నాకీ గుర్తింపు వద్దు దేవుడా..! (కథల పోటీలో ఎంపికైన రచన

నాకీ గుర్తింపు వద్దు దేవుడా..! (కథల పోటీలో ఎంపికైన రచన)

  • తులసి బాలకృష్ణ
  • 24/04/2015
TAGS:

‘‘ఎలా వుంది నీకిప్పుడు వొంట్లో?’’ అంటూ భార్య నుదుటిమీద చేయ వేసిన రఘుపతి- అసంకల్పిత ప్రతీకార చర్యగా చటుక్కున వెనక్కి తీసుకున్నాడు చేతిని. పెనంలా కాలిపోతోంది ఆవిడ వొళ్ళు. ‘‘ఈ రోజు తగ్గిపోతుంది జ్వరం.. పథ్యం పెట్టవచ్చు.. అనుకుని బీరకాయ కూర చేసి, చారు పెట్టానే సరస్వతీ.. మళ్లీ తిరగబెట్టినట్లుంది.. చ్ చ్చ్ చ్చ్…’’ అన్నాడు నొచ్చుకుంటూ… భయంతోనూ, బాధతోను వణుకుతూన్న గొంతుతో. నీరసంగా, సన్నగా నవ్విందావిడ భర్త కళ్ళలోకి చూస్తూ. ‘‘్భయం లేదు లెండి.. అదే తగ్గిపోతుంది’’ జిగురుగా అంటుకున్న నోటిని ప్రయత్నం మీద విప్పిన ఆమె నోట్లోంచి మాటలతో బాటు వేడి ఆవిరి కూడా వెలువడింది.
లోపల్నుంచి తన్నుకొస్తూన్న దుఃఖాన్ని కనురెప్పల వెనకే కుక్కుకుంటూ, అరిచేత్తో ఆమె నుదుటిమీద పడుతూన్న జుట్టుని పైకి తోస్తూ వౌనంగా వుండిపోయాడాయన. భర్త కళ్ళల్లోని బెంగని గమనిస్తూ అంత నీరసంలోనూ ఆయనకి ధైర్యం కలిగించడానికి, నవ్వడానికి ప్రయత్నిస్తూన్న సరస్వతికి తమ గత వైభవపు రోజులు గుర్తొస్తున్నాయి.
***
మద్రాసు టీనగర్‌లో వుండే రోజులు. పొద్దునే్న ఆరింటికల్లా స్నానాదులు ముగించుకుని వంటింట్లోకి వచ్చి, పీట వాల్చుకుని బాసిం మఠం వేసుక్కూచుని తను వడ్డించే ఇడ్లీలో, దోసెలో, పెసరట్లో శుభ్రంగా కడుపు నిండా లాగించేసి, గ్లాసుడు చిక్కటి ఫిల్టర్ కాఫీ తాగేసి, ‘బ్రేవ్’మని త్రేంచి, మరచిపోకుండా ‘‘అల్పాహార దాతా.. సుఖీభవా!’’ అంటూ తనని దీవించేసి వరండాలోకి పోయి కూర్చునే వాడాయన. ఓ అయిదు, పది నిమషాల తేడాతో ఏదో ఒక సినిమా ప్రొడక్షన్ తాలూకు కారో, వ్యానో వచ్చేది. వేసేవి హీరో వేషాలో, పూర్తి నిడివి వేషాలో కాకపోయినా, కొంచెం చిన్నవే అయినా, మంచి గుర్తింపు వుండే వేషాలు మాత్రం అయ్యుండేవి. కథా చర్చ ముగియగానే ‘ఇది రఘుపతిగారి వేషం’ అని వెంటనే నిర్ణయించేసేవాళ్ళు డైరెక్టర్లు. అలా ‘గుర్తింపు’ వుండేది, రాబడీ బావుండేది.
రోజులు మారాయి.. మనుషులు మారారు.. కథలు కొత్త పుంతలు తొక్కాయి.. హీరో హీరోయిన్లు, గూండాలు… అంతే! కేరెక్టర్ నటుడికి డిమాండ్ క్షీణించింది.. ఫలితం… ఎలాంటి వేషాలు లేవు… రాబడి లేదు. ముందుచూపు లేక డబ్బు పొదుపు చేసుకోలేదు. కూతురి పెళ్లికి ఉన్న కొద్దో గొప్పో ఖర్చయిపోయింది. ఇపుడు తమ పల్లెటూరి పూరింట్లో.. ఆ ఇల్లున్న దీన స్థితిలోనే తనూ, ఆయనా…
***
‘టక టక టక’’ మని వేళ్లతో తలుపు తట్టుతూన్న ధ్వని. తలుపు తీసాడు రఘుపతి. ఎదురుగా పక్కింటి సుభద్రమ్మగారు. ఆవిడ వెనక ఓ పాతికేళ్ళ యువకుడు.
‘‘ఎలా వుందండీ సరస్వతమ్మ గారికి?’’ అనడిందావిడ. గుమ్మానికి అడ్డు తొలిగి, భార్య కుక్కి మంచంవైపు చూపించాడు రఘుపతి భారంగా ఊపిరి వదుల్తూ.
ఆవిడ తన వెనక వున్న యువకుడితో ‘‘నువ్వ బాబాయ గారితో మాట్లాడుతూ వుండు రాజూ..’’ అని లోపలికి నడిచింది.
‘నాపేరు రాజండీ..’ అంటూ చేతులు జోడించి నమస్కరించాడు అతను రఘుపతికి. గడప దాటి బయటకొచ్చి బల్లమీద కూర్చుంటూ, ‘‘కూర్చో.. నాయనా’’ అన్నాడు రఘుపతి.
నాన్చకుండా తనను పరిచయం చేసుకుని, తను చెప్పదలుచుకున్న విషయాన్ని ఒక్క పది నిముషాల వ్యవధిలో ఆయన ముందు ఉంచాడు రాజు. తల పంకించి ఆలోచనలో పడ్డాడు రఘుపతి.
పది నిముషాలు పోయాక సుభద్రమ్మగారు బయటకొస్తూ, ‘మాట్లాడావా..?’ అన్నట్లుగా రాజువైపు చూసి, అతను ‘ఆఁ’ అంటూ తల వూపాక, రఘుపతితో- ‘‘ఆలోచించండి అన్నయ్యగారూ.. ఇతను మా వాళ్ళబ్బాయే. మంచివాడు. మిమ్మల్ని జాగర్తగా చూసుకుంటాడు. ఇక్కడ సరస్వతమ్మగారు ఒక్కరే ఉంటారని మీరేం భయపడక్కరలేదు. మేమంతా వున్నాంగా.. మాకు పెద్ద పనేం వుంటుంది… రోజుకి పదిసార్లు వచ్చి చూసి పోతుంటాం. ఆవిడకి తగ్గేవరకూ మందులూ అవీ ఇచ్చి, ఇంత జావా అదీ కాచి ఇస్తాం’’ అని నమ్మకంగా చెప్పి రాజుతో బాటు వెళ్లిపోయారు. నెమ్మదిగా లేచి లోపలి గదిలోకి నడిచాడు రఘుపతి.
‘‘ఏం నిర్ణయించుకున్నారండీ?’’ నూతిలోంచి వచ్చినట్లు వుంది సరస్వతి గొంతు.
ఉలిక్కిపడి ఆమె ముఖంలోకి చూస్తూ, ‘‘ఆవిడ నీకు చెప్పారా?’’ అనడిగాడు రఘుపతి. ఔనన్నట్లుగా తల ఊపి, పెదాల మీదకు నవ్వు తెచ్చుకుంటూ, ‘‘వెళ్లిరండి’’ అంది.
తెల్లబోయాడు రఘుపతి. ‘సరస్వతీ.. ఆవిడ నీకేం చెప్పారో.. నువ్వేం విన్నావో? ఆ అబ్బాయి టీవీ సీరియళ్ళకి జూనియర్ ఆర్టిస్టు సప్లయర్‌ట. మా రోజుల్లో ఎక్స్‌ట్రా సప్లయర్ అనేవాళ్ళు. నేను సిటీకి వెళితే రోజువారీ వేషాలు ఇప్పించగలననీ, రోజుకి నాలుగు వందలిస్తారనీ, అందులో రెండు వందలు తనకి ఇవ్వాలనీ, తన వద్ద వున్న మరో పది మందితో బాటు నాకూ తల దాచుకోవడానికి గూడు ఏర్పాటుచేస్తాననీ, పొద్దున్న టిఫిను, మధ్యాహ్న భోజనం షూటింగ్ వున్న యూనిట్ వాళ్ళు పెడతారనీ, రాత్రి భోజనం నేను చూసుకోవాలనీ చెప్పాడు ఆ అబ్బాయి. వాళ్ళిద్దరిదీ మనకి మేలు చేసి, ఇంత ఆలంబన కలిపించాలనే సదుద్దేశమే. కుర్రాడు కూడా మంచివాడు లాగే వున్నాడు. ఏదీ దాచకుండా ఉన్నది కచ్చితంగా చెబ్తున్నాడు. నా గత చరిత్ర తనకు తెలిసిందనీ, ఇప్పటి కుర్రాళ్ళమధ్య ఓ జూనియర్ ఆర్టిస్టుగా ఉండడానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి నా పేరును రాఘవయ్య అని మారుద్దాం అని అన్నాడు. అంతా బాగానే వుంది గానీ ఈ పరిస్థితుల్లో.. నిన్ను ఒంటరిగా వదిలి.. నెలకి వెయ్యి రూపాయలు వస్తూన్న కొట్లో గుమాస్తా ఉద్యోగం వదిలి….’’- అని నసిగాడు.
తనకేమీ కాదని, కొట్లో గుమాస్తా ఉద్యోగం కంటే ఎక్కువ గడించవచ్చనీ, ఆ రంగంలో పడ్తే మనసుకి కూడా ఆహ్లాదంగా ఉంటుందని, ఇంటి ఆర్థిక పరిస్థితితోబాటు ఆరోగ్యాలు కూడా బాగుపడతాయనీ, తప్పక వెళ్ళమని బలవంతంగా ఒప్పించింది సరస్వతి.
ఈ అవకాశం లభించిన ఆనందంతో ఆమెలో కొంత శక్తి కూడా వస్తూన్నట్లు తోచిన రఘుతికి- తనూ, ఆమె ఆనందంగా గడిపిన పాత రోజులు కూడా గుర్తొచ్చి, కొత్త ఊపిరి అందినట్లయ్యింది.
***
గడచిన ఇరవై రోజుల్లో పదిహేను రోజులు షూటింగులు వుండి కొంత రాబడి వుండడం, భార్య దగ్గర సుభద్రమ్మగారు ఏర్పాటుచేసిన సెల్ ఫోన్‌లో అప్పుడప్పుడు మాట్లాడగలగడం, ఆమె ఆరోగ్యం కూడా కుదుటపడుతూండడం.. రఘుపతికి బాగానే ఉంది గానీ, లోలోన… పేరు మార్చుకుని, ఓ అనామకుడిగా… ఓ ఎక్స్‌ట్రాగా.. ఈనాటి ఫీల్డ్‌లో వున్న భాష ప్రకారం ఓ జూనియర్ ఆర్టిస్టుగా.. ‘గుర్తింపు’ లేకుండా చెట్ల కింద కూర్చుని ఒళ్ళో పళ్ళెం పెట్టుకు తింటూ.. ‘‘రా..’’, ‘‘పో..’’ అంటూ ఏకవచన ప్రయోగంతో పిలిపించుకుంటూ వుంటే… కొంచెం బాధాగానే ఉంటోంది. మరో పది రోజులు గడిచాయి. ఓ సీరియల్ షూటింగ్‌లో తన పాత్రలో నటిస్తూన్నాడు రఘుపతి.
అసోసియేట్ డైరెక్టర్ అహంకారాన్ని ప్రదర్శిస్తూ- రఘుపతిని ఉద్దేశించి, ‘తన’ స్టయిల్ని ఫాలో కావట్లేదని, తనకి కావాల్సిన ఎఫెక్ట్ వచ్చేలా నటించడం లేదనీ, ‘‘ఎక్కడి నుంచి తెస్తారయ్యా బాబూ ఈ మొహాల్ని? ఓ డైలాగ్ చెప్పలేరు.. ఓ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వలేరూ…’’ అంటూ, రాజు మీద విసుక్కుంటూన్నాడు.. కొంతదూరంలో కూర్చుని నెక్ట్స్ సీన్ల స్క్రిప్ట్ తిరగేస్తూన్న డైరెక్టర్ పెద్ద గొంతుతో ‘‘తీసిపారేయండయ్యా అట్టాంటోళ్ళనీ.. టైం వేస్టు..’’ అని అరుస్తూన్నాడు.
అదే సమయంలో… షూటింగ్ స్పాట్‌కి వచ్చాడు ఆ సీరియల్ ప్రొడ్యూసర్. ఎప్పుడూ షూటింగ్‌కి రాని ఆయన వచ్చేసరికి కంగారుపడ్డ అందరూ డైరెక్టర్‌తో సహా గబుక్కున లేచి నిలబడి విష్ చేశారు. ‘ప్లీజ్ సిట్‌డౌన్. కమాన్ కంటిన్యూ షూటింగ్. డోంట్ స్టాప్. లీజర్ టైం దొరికితే సరదాగా వచ్చానంతే..’’ అంటూ నవ్వు ముఖంతో ముందుకు నడిచి.. డైలాగ్ చెబ్తూన్న రఘుపతి వైపు చూసి… కళ్ళు చిట్లించి… బాగా పరికించి చూస్తూ.. అసోసియేట్ డైరెక్టర్‌ని ‘‘ఈయన రఘుపతి గారు కదూ..?’’ అని అడిగాడు.
‘‘ఎవరో రాఘవయ్యట సార్.. జూనియర్ ఆర్టిస్టు… చంపేస్తున్నాడు… మార్చేద్దాం అనుకుంటున్నాం’’ అన్నాడు అసోసియేట్.
చటుక్కున కోపంగా అతని ముఖంలోకి చూసిన ప్రొడ్యూసర్ ‘‘ఏం మాట్లాడుతూన్నావయ్యా నువ్వు?’’ అని, డైరెక్టర్‌తో ‘‘ఏం సార్.. మీకూ తెలియదా ఆయన?’’ అని అడిగాడు. తెలీదన్నాడు డైరెక్టర్. ‘‘అదీ సంగతి. అందుకనే జూనియర్ ఆర్టిస్టుగా ట్రీట్ చేస్తూన్నారన్నమాట!’’ అన్నాడు ప్రొడ్యూసర్ కోపంగా. దెబ్బతిని, భ్రుకుటి ముడిచి అర్థంకాక చూసాడు డైరెక్టర్.
‘‘సినిమాల్లో ఒకప్పటి మహానటుడయ్యా ఆయన. ఆయన దురదృష్టంకొద్దీ పెద్ద వేషాలు దొరక్కపోయినా, వేసిన వేషాలు మాత్రం ఆయనే వేయదగ్గవీ అన్న క్రెడిట్ ఆయనకుంది. ఎంతసేపూ ఈ కాలపు గెంతులూ, ఎగురుళ్ళు తప్పితే.. పాత సినిమా కళాకారుల గురించి ఏమీ తెలియనట్లుంది మీకు..’’ అంటూ ముందుకి నడిచి, రఘుపతికి చేతులు జోడించి నమస్కరిస్తూ, ‘‘అయ్యా! మా వాళ్ళకి మీ పూర్వ వైభవం, మీ ప్రతిభ తెలియక, ఇలాంటి గుర్తింపు లేని వేషం ఇచ్చారు. తీసెయ్యండి ఈ వేషాన్ని. మీరు మా సీరియల్‌లో నటించడం మా అదృష్టం’’ అంటూ డైరెక్టర్ వైపు తిరిగి, ‘‘వీరికి మంచి రన్నింగ్ రోల్ ఇవ్వండి. మన సీరియల్ టిఆర్‌పి ఒక్కవారంలో పెరిగిపోతుంది. టాప్‌లో నిలుస్తుంది’’ అని, రఘుపతితో ‘‘వస్తానండీ.. థాంక్ యూ వెరీ మచ్’’ అని వెళ్లిపోయాడు ప్రొడ్యూసర్ హడావుడిగా.
డైరెక్టర్ పూడుకుపోయిన గొంతుని సవరించుకుంటూ, ‘‘సారీ సర్.. మంచి థ్రూ అవుట్ రోల్‌కి పిలుస్తాను మిమ్మల్ని రెండు రోజుల్లో. తీసెయ్యండి ఈ వేషం..’’ అన్నాడు తలొంచుకుని రఘుపతితో. ‘‘అయ్యో నాయినా.. ఈ వేషమైనా ఇచ్చినందుకు నేను కృతజ్ఞుడిని..’’ అన్నాడు రఘుపతి.
రూమ్‌కి తిరిగి వచ్చిన రఘుపతి గుండెల్లో పూలు పూస్తున్నాయి. ఎవరైనా తన ప్రతిభని గుర్తించి ప్రశంసించి ఎనే్నళ్ళు అయ్యింది? మళ్లీ ఇన్నాళ్ళకు.. ‘గుర్తింపు!’ ఈ సీరియల్‌లో మంచి గుర్తింపు వున్న రోల్ దొరికితే తన టాలెంట్ చూపించుకోవచ్చు. మరిన్ని సీరియల్స్‌లో మంచి వేషాలు లభిస్తాయి. మళ్లీ సినిమా వాళ్ళూ పిలవవొచ్చు. తనకీ, సరస్వతికీ తిరిగి మంచి రోజులు ఖాయం..
ఒక రోజు గడిచింది.. రెండవ రోజు.. మూడు, నాలుగు, ఐదు.. ఎలాంటి పిలుపూ లేదు. మరో వారం గడిచింది.. పిలుపు లేదు.. అది వస్తుందన్న ఆశ నీరుగారిపోతోంది.
ఓ రోజున రాజుతో, ‘‘నాయనా! పోనీ జూనియర్ ఆర్టిస్టుగా నాకు నువ్విప్పించే రోజువారీ వేషాలయినా….’’ అని అంటూండగానే- రాజు ‘‘ఇప్పుడు మీ గొప్పదనం గురించి అన్ని ప్రొడక్షన్స్‌కీ తెలిసిపోయింది సార్. జూనియర్ ఆర్టిస్టుగా మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళగలను?’’ అన్నాడు నిరాశగా.
మరో పది రోజులు గడిచాయి. అయనా ఎవరి నుంచి పిలుపు లేదు. జూనియర్ ఆర్టిస్టుగా తను ‘పనికిరాట్ట!’ రాజుకి ఇవ్వడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. తిండి లేదు. ఊళ్ళో సరస్వతి తిరిగి అనారోగ్యం పాలైనట్లుగా సమాచారం. తిరిగి వెళ్లిపోయినా కొట్లో గుమాస్తా ఉద్యోగం మళ్లీ దొరకదు. తనని ఎవ్వరూ గుర్తించకపోతేనే హాయిగా వుంది. అయ్యో భగవంతుడా…! ఒక్కోసారి గుర్తింపు కూడా ఇంతలా బాధిస్తుందా? ‘‘నాకీ గుర్తింపు వద్దు దేవుడా!’’ అంటూ ఆకాశంవైపు చూస్తూ గొంతు చించుకుని, కంఠ నాళాలు తెగిపోయేలా అరిచాడు రఘుపతి.. కళ్ళ నీళ్ళు తిరుగుతుండగా.. ఆ కేకలు దేవుడు విన్నాడో లేదో.. ఆ దేవుడికే ఎరుక!
*
రచయత సెల్ నెం. 8790 11 55 44

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.