తమిళ నేతల అనవసర రాద్ధాంతం

తమిళ నేతల అనవసర రాద్ధాంతం

  • – ముదిగొండ శివప్రసాద్ ఫోన్ :040-27425688
  • 08/04/2015
TAGS:

ఆంధ్రుల ఆస్తులు తగులబెట్టండి – ఆంధ్రుల హోటళ్లపై ఆస్తులపై దాడులు చేయండి అంటూ నాన్ తమిళ కచ్చి అనే ఒక తమిళ పార్టీ మంగళవారం మధ్యాహ్నం పిలుపునిచ్చింది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రపటాన్ని తగులబెట్టారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మొసలి కన్నీరు పెట్టారు. వైగో అనే మరొక తమిళనేత, తమిళుల మృతి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇళంగోవన్ చంద్రబాబు ప్రభుత్వాన్ని బెదిరించారు. ఇంతకూ అసలు జరిగిందేమిటి? ఎన్నో సంవత్సరాలుగా తమిళనాడులో, కర్ణాటకలో శేషాచలం అరణ్యాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యాపారం జరుగుతోంది. శేషాచలం అడవులు ప్రతి ఏప్రిల్ నెలలోను తగులబడుతుంటాయి.
ఎర్ర చందనం స్మగ్లర్ వీరప్పన్ అనే గజదొంగ కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ అనే నటుడిని అపహరించాడు. అతడిని విడిపించుకోవడం కోసం రహస్యంగా కోట్లాది రూపాయలు ఆనాటి కర్ణాటక ప్రభుత్వం దొంగల ముఠాకు సమర్పింకొంది. ఎర్రచందనం వస్తువులకు చైనావంటి దేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఈ కారణం చేత కావేరీ నదిలో ఎర్రచందనం దుంగలు నరికి పడేస్తుంటారు. వాటిని పట్టుకొని మరపడవల ద్వారా మాఫియా ముఠాలు గమ్యస్థానానికి చేరుస్తుంటాయి. ఈ అంశంపై లోగడ తమిళంలో రెండు సినిమాలు కూడా వచ్చాయి. ఎర్ర చందనం స్మగ్లర్లు బడా పారిశ్రామిక వేత్తలు రాజకీయ ప్రాబల్యం కలవారు.
శేషాచలం అడవుల్లోని చందనం దొంగలు ఎక్కువమంది తమిళ కూలీలు. వారు పూట గడవక ఈ రహస్య వ్యాపారంలోకి దిగారనేది బహిరంగ సత్యం. ఐతే అసలు విషయం అదికాదు. ఇన్నాళ్లు ఎర్రచందనం దొంగలు ఫారెస్టు ఆఫీసర్ల మీద దాడులు చేస్తూ వచ్చారు. పోలీసులను చంపారు. అడవులు తగులబెట్టారు. సోమవారం సాయంత్రం కొందరు పోలీసులు అడవుల్లో నిఘా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటే వారిపై చందనం దొంగలు కొడవళ్లతో, వేటకత్తులతో దాడి చేశారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో దాదాపు ఇరవై మంది దొంగలు హతులయ్యారు. అందుకు ప్రతీకారంగా తమిళ పార్టీలు భగ్గుమన్నాయి. ఇది మానవహక్కుల ఉల్లంఘన అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘువీరారెడ్డి ప్రకటన విడుదల చేశారు. మానవహక్కులు హరింపబడ్డాయి అంటూ మానవ హక్కుల సంఘాలవారు కోర్టుకు వెళతామంటూ బెదిరించారు. కోర్టుకు వెళ్లవచ్చు. అందులో తప్పేమీ లేదు. కోర్టు తీర్పు ఎలాగైనా రావచ్చు. కాకుంటే పోలీసులు మానవులు కాదా? వారికి మానవహక్కులు ఉండవా? వారు ఆత్మరక్షణార్ధం కాల్పులు జరపడం భయంకరమైన నేరమా? మానవహక్కులు మృగాలకు కూడా ఉంటాయా? ఎర్ర చందనం దొంగలు, అంతర్జాతీయ ఉగ్రవాదులు, సాయుధ చైనా ప్రేరేపిత బీభత్సకారులు, ‘మానవుల’నే పిలువబడుతారా? శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లినప్పుడు దానిని పరిరక్షించ వలసిన బాధ్యత భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రభుత్వానికి ఉంటుంది. ‘‘మాకు భారత రాజ్యాంగంపై గౌరవం లేదు’’ అనే చందనం దొంగలు, సిమీ ఉగ్రవాదులు, రాజ్యాంగ చట్టాల పరిధిలోకి రారు.
హైదరాబాదు సమీపంలో పెంబర్తి వద్ద మంగళవారం ఒక ఎన్‌కౌంటర్ జరిగింది. అందులో కరుడు కట్టిన వికారుద్దీన్ జిహాదీ ఉగ్రవాద ముఠా హతమైంది. అంతకు ముందు రెండు రోజుల క్రితం సూర్యాపేట వద్ద జరిగిన ఘటనలో మరో ఇద్దరు సిమీ ఉగ్రవాదులు హతులైనారు. వీరు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా, ఎస్‌ఐ సిద్దయ్య తీవ్రం గా గాయపడ్డారు. దీంతో పోలీసులు కాల్పు లు జరిపారు. సిద్దయ్య రెండు రోజులు మృత్యువుతో పోరాడి మంగళవారం సాయంత్రం కామినేని ఆసుపత్రిలో కన్ను మూసారు. పోలీసులు చనిపోయినప్పుడు నోరెత్తని మానవహక్కుల సంఘాలు, ఉగ్రవాదులు చనిపోతే గౌతమ బుద్ధుని శాంతి సూక్తాలు ఎందుకు పఠిస్తున్నారు?
పాపం ముస్లింలు చనిపోయారంటున్నారు. అంటే ఉగ్రవాది ముస్లిం అయితే అతడు మైనారిటీల రక్షణ పరిధిలోకి వస్తాడా? తమిళనాడుకు చెందిన నిమ్నజాతి చందనం దొంగలను చంపడం దారుణం అని కరుణానిధి ప్రకటించాడు. అంటే ఒక ఉగ్రవాది తమిళ జాతీయుడైనా అతనిపై చర్య తీసుకోకూడదు. అతడు తక్కువ కులంలో జన్మించినవాడైతే అతనిని వదిలిపెట్టవలసిందే. సింహళంలో వేలుపిళ్లై ప్రభాకరన్ అంతర్జాతీయ ఉగ్రవాది. అతనికి తమిళనాడు ప్రభుత్వం ప్రత్యక్షంగా మద్దతునిచ్చింది. ఫలితంగా అప్పుడు కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. తమిళ ఉగ్రవాదులు రాజీవ్ గాంధీని శ్రీ పెరంబుదూర్‌లో పొట్టన పెట్టుకున్నారు. ఇంత జరిగినా కాంగ్రెస్ నాయకులు ఉగ్రవాదులను సమర్ధించడం ఏమిటి? చంద్రబాబు నాయుడును ఇరుకున పెడితే మళ్లీ రఘువీరారెడ్డి లేదా సోనియాగాంధీ అధికారంలోకి వస్తారా? అంటే రాజకీయ లబ్దికోసం దేశాన్ని వెండిపళ్లెంలో పెట్టి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్‌కు అందజేయడానికి కాంగ్రెస్ నాయకులు, తమిళ రాజకీయ పార్టీల వారు సిద్ధంగా ఉన్నారనేది ఇక్కడ సారాంశం. భారతదేశ చరిత్రలో ఇలా చాలాసార్లు జరిగింది.
తమిళ స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో చనిపోతే తమిళ నాయకులు చెన్నైలోని తెలుగు హోటళ్లపై దాడి చేస్తారట. జయలలితను కర్ణాటక కోర్టు శిక్షిస్తే బెంగళూరులోని కన్నడ హోటళ్లలో విధ్వంసానికి తమిళ సేన బెంగళూరుకు చేరడం ఇటీవలి చరిత్రయే.
‘‘సిమి ఉగ్రవాదులంతా మా పిల్లలు, మా సమాజ్‌వాది పార్టీ పొలిటికల్ వింగ్ అనుబంధంగా ఉండే విద్యార్థి సాంస్కృతిక విభాగం (స్టూడెంట్స్ కల్చరల్ వింగ్)’’..ఈ మాట అన్నది స్వయంగా ములాయం ఖాన్ సింగ్! ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యుడీయన. ఈయన 75వ జన్మదిన వేడుకలకు రాంపూర్‌లో కోట్లు ఖర్చు పెట్టారు. ఇంత డబ్బు మీకెక్కడిది? అని ప్రశ్నిస్తే..‘‘మాకు మాఫియా గ్యాంగ్ లీడర్ దావూద్ ఇబ్రహీం ఇచ్చాడు’’ అని పార్టీ నాయకులు చెప్పారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వీళ్లా మన రాజకీయ నేతలు?
కరుణానిధి కుమార్తె కనుమొజి బంధువులు మారన్ ప్రభృతులు 2-జి వాయు తరంగాల విక్రయం కేసులో వేల కోట్లు దిగమింగారు. అందుకు కనుమొజిని తీహార్ జైలులో పెట్టారు. అందుకు కరుణానిధి ఢిల్లీ వెళ్లి ‘నా కూతురును వదిలిపెట్టి కేసులు రద్దు చేస్తారా? లేక యుపిఎ ప్రభుత్వానికి నా మద్దతును ఉపసంహరించుకోమంటారా?’’ అంటూ కేంద్రాన్ని బెదిరించాడు. వీళ్లా మన రాజకీయ నాయకులు? వీళ్ల చేతిలో భారత జాతి సురక్షితంగా ఉంటుందా?
ఇప్పుడు కొన్ని విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. అంతర్జాతీయ ఇస్లామిక్ జిహాదీ ఉగ్రవాద ముఠాలకు, చైనా ప్రేరేపిత సాయుధ ఉగ్రవాదులకు, తమిళనాడు నాస్తిక ఉగ్రవాదులకు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. ఎర్ర చందనం వ్యాపారాలు జరుపుతున్నది తమిళనాడుకు చెందిన బడా రాజకీయవేత్తలే. ఈ చనిపోయిన కూలీలు పొట్టకూటికోసం ఉగ్రవాద ముఠాల చేతిలో పావులుగా ఉపయోగపడ్డారు.
వేలుపిళ్లై ప్రభాకరన్ చేసిన దారుణాలకు జాఫ్నా, కచ్చైతీవు, వంటి ప్రాంతాలలో వేలాది మంది అమాయక తమిళ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మురుగన్ (కుమారస్వామి), పిళ్లియార్ (గణేశ్ దేవాలయాలు) నేలమట్టమైనాయి. ప్రభాకరన్ సకుటుంబంగా భారీ మూల్యం చెల్లించాడు. చివరి దశలో వృద్ధ తమిళ నేత కరుణానిధి ఇంకా ఉగ్రవాదులను వెనుకేసుకురావడం ఏమిటి?
1948 ప్రాంతంలో మద్రాసు ప్రావెన్సీస్‌లో ప్రత్యేకాంధ్ర ఉద్యమం సాగింది అప్పుడు 60శాతం తెలుగు భాషా ప్రాంతాలైన మద్రాసు, తిరుత్తరణి, కృష్ణగిరి, హోసూరు వంటి వాటిని తమిళనాడుకు వదులుకున్నారు. ఇప్పుడు అక్కడి తెలుగు మీడియం పాఠశాలను నడిపితే (కృష్ణగిరిలో) దాడి చేశారు. పాండిచ్చేరిలో సంస్కృ త శిక్షణా శిబిరం నడిపితే దాడి చేశారు. తమిళ భాషీయులైన స్మగ్లర్లను వెనకేసుకొని వస్తున్నారు. చిదంబరం.. కనుమొజి, కరుణానిధి, దయానిధి, కళానిధి మారన్‌ల వేల కోట్ల కుంభకోణాలను కేవలం తమిళ భాషీయలనే సాకుతో ఉపేక్షించారు. ఇది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు కాదా? స్వచ్ఛ భారత్- మేకిన్ ఇండియా చాలా మంచి నినాదాలే. కానీ ఉగ్రవాదం, నేటి అగ్రవాదం, దీనిని ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వంవారు ఎలా సమర్ధవంతంగా ఎదుర్కొంటారన్నది ఇక మీద చూడాలి.
మంగళవారం తెలంగాణ ప్రభుత్వానికి, ఉగ్రవాదులు సవాలు విసిరారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ మద్దతు కోల్పోతామేమోనన్న సంకుచిత దృష్టి పోకడతో తెలంగాణ సర్కార్ వ్యవహరించరాదు. ఎందుకంటె భారతదేశంలోని అన్ని ఉగ్రవాద కార్యకలాపాల జాతీయ మూలాలు హైదారాబాదు పాతబస్తీలోనే ఉన్నాయి.
మక్కా మసీదు, గోకుల్ ఛాట్, దిల్‌సుఖ్ నగర్ సాయిబాబాగుడి, సూర్యాపేట బస్టాండ్, పెంబర్తి (నేటి ఘటన)- ఇవన్నీ ఉగ్రవాద సంఘటనలే. ఉగ్రవాదులను నిర్లక్ష్యం చేస్తే నేడు సిద్దయ్య, నాగరాజు వంటి తెలంగాణ ముద్దుబిడ్డలైన పోలీసులు చేసిన త్యాగాలు నిష్ఫలవౌతాయి. ఆనాటి దొడ్డి కొమురయ్య, ఐలమ్మ, కొమురం భీం బలిదానాల వంటివే నేటి నాగరాజు, సిద్దయ్యల ఆత్మార్పణం. నష్టపరిహారం ద్వారా త్యాగాలకు విలువ కట్టలేం. ఉగ్రవాదాన్ని హైదరాబాదులో నిర్మూలించడమే వారికి సరియైన నివాళి. సీమాంధ్రలో అటు చంద్రబాబునాయుడు, ఇటు నాయని నరసింహారెడ్డి, ఢిల్లీలో రాజ్‌నాథ్ సింగ్‌లకు ఇదొక పరీక్ష వంటిది.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.