ఆనంద రామాయణ విశేషాలు -1

ఆనంద రామాయణ విశేషాలు -1

శ్రీమద్రామాయణం మన తొలికావ్యం .వాల్మీకి మహర్షి కృతం .ఈ మహర్షి ఆనందరామాయణం ,ఆధ్యాత్మ రామాయణం ,వాసిష్ట రామాయణం అనబడే యోగ వాసిస్టం కూడా రాశాడు . ఆనందరామాయణం లో శ్రీరాముని ఆనందమయ స్వరూపునిగా అభివర్ణించాడు వాల్మీకి .ఇందులో మనం ఇదివరకు వినని చూడని విశేషాలున్నాయి .వాటిని తెలియ జేయటానికే ఈ ప్రయత్నం .శివుడు పార్వతికి చెప్పిన కధలే ఇవన్నీ . బ్రహ్మశ్రీ సిద్ధాంతి శివ శంకర శాస్త్రులుగారు తెలుగు తాత్పర్యం రాసిన  ఈ గ్రంధాన్ని మూడు సంపుటాలుగా ‘’సర్వారాయా ధార్మికవిద్యా  ట్రస్ట్ –కాకినాడ- తూర్పు గోదావరిజిల్లా -533001’’వారు 2005లో పునర్ముద్రించారు .దీన్ని ఉయ్యూరు లైబ్రరీలో నుంచి తెచ్చి చూశాను .ఆ విశేషాలు అందరికి తెలియజేయాలనే ఉత్సుకతే ఈ ప్రయత్నం .

రాముడు  జరుపుకొన్న దీపావళి

సీతారాముల వివాహమై అయోధ్యలో హాయిగా ఆనందాన్ని అనుభ విస్తున్నారు .శరత్కాలం లో ఆశ్వయుజమాసం లో జనకమహారాజు వియ్యంకుడు దాశరధ మహా రాజును మిధిలకు సగౌరవం గా ఆహ్వానించటానికి మంత్రులను పంపాడు .దశరధుడు వారికి యధోచిత అతిధి మర్యాదలు నిర్వహించాడు .వారిని వచ్చిన కారణం అడిగాడు .అప్పుడు మంత్రులు ‘’దీపావల్యుత్స వార్ధం త్వాం సకుటుంబ సమంత్రిణం-పౌర జాన పదైస్సౌక మాహ్వాయామాస తేసుహృత్ ‘’అన్నారు ‘’మహారాజా!మీ మిత్రులు జనక మహారాజు మిమ్మల్ని సకుటుంబ పరివారం గా దీపావళి మహోత్సవానికి దయ చేయవలసినదిగా ప్రార్ధించారు ‘’అని వినయంగా చెప్పారు .

దశరధుడు అంగీకరించి ఈ విషయాన్నిదేశం లో  అందరికి తెలియ జేసేట్లు చాటింపు వేయించాడు .మంచి ముహూర్తం చూసుకొని పౌరులతో సకుటుంబం గా మిధిలకు ప్రయాణం సాగించాడు .శ్రీ సీతారామ లక్ష్మణులు ,కౌసల్యాది మాతలు ,సీత మొదలైన రాజ పత్నులు ఏనుగులను ఎక్కి ,దాస దాసీ జనాలతో మహా వైభవం గా ,మహోత్సవంగా బయల్దేరారు .వియ్యంకుని రాక  విషయం తెలిసిన మిదిలాదీశుడు అంతే వైభవం గా వారికి స్వాగత సత్కారాలు చేయటానికి సన్నద్ధుడై బంధు మిత్ర పరివారసమేతంగా ఎదురు వెళ్లి స్వాగతించాడు .మంగళ వాద్యాలతో నృత్యం చేసే నర్తకీ మణులతో మేడ పైభాగాలనుండి  పౌర స్త్రీలు చల్లే పుష్ప వర్షం తో మిధిలా అంతా పండుగ వాతావరణం లో ఉంది అందరికీ తమ ఇంటికే అమ్మాయి అల్లుడు వస్తున్న అనుభూతి పొందారు .దశరాదులకు ఆర్గ్య పాద్యాదులు సమర్పించి బందుగణాన్ని సాదరంగా జనకర్షి ఆహ్వానించి రాజభవనానికి తోడ్కొని వెళ్ళాడు .

అందరికి నూతన వస్త్రాలు సమర్పించి ,మ్రుస్టాన్న భోజనాలతో విందు చేసి అల్లుళ్ళను రత్నదీప కాంతులతో అలరించాడు .’’జనకః పూజయామాస దీపావల్యాం మహాదినే –దీపోత్సవై ర్మహా పుణ్యే బలిరాజ్యం ప్రవర్తితే –ఆనంద సర్వలోకానాం మంగళాని గృహే గృహే ‘’మహా పుణ్యమైన దీపావళి రోజున ప్రతి ఇంటా సర్వలోకానందం వెల్లి  విరిసేట్లు మహా ఉత్సవం జరిపించాడు .అప్పుడు బలి రాజ్యం సర్వ శోభాయమానమై వెలిగిపోతుంది .అల్లుళ్ళకు అభ్యంగన స్నానాలు చేయించి భోజన భాజనాదులు సమకూర్చి గోవులు దాస దాసీజనం ,చతురంగ సైన్యం సమర్పించి సంతృప్తి చెందాడు .అలాగే జానకీ మొదలైన కుమార్తెలకు సముచిత పుట్ట్టింటి మర్యాదలు జరిపాడు .వచ్చిన అయోధ్యావాసులన్దరిని మహా గౌరవం గా సత్కరించాడు .జనక మహారాజు ఎవరికీ ఏ లోపమూ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నాడు .వియ్యంకుని ఇంటిలో దీపావళి మహోత్సవాన్ని కుమారులు కోడళ్ళు భార్యలు మంత్రి పురోహితులు ,పురజనుల సమేతంగా సంతృప్తిగా ఆనందంగా జరుపుకొని దశరధుడు మరల అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యాడు .ఇదీ ఆనంద రామాయణం లో రామాదులు జరుపుకొన్న మొదటి దీపావళి పండుగ .

దారిలో ఉండగా సీతా స్వయం వరం లో ధనుర్భంగం చేయలేక హతాశులైన వివిధ రాజులుఅందరు కలిసి  పగ బట్టి శదశరధుని  పై కి దండ యాత్రగా వచ్చి ముట్టడించారు .కంగారుపడ్డాడు దశరధుడు .రాముడు లక్ష్మణ సమేతం గా తండ్రిని సమీపించి తానూ ఉండగా భయ పడాల్సినదేమీ లేదని తండ్రికి చెప్పాడు .అప్పుడాయన ‘’నీకు పదహారు ఏళ్లుమాత్రమే .వాళ్ళు నామీదకు వచ్చారు .నేనే తేలుస్తాను ‘’అన్నాడు .రాముడు ‘’నేను చేయలేనప్పుడు మీరు నాకు సహాయం రావచ్చు .మనవారందరి యోగ క్షేమాలు చూస్తూ ఉండండి ‘’అని విన్న వించాడు .ఆలస్యం అమృతం విషం అని శ్రీరాముడు ధనుర్బాణాలు తీసుకొని తండ్రి రధం ఎక్కి  శత్రురాజులపై కి వెళ్ళాడు  .మహా తేజం తో ఉన్న రాముని చూసి వారందరూ  ముందుభయపడినా తర్వాత యుద్ధానికి దిగారు .భీకర యుద్ధం జరిగింది .లక్ష్మణ భారత శత్రుఘ్నులూ యుద్ధానికి దిగారు .శత్రురాజులు భారత శత్రుఘ్నులను బాణాలతో మూర్చ పోయేట్లు చేశారు .ఆగ్రహించిన లక్ష్మణుడు కూడా వారితో తాలపడ్డాడు కాని శక్తి చాలక పోయింది .ఇక ఉపేక్ష చేయరాదని రాముడు రాజులపై వారి సైన్యం పై వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి ,సముద్ర తీరం వరకు తరిమేశాడు .మిగిలిన వారిపై మోహనాస్త్రాన్ని ప్రయోగించి మూర్చిల్ల జేశాడు .

భరతుని ఒడిలోకి తీసుకొని కైక ఏడవటం ప్రారంభించింది .వారిని అందర్నీ సమాధాన పరచి లక్ష్మణుడిని దగ్గరలో ఉన్న ముద్గల ముని ఆశ్రమానికిఆయుధాలు లేకుండా  వెళ్లి అక్కడున్న సంజీవిని మొదలైన ఓషధులను అడిగి తీసుకొని రమ్మని పంపాడు .శిష్యులవలన లక్ష్మణ ఆగమన వార్త విని ముని సంతోషించి సంజీవిని ని ఇచ్చి పంపాడు. దానితో భారత శత్రుఘ్నుల మూర్చ  నుండి రాముడు తేరుకోనేట్లు చేశాడు .ముని దశరాధులకు స్వాగతమిచ్చి శ్రీరామ దర్శనం తో పులకి౦చిపోయాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-4-15- ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.