”అసదృశ మందహాసం -సమాదర చిత్తం -విశ్వ జనీనత కల కవితా ప్రసాద్”

 ”అసదృశ మందహాసం -సమాదర చిత్తం -విశ్వ జనీనత కల   కవితా ప్రసాద్” 

కవితాప్రసాద్ కవితా విహారం

వచన కవితా విహారం

పద్యమైనా ,వచనకవిత్వమైనా ఆయనకు నల్లేరు పై బండీ నడకే .రెండిటిలోనూ తనప్రత్యేకత చూపి కవితా శిఖరారోహణం చేసిన నిత్య పదికుడు .కొన్ని కవితా నిర్వచనాలు అనితర సాధ్యం గా చేశాడు .కన్నీరు కు అందరూ అనేక రకాలుగా నిర్వచిస్తే కవితాప్రసాద్ ‘’కాల పరీక్ష నాళిక లోకి –కళ్ళు వొంపుతున్న ‘’మనస్సల్ఫ్యూరికామ్లం ‘’అన్నాడు కవిత్వానికి శాస్త్రీయతను అద్దుతూ .మనషి మనస్తత్వాన్నీ అంతే గొప్పగా చెప్పాడు ‘’మనిషి ఒక వస్తువు –మనిషి మహా వ్యాపరం –మనస్సోక మరణ శాసనం ‘’అన్నాడు వ్యాపార ధోరణికి ,విపణి వీధికి మనిషికి ఉన్న సంబంధాన్ని మహా గొప్పగా చెప్పిన మాటలివి . తనను ‘’తెల్లకాగితం ‘’తో పోల్చుకుంటూ ‘నన్ను తనపైకి అనువది౦చుకొనే కవయిత్రి తెల్లకాగితం ‘’అన్నాడు ఇంకొంచెం ముందుకు వెళ్లి ‘’అది నామనసు –దానిపై పద్యమై శయనిస్తాను .-అక్షర సరస్సు నై వికసిస్తాను ‘’అన్నాడు భావ గర్భితంగా .ఆధునికులకేమాత్రం తీసిపోని కవితా ధోరణి ఇందులో కనిపిస్తుంది .ఏ ప్రక్రియ అయినా దాన్ని తన అవక్ర కవితాపరాక్రమ  ప్రక్రుతి తో  సామర్ధ్యం తో తీర్చిదిద్దగలిగే కవితాత్మ ఆయన సొత్తు .అక్షరాలకు ఏమీ తెలియదని చమత్కరిస్తూ ‘’ఎక్కడో ఒక్కడు  నోబెల్ ప్రైజ్ తెచ్చుకుంటాడు –ఇది చదివి ఇంకోడు గుండె పగిలి చస్తాడు .-అక్షరాలకి ఈ రెండు సంఘటనలూ తెలియవు ‘’అన్నాడు .తిట్టినా ,పొగిడినా వాటికి ఆ తిట్టినవాడూ పొగడిన వాడూ కూడా తెలియదన్నాడు –‘’నువ్వు నన్ను తిడుతున్నా –నిన్ను నేను పొగుడు తున్నా –తిట్లకు ,పొగడ్తలకు –మనమెవ్వరో తెలీదు ‘’అన్నాడు .

తనజీవితాన్ని’’ నీటిపై పడవ’’గా అభి వర్ణించు కొంటూ ‘’ఆశల ఇంద్ర ధనుః పతాకతో –నదికన్నా వేగం గా –గమ్యం వైపుకు దూసుకు పోతోంది నా పడవ –ప్రతి అలా ప్రశ్నార్ధకం గా మారి పోతోంది –ప్రతి కలా ఆశ్చర్యార్ధకం గా రాలి పోతోంది –ఇక నా పడవే తీర రేఖ –నా పాలిటి కాల శాఖ ‘’అన్నాడు ఇందులో ఒక నిర్వేదం ఉంది .తన మృత్యువును ముందే చూసుకోన్నాడా అనే అనుమానం మనకు వస్తుంది .

గ్రంధ ముఖి లో లక్ష పద్యార్చన

‘’ ఫేస్ బుక్ ‘’ను ..గ్రంధ ముఖి ‘’అని కాయినేజ్ చేశాడు .అద్భుతమైన నిర్వచనం .అందులోనూ తన ప్రయోగాలు కొన సాగించాడు. సెల్లు తో సొల్లు కబుర్లు చెప్పే మనందరికీ కనువిప్పు కల్గించాడు కవితా ప్రసాద్ –గ్రంధ ముఖిలో ‘’లక్ష పద్యార్చన ‘’చేయాలని సంకల్పించుకొన్నాడు అదీ 27-2-2014 శివరాత్రి పుణ్య దినాన .అందులో తనకు ప్రశ్నలు సంధించమని కోరాడు . సమస్య ,దత్తపది ,వర్ణన ,అనువాదం ,అప్రస్తుత ప్రశంశ అనే అయిదు అంశాలు ఎన్నుకొన్నాడు .వీటిపై ప్రశ్నలు పంపమని కోరాడు .ఆ ప్రశ్నలుకూడా మానవులకు ఉపయోగ పడేవిగా ,సమకాలీనతకు ప్రతి బింబం గా ,విజ్ఞానం ,ఉత్తమ సంస్కృతీ నిర్మాణ పరం గా ఉండాలని గొప్ప నిబద్ధత పాటించాడు .ఉదాత్త ఆశయానికి సముదాత్త ప్రక్రియ అయింది ఇది .దటీజ్ కవితా ప్రసాద్ –ఆ పద్య మహా యజ్ఞం ఎలా నిర్వహించాలని భావి౦చాడో అందరికి తెలియజేశాడు ఫేస్ బుక్ ద్వారా –

‘’పద్యాగ్ని శిఖలతో ప్రజ్ఞా మహా యజ్న వేదికి –దివ్య హవిస్సులిడగ

రసవదమృత   పద్య రాజీవ బృందమ్ము –బ్రాహ్మికి కావ్య సరస్సు లిడగ

భూమాత హృదయమ్ము పూర్ణ  కుంభమ్మునై –శ్రీంకార రోచిస్సులిడగ’’

ఆ లక్ష పద్య యజ్ఞాన్ని నిర్వహిస్తానని ప్రతిన బూని ప్రారంభించి 1000  రోజులలో పూర్తీ చేస్తానని అన్నాడు . . దాదాపు సంవత్సరమే ఆ పద్య  సరస్వతీ నది  పారింది .ఆయన  అకాల  మరణం తో ఆగిపోయింది .

కవితాప్రసాద్ మూర్తి మత్వం

కవితా ప్రసాద్ మూర్తి మత్వాన్ని చక్కగా  వర్ణిం చాడొక కవి ‘’అసద్రుస మందహాసము –సమాదర చిత్తము –సత్కవిత్వ మున్ –విషయ వివేకమున్ –విశ్వజనీనత ‘’ఆయన లక్షణాలన్నాడు .నిజం గా ఆ గొప్ప లక్షణాలతో రాణించి వన్నెకేక్కి తనతో బాటు ఆంద్ర కవితా సరస్వతినీ దేశ విదేశాల లో ఊరేగించి చిర యశస్సు సాధించాడు .దివిజ కవి వరుల గుండియల్ డిగ్గురనగ – మన కొత్త రాజధాని అమరావతి రాక ముందే ‘’అమర పురి ‘’కి చేరాడు .అక్కడ ఇంద్ర సభలో కవితామృతం చిలికిస్తూ అమ్రుతానికే తీయదనాన్ని పవిత్రతను కల్గిస్తున్నాడేమో   !

అవ్యవవావధానం

అవధానాలు పూర్వం చాలా మంది చేశారు ఇప్పుడూ చేస్తున్నారు .కాని ప్రశ్న సంధించిన త్రుటిలోనే అంటే స్విచ్ వేస్తె బల్బు వెలగటానికి పట్టే సమయం కంటే ముందే పద్యం అందుకొనే మహా వేగం ఆయనది. దీన్నే మెరపు వేగం అంటారేమో !ఆ వేగాన్ని ఇంతవరకెవ్వరూ చూసి ఉండలేదు .ఎక్కడా యతి భంగం గతి భంగం  ప్రాసభంగం, ఔచితీభంగం సంస్క్రుతీభంగం కలగ కుండా ఆ పద్య వేగం సాగేది .దీనినేనేను ‘’అవ్యవవావధానం ‘’అన్నాను అదో చిర తపో సాధ్యమైన అమృత ఝరి .ఒక తపస్సు .అమ్మవారి అనుగ్రహం .అందులో మనం మునక లేయాల్సిందే .ఆ అనుభూతి కి లోను కావాల్సిందే .ఒక  అవధాని ప్రశ్న సంధించిన పావు గంటదాకా జిలేబీ చుట్ట రాగాలు తీసి ఏమీ తట్టక ఏదో పొడి మాటలతో ప్రారంభించి పాదం పూర్తయ్యే లోపు ఎన్నో సవరణలు చేసి మన బుర్ర తినటం చూశాం .ఒకాయన పద్య పూరణ వేగంగానే చేస్తాడు కాని ఆ పద్యం చదివే తీరు మనకే కాదు  బహుశా ఆయనకూ అర్ధం కాని రీతిలో ఉంటుంది .యువ అవధానులూ బాగానే చేస్తున్నారు .సహస్రావాదాన  సమ్రాట్టులూ ఉన్నారు .కాని పద్యం ఇంతహుందాగా ఇంత వేగం గా ,ఇంత సందర్భ శుద్ధిగా  చెప్పినవారు లేరు అంటే అతిశయోక్తి కాదు .ఎక్కడా సహనం కోల్పోవటం ఉండదు .యెంత క్లిష్ట ప్రశ్న వేసినా నవ్వుతూనే చిక్కుముడి విప్పటం ఆయనకే చెల్లింది .అప్రస్తుతం యెంత అప్రస్తుతం అయినా సంయమనం  కోల్పోవటం ఆయన అవధాన చరిత్రలో లేనే లేదు .ఆ చిరు దరహాసమే అందరికీ వందనీయమై  శ్లాఘనీయమైంది .ఆ నవ్వులో మనకు అమ్మవారి దర్శనం కలిగిస్తాడు ..అదీ కవితా ప్రసాద్ ప్రత్యేకత .ధారణలోను ఆయనది ప్రత్యేకమైన శైలి .ధారణా రాక్షసులున్నకాలం లో వారిని మించిపోయిన ధారణా సామర్ధ్యాన్ని చూపి వారి చేతనే ప్రశంశా వర్షం లో తడిసిన’’ధారణా పరబ్రహ్మ ‘’. ధన్య జీవి కవితా ప్రసాద్ . గంటకు ౩౦౦ పద్యాలు చెప్పాలనే దాన్ని ఛాలెంజీ గా తీసుకొని  పద్య కవితాప్రవాహం పారించిన ఆశుకవితా సమ్రాట్ కవితాప్రసాద్ .పట్టు బట్టలు సంప్రదాయ బద్ధం గా కట్టి ముఖాన యెర్రని కుంకుమ బొట్టు ధరించి బాసిం పట్టు వేసి అవధానానికి కూర్చుంటే ఎన్ని గంటలైనా ఆ తీరు మారేదికాదు .వెనకా ముందూ బాలీసులు తలగడల సీన్లు ఉండవు సర్వ సాధారణ క్రియగా అదొక సరస్వతీమాత  అర్చన గా జరపటం ఆయన ప్రత్యేకత .

శతాధిక గ్రంధ రచన

అవధానాలు చేయటం తో సరి పుచ్చుకోకుండా ‘’అవధాన విద్య ఆరంభ వికాసాలు ‘’వంటి గ్రంధాలు ,అగ్నిహంస ,ఒంటరి పూల బుట్ట ,దోసిట్లో భూమండలం ,వంటి ఆధునిక భావ జాల గ్రంధాలు ,తను నిత్య౦ అర్చించే   జగన్మాతపై ‘’కాదంబినీ ‘’శతకం ,ఏడుకొందలవానిపై భక్తీ ప్రపత్తులతో చెప్పిన ‘’సప్తగిరిదామ –కలియుగ సార్వభౌమ ‘’వంటి భక్తీ శతకాలతో బాటు వందకు పైగా గ్రంధాలు రాసి సాహితీ సృష్టి లోను అద్వితీయుడని పించుకొన్నాడు ..ప్రతిభా వ్యుత్పత్తి సామర్ధ్యం ముప్పిరిగొన్న కవితా పటిమ కవితా ప్రసాద్ కున్నది

కవితా ప్రసాద్ ఎదుగుదల క్రమం

కృష్ణా జిల్లా నెమలి వేణుగోపాల స్వామి దగ్గర గంపలగూడెం సమీపం లో ‘’గానుగ పాడు ‘’లో జన్మించిన వరప్రసాద రాజు 7 వ ఏటనే పద్య రచన ప్రారంభించి 18 వ ఏట భద్రాచలం లో మొదటి  అష్టావధానం చేశాడు .నెమలి స్వామి సమక్షం లో అవధానమూ చేసి స్వామిపై శతకమూ చెప్పాడు .తర్వాత బందరులో బి ఇ డి కాలేజి లో చదివి భద్రాచలం నెల్లిపాక లో లేక్కలమేస్టారుగా పని చేశాడు .పి ఐ బి లో ఉద్యోగం పొంది ,ప్రకాశం జిల్లా డి ఎస్ .డబ్ల్యు బి .గా పని చేసి హాస్టల్ విద్యార్ధులకు ఆరాధ్య దైవమే  అయ్యాడు .తర్వాత విజిలెన్స్ డిప్యూటీ డైరెక్టర్ గా అవినీతి అధికారుల భరతం పట్టి అసెంబ్లీ చేత  ప్రశంసలు  అందుకొన్నాడు .రెసి డేన్షియల్ హైస్కూల్స్  సొసైటీ కి డిప్యూటీ డైరెక్టర్ అయ్యాడు .పిమ్మట వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ గా చేశాడు .తర్వాత ఆంద్ర రాష్ట్ర సాంస్కృతిక శాఖ కు కార్య దర్శిగా గొప్ప సేవలు అందించాడు .ఇన్ని పదవులలో ఉన్నా అవధానాలు మానలేదు .పద్యాన్ని కవిత్వాన్ని వదిలి ఉండలేదు .మరింతగా విజ్రు౦భి౦ఛి చేశాడు ..

కృష్ణా జిల్లా కవితా కళా సమ్రాట్

కవితా  ప్రసాద్ చేత తొలి శతావధానం ,ద్విశాతావధానం చేయించిన ఘనత కృష్ణా జిల్లాకే దక్కింది .ముఖ్యం గా శ్రీ రావి రంగారావు కవితాప్రసాద్ కు బి ఇ డి కాలేజి లో టీచర్ .ఆ గురు శిష్య సంబంధం కృష్ణా జిల్లాకు ఏంతో  ఉపయోగపడింది .ప్రసాద్ చేత రంగారావు గారు చేయి౦చినవే శత ,ద్విశతావదానాలు .శతావధానం బందరు లో జరిగింది .కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని సాహిత్య సంస్థలలోని సభ్యులు రంగారావు గారు ప్రుచ్చకులను గా ఎంపిక చేసి శిక్షణ నిచ్చి అవధానం అత్యద్భుతం గా జరిగేట్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు .అంటే కవి అనుకొన్న ప్రతి వాళ్ళూ ప్రుచ్చకులైనారు .సాహిత్యాభిమానం ఉన్న వారు అవధానం పై మోజున్నవారందరూ ప్రుచ్చకులైనారు .ఇది కృష్ణా జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం .ఒక రకం గా ప్రతి ఇంటా ఒక ప్రుచ్చకులున్నట్లయి౦దన్నమాట .ఇది రంగారావు గారి చొరవ కవులతో సాహిత్య సంస్థల తో ఆయనకున్న అనుబంధానికి నిదర్శన .శిష్యుడైన కవితా ప్రసాద్  కవితా సామర్ధ్యానికి బల పరీక్ష పెట్టి నిగ్గు తేల్చటం .దీనికి సహకరించిన బందరు లోని చలమల శెట్టి వంటి వారెందరో వదాన్యులు ఏంతో అభినందనీయులయ్యారు .రెండు రోజులు సాగిన ఈ అవధానం ధారణ రోజున శ్రీ ప్రసాద రాయ కులపతుల వారి సమక్షం లో జరగటం ఒక దివ్యాను భూతి. ఆయనిచ్చిన ప్రశంశలు చిర స్థాయి గా నిలిచాయి .ఇందులో నేనూ ఒక ప్రాశ్నికుడిగా ఉండటం నా అదృష్టం .కవితాప్రసాద్ గారిఅవధానం తో నాకు సంబంధం కలుగ జేసిన రావి రంగారావు గారి సౌజన్యమే ఇది .కవితా ప్రసాద్ అవధాన మరంద ధారలోతడిసి ముద్ద అయిన అనుభవం నాది .

ద్విశతావదదానం కూడా రంగారావు గారి ఆధ్వర్యం లో బెజవాడలో జరిగింది .కవితా ప్రసాద్ ధారణ  ధారణా రాక్షస బిరుదాంకితులు సహస్రావధాని శ్రీ గరిక పాటి నరసింహా రావు గారి సమక్షం లో జరగటం చిరస్మరణీయం .తెలుగు సరస్వతికున్న రెండు సూర్య చంద్ర నయనాలు వేదికపై దర్శనమివ్వటం  సాహితీ అభిమానులకు గొప్ప అనుభూతి .ఈద్విశతావధానం లో నాతో బాటు నా శ్రీమతి ప్రభావతి కూడా ప్రుచ్చకురాలవ్వటం రంగారావు గారి కి నాపై ఉన్న అభిమానం .ఆమెలాగా మరెందరో రెండు అవధానాలకు ప్రుచ్చకులయ్యారు .అదొక గొప్ప ప్రేరణ .అవధానం పై అందరికి ఆసక్తి కల్గించటం లో వేసే ముందడుగు .ఈ అవధానం లో మరీ సన్నిహితుడినయ్యాను అవధాని గారితో .అయన కేదో బిరుదునూ సెలెక్ట్ చేశాం నేనూ రంగారావు గారూ .అది ఇచ్చారో లేదో నాకు గుర్తు లేదు .ఈ సారీ కృష్ణా జిల్లా పృచ్చకులు సింహ భాగం పొందారు .ఇలా రెండు అవధానాలలో చాలా మందిని ప్రుచ్చకులను చేసిన సౌజన్యం రావి వారిదే .కనుక వీరందరూ ప్రసాద్ గారి అభిమానులైనారు .అదొక అపూర్వ సన్నివేశమే అయింది అందుకనే కృష్ణా జిల్లా వారు అవితా ప్రసాద్ గారంటే అంతటి అభిమానం చూపించటం .అందరం కృతజ్ఞతా భావం చూపించాల్సిన అవసరం కూడా ఉంది .

బహుముఖీన ప్రజ్ఞ

ఆ తర్వాత ఇతర జిల్లాల లో,రాష్ట్రాలలోవి దేశాలలో ఎన్నో అవధానాలు చేసి లబ్ధ ప్రతిష్టితులయ్యాడు కవితా ప్రసాద్ .దాదాపు 500 అవధానాలు చేసిన అవధాన ఘనాపాటి శ్రీ కవితాప్రసాద్ .ఏది చేసినా ఆయన ద్రుష్టి యువత మీదే ఉండేది .వారిని సాహిత్యం వైపు ఆకర్షించటానికి ఆయన చేసిన కృషి అనన్య సాధ్యమైంది .అవధానాలపై వారికి అవగాహన కల్పించారు .యువ ప్రుచ్చకులను ఆహ్వానించారు వారికి ట్రైనింగ్ ఇచ్చారు.ఇన్ని విశేషాలు మూర్తీభవించిన వ్యక్తీ .బహుముఖ  ప్రజ్ఞా శాలి .మూర్తీభవించిన చైతన్యం .ప్రభుత్వపదవులను అత్యంత సమర్ధత తో నిర్వహించి ప్రజలకు చేరువయ్యాడు .అవధాన ప్రక్రియ లో ఆధునికతను జోడించి ,యువతకే కాక అన్ని వయసులవారికీ దగ్గరయ్యాడు .ఒక రకం గా ‘’విశ్వం పట్ట లేనంత అవధాన సరస్వతి ‘’.అంతటి వాడు మన కృష్ణా జిల్లా వాడు కావటం మనకందరికీ గర్వకారణం .ఆయన సమకాలీనులం గా మనం ఉండటం మన అదృష్టం

ఎన్నెన్ని ప్రక్రియలో

అష్టావధాన ,నవరసావదాన ,అల౦కార అష్టావదాన ,సాహిత్య ప్రక్రియావదాన,అపూర్వ దశావదాన ,విచిత్రావదాన ,శతావధాన ద్విశతావధాన ,ఆశుకవితా ఝరి అంటే గంటకు ౩౦౦ పద్యాలు చెప్పటం ,రేడియో అవధానం ,పలకరిస్తే పద్యం లలో ఎన్నో ప్రయోగాలు చేసి అందర్నీ అప్రతిభులను చేసిన ప్రక్రియా వై విద్యం చూపిన మహా ఆలోచనా పరుడు కవితా ప్రసాద్ .కవిత అమ్మవారి చేత ప్రసాదంగా పొందిన ధన్యుడు .అందుకే అమ్మవారిపై ‘’త్రిపుర సుందరి మాకు ప్రసన్నమయ్యేడిన్ ‘’ అనే మకుటం తో ‘’కాదంబినీ ‘’శతకం రాసి అమ్మవారికి కవితా నైవేద్యం గా సమర్పించాడు .’’సప్తగిరి ధామ –కలియుగ సార్వ భౌమ ‘’మకుటం తో ‘’ ఏడు కొండల వానిపై శతకం రాసి ఆత్మ నైవేద్యం చేసిన పరమ భాగవతోత్తముడు కవితా ప్రసాద్ .ఇందులో ఒక పద్య భాగం –‘’వేయి కన్నుల వానికే యగమ్యము తాను-నీరూప తతులు ననేక మాయే ‘’ఇందులో ‘’నీరూప ‘’అనే శాబ్దిక  చమత్కారాన్ని చేశాడని –నిర్ +రూప = నీ రూప  అవుతుందని అంటే రూపమే లేనివాడు అనేక రూపాలు పొందాడని భావం అని ఆచార్య శలాక రఘునాధ శర్మ గారు విశ్లేషించి చెప్పారు .ఈ పద ప్రయోగానికి ఎంతో ఆధ్యాత్మిక అనుభూతి  భాషా వ్యాకరణాలపై పట్టూ ఉంటేనే సాధ్యం అన్నారాయన .అదీ కవితా ప్రసాద్ కవితా లోతు .

భువన విజయ రాయలు

ఎన్నో భువన విజయాలు వివిధ సందర్భాలలో ప్రదర్శించి తానూ శ్రీ కృష్ణ దేవరాయల పాత్ర పోషించి ఉదాత్త భావగర్భిత ఆశుకవిత్వాన్ని చెప్పి అందరిని సంభ్రమాశ్చర్యాలతో ము౦చేసేవారు .అలాగే అమర సభలోను ఇంద్రుడిగా రాణించారు  .శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహాన్ని శ్రీకాకుళం లో ప్రతిస్టిం చటానికి ,కృష్ణా జిల్లా వైభవ సభలు జరపటానికి ఆయనదే ముందడుగు .

ప్రత్యక్ష వ్యాఖ్యానాలు

కృష్ణా గోదావరీ పుష్కరాలకు ,వెంకటేశ్వరస్వామి ఉత్సవాలకు భద్రాద్రి శ్రీరామ నవమికి ఎన్నో సార్లు ప్రత్యక్ష వ్యాఖ్యానం చేసి భక్తీ భావ లహరి ప్రసరింప జేశారు. వ్యాఖ్యాలకు గొప్ప స్థాయి కల్పించారు .కృష్ణా పుష్కరాలకు దగ్గరుండి కృష్ణా మహోత్సవాలు నిర్వహించారు .ఏ విషయాన్నైనా అలవోకగా యెంత సేపైనా ఏ ఆధారం చేతిలో లేకుండా ఎన్నో ఉదాహరణ లిస్తూ పద్యాలు శ్లోఆలు మంత్రాలు ఉదాహరిస్తూ లోతులు తరుస్తూ చెప్పగలిగే సామర్ధ్యం కవితా ప్రసాద్ ది.గాత్రం మధురం కాయం మధురం మధురాతి మధురం కవితా ప్రసాద్ హృదయం .

పురస్కారాలు –బిరుదులు

అవధాన విద్యా వాచస్పతి ,ఆశుకవితా సమ్రాట్  ,అష్ట దశావధాని ,ద్విశతావధాని బిరుడుల౦దుకొన్నారు కవితా ప్రసాద్ .ఇవి ప్రతిభకు తగిన పురస్కారాలు .2000లో ముఖ్యమంత్రి పురస్కారం , 2005 లో ప్రతిభా పురస్కారం ,విజయవాడలో స్వర్ణ కంకణ ధారణ ,మచిలీ పట్నం లో కనకాభిషేకం ,గుంటూరు లో కులపతుల వారిచే కనకాభిషేకం పొందారు .కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో జరిగిన మొదటి రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలకు రూప శిల్పి కవితా ప్రసాద్ .ప్రభుత్వం నుండి గణనీయం గా ఆర్ధిక సాయం అందజేయించి రాష్ట్ర సాంస్కృతిక శాఖా కార్య దర్శిగా బాధ్యతను గణనీయం గా నిర్వహించి సాహిత్యాభిమానుల మన్ననలు అందుకొన్నారు .

ఆ నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఇంట్లో కవితాప్రసాద్ ‘’ఆశు కవితా ప్రదర్శన ‘’చేసి ఆయన్ను  తన సామర్ధ్యం తో  ఆశ్చర్యం లో ముంచేసి అభిమాన పాత్రులయ్యారు . .

కవితాప్రసాద్ కు’’ కవితాంజలి’’

కవితా ప్రసాద్ కు కృష్ణా జిల్లా ఎంతో రుణ పడి ఉంది .ఆయన ఇక్కడ పుట్టినందుకే కాదు ఆయన ఎదుగుదలకు సోపానమైనందుకు ,ఆయన వల్ల మనం ప్రభావితమైనందుకూ .మనందర్నీ తనతో కలుపుకొని అవధాన ప్రదర్శనలో భాగ స్వాములను చేసినందుకు మనం ఋణం తీర్చుకోవాలి .కాని ఎవరూ ఇంతవరకు అ దృష్టితో ఆలోచించక పోవటం బాధగా ఉంది   .ఎవరికి వారు వేరు కుంపట్లు పెట్టుకొని మొక్కుబడిగా చేస్తున్నారు .మనలోని వర్గ భావాలను దూరం చేసి సమైక్యం గా సాహిత్యాభిమాను లందరూ కలిసి ఘన నివాళిని అందజేస్తే బాగుంటుందని పించింది .కాని ఆ దిశలో ఎవరూ ప్రయత్నం చేయలేదు .అందుకే బందరు’’ సాహితీ మిత్రుల సంఘం’’ అధ్యక్షులు శ్రీ సిలార్ గారితో చెప్పి బందరులో ‘’కవితా ప్రసాద్ గారికి కవితాంజలి ‘’కార్యక్రమం ఏర్పాటు చేయమని చెప్పాను .ఉయ్యూరు  ‘’సరసభారతి భారతి’’ కూడా సహకారం అందిస్తుంది అని చెప్పాను .సరే నన్నారు .బందరు లోని సాహిత్య సాంస్కృతిక సంస్థలన్నిటికీ తెలియ జేసి 2-4-15 గురువారం  సాయంత్రం వివేకానంద మందిరం లో ఏర్పాటు చేశారు శిలార్ జీ .ఒక 35 మంది హాజరయ్యారు .కవితాప్రసాద్ గారి చిత్రపటం పెట్టారు .పూలు, దండా తెచ్చారు .దండవేయటం మర్చి పోయారు .అప్పుడు నేనే కల్పించుకొని ము౦దుగా కవితా ప్రసాద్ గారి చిత్ర పటానికి అందరి చేత పూలు సమర్పింప జేశాను .అ తర్వాతైనా సిలార్ గారు దండ వేయంచలేదు .మేమురాత్రి  ఎనిమిదింటికి బయటికి వచ్చేదాకా ఆ దండ కిందనే ఉండిపోయింది.ఆతర్వాత వేశారో లేదో తెలీదు .సిలార్ గారు మీడియాకు చెప్పి పేపర్ ప్రకటన కూడా ఇచ్చినట్లు లేదు .కనీసం నేను మూడు సార్లు ఫోన్ చేసి అడిగే దాక నాకు ఆహ్వాన పత్రాన్ని  నెట్ లో పెట్టి పంపలేదు .అదీ నిర్వహణ లో’’ సౌఢభ్యం ‘’.

ఇక ప్రసంగించిన వారు కూడా కవితా ప్రసాద్ తో కాఫీ తాగాను ,ఆయనకు అద్దెకు ఇల్లు ఇప్పించాను ,ఆయన ఇంటికి వెడితే  భార్య టిఫిన్ పెట్టింది వగైరాపనికి మాలిన విషయాలు  మాట్లాడినవారేకాని కవితా ప్రసాద్ కవితా సౌందర్యాన్ని గురించి చెప్పలేదు .ఆయనపై కవిత్వం రాసి చదవ లేదు .ఒక్క మురళీ కృష్ణ  నేను తప్ప కృ. .జి .ర .సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు మాత్రం తమ సంఘం ఆధ్వర్యం లో జరిగిన మొదటి రెండు ప్రపంచ తెలుగు సభలకు కవితా ప్రసాద్ మార్గ దర్శి ,స్పూర్తి ప్రదాత ,అని ప్రభుత్వం నుండి ఆర్ధిక సాయం అందించిన చొరవ ఆయన దే నని ‘’పది లక్షల ప్రభుత్వ చెక్ ను కవితా ప్రసాద్ గాలిలో ఊపుతూ వేదికపై ప్రత్యక్షమైన తీరును’’ గుర్తు చేసి దృశ్యమానం చేశారు  .ప్రముఖ గాయకురాలు శ్రీమతి సింగరాజు కల్యాణి గారు ‘’ప్రసాద్’’ గారి పాటలకు స్వర రచన చేసి శ్రావ్యం గా గానం చేసి కవితాంజలి ఘటించారు .ఇంకా ఒకరిద్దరు ఇలా చేసి ఉంటె ఇంకా ఘనం గా ఉండేది .కల్యాణిగారితో పాడించమని ఆమె భర్త శ్రీ గోవర్ధన్ గారికి అంతకు ముందు  జరిగిన సుబ్బారావు గారి అభినందన సభలో (29 మార్చి  )చెప్పాను ఆయన ఆ బాధ్యత తనది అని చెప్పి మాట నిల బెట్టు కొన్నారు వేదిక కూడా గోవర్ధన్ గారే ఏర్పాటు చేశారు ..మరో ప్రసిద్ధ గాయని శ్రీమతి కాళీ పట్నం ఉమ తనకు రావటానికి కుదరలేదని రానందుకు బాధ పడుతున్నానని నిన్న రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పారు  .. తర్వాత దండిభోట్ల దత్తాత్రేయ శర్మ ,శ్రీమతి గుడిపూడి రాధికా రాణి కవితలు  రాసుకొచ్చినట్లు చూశాను . అందరూ బందరులో కవులేకదా అందరూ ఆయన ప్రభావం ఉన్నవారేకదా గొప్పగా కవిత్వం రాసి ఘన నివాళి  అర్పిస్తారనుకోన్నాను. కానీ’’ ఉల్టా’’అయింది .చాలా బాధగా ఉంది .ఇంత పేలవం గా జరుగుతుందనుకోలేదు .ఆ కవితలు వస్తే నెట్లో రాద్దామని లేక చిన్న పుస్తక రూపం లో తెచ్చే ఆలోచన చేద్దామని అనుకొన్నా .కాని అది జరగక పోవటం తీవ్ర నిరాశకు గురి చేసింది . సాధారణం గా సరసభారతి ఏర్పాటు చేసే సభలకు కవి సమ్మేళన .కార్యక్రమాలకు ఉయ్యూరు వారి పేర్లు చివరికి వేసి ముందు ఇతరుల పేర్లు వేస్తాం .నిర్వహణలో కూడా బయటి నుండి వచ్చిన వారిని అతిధులుగా గౌరవించి ముందు వారికే అవకాశం ఇచ్చిమాట్లాడించి కవిత్వం చెప్పించి  గౌరవిస్తాం .కానీ ఈ సభలో ముందే స్థానికులను పిలిచి వారికి ఎక్కడ కోపం వస్తుందోనని సిలార్ భాయ్ భయపడినట్లుకనిపించింది .ఇది బయటినుంచి వచ్చిన వారికీ చాలా అమర్యాద .సుబ్బారావు గారి సభలో భవిష్య గారు మొదట స్థానికుల కొకరికి అవకాశం ఇచ్చి తర్వాత సరసభారతికి అవకాశం కల్పించి గౌరవించారు .ఆ మాదిరి సౌజన్యం ఇక్కడ కలగక పోవటం ఇబ్బంది అని పించింది .అయిడియా మాది .సభ పెట్టాలని ,ఆయన ఫోటో పెట్టాలని ,దండ, కొనాలని, పూలు అందరితో వేయించాలని ఆహ్వానపత్రిక వేయాలని బందరులోని అన్ని సాహిత్య సాంస్కృతిక సంస్థలకు ఆహ్వానాలు వెళ్లాలని, మీడియా వారిని పిలవాలని ,సభ విషయం ఒక రోజు ముందే పేపర్ లో రావాలని  అందరూ కవిత్వం రాసి’’కవితాంజలి ‘’గా  నివాళి అర్పించాలని చెప్పింది సరసభారతి .దీన్ని అమలు చేయటం లో వైఫల్యం జరగటం శోచనీయం .

జరిగిందేదో జరిగిపోయింది . ఇటీవల జరిగిన తెలుగు ప్రపంచ సభల స్థాయి లో ఘన నివాళి కవితా ప్రసాద్ కు జరగాలి .అప్పుడే మనం కృతజ్ఞులం అని పించుకో గలం.కృష్ణా జిల్లాలో జరిగిన ఎన్నో అవధానాలకు ,సాహిత్య సభలకు ప్రేరణ, స్పూర్తి  నిర్వహణా కవితా ప్రసాద్ దే అని మరువ రాదు .

మచిలీ పట్నం లో కవితా ప్రసాద్ కు చిరస్మరణీయ స్మృతి చిహ్నం

కవితాప్రసాద్ గారికి  కాంశ్య విగ్రహం తయారు చేయించి బందరులో  ప్రతిష్టించాల్సిన  బాధ్యత కృష్ణా జిల్లా సాహిత్యాభి మాను లందరిపైనా ఉంది .ముఖ్యంగా దీనికి కృష్ణా జిల్లా రచయితల సంఘం నడుం కట్టాలి .శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ పూనుకోవాలి .అప్పుడే ఇది సాధ్యం .దీన్ని సాధించక పొతే చరిత్ర మనల్ని క్షమించదు.ఇది అందరి సమష్టి బాధ్యతగా భావించి కదలాలని మర్చి పోరాదు. కృష్ణా యూని వర్సిటీలో అయన పేర సాహిత్య పీఠం ఏర్పాటు చేయగలిగితే మహా మంచిది . .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-4-15 –ఉయ్యూరు

.

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సభలు సమావేశాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.