నిజరూపం… అపురూపం ( అప్పన్న చందనోత్సవం)

నిజరూపం… అపురూపం ( అప్పన్న చందనోత్సవం)

  • 19/04/2015
  • -విద్యాశంకర్

సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం!! శ్రీ వరాహ లక్ష్మీనారసింహుని వైభవం ఈ స్తోత్రంలో మనకు దర్శనమిస్తుంది. ప్రహ్లాదుని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు నరసింహుడిగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. అలాగే ప్రహ్లాదుని కోరిక మేరకే, వరాహ నారసింహ అవతారాల కలయికతో ఇలపై వెలసిన దివ్యక్షేత్రం సింహాచలం. శ్రీ చందన పరిమళాలు, సంపెంగల సౌరభాలు, ప్రకృతి రమణీయతతో శోభిల్లే సింహాచల క్షేత్రం ఇతర నృసింహ క్షేత్రాలకు భిన్నమైనది. మహా విశాఖ నగరంలో అంతర్లీనమై విరాజిల్లుతున్న ఈ క్షేత్రం ఎన్నో మహిమాన్విత విశేషాలను, చారిత్రక ఘట్టాలను తనలో ఇముడ్చుకొని ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతోంది. భారతావనిలో వరాహ నారసింహావతారాల కలయికలో శ్రీ మహావిష్ణువు స్వయంభువుగా వెలసిన ఏకైక మహా పుణ్యక్షేత్రం సింహాచలం. ఇక్కడ స్వామి వరాహ వదనంతో, మానవ శరీరంతో, సింహ వాలంతో విలక్షణ మూర్తిగా భక్తులకు దర్శనమిస్తారు. ఏడాదిలో 364 రోజులూ సుగంధ పరిమళ చందనమై పూతలో దర్శనమిచ్చే స్వామి ఒక్కనాడు అంటే వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రమే అదీ ఓ పూట శ్రీచందన ముసుగును తొలగించి భక్తులకు నిజరూప దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. అదే స్వామివారి చందన యాత్రగా ప్రసిద్ధికెక్కింది. ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీన జరగనున్న స్వామి నిజరూప దర్శనం కోసం దేశం నలుమూలల నుండే కాక విదేశాలలో స్థిరపడ్డ భారతీయులు సైతం తరలి రావడానికి సిద్ధమైనారు. క్షేత్ర మహాత్మ్యం కుందాభ సుందర తనుః పరిపూర్ణ / చంద్రబింబానుకారి వదన ద్విభుజస్ర్తీ నేత్రః శాంతస్ర్తీభంగి లలితః క్షితి గుప్తపాదః / సింహాచలే జయతి దేవ వరోనృసింహః ఇచ్చట వెలసిన శ్రీ వరాహ నారసింహుడు సుందరమైన తనువు కలవాడు. పూర్ణ చంద్రుని వంటి మేనిఛాయ కలవాడు, ద్విభుజుడు, త్రినేత్రుడు, శాంతమూర్తి, శరీరమందు మూడు వంకలు కలవాడు, భూమి లోపల పాదాలు నిక్షిప్తమై యున్నవాడు అంటూ స్వామి విలక్షణ స్వభావ స్వరూపాన్ని క్షేత్ర మహాత్మ్యం వర్ణిస్తోంది. అంతేకాక స్వామి అంతర్లీనంగా వామనమూర్తి రూపాంతరాన్ని పొందియున్నాడని అందుకే స్వామి నిజ రూపం కురచగా దర్శనమిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న వైవస్వత మన్వంతరానికి శే్వత వరాహ స్వామి అధిపతి అయినందువలన, ఇచ్చట నెలకొన్న స్వామి శే్వత వరాహస్వామే కావడం వలన స్వామిని దర్శించి తీరాల్సిందేనని క్షేత్ర మహాత్మ్యం స్పష్టం చేస్తోంది. చందనోత్సవం జరిగేదిలా… చల్లని చందనపు ముసుగులో ఉన్న చక్కని స్వామిని చూసేందుకు భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వైశాఖ శుక్ల తదియ (అక్షయ తృతీయ) పర్వదినం సమీపిస్తుండగా, స్వామిని అర్చక స్వాములు, పండితులు వేద మంత్రోచ్ఛారణలు చేస్తుండగా, నాదస్వర మేళతాళాలు మిన్నంటుతుండగా సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు. నిత్యార్చనలు పూర్తయిన తరువాత బంగారు, వెండి బొరిగెలతో స్వామిపై ఉన్న చందనాన్ని విసర్జింపజేస్తారు. నిజ రూపంలోకి వచ్చిన స్వామి శిరస్సున, ఛాతిపైన చలువ చందనాన్ని ముద్దలుగా ఉంచుతారు. దేవాలయంలో అనూచానంగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరిస్తూ అర్చకులు ఆలయ అధికారులు ధర్మకర్తలైన పూసపాటి వంశీయులకి తొలి దర్శన భాగ్యం కల్పిస్తారు. అనంతరం ప్రముఖులతోపాటు సాధారణ భక్తులకి కూడా ఏకకాలంలో దర్శనం కల్పిస్తారు. రాత్రి తొమ్మిది గంటల వరకు స్వామి వారి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. అనంతరం గంగధార నుండి సహజసిద్ధమైన జలాలను వందలాది మంది శ్రీవైష్ణవ స్వాములు వేయి కడవలతో తీసుకురాగా అర్చకులు స్వామిని అభిషేకిస్తారు. వీటితోపాటు పంచామృతాభిషేకం జరుగుతుంది. అభిషేకాదులు ముగిశాక స్వామికి తొలి విడతగా మూడు మణుగుల శ్రీగంధాన్ని సమర్పించడంతో చందన యాత్ర ముగుస్తుంది. శ్రీ చందనం విశిష్టత చందన చర్చిత నీలకళేబర… అంటూ జయదేవుడు అష్టపదిలో శ్రీహరికి శ్రీచందనంపై ఉన్న మక్కువని కొనియాడాడు. అంతటి విశిష్టమైన సిరిగంధంలోనే నిరంతరం ఉండే సింహాచలేశుని చందనం విషయంలో దేవస్థానం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. తమిళనాడు రాష్ట్రం నుండి ఎంపిక చేసిన మంచి గంధపు చెక్కలు (జాజిపోకల్-1 రకం) కొనుగోలు చేస్తారు. ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అనుమతులతో చెక్కలు దేవాలయానికి తీసుకువస్తారు. ఇలా వచ్చిన చెక్కలను ముందుగా తూకం వేసి అధికారులు భాండాగారంలో భద్రపరుస్తారు. ఏటా సుమారు నూట ఏభై కేజీల చెక్కలు లక్షలాది రూపాయలు వెచ్చించి కొంటారు. చందనం అరగదీత.. ప్రతి ఏటా చైత్ర బహుళ ఏకాదశినాడు గంధపు చెక్కల అరగదీత ప్రక్రియ శాస్త్రోక్తంగా మొదలవుతుంది. చందనం చెక్కలకు మూల విరాట్టు సన్నిధిలో పూజలు చేసి ఆలయ వైదిక పెద్దలు తొలి చందనాన్ని అరగదీస్తారు. ఈ గంధాన్ని స్వామికి నివేదన చేస్తారు. అనంతరం ఆలయ ఉద్యోగులతో గంధం చెక్కల అరగదీత ప్రక్రియ మొదలవుతుంది. స్వామి లెక్క 32… ముప్పై రెండు సంఖ్యకు నరసింహస్వామికి అవినాభావ సంబంధం ఉంది. నారసింహావతారాలు ముప్పై రెండు. నృసింహస్వామి మూల మంత్రంలోని అక్షరాలు ముప్పై రెండు. ఈ ప్రామాణికంలోనే తొలి విడత చందనం సమర్పణకు ముప్పై రెండు కేజీల చెక్కలను అరగదీసి సుమారు నూట ఇరవై ఐదు కేజీల గంధాన్ని అరగదీస్తారు. బేడా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సానలపై ఉద్యోగులు గంధాన్ని అరగదీస్తారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ ప్రక్రియలో ఏ రోజుకారోజు అరగదీసిన గంధాన్ని తూకం వేసి అర్చకులు భాండాగారంలో భద్రపరుస్తారు. చందన యాత్రకు ముందు రోజు గంధంలో సుగంధ ద్రవ్యాలను కలుపుతారు. అలనాడు దుగ్గన బోయెడు స్వామి గాయానికి పూసిన గంధంలో వాడిన సుగంధ ద్రవ్యాలను, వన మూలికలను నేటికీ కలపడం విశేషం. ఇలా వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ పౌర్ణములతో కలుపుకొని నాలుగు విడతలుగా 12 మణుగుల శ్రీగంధాన్ని (సుమారు 500 కేజీలు) స్వామిపై పూతగా వేస్తారు. చందన ప్రసాదం కోసం భక్తుల ఆరాటం ఏడాది పొడుగునా స్వామికి మైపూతగా ఉన్న శ్రీగంధాన్ని ప్రతీ ఏటా దేవస్థానం భక్తులకు ప్రసాదంగా విక్రయిస్తుంది. పది గ్రాముల పాకెట్‌ను పది రూపాయల చొప్పున భక్తులకు విక్రయిస్తారు. రాష్ట్రంలోని ప్రముఖులందరికీ ఈ చందన ప్రసాదాన్ని మర్యాదపూర్వకంగా అందజేస్తూ ఉంటారు. ఉద్యోగులకు నజరానా శ్రమకోర్చి దేవాలయ సంప్రదాయ అనుసారం శ్రీగంధాన్ని అరగదీసే సిబ్బందికి దేవస్థానం ప్రతీ ఏటా ప్రత్యేక ప్రతిఫలాన్ని అందజేస్తుంది. సంప్రదాయ వస్త్రాలతోపాటు కేజీ గంధానికి మూడు కేజీల బియ్యం దేవస్థానం అందిస్తుంది. ఈ బియ్యాన్ని మహా ప్రసాదంగా భావించి ఉద్యోగులు స్వీకరిస్తారు. బరంపురం నుంచి పొత్తివస్త్రం స్వామికి శ్రీచందనంతోపాటు 32 మీటర్ల పొత్తి వస్త్రాన్ని కూడా సమర్పిస్తారు. ఈ వస్త్రాన్ని ఒడిషా రాష్ట్రం బరంపురం నుండి ప్రత్యేకంగా కొనుగోలు చేస్తారు. కరాళచందన సమర్పణ నాలుగు విడతలుగా స్వామికి చందన సమర్పణ పూరె్తైన తరవాత శ్రావణ పౌర్ణమినాడు కరాళ చందన సమర్పణ (అలంకరణ)తో స్వామి చందనపు మైపూతని పూర్తి చేసుకొని నిండైన విగ్రహంతో ప్రకాశిస్తాడు. అవతార రహస్యం తల్లి గర్భం నుండే హరి భక్తిని అలవరచుకున్న పరమ పావనుడు ప్రహ్లాదుడు. కుమారుని హరిభక్తిని సహించలేని హిరణ్య కశిపుడు విష్ణ్భుక్తి వలదని నయానా భయానా చెప్పి, చివరకు అనేక శిక్షలకు గురి చేస్తాడు. ఈ నేపథ్యంలోనే ప్రహ్లాదుని సముద్రంలో పడవేసి కొండను పైన మూతగా వేస్తారు. కొండ కింద ప్రహ్లాదుడు ఆర్తితో త్రాహి.. త్రాహి.. అంటూ రక్షించమని శ్రీహరిని వేడుకుంటాడు. అంతట శ్రీమహావిష్ణువు గరుత్మంతునిపై ప్రహ్లాద రక్షణార్థమై వస్తూ భక్తుని రక్షించాలనే తాపత్రయం హెచ్చుకాగా, గరుత్మంతుడు వేగంగా ఎగురుతూ అలసిపోతుంటే స్వామి తన బొటనవేలు నోటిలో పెట్టి గరుడుడికి అమృతపానం చేయిస్తూ, జారిపోతున్న పట్టు పీతాంబరాన్ని మరొక చేతితో పట్టుకొని వస్తూ ఇంకా వేగం సరిపోక సింహగిరిపై అమాంతం దూకాడట. స్వామి వేగానికి పాదాలు రెండు పాతాళంలో కూరుకుపోయాయట. ప్రహ్లాదుని రక్షించిన స్వామి హిరణ్య కశిప సంహారానంతరం ప్రహ్లాదుని కోరిక మేరకు సింహగిరిపై ద్వయావతార రూపంలో వెలసినట్లు, ప్రహ్లాదుడు కృతయుగాంతం వరకు స్వామిని సేవించి తరించినట్లు స్థల పురాణ గాథ. ప్రహ్లాదుడు నిర్దేశించిన అర్చనా విధానం అలనాడు ప్రహ్లాదుడు తన పరివారంతో స్వామికి పర్ణశాలలు నిర్మింపజేసి, అర్చించి, అభిషేకించి తరించిన విధానానే్న నేటికీ ఆలయంలో కొనసాగింపబడుచున్నదని ప్రతీతి. తరువాత ఏం జరిగిందంటే… ప్రహ్లాదుడి అనంతరం స్వామిని పట్టించుకొనేవారు లేక ఆలయం శిథిలమైంది. స్వామిపై పుట్టలు పెరిగి మరుగున పడిపోయాడు. త్రేతాయుగంలో భారతావనిని పరిపాలిస్తున్న చంద్ర వంశీయుడైన పురూరవ చక్రవర్తి ఒకనాడు ప్రేయసి ఊర్వశితో కలిసి ఆకాశయానం చేస్తూ సింహగిరి పరిసరాలకు రాగానే వారి పుష్పక విమానం నిలిచిపోయింది. విషయం తెలియక పురూరవుడు దిగులు చెందాడు. ఊర్వశి తన దివ్యదృష్టితో తామున్నది పరమ పవిత్రమైన సింహగిరి ప్రాంతమని గ్రహిస్తుంది. ఇక్కడ వరాహ నృసింహుడు కొలువైనాడనీ, స్వామిని దర్శించి తరిద్దామని పురూరవునికి సూచిస్తుంది. పురూరవుడు స్వామి వెదుకులాటలో మూడు రోజులు గడుపుతాడు. ఎంతకీ స్వామి కానరాకపోవడంతో ప్రాయోపవేశానికి సిద్ధపడతాడు. రాత్రి స్వప్నంలో స్వామి సాక్షాత్కరిస్తాడు. తాన పక్కనే ఉన్న పుట్టలో ఉన్నానని గంగధారని ఆనవాలుగా చూపుతాడు. స్వామి ఆదేశానుసారం పురూరవుడు వేయి కడవల నీటితోనూ, పంచమృతాలతో అభిషేకం చేసి స్వామి దర్శనాన్ని పొందుతాడు. అయినను స్వామి పాదాలు కానరాక పురూరవుడు కలత చెందుతాడు. అంత స్వామి పాదాలు ప్రయత్నగోపితాలని షోడశోపచారాలు భక్తితో నెరవేర్చి శ్రీచందనాన్ని ఆచ్ఛాదింపజేయమని, ఏడాదికి ఒక్కనాడే చందనాన్ని తొలగించి నిజరూప దర్శనం చేయమని అశరీరవాణి పలుకుతుంది. పురూరవుడు అలా చేసి తరిస్తాడు. ఆనాడే అక్షయ తృతీయ. ఆనాటి నుండి అక్షయ తృతీయ నాడే స్వామి నిజరూప దర్శనం చేయాలని పురూరవుడు శాసనం చేసినట్లుగా తెలుస్తోంది. దుగ్గనబోయె కథ సింహాచలేశుని పురూరవుడు పుట్ట నుండి వెలికితీసినట్లు మనకు క్షేత్ర మహాత్మ్యం వలన తెలుస్తోంది. కానీ స్వామి చాలా కాలంపాటు ఎటువంటి చందనపు పూతలు లేకుండానే అనేక మందికి దర్శనమిచ్చాడని, పురూరవుని కంటే ముందే దుగ్గన అనే బోయెపల్లెకి చెందిన వ్యక్తి స్వామిని దర్శించాడని స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది. సింహాచల సమీపంలోని బోయెపల్లెకి చెందిన దుగ్గన అనే బోయవాడు పోడు వ్యవసాయం చేస్తూ కొర్రలు పండించేవాడట. అప్పన్న వరాహావతారంలో సంచరిస్తూ కొర్రలు తిని ఆ రుచికి అలవాటు పడ్డాడు. ఏదో జంతువు పంట పాడుచేస్తోందని తలచి మాటున దాగిన దుగ్గడికి వరాహం కనిపించింది. మాటుపెట్టి రొమ్ముపై బల్లెంతో పొడిచాడు. ఆ దెబ్బకు రక్తం కారుతూ వరాహం పుట్టలోకి జొరబడింది. ‘పాము పుట్ట చొచ్చునుగాని పంది జొచ్చునా’ అని ఆశ్చర్యపడిన దుగ్గన పుట్టలో చూడగా రక్తం కారుతున్న వరాహ నృసింహుడు కనిపించాడట. అంతట దుగ్గన బోయెడు సింహగిరిపై లభించే వనమూలికలను చందనపు ముద్దతో రంగరించి స్వామికి పట్టువేశాడట. అంతట స్వామి ఆనతి ప్రకారం కటకం వెళ్లి రాజు పురూరవుడికి వరాహ నారసింహుడి వృత్తాంతం తెలిపినట్లు ఇక్కడి వారి నమ్మిక. ప్రకృతి జలాలతోనే ప్రసాదం స్వామివారికి నివేదించే ప్రసాదాలను ప్రకృతిసిద్ధంగా ప్రవహించే జలధారలతోనే తయారుచేయడం ఇక్కడి విశిష్టత. గంగధారకి అనుసంధానంగా స్వామివారి వంటశాలలోనే ఒక ధార ప్రవహిస్తూ ఉంటుంది. రోజుకి ఇరవై వేల లీటర్ల నీరు ఈ ధార నుండి వస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. గంగధార జలాలు పరమ స్వచ్ఛమైనవి, ఆరోగ్య ప్రదాయకమైనవని పరిశోధకులు కూడా తేల్చడం విశేషం. శిల్పకళకు కాణాచి సింహాచల దేవాలయంలో ఎటువైపు చూసినా కానవచ్చే శిల్ప సంపద విశిష్టత ఎనలేనిది. కొండ మీద ఆలయ నిర్మాణమే ఓ అద్భుతంగా భావిస్తారు. శతాబ్దాలకు పూర్వం నిర్మించిన ఈ ఆలయం ప్రతి అణువునా శిల్పకళా వైభవం ప్రతిఫలిస్తుంటుంది. క్షేత్ర మహాత్మ్యాన్ని ప్రతిబింబించే అనేక సాక్ష్యాలు శిల్పాల రూపంలో దర్శనమిస్తాయి. ఏనుగులు, గుర్రాలు, తీగలు, లతలు, నాట్యకత్తెలు, సింహాలు ఏకశిలపై చెక్కిన విభిన్న కళాకృతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. స్వామి ధరించిన వరాహావతారం, ఉగ్ర నరసింహుడిగా హిరణ్యకశిప సంహారం, త్రివిక్రమావతారాల శిల్పాలు సజీవంగా విరాజిల్లుతూ అలనాటి శిల్పుల నైపుణ్యాన్ని, ఘనతను చాటుతున్నాయి. రాతిరథం, కళ్యాణ మండపంలోని స్తంభాలు నృత్య, శృంగార భంగిమలు నిత్యనూతనమై విలసిల్లుతున్నాయి. బేడా మండపంలోని స్తంభాలపై ముప్పై రెండు నారసింహాలు సజీవంగా దర్శనమిస్తాయి. నరహరిని నృత్యం చేయించిన కృష్ణమయ్య ప్రథమాంధ్ర వచన సంకీర్తనాచార్యుడు శ్రీకాంత కృష్ణమాచార్యుడికి, సింహాచలేశునికి అవినాభావ సంబంధం ఉంది. కృష్ణమయ్య చాతుర్లక్ష వచనాలను నరహరిపై రచించడమే కాక, కీర్తన చేశాడు. ఆ సంకీర్తనలకు పరవశుడైన సింహగిరి నరహరి బాలుడి రూపాన వచ్చి ఆనంద తాండవం చేశాడని అంటారు. కృష్ణమయ్య నిలువెత్తు విగ్రహాన్ని రామానుజ పీఠము వ్యవస్థాపకుడు శ్రీశ్రీశ్రీ త్రిదండి రంగరామానుజ జీయరు స్వామి మంగళాశాసనాలతో ఆలయం బేడా మండపంలో కొలువు తీర్చబడింది. ఆలయంలో హంస మూలలో ఉన్న విశిష్టాద్వైత సిద్ధాంతకర్త భగవద్రామానుజుల వారిని కూడా మనం దర్శించవచ్చు. సింహాచలం – చారిత్రక వైశిష్ట్యం సింహాచల దేవాలయంలోని అనేక శాసనాల ఆధారంగా ఎంతోమంది రాజవంశీయులు స్వామిని సేవించి తరించినట్లు తెలుస్తోంది. చోళులు, చాళుక్యులు, గాంగులు, ఒడ్డాదిమాత్యులు, నందపుర రాజులు, వరకూట పల్లవులు, కొప్పుల నాయకులు, కోరుకొండ నాయకులు దేవాలయ నిర్వహణలో ముఖ్య పాత్ర వహించినట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణ దేవరాయలు గజపతులపై దండయాత్రలో భాగంగా సింహాచలం వచ్చి స్వామిని సేవించినట్లు, అనేక ఆభరణాలతోపాటు పచ్చల పతకం సమర్పించినట్లు రాసిన శాసనం నేటికీ ఆలయ ఆవరణలో మనకు కనిపిస్తుంది. కళింగ గాంగ వంశీయుల కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగినట్లు, శిల్పకళా సంపద విస్తరణ జరిగినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. 1350వ సం.లో వీర నరసింహదేవుడి పట్టపురాణి గంగా మహాదేవి స్వామిని దర్శించి ఆలయంలో అఖండ దీపారాధనకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్లు, ఎన్నో కానుకలు సమర్పించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. కళింగ విజయనగరంను పరిపాలించిన గజపతులు సుమారు 236 సంవత్సరాల నుండి అనువంశిక ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం పూసపాటి ఆనంద గజపతిరాజు ఆలయ అనువంశిక ధర్మకర్తగా స్వామి సేవలో తరిస్తున్నారు. * …………………………………………… సంపెంగల స్వర్ణకాంతులు సింహాచలం పేరు చెబితేనే శ్రీచందన పరిమళం, సంపెంగల గుబాళింపు గుర్తుకు వస్తాయి. సింహాచలేశునికి అత్యంత ప్రీతిపాత్రమైన సంపెంగ పూలు సింహగిరి పరిసరాలలో విరివిగా లభిస్తాయి. సింహగిరితో పెనవేసుకున్న సంపెంగలకి ఒక భక్తుడు స్వర్ణ కాంతులను అద్దాడు. ఆ పుష్పాలతో ప్రతీ గురువారం స్వామి స్వర్ణ పుష్పార్చనగా అష్టోత్తర నామార్చన స్వీకరిస్తారు. అమెరికాకి చెందిన ప్రవాస భారతీయుడు నెక్కలపూడి సుబ్రహ్మణ్యేశ్వరరావు సంపెంగలను ఇక్కడి నుండి తీసుకువెళ్లి ఆ పుష్పాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్వర్ణ తాపడాన్ని చేయించాడు. స్వర్ణ పుష్పార్చనను సింహాచలేశుడు స్వర్ణ నృసింహ కవచాలంకరణలో స్వీకరిస్తారు. దసరానాడు శమీ పూజ కోసం కనుమ రోజున మకర వేటకి (గజేంద్ర మోక్షం) పుష్పవనానికి స్వామివారు తరలి వస్తారు. ……………………….. సంప్రదాయాలకు పుట్టిల్లు సింహాచల క్షేత్రం శాస్త్రాలకూ సంప్రదాయాలకూ పుట్టినిల్లు. పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం ప్రతి నిత్యం నాలుగు వేదాలు, నాలాయిర దివ్య ప్రబంధం, క్షేత్ర మహాత్మ్యం పారాయణలు జరుగుతూనే ఉంటాయి. ఆలయంలోని వంటశాలలో శతాబ్దాల కాలంగా నిత్య అగ్నిహోత్రం మండుతూనే ఉంటుం ది. ఇక్కడ తయారుచేసే ప్రసాదమంతా దేవాలయంలో నివేదన జరగనిదే అమ్మకానికి వెళ్లదు. ఈ సంప్రదాయం మరే దేవాలయంలోనూ కానరాదు. ఏభై చందన యాత్రలు నా చేతుల మీదుగా స్వామివారు స్వీకరించడం నా పూర్వజన్మ సుకృతం. -మోర్తా సీతారామాచార్యులు విశ్రాంత ప్రధానార్చక పురోహితుడు ………………… మహిమాన్వితం కప్పస్తంభం శ్రీవారి ఆలయ ప్రతిష్టను మరింత పెంచే మరొక మహిమాన్విత అంశం కప్పస్తంభం. స్వామికి కుడివైపున ఆలయంలో నెలకొన్న ఈ స్తంభాన్ని ఆలింగనం చేససుకుంటే కోరికలీడేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ స్తంభం సంతాన గోపాలస్వామి యంత్రంపై ప్రతిష్ఠించడం వలన సంతానం లేని దంపతులు మొక్కుకుంటే సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. కప్పం (రుసుము) రూ.25 చెల్లించి స్తంభాన్ని ఆలింగనం చేసుకొని కోర్కెలు తీర్చుకోవడానికి భక్తులు పోటీ పడుతూ ఉంటారు. ………………………… పరమ పావనం – గంగధార జలం ‘గంగధార సమం తీర్థం క్షైత్రం సింహాద్రి నాసమం నారసింహ సమోదేవో త్రైలోక్యే నాస్తి నిశ్చయః గంగధారకి సరియైన తీర్థం, సింహగిరికి సమమైన క్షేత్రం, నారసింహుని వంటి దైవం ముల్లోకాల్లోనూ లేదన్నది తథ్యం అంటూ గంగధార వద్ద మనకు శిలాఫలకం కనిపిస్తుంది. దీనిని బట్టి గంగధార విశిష్టత అర్థమవుతుంది. గంగధార ప్రకృతిసిద్ధమైన జలధార. ఇచ్చట గంగానది అంతర్వాహినిగా ప్రవహిస్తోందని ప్రజల విశ్వాసం. ఎచ్చట నుండి వస్తుందో తెలియని ఈ ధార సర్వకాలములలోను సజీవంగా ప్రవహిస్తూనే ఉంటుంది. తూర్పు నుండి పశ్చిమాభిముఖంగా ప్రవహించే గంగధారను సింహాచలేశుని ప్రతిరూపంగా వైదికులు వర్ణిస్తారు. పశ్చిమాభిముఖుడై వెలసిన సింహగిరి నరహరికి నిర్వహించే ప్రతీ అంశంలోనూ గంగధార జలం ఉండి తీరవలసిందే. గంగధారకి అనుబంధంగా సింహగిరిలో 12 జలధారలు ప్రవహిస్తున్నాయి. …………………….. శ్రీవరాహ పుష్కరిణి కొండ దిగువ అడివివరం నడిబొడ్డున వరాహ పుష్కరిణి కొలువుతీరి ఉంది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా వరాహ పుష్కరిణిలో స్నానమాచరించి సింహాద్రి నాథుడి సోదరిగా భావించే పైడితల్లమ్మ వారి దర్శనం చేసుకుని కొండకు చేరుకుంటారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పుష్కరిణిలో స్నానమాచరిస్తే పాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. గంధం అమావాస్య, వైశాఖ పౌర్ణమి రోజులలో ఉత్తరాంధ్రలోని సముద్రతీర ప్రాంత వాసులు పుష్కరిణికి వచ్చి పూజలు చేస్తారు. ప్రతి ఏటా పుష్య బహుళ అమావాస్య రోజున సింహగిరి నరహరి వేణుగోపాలస్వామి అలంకరణ ఉభయదేవేరులతో కలిసి హంస వాహనంలో విహరిస్తారు. ……………………. నమస్తస్మై భగవతే నాధాయ హరి భూభృతః యస్యప్రసాద గంధేన నిరశ్యనే్త మహార్తయః ఇలపై వెలసిన శ్రీ వరాహ నారసింహుని దర్శిస్తే, ఆ శ్రీహరి గంధ ప్రసాదాన్ని స్వీకరిస్తే సమస్త పాపాలు, సకల రోగాలు హరిస్తాయి. -డా.టి.పి.రాజగోపాల్ దేవాలయ ఆస్థానాచార్యులు ………………….. స్వామి అత్తింటివారు జాలర్లు.. క్షీరసాగర తనయను చేపట్టిన శ్రీ మహావిష్ణువుకి సముద్రుడు మామగారు, గంగపుత్రులు (జాలర్లు) అత్తింటివారు. అందుకే సింహాచలేశుని కళ్యాణానికి ముందు జరిగే రథయాత్రలో జాలర్లు ముఖ్య భూమిక పోషిస్తారు. వధూవరులను కల్యాణ వేదికకు తోడ్కొని వెళ్లే రథయాత్రకు సారథ్యం వహిస్తారు. ఇంతటి మహాభాగ్యం దక్కినందుకు జాలరులంతా తమ జన్మ ధన్యమైందని భావిస్తారు. -లక్ష్మణరావు, జాలరి కుల పెద్ద ……………………………… అప్పన్నకి దాసుడు… ఉత్కళీయులకు ఆరాధ్యుడు అప్పన్న సేవలో తరిస్తున్న భక్తకోటిలో ఒరియా వారు ముందు వరుసలో ఉంటారు. వీరికి ఆరాధ్యుడిగా చెప్పబడుతున్న అప్పన్నకి పరమ భక్తులు దాసుడి వంశీయులు. వంశపారంపర్యంగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వనమాలి నాయకోదాసు కుమారుడు లక్ష్మీకాంత నాయకోదాసు స్వామికి సేవలు చేస్తూ తరిస్తున్నాడు. దేవాలయంలో జరిగే అన్ని అర్జిత సేవలను దాసుడు తన బృందంతో తరలివచ్చి ప్రతి ఏటా జరిపిస్తూ ఉంటాడు. వైశాఖ మాసంలో సింహగిరికి చేరుకుని మూడు నెలల పాటు దాసుడు ఇక్కడే ఉంటాడు. దాసుడు సమర్పించే ఫల పుష్పాదులతో సింహాద్రినాథుడు శోభిల్లుతుంటాడు. దాసుడిక్కడ ఉన్నన్నాళ్లు ఒడిస్సా పరిసర ప్రాంతాల నుండి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చి సింహాద్రినాథుని దర్శించుకున్నార్ట. …………………… దేవస్థానం ఆదాయం రూ.34 కోట్లు ఏటా సింహాచలేశుని దేవస్థానానికి వివిధ రకాల రూపాలలో సుమారు ముప్పై నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఇందులో సింహభాగం భక్తులు సమర్పించే తలనీలాలదే కావడం విశేషం. దీని ద్వారా సుమారు ఏడు కోట్ల రూపాయల ఆదాయం ఏటా సమకూరుతోంది. తిరుమల తరువాత అత్యధిక ఆదాయం వస్తున్న దేవస్థానం ఇదే. నిత్య అన్నదాన పథకానికి భక్తులు సమర్పించిన విరాళాలు సుమారు పధ్నాలుగు కోట్ల రూపాయల డిపాజిట్లు వివిధ బ్యాంకులలో ఉన్నాయి. ……………… విస్తృత ఏర్పాట్లు చందనోత్సవం సందర్భంగా తరలి వచ్చే అశేష భక్త జనానికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెద్దలు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రూ.1000, రూ.500, రూ.200 ప్రత్యేక దర్శనం టిక్కెట్లను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశాం. ఉచిత దర్శనానికి వచ్చే భక్తులకు పెద్దపీట వేస్తాం. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రసాదాలు, శీతల పానీయాలు అందిస్తాం. ఎండవేడిని తట్టుకునే విధంగా పందిళ్లు ఏర్పాటు చేస్తున్నాం. వైద్యులు, మందులు, అంబులెన్స్‌తోపాటు అగ్నిమాపక వాహనాన్ని కూడా అందుబాటులో ఉంచుతున్నాం. -కె.రామచంద్ర మోహన్ దేవస్థానం కార్యనిర్వహణాధికారి *******************************

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

1 Response to నిజరూపం… అపురూపం ( అప్పన్న చందనోత్సవం)

  1. మిద్దె జయసూర్య అంటున్నారు:

    మంచిగ రాసారు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.