సమన్వయం సాధించిన సనాతనుడు!

సమన్వయం సాధించిన సనాతనుడు!

  • – హెబ్బార్ నాగేశ్వరరావు
  • 23/04/2015
TAGS:

ఆదిశంకరాచార్యుడు సనాతనుడు…. కలియుగంలో జన్మించిన వారందరిలోను అగ్ర గణ్యుడు. ఆయన పుట్టక పూర్వం కాని పుట్టిన తరువాత కాని కలియుగంలో ఆయనతో సమానమైన ప్రతిభావంతుడు ప్రభావవంతుడు మరొకరు పుట్టలేదు. భవిష్యత్తులో పుట్టవచ్చుగాక! కృష్ణద్వైపాయన వ్యాసుడు, యదుకుల కృష్ణుడు వంటివారు ఆదిశంకరాచార్యుని కంటె పూర్వం భారతీయతకు మరింతగా మెరుగులు దిద్దారు వారు ద్వాపరయుగంలో పుట్టినవారు! వసిష్ఠుడు వాల్మీకి వంటివారు మరింత పూర్వం త్రేతాయుగంలో జీవించినవారు! సనాతన భారతీయతత్త్వం వీరందరికంటె పూర్వంనుంచి ఉంది, సృష్టి ఆరంభంలో వేద ద్రష్టలైన మహర్షులు సనాతన సాంస్కృతిక తత్త్వాన్ని ఆవిష్కరించడం పునరావృత్తవౌతున్న చరిత్ర! ఎందుకంటె సనాతనతత్త్వం సృష్టి ఆరంభం కాకపూర్వం కూడ ఉంది! భారతీయులు దర్శించిన వాస్త వం చరిత్ర…. సృష్టి ఆరంభం కావడం, నాలుగువందల ముప్పయి రెండు కోట్ల సంవత్సరాలపాటు కొనసాగడం చరిత్ర. ఈ కాల వ్యవధి ముగిసిన తరువాత నాలుగువందల ముప్ప యి రెండు కోట్ల సంవత్సరాలపాటు శూన్యం ఏర్పడడం చరిత్ర! ఇలా ‘శూన్య’స్థితి, ‘సృష్టి’ స్థితి ఒకదాని తరువాత ఒకటి, ‘రాత్రి’, ‘పగలు’వలె, నిరంతరం పునరావృత్తం కావడం ‘శాశ్వతమైన’అంటే ‘సనాతనమైన’ విశ్వవ్యవస్థ! ఈ పునరావృత్తి సాపేక్షం! ఒకప్పుడు భాసిస్తున్నది…. మరొకప్పుడు శూన్యంగా ఉంటున్నది! అందువల్ల సృష్టికి శూన్యానికి అతీతమైనది సత్యం! ఈ సత్యం బ్రహ్మము! సత్యాన్ని మరోసారి వివరించిన కారణజన్ముడు ఆదిశంకరాచార్యుడు! కనిపించని వినిపించని ‘సత్యం’ కనిపించడం వినిపించడం ‘ఋతం’! ఈ ‘ఋతం’విశ్వవ్యవస్థ. విశ్వవ్యవస్థ అసంఖ్యాక వైవిధ్యాల నిలయం. వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేదు….సమన్వయం ఉంది. స్వరూప వైవిధ్యాల మధ్య స్వభావ ఏకత్వం ఉంది! ఇదే సమన్వయతత్త్వం! ఈ సమన్వయ తత్త్వం వేద సంస్కృతిగా, భారతీయ సంస్కృతిగా, హైందవ సంస్కృతిగా, సనాతన సంస్కృతిగా సమాజ స్థితం కావడం చరిత్ర! ‘‘ఏకం సత్ విప్రాః బహుధావదన్తి’’అన్నది సనాతన సమన్వయ తత్త్వం. ‘‘సత్యం ఒక్కటే… దాన్ని వివిధ మతాలుగా పండితులు వివరిస్తున్నారు.’’ వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని సమన్వయ తత్త్వం భారతీయతే. కొడిగట్టిన ఈ సమన్వయతత్త్వాన్ని మళ్లీ వెలిగించినవాడు ఆదిశంకరుడు! వైవిధ్య మతాలమధ్య కల సమన్వయతత్త్వాన్ని మరోసారి ఆవిష్కరించాడు…..
ఉన్నది ఒక్కటే… అది సత్యం, దానికి భిన్నమైనది ఏదీ లేదు. ఈ ‘బ్రహ్మ జిజ్ఞాస’ అద్వైతం! విభిన్న స్వరూపాలమధ్య నిహితమైన స్వభావం ఒక్కటేనన్న, లక్ష్యం ఒక్కటేనన్న ‘ఋతం’ ధర్మజిజ్ఞాసకు ప్రాతిపదిక! భారతీయుల ఈ ‘్ధర్మజిజ్ఞాస’ మతాల మధ్య ఉన్న అద్వైత స్థితిని గుర్తించింది, వ్యక్తికీ సమాజానికీ మధ్య, సమాజానికి సృష్టికీ మధ్య, సృష్టికీ, సృష్టికర్తకూ మధ్య సహజంగా ఉన్న అద్వైత స్థితిని దర్శించింది! ఈ సమన్వయ భావ సాంస్కృతిక తత్త్వానికి గ్రహణం పట్టినప్పుడల్లా గ్రహణ విముక్తికోసం విజయవంతంగా కృషిచేసిన ‘ప్రభావకరులు’ అనాదిగా ప్రభవించారు, అనంతంగా ప్రభవిస్తూ ఉంటారు. ఈ ‘పరంపర’లోని కారణజన్ముడు ‘కాలడి’లో పుట్టిన శంకరుడు.
వైవిధ్యాల మధ్య వైరుధ్యం ఉందన్న ‘భ్రమ’వైవిధ్యాల విధ్వంసానికి దోహదం చేసింది. ఈ ‘భ్రమ’్భరతీయ స్వభావానికి, వేదతత్త్వానికి వ్యతిరేకమైనది! భారతదేశంలో మొదటి మానవుడు పుట్టాడు, మానవీయ సంస్కృతి మొదట భారతదేశంలో వికసించింది. క్రమంగా భారతదేశంనుండి వివిధ కారణాలవల్ల సరిహద్దులకు ఆవలికి వెళ్లిన ప్రజలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడినారు!! క్రమంగా భారతీయతకు దూరమయ్యారు. అంటే వైవిధ్యాలను పరిరక్షించే ప్రవృత్తికి దూరమయ్యారు! ఇలా దూరమైనవారు మ్లేచ్ఛులు!! భారతదేశపు సరిహద్దులకు దగ్గరగా విదేశాలలో స్థిరపడినవారు కొన్ని భారతీయ సంస్కారాలను గుర్తుంచుకున్నారు. భౌగోళికంగా దూరంగా జరిగినవారు భారతీయ సంస్కారాలను పూర్తిగా మరచిపోవడం ప్రపంచ చరిత్ర! వైవిధ్య పరిరక్షక ప్రవృత్తికి ఇలా దూరమైనవారు తమదికాని ప్రతి వైవిధ్యాన్ని ధ్వంసంచేయడం ఆరంభించారు. తమది కాని మతాన్ని ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. తమది కాని భాషను, తమది కాని భావాన్ని, రీతిని, నీతిని ఇలా అనేకానేక వైవిధ్యాలను ధ్వంసం చేయడానికి భారతీయతకు దూరమైనవారు కృషిచేశారు! ఫలితంగా వైవిధ్యాలను పరిరక్షించే భారతీయులకూ, వైవిధ్యాలను ధ్వంసంచేసే విదేశీయులకూ మధ్య సంఘర్షణ మొదలైంది!
ఈ సంఘర్షణలో భారతీయులను విజయపథంలో నడిపించిన సమరశీల స్వభావాన్ని పునరుద్ధరించిన ‘కలియుగ కృష్ణుడు’ ఆదిశంకరాచార్యుడు!! భగవద్గీత లక్ష్యం జీవన సమర ధర్మాన్ని విస్మరించి చతికిలపడిపోయే అర్జునులను తిరిగి కర్తవ్యపథంలో నడిపించడం….. సరిహద్దుల రక్షణకోసం యుద్ధంచేయడం అనివార్యమన్న జీవన ధర్మాన్ని గుర్తుచేసి, స్వజాతిని కర్తవ్యపథంలో నడిపించిన కారణజన్ముడు శంకరుడు.
మహాభారత యుద్ధం జరిగిన తరువాత ముప్పయి ఆరేళ్లకు కలియుగం ఆరంభమైంది. అదే రోజున యదుకుల కృష్ణుడు పార్ధివ శరీరాన్ని పరిత్యాగం చేశాడు. కలియుగం ఆరంభమైన తరువాత ఈ మన్మథ సంవత్సరం ఉగాది నాటికి 5,116 ఏళ్లు గడిచాయి. ప్రస్తుతం 5117వ సంవత్సరం నడుస్తోంది. కలియుగంలో 1215వ ఏట గౌతమబుద్ధుడు జన్మించాడు. అది క్రీస్తునకు పూర్వం 1887వ సంవత్సరం. కలియుగంలో 2593వ సంవత్సరంలో ఆదిశంకరాచార్యుడు పుట్టాడు. అది క్రీస్తునకు పూర్వం 509వ సంవత్సరం. గౌతమబుద్ధుడు జన్మించిన సమయానికి ఆదిశంకరాచార్యుడు అవతరించిన సమయానికీ మధ్య నడిచిన 1378 సంవత్సరాలలో మన దేశ చరిత్రలో అనేక ప్రధాన సంఘటనలు దుర్ఘటనలు విఘటనలు సంభవించాయి! గౌతమబుద్ధుడు జన్మించిన తరువాత ఇప్పటికి 3902 ఏళ్లు అయింది. ఆదిశంకరుడు జన్మించిన తరువాత 2524 ఏళ్లు గడిచాయి. ఈ వైశాఖ శుద్ధ పంచమి ఈరోజు ఆదిశంకరుని 2525వ జయంతి.
గౌతమబుద్ధుడు హింసాకాండను నిరసించాడు. హింసను నిరసించడం అనాదిగా భారతీయ జీవన పద్ధతి! అహింస పరమ ధర్మము. వేదాలు పురాణాలు శాస్త్రాలు స్మృతులు హింసను నిరసించాయి. ‘‘నితాం తా పారభూతదయ’’ భారతీయ స్వభావం. అందువల్ల అహింస ప్రాతిపదికగా గౌతమబుద్ధుడు బౌద్ధమత ప్రచారం చేయడం సనాతన జీవన వైవిధ్యాలలో ఒకటి! అనేక శుభ లక్షణాల సమాహారం సనాతన సంస్కృతి! అయితే సమయానుగుణంగా ఒక్కొక్క శుభ లక్షణం ఒక్కొక్క సమయంలో ప్రాచుర్యం పొందుతుంది! ఇది సృష్టిగతమైన ధర్మం కూడ! ఎండవానలు రెండూ సృష్టిగతం! రెండూ అవసరమే….. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ప్రధానవౌతోంది! అలా బుద్ధ్భగవానుని ప్రభావంతో అహింసకు ప్రాధాన్యం వచ్చింది! కానీ శతాబ్దులు గడిచిన తరువాత ‘అహింస’ విపరీత అర్థాలకు, వక్రీకరణకు గురిఅయింది!
యుద్ధం చేయడం ‘హింస’కాదు, మనమీదికి దూకిన పిశాచాలనుండి, రాక్షసుల నుండి, క్రూర మృగాలనుండి కాపాడుకొనడానికై యత్నించడం ఆయుధ ప్రయోగం చేయడం హింసకాదు. నిష్కారణంగా నిష్కరుణగా ఇతరులను భౌతికంగా, మానసికంగా, బౌద్ధికంగా బాధించడం హింస! ఇతర దేశాలలోకి చొరబడి నిరాయుధులను వధించడం, ఇతర దేశాలలోని జాతీయ చిహ్నాలను, ధార్మిక కేంద్రాలను ధ్వంసం చేయడం, మహిళలపై అత్యాచారం జరుపడం వంటివి హింసారూపాలు. కానీ మన దేశం మీది ఇతరులు దండెత్తి వచ్చినప్పుడు వారిని ప్రతిఘటించడానికై యుద్ధం చేయడం హింస కాదు. వైవిధ్య విధ్వంసక శక్తులను తిప్పికొట్టడానికి వైవిధ్య పరిరక్షక శక్తులు సంఘర్షణ సాగించడం హింస కాదు!! కానీ శతాబ్దుల తరువాత బుద్ధ్భగవానుని ‘అహింస’ను వక్రీకరించిన వారు ‘్ధర్మయుద్ధం’ చేయడం హింసచేయడంలో సమానమని ప్రచారం చేశారు. ఫలితంగా బౌద్ధమత నిబద్ధులైన పాలకులు దురాక్రమించిన విదేశీయులను ప్రతిఘటించడం మానుకున్నారు. దేశపు సరిహద్దులు ఛిద్రమయ్యాయి. విదేశీయులు మన దేశంలోకి చొరబడి దోపిడీకాండ సాగించారు!
కలియుగం 2,269నుంచి 2775వ సంవత్సరంవరకూ ఆంధ్ర శాతవాహనులు ‘గిరివ్రజం’ రాజధానిగా మొత్తం భారతదేశాన్ని పాలించిన సమయంలో సరిహద్దుల భద్రత మరింత ఛిద్రమైంది. ఎందుకంటె ఈ ఆంధ్ర శాతవాహనులలో అత్యధికులు యుద్ధం చేయడం మానిన బౌద్ధులు. క్రీస్తునకు పూర్వం 833లో మొదలైన వీరి సార్వభౌమత్వం క్రీస్తునకు పూర్వం 327 వరకు కొనసాగింది! ఈ సమయంలోనే పారశీక రాజు డేరియస్ సైరస్ మన దేశంలోని వాయువ్య పశ్చిమ ప్రాంతాలను ఉత్తర ప్రాంతంలో కొన్ని భాగాలను ఆక్రమించాడు. కలియుగం 2552లో అంటే క్రీస్తునకు పూర్వం 550లో ఈ సైరస్ తన పేరిట కొత్త కాలగణన పద్ధతి- శకం-ని ఆరంభించాడు. భారతీయులు ఈ కొత్త ‘శకాన్ని’వాడడం ఆరంభమైంది.
ఈ భావదాస్య నేపధ్యంలో ‘సైరస శకం’ ఒకటవ శతాబ్దిలో జన్మించిన ఆదిశంకరాచార్యుడు తన పరిక్రమ ద్వారా ప్రబోధం ద్వారా స్వజాతీయులను, సనాతన భారతీయులను ప్రభావితం చేశాడు! ఈ ప్రభావం భారతీయులను శతాబ్దులపాటు జాగృతం చేసింది. విదేశీయుల దురాక్రమణనుండి దేశాన్ని రక్షించుకొనడానికై సంఘర్షణకు మళ్లీ శ్రీకారం చుట్టింది!! యుద్ధంచేయాలని భగవద్గీతను ఆవిష్కరించిన కృష్ణుడు ‘ద్వాపరం’లో బోధించాడు. ‘్భగవద్గీత’కు ‘్భష్యం’చెప్పిన ఆదిశంకరాచార్యుడు కలియుగంలో అదే కర్తవ్యాన్ని ధ్వనింపచేశాడు!! ఫలితం కలియుగం 2776లో అంటే క్రీస్తునకు పూర్వం 326లో అలెగ్జాండర్ అన్న గ్రీకు బీభత్సకారుడిని గుప్త చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు మన దేశంనుండి తరిమివేయడం…..ఇలా భౌగోళిక సమగ్రతను కాపాడడానికి పూర్వకంగా ఆదిశంకరుడు అంతర్గత సమన్వయం సాధించాడు! ఈ సమన్వయం వైదిక మతాల మధ్య మాత్రమేకాదు, వైదిక మతాలకూ, వైదికేతర మతాలకూ మధ్య కూడ ప్రస్ఫుటించడం చరిత్ర! శైవ, వైష్ణవ, శాక్త, సౌర, గాణాపత్య, స్కాంద మతాలన్నీ ఒక సనాతన వేద సంస్కృతికి చెందిన వైవిధ్యరీతులన్నీ సత్యాన్ని ఆదిశంకరుడు పునఃప్రచారం చేశాడు!
ఈ సర్వమత హైందవ సంపుటంలో బౌద్ధ జైన మతాలు సమన్వయం పొందడం ఆదిశంకరుని ‘అద్వైత’ సాధనకు పరాకాష్ఠ!
ఆత్మకూ పరమ్మాకూ మధ్య అద్వైతం……
సాకార దేవతామూర్తుల మధ్య అద్వైతం…..
వ్యక్తికీ సమాజానికీ మధ్య అద్వైతం….
సమాజానికీ సృష్టికీ సృష్టికర్తకూ మధ్య అద్వైతం…..
ఆదిశంకరార్యుడు పునరావిష్కరించిన సనాతన జాతీయ తత్త్వం ఇది!

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.