‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-1

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-1

రష్యా సీతారామయ్య రాక

అది 1963 వ సంవత్సరం మే  నెల .ఉయ్యూరు అంతా’’రష్యా సీతారామయ్య ‘’గారి రాక కోసం ఎదురు చూస్తోంది .ఆయన ఉయ్యూరువాడని ,రష్యా వెళ్లి 42 ఏళ్ళు దాటి మళ్ళీ ఇన్నేళ్ళకు, ఇన్నాళ్ళకు42రోజుల పర్యటనకు  ఉయ్యూరు వస్తున్నారని అందరు సంబర పడుతున్నారు .రష్యాలో ఆయన గొప్పఆయిల్  శాస్త్ర వేత్త అని ,అనంత రామయ్యగారి తమ్ముడు అని మాత్రమె తెలుసు .అంతకంటే ఇరవై మూడేళ్ళ వయసున్న మా లాంటి వారికి మిగిలిన వివరాలు తెలీవు .ప్రతి ఇల్లు తమ ఇంటి బంధువు వస్తున్నట్లు ఎదురు చూసింది .ఆయనకు అపూర్వ స్వాగత సత్కారాలు చేసి గౌరవి౦చు కోవాలనే ఉత్సాహం పెల్లుబికింది. అదీ ఆ సందడి కి కారణం .మా వంగల దత్తుగారి పుణ్యమా అని సీతారామయ్య గారి ని దగ్గరగా చూసే అవకాశం కలిగింది .అప్పటికే మేము దత్తు గారింట్లో ‘’బాల భారతి ‘’నిర్వహిస్తున్నాం ‘’నన్నయ కళాసమితి ‘’ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేస్తున్నాం .అందువల్ల దత్తుగారింట్లో మాకు స్వతంత్రం ఎక్కువ .మా మిత్ర బృందం అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం .సెలవులైతే ఇక చెప్పక్కర్లేదు .ఆయన లైబ్రరీ ఆయన రేడియో మాకే స్వంతం .అంత చనువు .మాకంటే చాలా పెద్ద వయసు వారే అయినా దత్తుగారు మాకు స్నేహితునిలాగానే కనిపించేవారు .కనుక దత్తుగారింట్లో మాకున్న చనువుతో సీతారామయ్యగారిని మరింత దగ్గరగా చూడచ్చు ,మాట్లాడచ్చు అనే ఆనందం నాది .

సీతారామయ్యగారు ఉయ్యూరుకు దగ్గరున్న యాక మూరుచిన్న పల్లెటూరిలో   సుక్షేత్రమైన వ్యవసాయ క్షేత్రం లో స్వంత అన్నగారింటిలో దిగారని ,అక్కడి బంధు మిత్రులందరూ ఆనందాన్ని పట్టలేక పోయారని ,వారు ఆయనకు ఆప్యాయంగా నలుగుపెట్టి ,తలంటి పోశారని ,ఉయ్యూరువదిలి సుమారు అర్ధ శతాబ్దంఅయినా స్వచ్చమైన తెలుగు మాట్లాడుతున్నారని ,ఇంట్లో సంధ్యావందనం ,పూజ చేస్తున్నారని ,దేవాలయాలకు వెళ్లి దర్శిస్తున్నారని ,సంస్కృత శ్లోకాలు, తెలుగు కవుల పద్యాలు ధారాళంగా అవసరం వచినప్పుడు వారి నోటినుండి వెలువడుతున్నాయని ,శ్రీ శ్రీ మహా ప్రస్తానం వారికి వాచో విదేయమని ,సంస్కృత కవుల గురించి సాధికారంగా మాట్లాడి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయని వార్తలు యాకమూరు నుండి ఉయ్యూరుకు ఏ రోజుకారోజు చేరేవి .విని ఆనది౦చే వాళ్ళం అంతటి సంస్కారం ,నిబద్ధత భారతీయ సంస్కృతిపై మక్కువ నా బోటి వారికి పరమానందాన్నే కలిగించింది .ఒక రకం గా ఆయన అభిమానినయ్యాను . కరడుకట్టిన కమ్యూనిస్ట్  దేశమైన రష్యాలో ఉంటూ ఈ దైవ భక్తీ, మాత్రు దేశ భక్తీ సంస్కృతీ ,సంస్కారాలు ఇంకా వంట బట్టి ఉండటం మరింత ఆశ్చర్యం కలిగించింది .రష్యాలో ఆయన పేరు ‘’కాన్ స్టాన్టిన్ సెర్జియో విచ్ ‘’అని తెలిసి ఇంకా ఆశ్చర్య మేసింది .ఆ పేరు మాకు ఒక మంత్రమే అయింది .తెలిసినవారందరికీ ఆపేరు ప్రచారం చేశాం .రష్యా సీతారామయ్యగారి అసలు పేరు’’ కొలచల సీతారామయ్య ‘’అని పూర్తిగా తెలుసుకొన్నాం. రష్యా పేరున్నా అక్కడ ఆయన ‘’రామయ్యా’’ అనే పిలువ బడేవారని, చెప్పుకొనే వారని తెలిసి మరీ ఆనందమేసింది .ఆయన రష్యా ఆవిడను పెళ్లి చేసుకొన్నారని ఆవిడ పేరు ‘’కాత్యా ‘’అని కాని రష్యాలో ఆమెను ‘’సీతమ్మ ‘’అని ఆప్యాయంగా పిలుచుకోనేవారని ,ఇంట్లో ఆతిధ్యం అచ్చంగా తెలుగు సంప్రదాయం లోనే ఇచ్చేవారని  మరిన్ని వివరాలు తెలుసుకొని ముక్కు మీద వేలేసుకోన్నాం .ఆయన ఇద్దరు కూతుళ్ళకు లీలావతి అని ,నీల వేణి అని భారతీయ పేర్లు పెట్టారని తెలిసి మరీ యెగిరి గంతేశాం .అంతకు మించి సీతారామయ్యగారి గురించి మాకు తెలియలేదు .తెలుసుకొనే తీరుబడీ లేదేమో !అప్పటికి మా నాన్న గారు చనిపోయి రెండేళ్ళు అవుతోంది .రాజమండ్రిలో బి .ఇ .డి .ట్రెయింగ్ పూర్తీ చేసికృష్ణా  జిల్లా పరిషత్ లో సైన్స్ మేస్టర్ ఉద్యోగం కోసం ఎదురు చూపులు చూస్తూ ఉన్నాను .వేసవి సెలవలు కూడా .అప్పుడు రోహిణి లో రోళ్ళు బద్దలయ్యే ఎండలుండేవి.

దత్తు గారింట్లో –కొలచలవారింట్లో –సూరివారింట్లో సీతారామయ్యగారు

యాకమూరు నుంచి బంధుగణం తో ఒక రోజు దత్తుగారింటికి వచ్చారు సీతారామయ్యగారు .మేమందరం ఆయన చుట్టూ మూగి హడావిడి చేశాం .పెద్దవాళ్ళు ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారు .ఆయన ఏంతో ఓపికగా సమాధానాలు చెబుతున్నారు  .రష్యా అభివృద్ధి జర్మనీ అభి వృద్ధి విషయమై ప్రశ్నలేవరో వేశారు .అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది .మర్చిపోలేని విషయం అది. ‘’మన భారత దేశం లో అన్నీ ఉన్నాయి .ఆలోచనల్లో మనమే ముందు .కాని ఆచరణలో వెనక బడిపోయాం .దీనికి పరాయి పాలన కొంత కారణం .మన అశ్రద్ధ మిగతాకారణం  మీకు తెలియని విషయం ఒకటి నేను చెబుతున్నాను వినండి .ఇది ప్రైవేట్ సంభాషణ కనుక ఇబ్బంది లేదు .వేదిక మీద ఇలాంటివి చెప్పకూడదు .విమాన శాస్త్రాన్ని మన భరద్వాజ మహర్షి రాశారు .కాని దానిపై మనం ఆలోచించి ప్రయోగాలు చేయలేక పోయాం .కాని జర్మన్లు ఆ శాస్త్రాన్నిమన నుంచి  దక్కించుకొన్నారు .మన వాళ్ళను తీసుకొని వెళ్లి దాన్ని విశేషాలు నేర్చుకొని వాళ్ళ భాషలోకి మార్చుకొని విమానాలు  తయారు చేసి  ఆధునీ కరించారు .ఇలా ఎన్నో శాస్త్రాలు మననుంచి వారికి చేరాయి .వాటిని చక్కగా ఉపయోగించుకొన్నారు .మన దేశం లో లేని శాస్త్రం లేదు ధీరీ  ఉంది .దానిపై ప్రాక్టికల్స్, అప్లికేషన్లు మనం చేయలేకపోయాం  మనకు ఆర్ధిక స్తోమతా తక్కువే .దాని ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు .మనం వెనక బడి పోయాం ‘’అనగానే అందరము  గట్టిగా చప్పట్లు కొట్టి  అభి నందించు కొన్నాం . మన గొప్ప తనానికా ?చేతకాని తనానికా ఆ చప్పట్లు అని ఇప్పుడని పిస్తోంది .దత్తు గారింట్లో కాఫీ టిఫిన్లు  భోజనాలు ఏర్పాటు జరిగింది .సాయంత్రంకాలేజి రోడ్డులోని  కొలాచల శ్రీరామ మూర్తి మామయ్య ఇంటికి సీతారామయ్యగారితో ఆటు అందరం చేరాం .అక్కడా ఇలాగే సంభాషణ పరంపర సాగింది .ఆయనా ఆత్మీయ ఆతిధ్యం ఇచ్చాడు .ఆ తర్వాత సూరి అనంత రామయ్యగారింటికి వెళ్ళిన జ్ఞాపకం .అక్కడా మనసు విప్పి మాట్లాడారు పాత జ్ఞాపకాన్నీ తవ్వి తీశారు .అందర్నీ పేరు పేరునా ఆరా అడిగి తెలుసుకొన్నారు .రష్యాలో తమ జీవిత విధానం ,ఇంట్లో ఆడవాళ్ళ విషయం పిల్లలు ఏమి చేస్తున్నారు  అన్నీ సవివరంగా చక్కని తెలుగులో మాట్లాడుతుంటే చూసే వారందరం బొమ్మల్లా మారి పోయాం .అంతటి ప్రభావం కలిగించారు

పౌర సన్మానం .

ఉయ్యూరులో సీతారామయ్య గారు ఎక్కడికి వెళ్ళినా యాభై అరవై మంది ఆయన్ను అనుసరించి ఒక ఊరేగింపుగా వెళ్ళేవారు .చూడటానికి భలే ముచ్చటగా ఉండేది .ట్రావెలర్స్ బంగళాలో మే నెల 21 వ తేదీసాయంత్రం ఉయ్యూరు పంచాయితీ ప్రెసిడెంట్, పంచాయితీ  సభ్యులు ,పౌర సమితి తరఫున డాక్టర్ మిక్కిలినేని సాంబశివరావు గారు కలిసి బ్రహ్మాండమైన ఆత్మీయ పౌర  సన్మానం చేశారు సీతారామయ్యగారికి  .పుష్పహారాలతో ముంచెత్తారు .దీనికి కమ్యూనిస్ట్ పార్టీ వారు లీడ్ తీసుకొన్నారు .బహిరంగ సభలలో సీతారామయ్యగారు భారత రష్యా మైత్రీ బంధాన్ని గురించి చెప్పేవారు రష్యా అగ్రగామి దేశంగా మారిందని అన్నిరకాల భారత దేశ అభి వృద్ధికి అన్నిరంగాలలోనూ సహాయ సహకారాలు అంద జేస్తుందని తెలియ జేసేవారు. ఇంటర్వ్యులలోనూ ఈభావాన్ని చెప్పేవారు   .

మళ్ళీ  రష్యాకు

1963 ఏప్రిల్ 22 నుండి జూన్ 5 వరకు 42 రోజులు మాత్రమె మాత్రు దేశమైన భారత్ లోగడిపి  సీతారామయ్యగారు మళ్ళీ రష్యా చేరుకొన్నారు .ఆయన తాను ఇండియాకు ,రష్యాకు చెందినా ఉమ్మడి పౌరుడిని అని చెప్పి గర్వ పడే వారు రష్యాలో ఆయన్ను’’ ఆంధ్రా సీతా రామయ్య’’ అంటే ఇండియాలో మనం ఆయన్ను ‘’రష్యా సీతారామయ్య’’ అంటాం .అదే బంధుత్వం రెండు దేశాల మధ్య .ఆయన ఒక శాస్త్రీయ సాంకేతిక రాయబారి . భారత్ నుండి రష్యా వెళ్ళిన తర్వాత సుమారు 14 సంవత్సరాలకు ఉబ్బసం తీవ్రమై న్యుమోనియా తో బాధపడి  29-9-1977 న  సీతారామయ్యగారు 78 వ ఏట మరణించారు .

మనుమరాలు మూలాల  ఆచూకీకి  రాక

సుమారు పదేళ్ళ క్రితం  కొల చాల సీతారామయ్యగారి మనుమరాలు ‘’అనస్తేషియ ‘’తన తాతగారు జన్మించిన  గ్రామాన్ని దేశాన్ని సందర్శించాలని తన మోల్లాల అస్తిత్వాలను తెలుసుకోవాలని ఉత్సుకత తో , సంకల్పం తో ఇండియా వచ్చింది .’’హాం రేడియో అధిపతి’’ సూరి శ్రీరామ మూర్తి (సూరి)ఆమెను హైదరాబాద్ నుండి ఉయ్యూరు తీసుకొని వచ్చి ఉయ్యూరు కాలేజి దగ్గరున్న తన స్వగృహం లో శ్రీ వై. వి .బి .రాజేంద్ర ప్రసాద్  ఆధ్వర్యం ఆమెకు అభినందన సభ ఏర్పాటు చేసి ,తాతగారు తిరగాడిన ప్రదేశాలన్నీ తిప్పి చూపింఛి  ,ఆమెకు గొప్ప స్పూర్తి కలిగించాడు  ఆమె వాళ్ళ మాకు ప్రేరణ కల్గించాడు .ఆమె భారత నారిలాగా చీరా జాకెట్ ధరించి బొట్టు గాజులుతలలో పూలు పెట్టుకొని అందరి అభిమానాన్నీ పొందింది .కలుపుగోలుగా మాట్లాడింది ప్రశ్నలు వేసి అక్కడికి చేరిన వారితో సీతారామయ్య గారి పరిచయాన్ని అడిగి తెలుసుకొన్నది .మళ్ళీ వస్తానని ,ఇక్కడ తాతగారికి ఏదో ఒక స్మ్రుతి చిహ్నం ఏర్పాటు చేయాలను కొంటున్నానై తెలియ జేసింది . .ఆమె ఏంతో ఆత్మీయంగా ,తన్మయంగా  మాట్లాడి కృతజ్ఞతలు తెలియ జేసింది . ఆసభలో నేనూ ప్రసంగిస్తూ ‘’మన బజారుకు’’ కొలచల సీతా రామయ్య బజారు ‘’అని పేరు పెట్టి గౌరవించి సార్ధకం చేసుకోవాలి అని ,దీనికి రాజేంద్ర చొరవ తీసుకోవాలని ‘’చెప్పాను .రాజకీయ నాయకుడు కనుక రాజేంద్ర ‘’ అదెంత పని .పంచాయితీ మనదే   .తీర్మానం చేసి పాస్ చేయిద్దాం ‘’అని హామీ ఇచ్చాడు .కాని ఇంతవరకు ఏమీ జరగలేదు  .ఎనస్తేషియా భావించిన స్మ్రుతి చిహ్నమూ యేర్పడ లేదు .ఇవన్నీ సభా వైరాగ్యాలే .Untitled

ఈ మధ్య మా మైనేని గోపాల కృష్ణగారు సీతారామయ్యగారి పై వచ్చిన ‘’A wreath for doctor Ramayya ‘’92cc227532d17e56e07902b254dfad10 by Ghen Shangin –Berezovsky ‘పుస్తకం కొని పోస్ట్ లోపంపారు .దాన్ని మూడు రోజుల్లో జుర్రేశాను .దాని నాదారంగా సీతారామయ్యగారి జీవితం ,పరిశోధనలు ,సాహిత్యం మొదలైన విషయాలపై ఏదో రాయాలనే సంకల్పం కలిగి మైనేని వారికి మెయిల్ రాశా .దానికి శీర్షిక కూడా ‘’పుల్లేరు నుండి ఓల్గా దాకా ‘’అనేది ,‘’కొలచల సీతారామయ్యాయణం ‘’అనే శీర్షికా మనసులో మెదిలి ఆయనకు తెలియజేశాను .  మొదటిది మైనేని వారికి బాగా నచ్చిందని చెప్పారు ..కాని రాత్రి ఎందుకో ‘’కేమోటాలజీ పిత కొలచల సీతారామయ్య ‘’అనేది సార్ధకం గా ఉంటుందని ,ఆయన వైజ్ఞానిక కృషికి అద్దం పడుతుందని అనిపించి మొదలుపెట్టాను .ఎలా రాయాలో తెలీక ఇలా ప్రారంభించా . దీన్ని ధారావాహికం గా రాస్తాను .అంతటి మహా విజ్ఞాన శాస్త్ర వేత్త మా ఉయ్యూరు వాడనే గర్వం ,ఆయన జీవితం అందరికీ తెలియాలనే తపన ,అది యువత కు ఆదర్శం కావాలనే కోరికా, మా గోపాల కృష్ణ గారి సౌజన్యానికి కృతజ్ఞత లే  ఈ వ్యాస పరంపర .సీతారామయ్యగారి ఫోటో కోసం గూగుల్ లో వెతికితే దొరక్కపోవటం దురదృష్టం .అందుకని ఆ పుస్తకం లోదే తీసు కొంటున్నాను.కింద ఫోటో జతచేశాను చూడండి  .k .sitaramayya 001

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-4-15 –ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

1 Response to ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-1

  1. venkat అంటున్నారు:

    అన్ని సంవత్సరాల మునుపు , మన తెలుగు వ్యక్తీ అంత దూరం వెళ్లి పరిశోధనలు చేసి , ఇంత గొప్ప పేరు సంపాదించుకోవడం నిజంగా మన అందరికి స్పూర్తిదాయకం .
    ఆయన జీవితాన్ని మీరు ఇలా మాకు బ్లాగ్ రూపం లో అందించడం , మేము చదవడం మా అదృష్టం .
    దయచేసి రాయండి . ఇలా ప్రయాస పది మీరు మాకు అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.