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది.
పౌర్ణమి నుంచీ.. పౌర్ణమి వరకు..
మా మూడు కుటుంబాల్లోని వాళ్లందరం వంతులవారిగా వేమన సమాధి వద్ద పూజలు చేస్తాం. పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు మేము అర్చన చేస్తే… ఆ తర్వాత ఇంకో కుటుంబం వారు చేస్తారు. తరతరాలుగా ఈ ఆచారం ఇలాగే కొనసాగుతోంది. మేమందరం సఖ్యతగా ఉంటూ ఏటా బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నాం. వేమన ఉత్సవాలు మాకు పెద్ద పండగ కన్నా ఎక్కువ. అందుకే అత్యంత నియమనిష్ఠలతో నిత్యం పూజలు చేస్తాం. వేమన చరిత్రను తెలిపే ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం. ఈ ఉత్సవాలకు నెల్లూరు, గుంటూరు, కడప, కర్ణాటక, చింతామణి, తమిళనాడు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు వస్తారు. ఉత్సవాలలో మహా కుంభాభిషేకం ప్రత్యేక ఆకర్షణ. ప్రతి ఆదివారం మాంసం వండి సమాధి వద్ద కొలువు చేస్తాం. ఇది మా సంప్రదాయం. ప్రతీ ఉదయం మంగళవాయిద్యాలతో స్వామిని కీర్తిస్తూ కీర్తనలు, పద్యాలు పాడతాం. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు భక్తులకు పంచి పెడతాం.
నిత్య దీపారాధన.. పవిత్రంగా పూజలు..
రోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేచి స్నానాదులు ముగించి దీపారాధన చేస్తాను. ప్రత్యేక అర్చనలు చేసి.. గ్రామస్తులు, సందర్శకులకు తీర్థప్రసాదాలు అందజేస్తాను. ఇవన్నీ చాలా పవిత్రంగా జరిగే పూజా కార్యక్రమాలు. ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచుతాను. నా భర్త గుర్రాలకు కడుపునిండా దాణా పెట్టి ఆలయానికి వస్తాడు. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్లి వంటపనులుపూర్తీ చేస్తాను. ఉదయం నుంచీ సాయంత్రం దాకా గుడి పక్కనే టెంకాయ, తాంబూలాలు, వేమన సాహిత్య పుస్తకాలను విక్రయిస్తాం. వీటితో పాటు హారతి పళ్లెంలో భక్తులు వేసిన కానుకలే మాకు జీవనాధారం.
వేమన నడయాడిన నేలపై నిత్య కరువు..
గొప్ప దార్శనికుడుగా పేరుగాంచిన వేమన నడయాడిన నేల ఇప్పుడు భయంకరమైన కరువుతో తల్లడిల్లిపోతోంది. ఆ మహానుభావుడి సమాధి వద్ద.. ఆలయ ప్రాంగణంలో కనీసం తాగడానికి మంచినీళ్లూ కూడా దొరకవు. బోర్లన్నీ ఎండిపోయాయి. వానలులేక వ్యవసాయ భూములన్నీ బీళ్లుగా మారాయి. మాకు కొంత సేద్యం భూమి ఉంది. గతంలో కొంత పంట పండేది. కొన్నేళ్లుగా అదీ లేదు. ఇప్పుడు నాకూ, నా భర్తకూ ఆలయంలోని చిరువ్యాపారంతోనే జీవనోపాధి.
భక్తుల ఆకలి తీరుస్తున్నాం..
కఠారుపల్లెకు వచ్చే పేద భక్తులకు మా ఇంట్లోనే ఆతిథ్యం ఇస్తున్నాము. మేం వండుకున్న దాంట్లోనే వారికీ పెడతాం. భక్తుల ఆకలి తీర్చడంలో చాలా సంతృప్తి ఉంటుంది. మాకు పిల్లలు లేరన్న బాధను మరచిపోవడానికే భక్తులకు, పేద పిల్లలకు వంటలు వండి పెడుతున్నాను. ఆలయ ప్రాంగణంలోని గర్భగుడిని తరతరాలుగా పవిత్రంగా కాపాడుకుంటూ వస్తున్నాం. చారిత్రక ఆనవాలు దెబ్బతినకుండా సహజత్వానికి భంగం కలగకుండా సమాధిని, పరిసరాల్ని రక్షించుకుంటున్నాం. అందుకే ప్రభుత్వం అడిగినా గర్భగుడిని పర్యాటక శాఖకు అప్పగించలేదు. ఆలయం బయటి ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయడం ఆనందంగా ఉంది. క్యాంటీన్‌, కాటేజీలు, పార్కు, రెస్టారెంట్‌, ఇలా మంచి వసతులు కల్పించారు. కానీ ఆలయంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు ఆలయంలో కళ్యాణకట్ట, వంటగది నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలి.
వేమన జీవితాన్ని వివరిస్తున్నా…
వేమన పూర్వాశ్రమంలో అల్లరిచిల్లరిగా తిరిగినా.. ఆ తర్వాత జ్ఞానబోధ పొందిన తర్వాత ఇహాపర సుఖాలపట్ల విరక్తి చెందాడు. మానవులకు అసలైన జ్ఞానాన్ని, ఆనందాన్ని పంచడం కోసం ఎన్నో ప్రాంతాల్లో పర్యటించారు. అలా రాయలసీమ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతం ఆయనకు బాగా నచ్చినందున కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని అణువణువూ ఆయనకు తెలుసునని చాలా మంది పెద్దలు చెబుతారు. వేమన వంటి మహాతాత్త్వికుడు అనంతలో జీవసమాధి పొందడం ఈ ప్రాంతవాసులుగా మేం చేసుకున్న అదృష్టం. అందులోనూ వారి వంశస్తురాలినైనందుకు నా జన్మధన్యమైందని భావిస్తున్నాను. నాకన్నా ముందు ఇక్కడ ఒక అవ్వ పూజలు చేసేది. కొన్నేళ్ల క్రితం ఆమె చనిపోయింది. అందుకే వేమన జీవితసారాన్ని, భావజాలాన్ని పుస్తకాల ద్వారా చదివి, మా పూర్వీకుల ద్వారా విని… ఆ…. విశేషాలను సందర్శకులకు నాకు తెలిసిన మేరకు వివరిస్తున్నాను. భవిష్యత్తులో కఠారుపల్లె ప్రపంచ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని నా నమ్మకం. ఇదే నా ఆకాంక్ష కూడా!
వేమన పూర్వాశ్రమంలో అల్లరిచిల్లరిగా తిరిగినా.. ఆ తర్వాత జ్ఞానబోధ పొందిన తర్వాత ఇహాపర సుఖాలపట్ల విరక్తి చెందాడు. మానవులకు అసలైన జ్ఞానాన్ని, ఆనందాన్ని పంచడం కోసం ఎన్నో ప్రాంతాల్లో పర్యటించారు. అలా రాయలసీమ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతం ఆయనకు బాగా నచ్చినందున కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని అణువణువూ ఆయనకు తెలుసునని చాలా మంది పెద్దలు చెబుతారు. వేమన వంటి మహాతాత్త్వికుడు అనంతలో జీవసమాధి పొందడం ఈ ప్రాంతవాసులుగా మేం చేసుకున్న అదృష్టం. అందులోనూ వారి వంశస్తురాలినైనందుకు నా జన్మధన్యమైందని భావిస్తున్నాను.
డాక్టర్‌ ఉద్దండం చంద్రశేఖర్‌, అనంతపురం
ఫోటోలు : అమరనాథ్‌, గాండ్లపెంట

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.