కుదిరితే కప్పు కాఫీ..! -శైలజామిత్ర

కుదిరితే కప్పు కాఫీ..!

  • -శైలజామిత్ర
  • 18/04/2015
TAGS:

కథల పోటీలో ఎంపికైన రచన
======================
‘‘ఎంత మాటన్నావు? ఎంత ధైర్యం నీకు? అసలు ఏం చూసుకుని నీకు అంత పొగరు?’’ రొప్పుతూ అన్నాడు శ్రీ్ధర్.
‘‘నా ఇష్టం. నేనెలాగైనా మాట్లాడతాను. నువ్వు మాత్రం తక్కువ మాటన్నావా?’’ అంది జుట్టుకు మరింత గట్టిగా రబ్బర్ బిగిస్తూ రమ.
‘‘నేనేమన్నాను? మా అమ్మకు విలువ ఇచ్చి మాట్లాడమంటే తప్పా? ఏం? ఆమె మీ అమ్మలాంటిది కాదా? రేపు నేను కూడా మీ అమ్మను ఇలా అంతలేసి మాటలంటే నీకు బాధ కలగదా?’’
‘‘మీ అమ్మ మాత్రం నన్ను తిట్టలేదా? నెలకు 50 వేలు సంపాదిస్తున్నది మీ అమ్మదగ్గర – ‘పని రాదు.. కాస్త పని నేర్చుకోవాల’ ని అనిపించుకోవడానికి కాదు. నాకు పనిచేయాల్సిన ఖర్మ ఏం పట్టింది?’’.
‘‘మీ అమ్మ కూడా నన్ను అందిగా. నన్ను పొద్దునే్న లేవమని, వాకింగ్ చేయమని. నేను రాత్రి రెండు గంటలవరకు టీవీ చూడకూడదని.. ఆమె ఎవరు అనడానికి? నా ఇష్టం. నేను ఎలా ఉండాలో మీ అమ్మ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం, ఖర్మ ఏమీ పట్టలేదు. నాకూ 50వేల రూపాయల జీతం వస్తుంది’’ అన్నాడు అదే వాయిస్‌తో శ్రీ్ధర్.
‘‘మా అమ్మ క్రమశిక్షణగా ఉండమంది. మీ అమ్మ పనిచేయమంది. దానికి, దీనికి చాలా తేడా ఉంది’’ అంది అక్కడున్న గ్లాసును దూరంగా విసిరేస్తూ రమ.
‘‘అత్తగారిని గౌరవించే విషయంలో మీ అమ్మ క్రమశిక్షణ నేర్పలేదా?’’ అన్నాడు వ్యంగ్యంగా శ్రీ్ధర్.
‘‘షటప్’’
‘‘యూ.. షటప్’’
ఈ అరుపులు సుశీలమ్మకు మామూలే! రోజూ దేనికో ఒకదానికి ఇలా అరచుకోవడం వీరిద్దరికీ మామూలే. వినలేక, అక్కడ్నించి బయటపడలేక ఎంతో సతమతమవుతోంది పాపం. కలుగజేసుకుందామంటే- కోడలి నుంచి ఏ మాట వినాల్సి వస్తుందోననే భయంతో దూరంగా ఉండిపోతోంది. తన స్నేహితురాలు బిరియానీ తెచ్చిందని చాలా బావుందని చెబితే- ‘నువ్వూ వంట నేర్చుకోమ్మా’ అన్న మాటకు ఇంత రాద్ధాంతం జరగడంతో సుశీలమ్మ బాధపడతోంది. అనవసరంగా వీరిద్దరిమధ్య గొడవకు తాను కారణమైనట్లు కుమిలిపోయింది.
మా కాలంలోనే నయం. ఉండీ లేని కుటుంబమైనా భర్తకు విలువనిచ్చి చెప్పినట్లు వినేవారం. ‘నువ్వెంత? అంటే నువ్వెంత?’ అని ఒక్కనాడైనా అనుకునేవారం కాదు. ఆయన సంపాదనతో ముగ్గురు పిల్లల్ని పెంచినా ఏ రోజూ బతుకు భారంగా అనిపించలేదు. ఇపుడు నేనిక్కడ, ఆయన మరో కొడుకు దగ్గర ఉంటున్న తీరు మరింతగా బరువుగా ఉంది. ఒక్కసారైనా ఇద్దరూ కలిసి ఏదైనా ప్రశాంతంగా ఉండే చోటుకు వెళ్లి బతకాలనిపించగానే భర్త గుర్తొచ్చాడు. మాట్లాడాలనిపించింది. కానీ, అబ్బాయిని ఫోను అడగాలి. అదీ భర్త వద్ద ఉన్న మరో అబ్బాయికి చెయ్యాలి. వీడికిష్టమయితే ఇస్తాడు. వాడికిష్టమయితేనే తండ్రికిస్తాడు. ఆయనక్కడ.. నేనిక్కడ.. అనుకుంటూ భయంగా కూర్చుంది ఒక స్టూలు మీద.
అంతలో శ్రీ్ధర్ సెల్‌ఫోన్ రింగయ్యింది. ‘‘కుదిరితే ఒక కప్పు కాఫీ.. వీలయితే రెండు మాటలు’’- వెంటనే సెల్ ఆఫ్ చేస్తూ ‘‘ఈ రింగ్‌టోన్ ఒకటి. ఇలాంటివి పెట్టుకునే నన్ను పడేశావ్. ఇంకా ఎంతమందిని పడేస్తావ్?’’ అంది ఫోన్ అందుకుని చూస్తూ రమ.
‘‘ఇదిగో.. నోరు కంట్రోల్‌లో పెట్టుకో. నీ ఒక్కదానే్న భరించలేక చస్తున్నాను. ఇక మరొకటా? బుద్ధుంటే ఆ పని చేయను’’ అన్నాడు తన సెల్‌ను లాక్కుంటూ.
‘‘అంటే నేను నీకంత భారమైపోయానా? అపుడే చెప్పాడు మా డాడీ. వద్దు వాడు నీకు సరిపోడని’’ అంది విసురుగా సోఫాలో కూర్చుంటూ.
‘‘మీ నాన్న మాట వినుండాల్సిందే. పీడా విరగడయ్యేది’’ అనేసరికి ఏకంగా భద్రకాళి అయ్యింది. ‘‘ నేనంటే నీకసలు ప్రేమే లేదన్నమాట. మరెందుకు నా వెంట కుక్కలా తిరిగావు?’’
‘‘తిరిగాను. నువ్వుకూడా నా వెంట తిరిగావు కదా? నీది కూడా కుక్క జాతేనా?’’ అంటూ మాటకు మాట పెరిగిపోతూ, చేతికందినవి విసిరేసుకుంటూ, ఇంటి పరిస్థితిని గందరగోళం మార్చేసారు.
సుశీలమ్మకు ఏమీ తోచడంలేదు. ఎదురుగా ఏడుకొండలవాడి పటాన్ని చూస్తూ వేడుకుంది- ‘‘దేవుడా..! వీరినిద్దరికి పొంతన కుదుర్చు. రోజూ ఈ గోల భరించలేకపోతున్నాను’’ అంటూ.
***
ఉదయం లేవగానే కోడలికి కాఫీ అందించింది. ఆమె వౌనంగా తీసుకుంది. టిఫిన్ బాక్స్‌లో బిరియానీ పెట్టానమ్మా. తిని చూడు. నీ కోసం నేర్చుకుని మరీ చేశానని అంది చేతికి బాక్స్‌ను అందిస్తూ.
‘‘మీరు బిరియానీ చేశారా? ఎలా?’ అంది రమ.
‘‘నీకిష్టమని పుస్తకంలో చదివి చేశాను. తిని చూడమ్మా.. బావుంటే ఇంకాస్త ఎక్కువ చేస్తాను’’ అంది మెల్లగా సుశీలమ్మ.
మారు మాట్లాడకుండా చాలని తలూపి వెళ్లిపోయింది. రమ వెళ్లిన కాస్సేపటికి శ్రీ్ధర్ కూడా బయలుదేరబోయేంతలో..
‘‘శ్రీ్ధర్ ఒక్కసారి ఆగు’’ అంది సుశీలమ్మ.
‘‘ఏంటమ్మా?’’
‘‘మరేం లేదురా… చినికి చినికి గాలివాన అవుతుందిరా. ఆ అమ్మాయి ఏదో అందే అనుకుందాం. వినీ విననట్లు వదిలేయ్. ఒకసారి అంటుంది. రెండుసార్లు అంటుంది. మూడోసారి ఊరుకుంటుందిగా.. ఏమంటావు? ఎక్కడో బయటనుండి వచ్చిన అమ్మాయి. మన పద్ధతులు, మనం ఎలా అర్థం అవుతాము? సంసారంలో ఒకరు కోపగించుకున్నపుడు మరొకరు ఊరుకోవడం ఉత్తమం. అర్థమయ్యిందా?’’ అంది చేతికి మంచినీళ్ళు అందిస్తూ తల్లి.
‘‘ఏం.. నేనే ఊరుకోవాలా? ఆడది తను ఊరుకోవచ్చుగా? తనకే అంత అహంకారముంటే మగాడ్ని నాకెంత ఉండాలి?’’ అన్నాడు విసుగ్గా.
‘‘ఏం చేద్దాం? సంపాదనంటూ వీధుల్లో పడినపుడు ఇక ఆడ, మగ ఏంటి? అంతా సమానమే. ఆర్థిక స్వాతంత్య్రం వచ్చాక ఇపుడు మీరు స్నేహితుల్లా మెలగాలి తప్ప ఇక మగ, ఆడ అనే తేడాలు పెట్టుకోకూడదు’’ అనగానే ‘‘సరేలే, చూద్దాం’’ అంటూ బయలుదేరబోయాడు.
‘‘ఓరేయ్ శ్రీ్ధర్’’
‘‘మళ్ళీ ఏంటి?’’
‘‘మీ నాన్నని గుడికి రమ్మనరా. చూసి చాన్నాళ్లయ్యింది’’ అంది మెల్లగా సుశీలమ్మ.
‘‘అలా అంటే ఎలాగమ్మా? ఈ రోజు ఇంటికి మా ఫ్రెండ్స్ వస్తున్నారు. నువ్వు వంట బాగా చేస్తావని గొప్పగా చెప్పాను. రేపో.. ఎల్లుండో..?’’ నసిగాడు శ్రీ్ధర్.
‘‘అలాగా! అయితే సరేలేరా! మీకు పెళ్ళయ్యాక మీ స్నేహితులకంటూ ఏమీ చేయలేదు. సరే మీరేమి వండమంటారో చెబితే…’’ అంది మెల్లగా ఇక తప్పదన్నట్లు.
‘‘కొడుకు చెప్పిన లిస్టు అందుకుని ఈసురోమంటూ వంటింట్లోకి నడిచింది. ఆడదానికి అందునా ఉద్యోగం లేని ఆడవారికి చచ్చేంతవరకూ వంటిల్లే జీవితం అన్న భర్తమాటలు నిజమేననిపించింది.
***
‘‘ఒరేయ్! చిన్నోడా!’’
‘‘ఆ…! ఏంటి నాన్నా?’’
‘‘ మీ అమ్మను చూడాలని ఉంది.. గుడి దగ్గరకు రమ్మంటే’’ అని నసిగాడు.
‘‘ఈ రోజా..? కుదరదు నాన్నా! ఈ రోజు మీ కోడలు విద్య పుట్టిన రోజు. సాయంత్రం చిన్న పార్టీ అని అందర్నీ పిలిచాను. పిల్లలకు హోంవర్క్ చేయించాలి. సాయంత్రం అంతా చాలా హడావుడిగా ఉంటాము. ప్లీజ్.. మరోసారి..’’ అన్నాడు రిక్వెస్టింగ్‌గా.
‘‘సరేలేరా మరెప్పుడైనా..!’’ అని లోనికి వెళ్లాడు దిగులుగా తండ్రి ఆంజనేయులు.
ఆంజనేయులుకు ఇది కొత్త కాదు. తల్లిని ఒకరు, తండ్రిని ఒకరు ఇంట్లో పెట్టుకుని పోషిస్తామన్నారు కొడుకులిద్దరూ. ఆరు నెలలు దాటాక ఇద్దరూ ఇల్లు మారాలట. అంటే పెద్దకొడుకు దగ్గర ఉన్న తల్లి చిన్నకొడుకు దగ్గరకు, చిన్నకొడుకు దగ్గరున్న తండ్రి పెద్దకొడుకు దగ్గరకు మారాలి తప్ప, ఏ ఒక్కరోజూ- ‘‘మీరిద్దరూ ఎపుడు కలిసి మాట్లాడుకుంటారు?’’ అనే మాటే లేకపోవడం ఇద్దరినీ మరింత కుంగదీస్తోంది. పోనీ విడిగా ఉందామా? అంటే వేలకొద్దీ అద్దెలు కట్టుకునే స్థాయి లేదు. వచ్చే పదివేల రూపాయల పెన్షన్ అన్నింటికి సరిపోదు. ఏదైనా హోంలో చేరుదామంటే ఇద్దరినీ రానియ్యరట. అందులోనూ స్ర్తిలది వేరు, పురుషులది వేరు. అక్కడా ఇదే రాత. విడిగా జీవిద్దామనుకుంటే ఏ క్షణంలో ఏ జబ్బు వచ్చేస్తుందో, అపుడు వారు చేరదీస్తారో లేదో అని సుశీలమ్మ బాధ. ఆమె బాధతో ఇష్టం లేకున్నా భరించక తప్పడం లేదు ఆంజనేయులకు కూడా.
అందుకని ఎప్పుడో ఒక రోజు కుదిరితే మాట్లాడుకుంటూ, పిల్లల విషయాలను చర్చించుకుంటూ గడుపుతారు. వృద్ధాప్యం అంటే- వీరి నడుములేమీ వంగిపోలేదు. అలాగని గట్టిగానూ లేవు. కన్నకొడుకుల ప్రవర్తనతో మనసు మాత్రం కుంగిపోయింది. సరే అనుకుని ఎప్పటికప్పుడు సర్దుకుపోతున్నారు. ఎపుడెపుడు సుశీలను చూడాలా? అని ఆంజనేయులు, భర్తను చూసి ఎంతకాలమయ్యిందో? అని సుశీల జీవితాలను గడిపేస్తున్నారు.
***
రమకు తెలియని ఆవేదనగా ఉంది. ఎంత వద్దనుకున్నా ఏదో వెలితి. శ్రీ్ధర్ ఎంతగా ప్రేమించానన్నాడు? తాను లేకపోతే చనిపోతానని కూడా అన్నాడు. ఇపుడేమో అసలు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందని అంటున్నాడు. అంత మాట అనడానికి కారణం నేనేనా? పెళ్ళయి ఆరు నెలలు తిరక్కుండానే ఇంతలా పోట్లాడుకుంటుంటే ఇకపై జీవితం? పోనీ విడాకులు తీసుకుంటే?.. అమ్మో! శ్రీ్ధర్ లేకుండా తన జీవితమా? కుదరదేమో! ఒకవేళ అది జరిగినా మళ్లీ పెళ్లి.. మళ్లీ వచ్చేవాడు కూడా ఇలానే ఉంటే? ఇలా వదులుకుంటూ పోవడమేనా జీవితం? నోనో.. అనుకుంటూ తన సెల్‌ఫోన్ చేతిలోకి తీసుకుంది రమ శ్రీ్ధర్‌కు సారీ చెబుదామని. కానీ… మళ్లీ ఫోన్ తీయకుండా ఉంటే తనకెంత అవమానం? అనుకుని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. అత్తగారు గుర్తుకురాగానే పాపం..! తనకోసం బిరియానీ నేర్చుకుని వండిందంటే నేనంటే ఎంత ప్రేమో కదా? పైగా నచ్చుతుందో లేదో అనే భయం. నేనే తొందరపడుతున్నానా ఆమె విషయంలో… అనుకుంటూ బస్సులో ప్రయాణమంతా గడిచిపోయింది.
ఇక్కడ శ్రీ్ధర్ పరిస్థితీ అంతే! రమని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. అపుడు వంట రాదని తెలుసు కూడా. అపుడు రాని కోపం ఇపుడెందుకు వస్తోంది? తనలానే చదువుకుంది. వంట నేర్చుకునే సమయం ఎక్కడుంది? తనకిష్టమని ఈ రింగ్ టోన్ పెట్టుకున్నాడు. ఈ రోజు ఇదే రింగ్ టోన్ తనకింత అసహ్యం అయ్యిందంటే తన ప్రవర్తనే కారణం అనిపిస్తోంది. జీవితమంటే రింగ్‌టోన్ పెట్టుకున్నంత సులభం కాదు కదా? ఛ! పెళ్ళయి ఆరునెలలు తిరగకుండానే ఇద్దరిమధ్య ఇంత అగాధమా? వద్దు. ఇద్దరూ విడాకులు తీసుకుంటే… అమ్మో! రమ లేకుండా తను ఎలా బతకగలడు? ఎన్ని ఏళ్ళు వెంటపడి పెళ్లి చేసుకున్నాడు? ఇపుడు నలుగురిలోనూ నవ్వులపాలు అవ్వడమే కాదు. ఇకపై జీవితంలో ఎవరినీ ఆహ్వానించలేడు. తర్వాత పెళ్లి చేసుకున్నది కూడా ఇలానే ఉంటే? ఇలా కాదనుకుంటూ పోతుంటే ఇక మిగిలేది ఏముంది? అనుకున్న మరుక్షణం వెంటనే చెయ్యి ఫోన్ మీదికి వెళ్లింది. రమకు క్షమాపణ చెప్పాలని.. ఏమో! మళ్లీ ఇదో నాటకమా అంటే? అని అనుకుంటుంది. వెంటనే తల్లికి ఫోన్ చేశాడు. ‘‘అమ్మా! నువ్వు సాయంత్రం రెడీగా ఉండు, గుడికి పంపుతాను’’ అన్నాడు మొదటి మార్పుకు నాంది పలుకుతూ.
***
‘‘బావున్నారా? అరగంట నుండి వేచి చూస్తున్నాను. ఇంత ఆలస్యమైతే ఎలా? అంది మూతిని తిప్పుతూ సుశీల.
‘‘నాకేం గుండ్రాయిలా ఉన్నాను. నువ్వెలా ఉన్నావోయ్ ముసలీ’’ అంటూ నవ్వాడు ఆంజనేయులు.
‘‘అప్పటికి మీరేదో కుర్రాడయినట్లు’’ అంది నవ్వుతూ.
‘‘నేనెప్పుడూ కుర్రాడినే. అసలు మన పిల్లలకు మనం థాంక్స్ చెప్పాలోయ్’’
‘‘ఎందుకూ? మనల్ని ఇలా విడదీసినందుకా?’’ అంది కోపంగా.
‘‘విడదీశారని ఎందుకు అనుకుంటున్నావు? మనల్ని ప్రేమికుల్ని చేశారనుకుని చూడు. వారిమీద నీకు కోపమే రాదు’’ అన్నాడు నవ్వుతూ.
‘‘మనల్ని ప్రేమికుల్ని చేయడమేంటి? విడ్డూరం!’’ అంది చెంపలు నొక్కుకుంటూ.
‘‘కాకపోతే మరేమిటి? నువ్వేమో గుడి దగ్గర ఎదురుచూడటం, నేను కాస్త ఆలస్యంగా వస్తే- ఇంత లేటా? అని నువ్వు అలగటం, నువ్వు ఏదయినా స్వీటు వండితే కొంగులో దాచుకుని వచ్చి నాకివ్వడం, నేను ఏదో ఇవ్వడం.. ఇలా మనల్ని ఏకంగా యాభై ఏళ్ళ వెనక్కు తీసుకెళ్లి డ్యూయెట్లు పాడుకునేలా చేశారంటే- అంతా వారి గొప్పదనమే కదూ?’’ అన్నాడు బిగ్గరగా నవ్వుతూ.
‘‘్ఛ! అవేం మాటలండీ? ఎవరైనా వింటే నవ్విపోతారు’’ అంది సిగ్గుపడుతూ.
‘‘ఇందులో నవ్వుకోవడానికి ఏముందే పిచ్చిదానా? అసలు ప్రతి తల్లిదండ్రులు ఇలా అనుకుంటే అసలు సమస్యే రాదు’’ అన్నాడు ఆంజనేయులు.
ఇందాక బయలుదేరేటపుడు అబ్బాయి అన్నాడు- ‘‘అమ్మా.. ఇకపై మీ ఇద్దరూ కలిసి ఉండేలా ఏర్పాటుచేస్తాము. మిమ్మల్ని విడదీసిన పాపమే మా మధ్య అపార్థాలకు కారణమవుతుందేమో! ఈ విషయం తమ్ముడితో మాట్లాడతా.. ఉన్నన్నాళ్ళు హాయిగా ఉండండ’’ని అన్నాడు. అంతా ఆ ఏడుకొండలవాడి దయ… అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ సుశీల.
‘‘అంత మాటన్నాడా? వాడికెంత ధైర్యం? ఇపుడిపుడే ప్రేమించుకుంటున్న మనల్ని మళ్లీ భార్యాభర్తల్ని చేసేస్తానంటాడా? అందుకు నేనొప్పుకోను… అంతే..!’’ అన్నాడు చిన్నపిల్లాడిలా ఆంజనేయులు.
‘‘మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. మనం భార్యాభర్తల స్థాయి నుంచి తల్లిదండ్రుల స్థాయికి ఇపుడు తాతా నానమ్మల స్థాయికి వచ్చాము. ఇంకా మీతో గొడవలంటే నావల్ల కాదంతే..’’ అంటూ ముసిముసి నవ్వులు నవ్వడంతో అక్కడున్న చల్లని వాతావరణంలా వారి మనసులు హాయిగా నవ్వుకున్నాయి.
*

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.