ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -32

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -32

 

14-సంస్కరణ  ,వాస్తవ వాది  శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్-4(చివరిభాగం )

టాల్ స్టాయ్ అనుచర గణం

 

టాల్ స్టాయ్ చాలా నిష్టగా ఉన్నాడుకాని భోగాలమధ్యే జీవిస్తున్నాడు .పూర్వానుభవాలు, బలహీనతలకు లో౦గి పోతున్నాడు .తనను తానూ నియంత్రించుకోలేక పోతున్నాడు .యాత్రికుల సందర్శన పెరిగింది .అడపాదడపా పుస్తకాలు  బూట్లు రిపైర్ చేసే బెంచి పై  కూర్చుని రాస్తున్నాడు .ఇలా అనేక విధాల స్థిమిర జీవితం లేకపోయినా కుటుంబంలోను బయటా ఆయన ప్రతిభా కీర్తి పెరుగుతూనే ఉన్నాయి .ప్రజలకు ఆయన బోధలపై విపరీతమైన గురి ఏర్పడింది .ఆయన బోధనలను అమలు పరచటానికి కాలనీలు ఏర్పడ్డాయి .రష్యా యువకులు తమ గురూజీ టాల్ స్టాయ్ అనే చెప్పుకొన్నారు .తమను ‘’టాల్ స్టాయన్స్ ‘’గా పిలుచుకొన్నారు .ఆయన రచనలు ప్రపంచ భాషల్లోకి అనువాదం పొందాయి .వాటి ప్రభావం ఇంకా పెరిగింది .

కరువు –సహాయ పనులు

1891 లో రష్యాలో వచ్చిన భయంకర కరువును ఎదుర్కోవటానికి బాధితులకు సహాయ సహకారాలు అందజేయటానికి నడుం బిగింఛి అంకిత భావంతో రిలీఫ్ వర్క్ ను చేబట్టాడు . .దేశ విదేశాలనుండి కరువు నివారణకు అందు తున్న నిధులను గ్రామాలకు గ్రామాలకే ఆహారం సరఫరా చేయటానికి ఖర్చు పెట్టాడు .దీనితో టాల్ స్టాయ్ సేవానిరతి ప్రపంచమంతా పాకిపోయి ప్రపంచం లోనే గొప్ప గౌరవ నీయుడు ఆరాధనీయుడయ్యాడు

అరిస్టోక్రసికి సింహ స్వప్నం .

ఆయన జీవితం లో చివరి ఇరవై ఏళ్ళు రష్యన్  అరిస్టోక్రసి కి  సింహ స్వప్నమే అయ్యాడు  .ఆయన రచనలనేకం నిషేధించబడ్డాయి .దొంగచాటుగా ప్రింట్ చేసి సొమ్ము చేసుకొన్నారు .ఆయన సమర్ధకులను జైల్లో పెట్టి హింసించారు . ఆయననూ పోలీసు నిఘాలో ఉంచారు .75 వ ఏట చర్చి కూడా బహిష్కరించింది ఆయనను .సంప్రదాయ క్రిస్టియన్ మతాన్ని కాదన్నాడనేదే అభియోగం .ఆయనకున్న పరపతిని తగ్గించాలన్నదే ఆశయం .

అహింసా పరమో ధర్మః

ప్రభుత్వం  పెట్టె హింసలను చూపించే దౌర్జన్యాలను ఆయన పరమ ప్రశాంత చిత్తం తో అహింసా మార్గం లో  ఎదుర్కొన్నాడు .ఆయన విప్లవానికి పూర్తీ వ్యతిరేకి .ప్రభుత్వ చేష్టలను తీవ్ర స్వరం తో నిరసించాడు .అన్యాయాలను అడ్డుకున్నాడు .ప్రతిపనిపైనా పూర్తిగా విచారణ జరిపి మాత్రమె చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి తెలియ జెప్పాడు .ఆ నాటి ప్రజల మనోభావాలకు టాల్ స్టాయ్ అద్దంపట్టాడు .విప్లవానికి టాల్ స్టాయ్ యెంత వ్యతిరేకి అయినా ఆయన మరణం తర్వాత 7 ఏళ్ళకు చివరి రివల్యూషన్ రష్యాలో జరిగింది .

మహాత్ముడికి ఆదర్శం

రష్యాలోని యాస్నాయ పోల్యానా దక్షిణ అమెరికాకు అర్ధ ప్రపంచం దూరం లో ఉంది .అక్కడ మోహన్ దాస్ కరం చంద్ గాంధి ‘’the kingdom of God is within you ‘’అని  ప్రకటించాడు .టాల్ స్టాయ్ కి జాబు రాస్తూ తాను  ఆయన విశ్వాసపాత్రుడైన అనుచరుడిని అని చెప్పుకొన్నాడు .ఇద్దరి మధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు చాలాకాలం జరిగాయి .1910 చివరలో టాల్ స్టాయ్ మహాత్ముడికి ఒక సుదీర్ఘమైన లేఖ రాశాడు .అందులో క్రిష్టియానిటి  క్రీసు బోధనలను అనుసరించటం లేదని బాధ పడ్డాడు .అందులోనే చాలా తీవ్రంగా ‘’the longer I live ,and especially now when I vividly feel the nearness of death ,I want to tell others what I feel so very clearly and what to my mind is of great importance –namely that which is called passive resistance ,but which in reality is nothing less than the teaching of love ,uncorrupted by false interpretations. A s soon as force was admitted into love ,love was no longer the law of life .And as there was no law of love ,there was no love at all, except violence –that is the power of the strongest .Thus Christian mankind has lived for nineteen centuries ‘’అని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పాడు .ఇవే మహాత్ముడికి ప్రేరణ మంత్రాలైనాయి భారత దేశ స్వతంత్ర సాధనకు .అవే మార్టిన్ లూధర్ కింగ్ కు ఆదర్శాలూ అయ్యాయి .

సందర్శకుల సందడి

ఈ ముసలివయసులో అన్నిరకాల అభిప్రాయాల వారి సందర్శన తో టాల్ స్టాయ్ క్షణం తీరిక లేకుండా గడిపాడు .ప్రముఖ కవులు ,భక్తులు ,రాజకీయ నాయకులు ,రాజ్య పాలకులు అందరూ క్యూకట్టి దర్శనాలు చేసుకొని సర్వ సంగ పరిత్యాగి అయిన ఆ మహాను భావుడిని అర్చి౦చేవారు .సన్మానించి గౌరవించేవారు .’’సత్యం కోసం బాహ్య విషయాలను త్యాగం చేయటమే పరమార్ధం అని బోధించాడు లియో .

ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత

ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత లాగా   తయారైంది టాల్ స్టాయ్ బతుకు .ప్రపంచమంతా ఆరాదిస్తూ పూజిస్తున్న మహా రచయితా దార్శనికుడికి ఇంటిపోరు అదే దామాషాలోఅనులోమంగా  పెరిగి ఇంట్లో పరువు విలోమంగా తగ్గిపోయింది సంతానాన్ని గారాబం గా చూసుకొంటూ వాళ్ళతో ఆటలాడుకొంటూనే  ఉండే వాడు ఒకప్పుదు  .వారికీ తండ్రిపై వల్లమాలిన గౌరవ ప్రేమలుండేవి .కాని ఇప్పుడు అంతా ‘’ఉల్టా సీదా ‘’అయి పోయింది .పిల్లల్లో స్వార్ధం పెరిగింది  .తండ్రి త్యాగనిరతిని వాళ్ళు అర్ధం చేసుకోలేక గొడవ పడ్డారు .పలకరింపులే లేవు .సానుభూతి ఎండమావి అయిపోయింది .కుటుంబం లో .చిన్న కూతురు అలేక్సా౦డ్రా మాత్రమె తల్లినెదిరించి తండ్రి పక్షాన నిలిచింది .మిగతావారంతా బద్ధ విరోదులైపోయారు

సుఖము లేదంతే.

సాధారణం గా మానవ జీవిత చరమాంకం లో సుఖ శాంతులతో వర్ధిల్లటం అందరూకోరుకొనే వరం పాపం ఈ ముసలాయనకు అది శాపంగా మారింది .అందరూ ఆయన్ను వ్యక్తిగతంగా బాధించారు హింసించారు ,పీడించారు .భార్య సోన్యాకు లియో అనుచరుడు వి. జి .చేర్కొవ్ కు మధ్య’’ టగ్ ఆఫ్ వార్ ‘’కొనసాగింది .చేర్కొవ్ పెద్ద లాండ్ లార్డే .సంస్థానం లో ఉండే రైతుల జీవితాలను బాగు చేయాలనుకోన్నవాడే .రెండు విషయాలే తగాదాకు కారణాలైనిలిచాయి .మొదటిది తన రచనల మీద కాపీ రైట్  హక్కులు ప్రజలకు ఇవ్వకుండా భార్యకు దఖలు పరచటం .చరమాంకం లో ఉన్న మాస్టర్ లియో  ను ఆ హక్కులు ప్రజలకు దక్కెట్లు వీలునామా లో పొందుపరచమని చిలక్కి చెప్పినట్లు చెప్పాడు ,ఇలా చేస్తే సోన్యాకు ,ఆమె వారసులకు  హక్కులు దక్కవు .రాయల్టీలు రావు .టాల్ స్టాయ్ చాలా రహస్యం గా భద్ర పరచిన డైరీలు చేర్కొవ్ అధీనం లో ఉండటం .చివరికి చిలికి చిలికి గాలివానైంది ఈ డైరీల విషయం లోనే .

సోన్యా మానసిక స్థితి

ఇంటిలోని పోరు గురించి ఆయన రాసుకొన్న ఎనిమిది డైరీలున్నాయి .సోన్యా మానసిక పరిస్తితికూడా బాగా లేదు .మెనోపాజ్ బాధలెక్కువైనాయి .హిస్టేరికల్ గా మారిందికూడా .భర్త రాసుకొన్న డైరీలలో తన అనారోగ్య విషయాలేమైనా ఉన్నాయేమోనని ఆమె అనుమానం  అపోహ  .భర్త చనిపోతే వాటిని ప్రచురించే హక్కు ఎవరికి దక్కుతుంది అనేదానిపై సందిగ్ధం ఆమెను పీడిస్తోంది .ఎప్పుడూ ఇంట్లో ఆమె ఏడుపులు పెడ బొబ్బలుగా గా ఉంది. ఇల్లు నరకప్రాయమై పోయింది .తరచుగా ఆత్మహత్యా ప్రయత్నాలూ చేసింది .భర్త ప్రతికదలిక పైనా నిఘా పెట్టింది .చెప్పరాని రాయలేని అనేక నేరాలు ఘోరాలు ఆయనపై మోపి మానసిక క్షోభ పెట్టింది .82 ఏళ్ళ ముదుసలి భర్తకు చేర్కొవ్ తో అక్రమ సంబదాన్నీ అంట గట్టింది .ముప్ఫై ఏళ్ళు భార్యకు లొంగి బతికాడు .ఇక ఏమాత్రమూ సహించలేక పోయాడు స్వేచ్చ కావాలని పించింది .రాజీ ప్రశ్నే లేదన్నాడు .

ఇంటి నుంచి బయటి ప్రపంచం లోకి –అటునుంచి అనంత లోకాలకు

28-10-1910 ఉదయం 6 గం లకు అక్టోబర్ చలిగాలిలో తెల్లవారుజాముననే టాల్ స్టాయ్ లేచి తన స్వంత ఎస్టేట్ యాస్నా పోల్యానా వదిలి బాహ్య ప్రపంచం లోకి వచ్చేశాడు .ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎక్కడికి వెడుతున్నాడో తెలియదు .తన ఇంట్లో ఇంక ఒక క్షణం కూడా ఉండలేనని ,ఉండరాదని మాత్రం నిశ్చయించుకొని బయట పడ్డాడు ఆమహా రచయిత.అయనను అమితంగా ఆరాధించే కూతురు అలేక్సా౦డ్రా తండ్రిని ఆయన సోదరి ఉండే ఒక కాన్వెంట్ దగ్గర కలుసుకోగలిగింది . మర్నాడు తండ్రీ కూతురు కలిసి తెలియని దూర తీరాలకు ప్రయాణం చేశారు .లియో చలితో వణికి పోతున్నాడు .జ్వరం తీవ్రంగా ఉంది వీళ్ళు ఎక్కిన రైలు  ఆష్టా పోవో స్టేషన్ లో ఆగింది .స్టేషన్ మాస్టర్ దయ తలచి తను ఉంటున్న ఇంటిలో ఆతిధ్యమిచాడు .అప్పటికే న్యుమోనియా సోకి బాధపడుతున్నాడు .టాల్ స్టాయ్ ఇల్లు వదిలి వేల్లిపోయాడన్న వార్త  గుప్పుమన్నది .ప్రపంచం అంతా ఆయన పక్షాన నిలిచింది .ఆస్టా పోవోగ్రామం అంతా జనసముద్రమై ఉప్పొంగింది .విలేకరులు ,ఫోటోగ్రాఫర్లు ,అధికారులు ,గూఢచారి పోలీసులు ,శిష్యులు ,కొడుకులు ,కూతుళ్ళు బంధుజనం అభిమానులు ఆసక్తి పరులతో అంతా హడావిడిగా ఉంది .భార్య సోన్యా కూడా చూడటానికి వచ్చింది కాని భర్త ఆమెను తన రూమ్ లోకి రానివ్వ వద్దని ఆంక్ష విధించాడు  .మర్నాడు నవంబర్ 7 ఉదయం టాల్ స్టాయ్ స్పృహ కోల్పోయే దాకా ఆమెను లోనికి రానివ్వలేదు .ఆ తర్వాతే అనుమతించారు .కొన్ని గంటల తర్వాత ఆయన ఆయాస పడి గాలి పీల్చుకోవటానికి చాలా కష్టపడి చివరికి అంతిమ శ్వాస వదిలాడు .

టాల్ స్టాయ్ తప్పులేమీ చేయని వాడూ ,మహోన్నతుడూ కాకపోయినా ఆయన రష్యాసాహిత్య చరిత్రలో ఒక విస్తృత విశాల మానవుడు ,అంతకు మించి అత్యంత గొప్ప నైతిక బలమున్నవాడు అనటం లో సందేహం లేదన్నాడు రచయిత లూయీ అంటర్ మేయర్ .

టాలెస్ట్ రైటర్, ఫిలాసఫర్ పసిఫిస్ట్   టాల్ స్టాయ్

నవలాకారులలో అత్యున్నతుడు లియో అంది వర్జీనియా ఉల్ఫ్ .జేమ్స్ జాయిస్ ‘’he is never dull ,never tired ,never pedantic ,never theatrical ‘’అన్నాడు .డాస్తో విస్కీ ‘’సజీవనవలాకారుల్లో గొప్పవాడు ‘’అంటే, ఫ్లాబర్ట్ వార్ అండ్ పీస్ చదివి ‘’ఆయనలో కళాకారుడు ,సైకాలజిస్టూ’’ఉన్నారన్నాడు .’’seldom art work so much like nature’’అనిపోగిడాడు ధామస్ మాన్ .ప్రౌస్ట్ ,ఫాక్నర్ ,నబకోవ్ లదీ ఇదే అభిప్రాయం .

టాల్ స్టాయ్  ప్రైవేట్ ప్రాపర్టీ కింద భూములు ఉండటానికి ఇష్టపడలేదు .ఫాదర్ సేర్జియాస్ ను చెకోవ్ కు గోర్కీ కి చదివి వినిపిస్తూ చివర్లో టాల్ స్టాయ్ కన్నీళ్లు ఆపుకోలేక కార్చేశాడు .ఆయన గాంధీగారికి రాసిన ఉత్తరం ‘’ఏ లెటర్ టు ఎ హిందూ ‘’పేరున ప్రసిద్ధి చెందింది .మహాత్ముడు ఆయనను ‘’the greatest apostle of non violence that the present age has produced ‘’అని శ్లాఘించాడు .దక్షిణాఫ్రికాలో ఏర్పాటు చేసిన రెండవ కాలనీకి గాంధీగారు ‘’టాల్ స్టాయ్ కాలని ‘’అని గౌరవ నామ కరణం చేశాడు .అంతర్జాతీయం గా భాషలన్నిటికి ఏక భాష  ‘’ఎస్పరాంటో ‘’ఉండాలని ఆశించాడు లియో .డొకో భోర్ 1895లో తమ వద్ద ఉన్న ఆయుధాలను తగల బెట్టి శాంతి ఉద్యమాన్నిచేయటాన్ని  సమర్ధించాడు .వారి భావాలను అంతర్జాతీయ వేదికపై చర్చి౦చాడు కూడా.డొకో బోర్లు కెనడాకి వలసపోవటానికి సహాయ పడ్డాడు లియో . 1904జపాన్ –రష్యా యుద్ధాన్ని వ్యతిరేకించన శాంతి కాముకుడు టాల్ స్టాయ్ .

Image result for tolstoy

మరో ప్రముఖవ్యక్తితో కలుద్దాం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -11-4-15 –ఉయ్యూరు

 

.

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.