సీతారాం ఏచూరి తల్లిగానే ఇష్టపడతా !

సీతారాం ఏచూరి తల్లిగానే ఇష్టపడతా !
‘‘ ఏవిటీ.. సడెన్‌గా నేను గుర్తొచ్చాను మీకు! అయినా సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యింది వాడు కదా.. నేను కాదే.
నా ఇంటర్వ్యూ ఎందుకు మీకు?’’ అంటూ మొదలు పెట్టారు కల్పకం ఏచూరి. బహుశా సీతారాం ఏచూరి తల్లి అంటేనే ఆమెను అందరూ సులువుగా గుర్తుపడతారేమో! వాస్తవానికి తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నప్పటికీ తనను అలా గుర్తిస్తేనే ఒక తల్లిగా ఇష్టపడతానని అంటున్న కల్పకం ఏచూరి తన కొడుకు గురించి చెప్పిన ముచ్చట్లు…

‘‘దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ జైలుకెళ్లినప్పుడు వారి కుటుంబ బాధ్యతల్ని మా అమ్మ చూసుకునేవారు. ఆమె ఎనిమిదేళ్ల వయస్సులోనే ఒకరిని పెళ్లి చేసుకుని, ఆ తర్వాత ఆయనకు వేరే అమ్మాయితో పెళ్లి చేయించారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ అమ్మాయిని కూడా ఆంధ్ర మహిళా సభలో చేర్పించి బొమ్మలు తయారు చేయించటం నేర్పించి, ఆమె తనకాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఆమె ఎప్పుడూ ఒక్కటే చెప్పేవారు. ‘నువ్వు గొప్పదానివైతే సంఘానికి ఏం లాభం? సంఘానికి ఎంతోకొంత నువ్వు ఉపయోగపడితేనే ప్రయోజనం..’ అనేవారు. ఆ ప్రభావం నాపై పడింది. అందుకే ఇప్పటికీ నేను ఏదో ఒక పనిలో నిమగ్నమవుతూనే ఉన్నాను. నేను పుట్టింది, పెరిగిందీ అంతా మద్రాసులోనే. మా నాన్న కందా భీమశంకరం హైకోర్టు జడ్జి. ఆంధ్రా విడిపోవటంతో గుంటూరుకు, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుతో హైదరాబాద్‌కు మకాం మారాం. నా పెళ్లి కూడా చిన్నతనంలోనే జరిగింది. అయితే, నేను మద్రాసులోనే అమ్మ దగ్గర ఉండి ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత మావారు ఇంజనీర్‌ సర్వేశ్వర సోమయాజులు కేంద్ర ఆరోగ్య శాఖ రవాణా విభాగానికి బదిలీ కావటంతో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం. మా ఇంట్లో చాలామంది లాయర్లే. నేనూ లాయర్‌ అవుదామనుకుంటే నాన్న వద్దన్నారు. దాంతో పీహెచ్‌డీ చేద్దామనుకున్నాను. అదీ కుదర్లేదు. ఇద్దరు కొడుకులనూ చూసుకోవటంతోనే సరిపోయింది’’

డాక్టర్‌ కావాలనుకుంటే లీడర్‌ అయ్యాడు..

ఏచూరి సీతారాం సౌమ్యుడు. వాణ్ణి నిద్రలేపాలంటే ఫ్యాన్‌ ఆఫ్‌చేస్తే సరిపోయేది. అంత సుకుమారుడు. చొక్కాలకు గంజి ఎక్కువ పెడితే వాడికి గుచ్చుకుంటుందని మా అమ్మ తక్కువగా పెట్టమని చెప్పేది. హైదరాబాద్‌ నిజాం కాలేజీలో పీఎల్‌సీ చదివేప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది. దీంతో మా నాన్న వాడిని ఢిల్లీకి పంపించేశారు. చిన్నప్పటి నుంచీ బ్రిలియంట్‌ స్టూడెంట్‌. అన్నింట్లోనూ ఫస్టే. వాడు డాక్టర్‌ కావాలన్నది నా కోరిక. అయితే, వాడు ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చేరాడు. ఆ తర్వాత జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో చేరడం వల్ల.. జీవితం మలుపు తిరిగింది. తొలుత స్టూడెంట్స్‌ యూనియన్‌కు అధ్యక్షుడయ్యాడు. క్రమక్రమంగా సీపీఎంలో చేరిపోయాడు. ఇదంతా మాకు తెలియకుండానే జరిగింది. ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ అంటే ఒక అలర్జీ. పైగా, మాదేమో కాంగ్రెస్‌ కుటుంబం. పనివాళ్లను కూడా ‘కాంగ్రె్‌స్‌కే ఓటెయ్యి’ అని చెప్పి పంపించేవాళ్లం. మా అమ్మ తండ్రి రామస్వామి ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. దానికితోడు వీడేమో బాగా చదువుకుంటున్న, సుఖంగా బతుకుతున్న వ్యక్తి. ఒక్కసారిగా ఇంత కష్టపడటం ఎందుకు? అనిపించింది. చిన్నప్పటి నుంచీ ఏదో ఒకటి చేద్దాం అన్న తపనతోనే ఉండేవాడు. కానీ, ఏం చేయాలన్నది మాత్రం స్పష్టత లేదు. మా తమ్ముడు మోహన్‌ కందాకు (ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైరయ్యారు) మావాడికీ పెద్దగా వయస్సు తేడా లేదు. ఇద్దరిపైనా నాన్నగారి ప్రభావం ఎక్కువ. తమ్ముడు ఐఏఎస్‌ అయ్యాడు. మావాడు ఐఎ్‌ఫఎస్‌ అవ్వాలని కోరుకున్నాడు. అన్ని అవకాశాలూ ఉన్నాయి కనక నేను మాత్రం డాక్టర్‌ అయితే బాగుంటుందని చెప్పాను. కానీ వాడు ఎకనామిక్స్‌లో చేరగానే సరిపెట్టుకున్నాను. అయినా వదలకుండా నా కోరికను గుర్తు చేసేదాన్ని. ‘ఇప్పుడు చేరమంటావా చెప్పు’ అని సరదాగా అడిగేవాడు.

నేను దేవుడితోనే దెబ్బలాడతాను. ఆయనొక్కడే కేకలేయడు. తిట్టడు. చెబితే వింటాడు. వినకపోతే నోర్మూసుకుని

 అయినా ఊర్కుంటాడు. అలాంటి ఫ్రెండ్‌ గణేశుడు. ఐ టేక్‌ హిమ్‌ ఫర్‌ గ్రాంటెడ్‌. కానీ, మా అబ్బాయి మాత్రం దేవుడ్ని నమ్మడు. వాడు పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాక నా కజిన్‌ ఒకరు ఫోన్‌ చేసి వెంటనే వినాయకుడి గుడికి వెళ్లి 11 కొబ్బరికాయలు కొట్టి, 11 రూపాయలు వెయ్యి అని చెప్పింది.
మావాడికి పదవి వచ్చాక ఒకరిద్దరు మీడియావాళ్లు ఫోన్‌ చేస్తే మాట్లాడలేదు. మా తమ్ముడు ఫోన్‌ చేసి.. ‘‘నీ కొడుకు 45 ఏళ్లు వాళ్లని భరించాడు. నువ్వు రెండు రోజులు భరించలేవా?’’ అని చెప్పాడు.
కాకినాడకు వెళ్లి ఆవకాయ పెట్టుకోవటం అంటే నాకు ఇష్టం. ఇప్పుడు కూడా ‘మామిడికాయలు వచ్చాయి. నువ్వెప్పుడు వస్తున్నావ్‌’ అని అక్కడి నుంచి నాకు ఫోన్లు వస్తుంటాయి. ప్రతిసారీ వెళ్లి.. అందరికీ సరిపడా ఆవకాయ పెట్టుకుని వస్తాను.
తెలుగు భోజనం వదులుకున్నాడు..

మా నాన్న కారణంగా వాడికి ఇంగ్లీషుపై పట్టు, చర్చించటం, సౌమ్యంగా ఎదుటివారికి తాను చెప్పాల్సింది స్పష్టంగా, లౌక్యంగా చెప్పి తనవైపుకు తిప్పుకోవటం ఇలాంటివన్నీ అలవాటయ్యాయి. ముందు నుంచీ వాగ్ధాటి కలిగిన వ్యక్తి. కాబట్టి సహజంగానే నాయకుడయ్యాడు. అయితే వాడు సీపీఎంలో చేరటం నాన్నకు ఇష్టం లేదు. కానీ, ఆయన చనిపోయేముందు మాత్రం ‘అమ్మాయీ.. వాడు చెబుతోంది రైటేనేమోనే’ అని అన్నారు. అలా జడ్జిగారి ఆమోదం కూడా పొందాడు. ఒకసారి యూనివర్శిటీలో చదువుకుంటుండగా ఆందోళన చేశారని వీడినీ, స్నేహితులనూ అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌లో పెట్టారు. పోలీసులే మాకు ఫోన్‌ చేసి భోజనం తీసుకురావాలనుకుంటే తీసుకొచ్చి ఇవ్వండి అన్నారు. అందరికీ కలిపి నేను భోజనం తీసుకెళ్లాను. వీడేమో బల్లపై కూర్చుని అందరికీ ఏదో చెబుతున్నాడు. పోలీసులు కూడా శ్రద్ధగా వింటున్నారు. మనకెందుకురా ఇవన్నీ అన్నాన్నేను. ‘ఇలా ఉద్యమాలు చేసి పోలీసు స్టేషన్లకు, జైళ్లకు వెళ్లినవారే పైకొస్తారు. నీకెందుకు భయం’ అన్నాడు. ఆ గొడవల్లో పడి పీహెచ్‌డీ చేయలేకపోయాడు. నా మిత్రులంతా అనేవాళ్లు ‘ఆ పార్టీయే అంత. వాడిని పీహెచ్‌డీ చేయనివ్వదు’ అని. జేఎన్‌యూలో చేరిన కొన్నాళ్లకే హాస్టల్‌లో చేరిపోయాడు. ప్రతిరోజూ రాత్రిళ్లు చర్చలు. పగలు చదువుకోవటం, పార్టీ పనులు చూసుకోవటం. ఇదే దినచర్య అయ్యింది. వారాంతాల్లో అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి ఇంటికొచ్చేవాడు. వాడికి తెలుగు భోజనం అంటే మహా ప్రీతి. కొబ్బరి పచ్చడి, ఆవకాయపచ్చడి, పులుసు, గడ్డపెరుగు ఇలా అన్నీ కావాలి. కానీ, పార్టీలో చేరిన తర్వాత మాత్రం భోజనాన్ని వదులుకున్నాడు. పార్టీ కార్యాలయంలో స్టాండర్డ్‌ మెనూ ఉంటుంది. రాజ్మా చావల్‌, దాల్‌ చావల్‌.. ఇలా. కింది నుంచి పై వరకూ అంతా ఇదే భోంచేస్తుంటారు. దాంతో ఎప్పుడైనా వారాంతంలో అయినా రమ్మని చెప్పి వండిపెట్టాలని ఉంటుంది. వాడికి సమయం దొరికినప్పుడెప్పుడో వస్తుంటాడు.

పార్టీ కోసం జీవితాన్ని ధారపోయాలి..

ప్రధాన కార్యదర్శి పదవిని కూడా చాలా సౌమ్యంగానే, ఎన్నికల్లేకుండా పార్టీ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు. ఈ స్థాయికి రావాలి అని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. దీనికోసం పనిచేయలేదు. అసలు ఈ పార్టీ విధానమే వేరు. కిందికి పడటమే తప్ప పైకి రావటం లేదు. దీన్ని పైకి తీసుకురావటానికి బాగా కష్టపడాలి. పార్టీ కోసం కష్టపడితే సరిపోదు. అందరినీ కలుపుకుని, అన్ని పార్టీలనూ కలుపుకుని ముందుకెళ్లాలి. దేశంలో భిన్నమైన వ్యవస్థ, భిన్నమైన ప్రభుత్వం, భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. అంతా కలిస్తే తప్ప అనుకున్నది సాధ్యం కాదు. ఏదో చేస్తానని అందరికీ ఆశ కల్పించిన వాడు ఇప్పుడు చేయకపోతే ఎలా? సీతారాం చేయాల్సింది చాలా ఉంది. తప్పకుండా ప్రయత్నం చేస్తాడు. అందులో అపనమ్మకం లేదు. అయితే, దేవుడు కూడా సహకరించాలి. ఈ మాటను మాత్రం వాడు ఒప్పుకోడనుకోండి!! నేను మాత్రం దేవుడ్ని నమ్ముతాను. సీతారాం కూతురు ఎడిన్‌బరోలో ప్రొఫెసర్‌. కొడుకు జర్నలిస్టు. మూడోవాడు కాలేజీలో చదువుతున్నాడు. ఇంటిని ఎక్స్‌పోజ్‌ చేయడు. అయినా ఇప్పటికీ, తమ్ముడికైనా, ఇంట్లో ఎవరికైనా సలహాలన్నీ ఇస్తుంటాడు.

‘గుండోజీ’ అని ముద్దుగా పిలిచేవారు

సీతారాం పార్టీలో చేరినప్పుడు దుర్గాభాయమ్మ ‘వీడు పార్టీలో చేరిపోయాడు. మనం ఒక కన్నేసి ఉంచాలి’ అనేవారు. బొద్దుగా ఉండటంతో ఆమె ముద్దుగా ‘గుండోజీ’ అని పిలిచేవారు. సాయిబాబా జుట్టులాగా రింగులు తిరిగి ఉండేది. ఐదు రూపాయల నోటు ఇచ్చి జుత్తు కత్తిరించుకుని రారా! అని పంపించేవాళ్లు. ఆమె మేనల్లుడు, వీడు కలిసి వెళ్లి రెండు వెంట్రుకలు కత్తిరించుకుని వచ్చేవారు. ఏంట్రా అంటే.. ‘ఆ డబ్బుకు అంతే చేస్తారత్తా’ అనేవాళ్లు. దేశ్‌ముఖ్‌ గారు కూడా చాలా ప్రేమగా ఉండేవారు. దుర్గాభాయమ్మ కూడా తిండి బాగా తినమని చెప్పేవారు..’’ అని ఇంటర్వ్యూ ముగించారు కల్పకం ఏచూరి.

సామాజిక సేవకురాలు..

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.