ఆర్టిస్టులంతా కలిసే ఉంటాం

ఆర్టిస్టులంతా కలిసే ఉంటాం

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ (మా) ఎన్నికలంటే.. ఎప్పుడు జరిగాయో.. ఎప్పుడు ముగిశాయో సామాన్యులకు తెలిసేది కాదు. అదంతా ఫిల్మ్‌నగర్‌ వ్యవహారం అనుకునేవారు. కాని ఈ సారి వేసవి ఉక్కపోతలాగ.. ఫిల్మ్‌నగర్‌ మొత్తం ఎన్నికల హీట్‌తో ఉడికిపోయింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, వివాదాస్పద వ్యాఖ్యలతో.. రాజకీయ పార్టీలను తలపించాయంటే అతిశయోక్తి కాదు. ఉత్కంఠరేపిన ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా రాజేంద్రప్రసాద్‌ అనూహ్య విజయం సాధించారు. నటీనటుల అభినందనల ఆనందహేళలో తడిసిముద్దవుతున్న ఆ నట కిరీటి ఏమంటున్నారో చూద్దాం..
ఈ సారి ‘మా’ ఎన్నికలకు ఎందుకింత క్రేజ్‌ ఏర్పడింది?

ఎందుకో ఈ ఎన్నికల మీదే అందరి దృష్టి పడింది. సామాన్య ప్రజలు కూడా చాలా ఆసక్తి కనబరిచారు. ఇదివరకు ‘మా’ ఎన్నికలంటే కేవలం నటులు మాత్రమే పట్టించుకునేవారు. ఇప్పుడు మీడియా పుణ్యమాని ఈ ఎన్నికలకు ఎక్కడలేని క్రేజ్‌ వచ్చింది. మీడియా కూడా ఉన్నది ఉన్నట్లు.. చూపిస్తూ వచ్చింది. మార్పు అవసరం అనే విషయం అందరికీ అర్థమైంది. ఊరిలో ఉన్న మా అన్నయ్య కూడా మొన్న ఫోన్‌ చేసి.. ‘రిజల్ట్ట్‌ ఎప్పుడొస్తుంది? ఇక్కడ టెన్షన్‌తో ఎదురుచూస్తున్నాం. మా పక్కింటి వాళ్లు ఏమైంది ఏమైంది అని పదే పదే అడుగుతున్నారు..’ అని అడిగాడు. మా అన్నయ్యే కాదు. ఎక్కడెక్కడి నుంచో నాకు ఒక్కటే ఫోన్లు. అమెరికా, ఆసే్ట్రలియాల్లోని తెలుగు వాళ్లు కూడా ఆరా తీశారు. వాటీజ్‌ రాజేంద్రప్రసాద్‌, వాటీజ్‌ మా ఎలక్షన్స్‌ అన్నది ఒక్క పెద్దటాపిక్‌ అయిపోయింది. నేను ‘మా’ అధ్యక్షుడిని ఎందుకు అవ్వాలనుకుంటున్నాను’ అన్నది అందర్నీ ఆకట్టుకుంది. నా మీద ఇంతమంది ఆశపెట్టుకున్నారు కనక.. ఇప్పుడు నూరుశాతం బాధ్యత పెరిగింది.

మీరు బలవంతంగా ఈ పోటీలోకి దిగారా? ఎప్పుడైనా ఎందుకొచ్చానురా దేవుడా అనిపించిందా?

నేను దేని గురించి అయినా చాలా ఆలోచిస్తాను. అయితే ఒక్కసారి ఆలోచించి రంగంలోకి దిగానంటే చావో రేవో తేల్చుకునే వరకు వెళతాను. అవసరమైతే పోరాడుతూ పోయినా పరవాలేదనుకునే మనస్తత్వం నాది. పోటీకి ముందు పరిశ్రమకు చెందిన కొందరు ఆత్మీయులు నావద్దకు వచ్చి.. ‘మీరు అయితేనే ఈ పోటీకి కరెక్టు. అందరికీ కావాల్సిన వారు. దయచేసి కాదనకండి’ అని అడిగారు. ‘మీ అందరి అండ ఉంటే నేను తప్పక నిలబడతాను’ అని వారికి హామీ ఇచ్చాను. చెప్పినట్లే పోటీకి నిల్చున్నా. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా వెనకడుగు వేయలేదు. పరిశ్రమలోని చిన్న కళాకారుల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ మద్దతు ఇచ్చారు. 37 ఏళ్లుగా నేను నటునిగా అందర్నీ నవ్విస్తున్నాను. రోజూ టీవీల్లోను, సినిమాల్లోను నన్ను చూస్తూనే ఉన్నారు. అందుకని సామాన్య ప్రజలు కూడా నేను గెలవాలని కోరుకున్నాను.

ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. మళ్లీ ఆర్టిస్టులంతా ఐకమత్యంగా ఉండగలుగుతారా..?

ఎందుకు ఉండమూ! మేమెప్పుడూ కలిసే పనిచేస్తాము. ఒకర్నొకరు పొడుచుకోలేదు కదా! కళాకారునికి ఒక సౌలభ్యం ఉంది. వ్యక్తిగతంగా ఎన్ని బాధలు ఉన్నప్పటికీ.. కెమెరా ముందుకు వెళ్లాక నవ్వించే సీన్‌ వస్తే నవ్వించాలి అంతే! నటన అన్నిటినీ మరిచిపోయేలా చేస్తుంది. కాబట్టి అన్ని మరిచిపోయి అందరం కలిసి మళ్లీ నటనలో మునిగిపోతాము. ఏదీ మనసులో పెట్టుకోము. పాలకుండలో మూడు విషపు చుక్కలు పడినట్లు.. కొందరు కావాలనే పనిగట్టుకుని మా అధ్యక్ష ఎన్నికలను ఇలా చేశారు కాని.. ఇంతకుమించి మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.

తెలుగు నటులకు మీరు కొత్త అధ్యక్షునిగా ఏం చేయాలనుకున్నారు?

నేను ఎన్నికైనా వెంటనే నటీనటులకు పెన్షన్లు, హెల్త్‌కార్డుల మంజూరుకు కృషి చేస్తాను. కొత్తకాపురం పెట్టగానే అయిపోదు కదా! ఇప్పుడే పెళ్లి అయింది. మిగిలినవన్నీ మెల్లమెల్లగా జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలను సమీక్షిస్తాను. అనుకున్న పనులన్నింటినీ అమలయ్యేలా కృషి చేస్తాను. ఈ నిమిషం నుంచి నేను మా కార్యాలయం వెళ్లినప్పుడు కనీసం టీ కూడా తాగను. అంత కచ్చితంగా ఉంటాను.

ఈ గెలుపుతో కృష్ణానగర్‌కు, ఫిల్మ్‌నగర్‌కు మధ్యనున్న గోడ బద్ధలైందా?

అందరూ కోరుకున్నట్లే ఇప్పుడు పగిలిపోయిందిగా. ఇక శుభ్రం కావడమే మిగిలింది.
ఎన్నికలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మళ్లీ ఎలా కలిసిపోగలరు?
మేమందరం కళాకారులం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి.. ఇలా అందరం ఒకే చోట కలిసి బతుకుతున్నాం. నేను ఇతరుల గురించి ఆలోచించే మనిషిని. నేను ఎప్పుడైనా అన్నం తింటున్నప్పుడు అటూఇటూ నిల్చున్న వాళ్ల ప్లేట్ల వైపు చూసి.. ఒకవేళ అన్నం లేకపోతే.. నా ప్లేట్‌లోని అన్నం ముద్దను తీసి వారికి పెట్టే అలవాటు నాది. కాబట్టి ప్రతి కళాకారుని కష్టం నాకు తెలుసు.

ఇప్పటి వరకు ‘మా’కు ఒక మహిళ అధ్యక్షురాలు కాలేదు. జయసుధ మీద పోటీకి నిల్చున్నప్పుడు మీకేమనిపించింది?
అసలు ఆమెకు పోటీగా నిల్చునేకంటే ముందు తోటి మద్దతుదారులతో కలిసి ఈ విషయం మీద చాలా ఆలోచనలు చేశాము. ‘పోటీకి దిగిన ఒక ఆడపిల్లకు మనమేమైనా అన్యాయం చేస్తున్నామా?’ అని అంతర్మథనం చేశాం. అయితే ఒక మహిళను అధ్యక్షురాలిని చేయాలన్న నిజాయితీతో ఆమెను ఎదుటి వర్గం నిల్చోబెట్టలేదు. కావాలనే మహిళను ఎంచుకుని పోటీకి పెట్టినట్లు నాకు అనిపించింది. అందుకనే తప్పనిసరిగా నేను రంగంలోకి దిగాల్సి వచ్చింది. అంతకు మించి నాకు ఎవరి మీద ద్వేషం లేదు.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.