మనకే తెలియని మన త్రిభాషా కవి శ్రీ చింతకుంట సూర్య నారాయణ రావు

మనకే తెలియని మన త్రిభాషా కవి శ్రీ చింతకుంట సూర్య నారాయణ రావు

ఎంతో ప్రతిభ ఉన్నా ఎన్నో గ్రంధాలు రాసి పేరు తెచ్చుకొన్నా ,బిరుదు లెన్నో అందుకున్నా   బహుభాషా పాండిత్యం ఉన్నా కొందరిని కాలం మర్చిపోతుంది .వారి చరిత్ర ఏ ఇంటర్ నెట్ కో పరిమితమై పోతుంది .అలాంటి వారిలో తెలుగు వారు గర్వించదగిన త్రిభాషాకవి  న్యాయ వేత్త ,శ్రీ చింతకుంట సూర్యనారాయణ రావు గారు .న్యాయశాస్త్ర పాండిత్యం  వారికవిత్వానికి రచనలకు సొబగు కూర్చింది  .రావు గారిని  ఈ తరానికి పరిచయం చేసే ప్రయత్నమే ఇది .

అవధాన ఆశుకవితా ప్రభావం

1924 లో జన్మించిన సూర్యనారాయణ రావు గారికి  ఆశుకవి సార్వభౌములైన కొప్పరపు సోదర కవుల పరిచయ భాగ్యం 12వ ఏట కలిగింది .ఆంద్ర పత్రిక సంపాదకులు శ్రీ కాశీనాధుని నాగేశ్వర రావు గారి భవనం లో వారి సమక్షం లో సోదరకవుల ఆశుకవితావదానాన్ని కవితా విందుగా అనుభవించిన రావు గారు ఆశుకవిత్వం వైపుకు మొగ్గారు . సోదరులలో ఒకరు ఒక పాదం చెబితే రెండవ వారు రెండవ పాదాన్ని చెప్పి ఆశుకవితకే పట్టం కట్టారు .కాని వారు  శాశ్వతం గా నిలిచిపోయే గ్రంధాలను రాయకపోవటం  దురదృష్టం . కొప్పరపు కవులతో ఢీ అంటే ఢీ  అని సవాలు చేసి ఆశుకవిత్వావదానాలు చేసిన తిరుపతి కవులు మాత్రం శాశ్వత రచనలు చేసి సరస్వతీ సమార్చనం చేశారు . ఈకవుల విధానం నచ్చిన సూర్య నారాయణ రావు గారు ఇదే బాటలో నడిచి సద్గ్రంధ రచన చేసి కీర్తి సాధించారు .ఆనాటి యువ కవులకు తిరుపతికవులే స్పూర్తి ప్రేరణ .తెలుగు వారికి మాత్రమె స్వంతం  ఆశుకవిత్వం ,అవధాన ప్రక్రియ అని భావిస్తాం .రావుగారు ఏం ఏ. బి .ఎల్.

జాన్ మిల్టన్ ఆశుకవిత్వం

ఆంగ్లకవి జాన్  మిల్టన్ కనులు కోల్పోయి గుడ్డివాడై ‘’పారడైజ్ లాస్ట్ ‘’మహా కావ్యాన్ని ఆశువుగా చెబుతూంటే ఆయన కుమార్తె గ్రంధస్తం చేసిన విషయం మనకు తెలుసు .దీన్ని ఒక రకంగా ఆశుకవిత్వం గా భావించవచ్చు .ఆశు కవిత్వానికి గొప్ప ఊహ ,కవితా సామర్ధ్యం ,సందర్భాన్ని బట్టి కవిత అలవోకగా జాలువారి సహృదయ స్పందన కలిగించటం లక్షణాలు .ఆశుకవి తనకు వాగ్దేవీ  అనుగ్రహం లభించటం వలన కవిత్వం వస్తోందని నమ్ముతాడు .మిల్టన్ కూడా అనేక దేవీ దేవతలా అనుగ్రహమే తన కవిత్వానికి శ్రీరామ రక్షగా భావించాడు .

రావు గారి కవితా భ్యుదయం –బిరుద సత్కారం

సూర్య నారాయణ రావు గారు 1970లో కాన్పూరు లో ఉద్యోగం చేస్తూ ఒంటరిగా  ఉన్నప్పుడు సంస్కృత కవిత్వం పైన ద్రుష్టి పడింది .పిల్లల చదువుకోసం కుటుంబాన్ని కలకత్తాలో ఉంచేసి తానోక్కరే కాన్పూరు లో ఉన్నారు .కాన్పూరు రాదా కృష్ణ మందిరం పవిత్రత ,ప్రశాంతత ఆయనకు మహా నచ్చటం వలన రోజూ దైవ దర్శనం చేసుకొనేవారు .కృష్ణ భక్తీ ఆయన మనసులో నిండిపోయి ‘’కృష్ణ కదా సుధ’’రాయటం ప్రారంభించారు అప్పటికే మొదలు పెట్టి రాస్తున్న ‘’గీతాంజలి గానామృతం ‘’వెనక బడింది .కృష్ణ కద ముందే ముద్రణ పొందింది .రాదా కృష్ణ మందిరం లో దర్శనానుభూతి పొందుతుండగా ఆయన మనసులో భావాలు ప్రవాహాలై కవితా ఝరులై ప్రవహించి కావ్యాన్ని పూర్తీ చేయించాయి .దీని తర్వాత చాలా రచనలు చేశారు .కవిత్వాన్ని గుణ ప్రధానం గా ఎంచాలని అభిప్రాయపడేవారు. అశాశ్వత మైన ,పనికిమాలిన కవిత్వం శాశ్వత ఆనందాన్నవ్వదంటారు .మంచి కవిత్వం ఉత్తమ విలువలతో కూడి ఉండి వ్యక్తికీ సమాజానికి మేలు చేసేదిగా  ఉండాలి .ఇవే భావాలను ఆంగ్ల కవి ‘’హాబ్స్ ‘’కూడా చెప్పాడు .భక్తి  భావాలతో పులకించిన సూర్య నారాయణ రావు గారు అనేక రచనలు చేసి ఉత్తమకవిగా వినుతి కెక్కారు .అందుకనే ‘’ 1998లో  మద్రాస్ కు చెందిన’’అఖిల భారత విష్ణు సహస్ర నామ ఫెడరేషన్ ‘’శ్రీ చింతకుంట సూర్య నారాయణ రావు గారికి తిరుమలలో  శ్రీ వారి ఆస్థాన మండపం లో వెయ్యి మంది ప్రనిధులు పాల్గొన్న సదస్సు లో ‘’ భక్తి సాహిత్య  భాస్కర ‘’మరియు ‘’కవి హృదయ విశారద ‘’బిరుదులను  ప్రదానం చేసి గౌరవించారు .సరస్వతీ పుత్రులైన ఆ విజ్ఞాన మూర్తి శ్రీ చింతగుంట సూర్య నారాయణ రావు గారు  91 సంవత్సరాల వయసుతో ఆరోగ్యంగా మనముందున్నారు .స్పూర్తిని కలిగిస్తున్నారు .వారి సమకాలీనులుగా  ఉండటం వలన మనం ధన్యులం .అదృష్ట వంతులం .

త్రిభాషా రచన

రావు గారు ఆంగ్ల, ఆంద్ర, సంస్కృత భాషలలో అరుదైన రచనలు చేసి తన విద్వత్తును ప్రదర్శించారు .

ఆంగ్ల రచనలు

న్యాయ శాస్త్రం తో సంబంధం ఉన్నసీనియర్ లాయర్ ,ప్రభుత్వ విధానాలలో అనుభవం ఉన్న  సూర్యనారాయణ రావు గారు రాజ్యాంగం పై గొప్ప రచనలే చేశారు .1999లో రాసిన ‘’Constitution of conventions ‘’ గ్రంధానికి సుప్రీం  కోర్ట్ జస్టిస్ ఒ.చిన్నపరెడ్డి ముందుమాట రాశారు .భారత రాష్ట్ర పతి విధి విధానాలను ఇందులో రావు  గారు విపులంగా చర్చించారు .ఇది ప్రతి పౌరుడికి కరదీపిక .రెండవ పుస్తకం ‘’Role of directors in company laws ‘’1970లో ప్రచురించారు .సుప్రీం కోర్ట్ జస్టిస్ శ్రీ కోకా సుబ్బారావు గారు దీనికి ముందుమాట రాశారు .ఆంగ్లం లోనే ‘’త్యాగరాజ గీత ‘’రాసి అందులో త్యాగయ్య గారి 27 అమర కీర్తనలపై విపులమైన వ్యాఖ్యానం వచనం లో రాశారు .రామాయణ భాగవత ,కాళిదాస గ్రంధాలనుండి విషయ సేకరణ చేసి ‘’Tales from  ancient India ‘’రచించారు .అధర్వ వేదం లోని ‘’ఆదిత్య మండలం ‘’ను సాదికారికం గా ఆంగ్లం లోవచనం గా  తర్జుమా చేసి తన విద్వత్తును ,ప్రతిభను నిరూపించుకొన్నారు .ఆంగ్ల మహాకవి షేక్స్ పియర్ రాసిన ‘’సానేట్స్’’పై  ‘’Shakespeare;s sonnets- their purport and significance in the Indian perspective ‘’గా రాశారు  .అన్నమాచార్యులు సంస్కృతం లో రాసిన అతి తక్కువ సంస్కృత ‘’పదాలను ‘’ఆంగ్లం లోకి ‘’Annamacharya;  Sanskrit  Lyrics on Lord Venkateshwara ను 1996లో వెలువరించారు .

తెలుగు రచనలు

మహాకవికాళిదాసు రచన ‘’మేఘ దూతం  ‘’ను మేఘ సందేశం గా తెలుగులో1946లోనే  కవిత్వీకరించారు .సంస్కృత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ‘’రసాలవాలం ‘’పేరిట తెలుగు అనువాదం చేశారు .ఇందులో వివిధ దేవీ దేవతలపై స్వీయ కవితలూ ఉన్నాయి .1994లో ‘’గోపికాగీతం ‘’రచించి ప్రచురించారు .వ్యాస విరచితమైన భాగవతం లోని 19 శ్లోకాలకు మధుర మంజుల అనువాదమే ఇది .కృష్ణ ప్రేమ పై విపుల వ్యాఖ్యానం రాసి వన్నె తెచ్చారు .1990లో శంకారాచార్య స్వామివారి ‘’శివానందలహరి ‘’కి భక్తి  ప్రపత్తులతో అలౌకిక అనువాదం చేసి కావ్య వస్తు విషయాలపై గొప్ప ఉపోద్ఘాతమూ రాశారు .జగద్గురువుల’’ సౌందర్య లహరి’’కీ  సుస్పష్ట అర్ధ అనువాదం చేశారు .ఇది ఇంకా ప్రచురణకాలేదు . సఖ్య-ఆసక్తి అనేది షేక్స్పియర్ రాసిన 154 సానెట్ లకు తెలుగు అనువాదం1977లో రాశారు . .ఒకే ఛందస్సులో రాసిన రచన ఇది సానేట్లన్నిటిలో ఏక సూత్రత గమనించిన రావు గారు వీటిని భారతీయ ఆధ్యాత్మిక ద్రుష్టి తో అనువదించి వైశిస్ట్యాన్ని చూపారు .ఇలా ఇంతవరకు ఎవరూ చేయలేదు. ఇదొకఅద్భుత సృష్టి .రావు గారి నూతన దృష్టికోణం .భారతీయ వేదాంత పరమార్దానికి ఇదొక మచ్చు తునక .

సంస్కృత రచనలు

మొదటి సంస్కృత కావ్యం గా ‘’గీతాంజలి గానామృతం ‘’రాశారు రావు గారు దీనిపై శ్రీ బెజవాడ గోపాల రెడ్డి స్పందిస్తూ ‘’రవికవి గీతా౦జలి ప్రపంచ భాషలలోకి అనువదింపబడింది .దీనికే గురు దేవులకు నోబెల్ సాహిత్య బహుమతి లభించింది .ప్రాచ్యభాషా సౌధం లోకి పాశ్చాత్యులకు ప్రవేశం గీతాంజలి వలన కలిగింది .శ్రీ సూర్యనారాయణ గారి సంస్కృత గీతాంజలి అనువాదం సుందరం గా సాగింది ప్రసిద్ధలైన నాలుగైదు  వృత్తాలలో రవీంద్రుని హృదయాన్ని చక్కగా ఆవిష్కరించారు .ఆంగ్లం లో లేని లయా ,శయ్యా సౌ భాగ్యం  .సంస్కృతం లో రావు గారు కలిగించారు .బెంగాలీ గీతాంజలి పాటల్లాగా ఉండి దాని ప్రత్యేకత నిల్పింది .రావు గారు రవీంద్రుని ఆంగ్లానువాదాన్నే అనుసరించారు .బెంగాలీ గీతాంజలి చూసి ఉన్నట్లు లేదు .సంస్కృత విద్యార్ధులకు రావు గారివలన గీతాంజలి పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉన్నది .రావు గారు దీన్ని రవీ౦ద్రునికే అంకిత మివ్వటం గంగా జలం తో గంగా నదికే  అర్ఘ్యమివ్వటం లాగా ఉందని చమత్కరించారు .భారత సాహిత్యం లో ఏ  గ్రంధానికి లభించని నోబెల్ బహుమతి గీతాంజలికే వచ్చింది ‘’అని గురుదేవ్ టాగూర్ ప్రతిభను ప్రస్తుతించారు .

గోపాల రెడ్డిగారు శాంతినికేతన్ కు అధిపతిగా ఉండేవారు .ఒక సారి నెల్లూరు లో ఒక సభ జరిపి శ్రీ సూర్య నారాయణ రావు గారిని ఆహ్వానించి రవీంద్రుని స్మారక ఉపన్యాసం చేయించి  సన్మానించారు .దీనితర్వాతే రావు గారి సంస్కృతగీతాంజలి అనువాదం 1996 సెప్టెంబర్ లో హైదరాబాద్ లో ప్రచురింపబడి విడుదలయింది

రావు గారి అముద్రిత గ్రందాల లిస్టు కూడా పెద్దదే .’సూర్య సన్నుతి’’ అందులో ఒకటి .మయూరుని సూర్యశతకం లాంటిది .’’శ్రీ కృష్ణ కదా సుధ’’ ఇంకారావాలి .శ్రీకృష్ణుని జీవిత చరిత్ర అంతా కావ్య రూపంగా రాసిన గ్రంధం .అమ్మవారి దివ్య విభూతి పై రాసిన ‘’మాతృ సహస్రనామ స్తోత్రం  ‘’ముద్రి౦పబడాలి  . ‘’జ్యోతిర్లేఖ ‘’కూడా వెలుగు చూడాలి .

రావు గారి రచనలను స్వంత సంస్థ అరుణ్ పబ్లిషర్స్ ద్వారా  ప్రచురించారు .దీని అధ్యక్షులు రావుగారే .అడ్రస్ –అరుణ్ పబ్లిషర్స్ బంజారా కాటేజ్ బి 747-ఎల్లారెడ్డి గూడా –హైదరాబాద్ -500073.-ఫోన్ నంబర్ -040-23732315.రావు గారి పుస్తక ప్రచురణకు , ముద్రితమైనవాటి పునర్ముద్రణకు ఎవరైనా స్పాన్సర్లు ముందుకు వస్తే ఆహ్వానిస్తున్నామని పబ్లిషర్లు తెలియ జేశారు .ఆసక్తి ఉన్నవారు సంప్రది౦చ వచ్చు .

రావుగారి మెయిల్ అడ్రస్ chsrao63@rediff.mail .com

ఈ వ్యాసానికి ఆధారం –డా.రాచకొండ నరసింహ శర్మ ఏం డి .గారు పంపిన ఆంగ్ల వ్యాసం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-4-15 ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.