నెట్టింట’ గగ్గోలు

నెట్టింట’ గగ్గోలు

  • 26/04/2015
  • -పి.ఎస్.ఆర్.

* పగలంతా ఉద్యోగ బాధ్యతలతో అలసిపోయి సాయంత్రం ఇంటికి చేరాక ‘యూట్యూబ్’లో పాత పాటలో, అలనాటి సినిమాలో చూస్తుంటే మనసుకెంత హాయి..! నచ్చిన సినిమాలను ‘నెట్’లో చూస్తూ ఇంట్లో సేదతీరాలంటే- ఇక ఎంతోకొంత ‘చేతి చమురు’ తప్పదంటే ఎలా..? *** ఇంట్లో కాలుమీద కాలు వేసుకుని మనకు నచ్చిన ఎలక్ట్రానిక్ వస్తువులను దర్జాగా ‘ఆన్‌లైన్’లో బుక్ చేసుకోవడం.. ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పద్ధతిలో ఆ వస్తువును ఇంటి ముంగిట అందుకోవడం.. ఇలాంటి పనులకు ‘అదనపు చెల్లింపులు’ అనివార్యమంటే ‘నెటిజన్ల’కు కష్టమే మరి.. *** పాత వస్తువులకు ఫొటోలు తీసి ‘నెట్’లో పెట్టడం, వాటిని ఎంతోకొంత ధరకు వదిలించుకోవడం.. ఈ తరహా సేవలకు వెబ్‌సైట్లను వాడుకునేవారిపై ఆర్థిక భారం పడితే ఎలా? *** ఎక్కడికైనా ప్రయాణం చేయదలిస్తే టాక్సీస్టాండ్‌లకు వెళ్లి ఆయాస పడకుండా, ‘ఓలా’ వంటి యాప్‌లను వాడుకుని మన గుమ్మం ముందుకు టాక్సీలను రప్పించుకోవడం ఇక ఖరీదైన వ్యవహారమేనా? *** అవసరమైన సమాచారం కోసం, మన మనోభావాలను ఇతరులతో పంచుకునేందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను స్మార్ట్ఫోన్లలో యథేచ్ఛగా వాడుకోవడం ఇక కుదరదా? *** … సామాజిక వెబ్‌సైట్లు, ఈ-కామర్స్ పోర్టళ్లు, పలురకాల యాప్స్ లేకుండా నేడు జీవితాన్ని ఊహించలేం. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా అన్నివర్గాల వారు ఇంటర్నెట్‌కు బాగా అలవాటు పడిన నేటి రోజుల్లో- సేవల వినియోగానికి ‘ఆంక్షల చట్రాలు’ బిగిస్తే నిరసన సెగలు, ఉద్యమాలు తప్పవు. ప్రస్తుతం మన దేశంలో జరుగుతోంది ఇదే. మనం వాడుతున్న నెట్ కనెక్షన్ – బిఎస్‌ఎన్‌ఎల్, రిలయన్స్, ఐడియా, ఎయిర్‌టెల్, వొడాఫోన్.. ఇలా ఏ ‘సర్వీస్ ప్రొవైడర్’దైనా కావొచ్చు. ఇపుడు అన్ని వెబ్‌సైట్లు, చాలా యాప్స్ అందరికీ ఉచితమే. ఇందుకు భిన్నంగా ‘ఫేస్‌బుక్’ వాడాలంటే నెలకు ఇంత, వాట్సాప్ వినియోగించాలంటే ‘చెల్లింపులు’ తప్పవంటే ‘నెటిజన్ల’లో సహజంగానే ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటాయి మరి! ఏ వెబ్‌సైట్‌నైనా, యాప్‌నైనా ఉచితంగా, స్వేచ్ఛగా వాడుకునే అవకాశం ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగాలంటూ దేశవ్యాప్తంగా నేడు ఓ ఉద్యమం ఉరకలెత్తుతోంది. అదే- ‘ఇంటర్నెట్ న్యూట్రాలిటీ’ ( అంతర్జాల సమానత్వం) పోరాటం. ఈ ఉద్యమానికి సినీ, రాజకీయ సెలబ్రిటీల మొదలుకొని అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. కొన్ని యాప్‌లు ఉచితమని, మరికొన్నింటికి డబ్బు చెల్లించాలంటే వాటి తయారీదార్లపైనే కాదు, వినియోగదార్లపైనా ఆర్థిక భారం ఖాయమన్న వాదనలు బలం పుంజుకుంటున్నాయి. ఇంటర్నెట్.. ప్రపంచ గమనానే్న మార్చేసిన ఓ అనూహ్య విప్లవం, ఓ అద్భుత ఆవిష్కరణ. వెబ్‌సైట్లు, యాప్‌లను వాడుకోవాలంటే ఎవరి అనుమతులు అక్కర్లేదు. కేవలం నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఈ-కామర్స్, బ్లాగులు, ఆన్‌లైన్ గేమ్స్.. ఇలా మనకు అభిరుచి, ఆసక్తి ఉన్న సైట్లలో వీరవిహారం చేయొచ్చు. ఇదంతా ‘నెట్ నూట్రాలిటీ’ ఫలితమే. ఆదాయ మార్గాల కోసం టెలికాం ఆపరేటర్ల సరికొత్త వ్యూహాలు సఫలమైతే- మనకు ఇష్టమైన సైట్లను, యాప్‌లను స్వేచ్ఛగా వాడుకోలేని పరిస్థితి దాపురించవచ్చు. అంతర్జాల సేవల విషయంలో నూటికి నూరుపాళ్లూ తటస్థంగా ఉండాల్సిన టెలికాం సంస్థలు నష్టాలను నివారించుకోవడానికో, అదనపు ఆదాయం కోసమో తమ స్వేచ్ఛను హరిస్తే సహించేది లేదని ఆసేతుహిమాచలం నెటిజన్లు నిరసన గళం వినిపిస్తున్నారు. కొన్ని సైట్లకు, యాప్‌లకు అదనంగా రుసుము చెల్లించాలన్న టెలికాం కంపెనీల ప్రతిపాదనలు సరికావని, ఈ పరిణామాలు గుత్త్ధాపత్యానికి దారితీయడమే గాక చిన్న తరహా సంస్థలకు చేటు కలుగుతుందని ‘నెట్ సమానత్వా’న్ని సమర్థిస్తున్నవారు ఆరోపిస్తున్నారు. నెట్ వినియోగంలో మన దేశం ఇప్పటికే ప్రపంచంలో రెండో స్థానాన్ని ఆక్రమించిన నేపథ్యంలో అదనపు ఆదాయం కోసమే టెలికాం సంస్థలు ఆరాటపడుతున్నాయన్న విమర్శలు చెలరేగుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారూ స్మార్ట్ఫోన్లను వాడుతున్నందున ‘నెటిజన్ల’ సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. విజ్ఞానం కోసం, వినోదం కోసం వెబ్‌సైట్లను, యాప్‌లను వినియోగించడం సర్వసాధారణమైంది. నేడు మన దేశంలో 25 కోట్ల నెట్ కనెక్షన్లు ఉండగా, ఇందులో 18 కోట్లు మొబైల్ కనెక్షన్లు కావడం విశేషం. ఇలాంటి పరిస్థితుల్లో ఆంక్షల సరిహద్దులు గీస్తే సహించేది లేదని నెటిజన్లు తెగేసి చెబుతున్నారు. అందరికీ స్వేచ్ఛగా దక్కాల్సిన ‘అంతర్జాలం’పై పట్టు బిగించాలని, ఎడాపెడా డబ్బులు దండుకోవాలని టెలికాం కంపెనీలు ప్రయత్నిస్తే భంగపాటు తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. సర్వత్రా సంఘీభావం.. ‘నెట్ న్యూట్రాలిటీ’ని ఆకాంక్షిస్తూ దేశం నలుచెరగులా నెటిజన్లు పోరుబాటలో నడవడం, ‘ఇంటర్నెట్‌ను పరిరక్షించండం’టూ ప్రారంభమైన ఆన్‌లైన్ ఉద్యమానికి సెలబ్రిటీలు సైతం మద్దతునివ్వడంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నెటిజన్ల ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుండడంతో కొన్ని టెలికాం కంపెనీలు, ఈ-కామర్స్ పోర్టళ్లు పునరాలోచనలో పడుతున్నాయి. కొన్ని సైట్లను ఉచితంగా ఇవ్వడం, మరికొన్నింటికి డేటా రుసుము వసూలు చేయడం వంటి చర్యలు ‘నెట్ సమానత్వాని’కి భంగం కలిగిస్తాయని దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ‘్ఫ్లప్‌కార్ట్’ వెనకడుగు వేసింది. ‘ఎయిర్‌టెల్ జీరో’ నుంచి తప్పుకుంటున్నట్లు ‘్ఫ్లప్‌కార్ట్’ ప్రకటించాక మరికొన్ని సంస్థలు అదే బాట పడుతున్నాయి. ‘ఇంటర్నెట్ డాట్ ఓఆర్‌జి’నుంచి వైదొలగుతున్నట్లు ప్రముఖ ట్రావెల్ పోర్టల్ ‘క్లియర్‌ట్రిప్’ స్పష్టం చేసింది. రంగంలోకి దిగిన సర్కారు.. ‘నెట్ న్యూట్రాలిటీ’కి మద్దతుగా సామాజిక మీడియాలో ప్రచారం పతాక స్థాయికి చేరుకోవడంతో ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించక తప్పలేదు. టెలికాం కంపెనీల తాజా ప్రతిపాదనలపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని నియమించారు. నెట్ న్యూట్రాలిటీ వల్ల కలిగే లాభనష్టాలు, ఆంక్షలపై వచ్చే నెల రెండోవారంలో ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. టెలికాం కంపెనీలు అందిస్తున్న పథకాలను, వాటిలో గుత్త్ధాపత్య ధోరణుల గురించి కూడా కమిటీ అధ్యయనం చేస్తుంది. లక్షల్లో ఫిర్యాదులు.. దేశ వ్యాప్తంగా టెలికాం కంపెనీలను నియంత్రించే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ట్రాయ్) కూడా ‘నెట్ న్యూట్రాలిటీ’పై స్పందించి నెటిజన్ల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక ఏ ర్పాట్లు చేసింది. ఇందుకోసం ‘ట్రాయ్’ ప్రత్యేక ఈ-మెయిల్ ఐడిని ఏర్పాటు చేయగా తొలి రెండురోజుల్లోనే 3 లక్షల ఫిర్యాదులు అందాయి. మరో నాలుగురోజులకు ఆ సంఖ్య 8 లక్షలకు చేరింది. ఏప్రిల్ 24వరకు ఫిర్యాదులు స్వీకరించిన ప్రభుత్వం తరువాత ఏం చేయాలన్న దానిపై మే రెండోవారంలో నిర్ణయం తీసుకుంటుంది. టెలికాం నియంత్రణ సంస్థగా తాను నిర్వహించాల్సిన బాధ్యతలను విస్మరించి, కార్పొరేట్ కంపెనీల శ్రేయస్సు కోసం పరితపిస్తున్న ‘ట్రాయ్’ అంతర్జాల సమానత్వం కోసం ప్రజల అభిప్రాయాలను కోరడం విడ్డూరంగా ఉందని ఇండియా ఇన్ఫోసెక్ కన్సార్షియం (ఐసిసి) ప్రతినిధులు విమర్శిస్తున్నారు. నెట్ సమానత్వాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్న టెలికాం సంస్థల ఎజెండాకు ‘ట్రాయ్’ మద్దతునిస్తోందని ‘ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (ఐఎఎంఎఐ) ఆరోపిస్తోంది. నెట్ న్యూట్రాలిటీకి మద్దతుగా తాము చేపట్టిన ‘ఇంటర్నెట్ డాట్ ఓఆర్‌జి’ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఫేస్‌బుక్ స్పష్టం చేయగా, ఈ పథకం నుంచి వైదొలగుతున్నట్లు క్లియర్‌ట్రిప్, టైమ్స్ గ్రూప్ సంస్థలు ప్రకటించాయి. దుమ్మురేపిన వీడియో హాస్యం వికటించి, వివాదాలకు మారుపేరుగా మారిన కమెడియన్ల గ్రూప్ ‘ఆలిండియా బక్‌చోద్’ (ఏఐబి) ఇప్పుడు చేసిన సీరియస్ ప్రయోగం దేశవ్యాప్తంగా నెట్ న్యూట్రాలిటీ (అంతర్జాల సమానత్వం) ఉద్యమానికి ఊపిరినిచ్చింది. సాధారణంగా హాస్య సన్నివేశాలు, శ్రుతిమించిన వ్యాఖ్యానాలతో, రక్తి కట్టించే నటనతో రూపొందించిన దృశ్యాలను యూట్యూబ్‌లో పోస్ట్ చేసే ఏఐబి తాజాగా నెట్‌న్యూట్రాలిటీపై ‘సేవ్ ఇంటర్నెట్’ అన్న నినాదంతో 9 నిమిషాల నిడివిగల షార్ట్ఫిల్మ్‌ను ఆవిష్కరించింది. టెలికాం కంపెనీలు, ‘ట్రాయ్’ తీసుకునే నిర్ణయాల ఫలితంగా ఇంటర్నెట్ వినియోగదారులకు ఎదురయ్యే కష్టనష్టాలను ఆ వీడియోలో వివరించారు. ఇంటర్నెట్ ఆడంబరం కాదని, నిత్యావసరమని చెబుతూ నెట్ న్యూట్రాలిటీ వల్ల కలిగే మేలును అందరికీ అర్థమయ్యేలా దృశ్యరూపంలో చిత్రీకరించారు. సాంకేతిక అంశాలతో కూడిన నెట్ న్యూట్రాలిటీ గురించి సులువుగా అర్థమయ్యేట్లు ఇందులో వ్యాఖ్యానాలు, గ్రాఫిక్స్ చేశారు. నెట్ ప్రొవైడర్ సంస్థ ‘ఎయిర్‌టెల్’ ప్రవేశపెట్టదలచిన ‘ఎయిర్‌టెల్ జీరో’ పథకంతో మొదలైన ‘నెట్టింటి కల్లోలం’ ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. భావప్రకటన స్వేచ్ఛను హరించి, ఆర్థిక భారాన్ని మోపే టెలికాం సంస్థల ప్రయత్నాలు, వారికి తలూపుతున్న ‘ట్రాయ్’ చేష్టలను ఈ వీడియో విమర్శించింది. 20 ప్రశ్నలతో ‘ట్రాయ్’ విడుదల చేసిన 118 పేజీల కన్సల్టేషన్ పేపర్ గురించి కూడా ఈ వీడియో ప్రస్తావించింది. అందులో వేసిన 20 ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో రాసి, ఆ కాపీని అందుబాటులో ఉంచింది. దానిని ‘ట్రాయ్’కు పంపిస్తే చాలని సూచించింది. ఏఐబి వీడియోతో దేశంలో నెట్ న్యూట్రాలిటీ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. మొత్తానికి ఏఐబి గత వివాదాల నుంచి బయటపడి ఇపుడు ప్రజల దృష్టిలో మంచిమార్కులు కొట్టేసింది. అసలు సమస్య ఇదీ.. నెట్ న్యూట్రిలిటీ అంటే అందరికీ అందుబాటులో అంతర్జాలం ఉండటం. ఎవరికైనా, ఏ వెబ్‌సైటైనా, ఏ యాప్ అయినా ఒకేవేగంతో, ఒకేలా లభించే సౌలభ్యం ఉండటం. ఇదంతా ఇంతవరకూ ఉచితంగానే ఉంది. మనదేశంలో ఉన్న ఇంటర్నెట్ వినియోగదారుల్లో ఎక్కువమంది మొబైల్ ఫోన్లలోనే నెట్‌ను వినియోగిస్తున్నారు. అధికజనాభాతో ఉన్న మనదేశంలో నెట్ వినియోగదారుల సంఖ్య కూడా ఎక్కువే. విస్తృతమార్కెట్ ఉండటంతో లాభాల కోసం, వ్యాపారం కోసం టెలికాం సంస్థలు, అంతర్జాతీయ సామాజిక మాధ్యమ సంస్థలు కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాయి. ఫేస్‌బుక్ ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి కొన్ని టెలికాం కంపెనీలతో ‘ఫేస్‌బుక్’ ఒప్ప ందం కుదుర్చుకుంది. ఆ టెలికాం సంస్థ వినియోగదారులకు ఉచితంగా, వేగంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఇలా ఏర్పాటు చేయాలన్నది వారి ఆలోచన. ఎయిర్‌టెల్ కూడా ‘ఎయిర్‌టెల్ జీరో’ పథకాన్ని ప్రకటించింది. తమ వినియోగదారులకు కొన్ని యాప్‌లు, కొన్ని సైట్లు వేగంగా, ఉచితంగా అందిస్తుందన్నమాట. అవికాక వేరే వెబ్‌సైట్లు, యాప్‌లు కావాలంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో నెట్ ఆలస్యంగా కనెక్టవుతుందన్నమాట. ఇలాంటి మాయలన్నీ ఉంటాయని బయటకు పొక్కడం, నెట్ న్యూట్రాలిటీ కోసం నెటిజన్లు గళం విప్పడంతో నెమ్మదిగా ఒక్కో సంస్థ వెనుకడుగు వేస్తున్నాయి. కేబుల్ టీవీ సంస్థల మాదిరిగా కొన్ని ఛానల్స్‌ను మాత్రమే ప్రసారం చేసే విధంగా నెట్‌ను, వెబ్‌సైట్లను నియంత్రించి, తమకు ఇష్టమైన వాటిని అందుబాటులో ఉంచడం, వినియోగదారులకు కావాల్సినవి అందించాలంటే డబ్బులు రాబట్టడం ఆ కొత్త ఆలోచనల ఆంతర్యం. ఈ విషయం విపులంగా అర్థం కావడంతో నెటిజన్లు ససేమిరా అంటున్నారు. విదేశాల్లో ఇదే అంశంపై దశాబ్దకాలంగా వివాదం సాగినా చివరికి నెటిజన్ల మాటే నెగ్గింది. ఇప్పుడు భారత్‌లో ఇదే వివాదం మొదలైంది. మార్చి 27న ‘ట్రాయ్’ విడుదల చేసిన 118 పేజీల కన్సల్టేషన్ పత్రం, 20 ప్రశ్నలతోకూడిన పేపర్ ఉద్యమవేడికి ఆజ్యం పోసింది. మే 8న ఈ విషయంపై నివేదిక అందాక ‘ట్రాయ్’, కేంద్రప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటాయి. మేం వ్యతిరేకం కాదు.. అంతర్జాల సమానత్వానికి ‘ఇంటర్నెట్ డాట్ ఓఆర్‌జి’ ఏ మాత్రం వ్యతిరేకం కాదని ‘ఫేస్‌బుక్’ చైర్మన్ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. మొబైల్ ద్వారా కంటే ఆన్‌లైన్‌లో అనుసంధానమైతే సమాచారాన్ని, అభిప్రాయాల్ని అత్యంత వేగంగా పంచుకోవచ్చని, ఇందుకు ‘ఇంటర్నెట్ డాట్ ఓఆర్‌జి’ వంటివి దోహద పడతాయని, నెట్ సమానత్వానికి లోబడే ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇక ‘సేవ్ ద ఇంటర్నెట్’, ‘్ఛంజ్ డాట్ ఓఆర్‌జి’ పేర్లతో నెటిజన్లు నిర్వహిస్తున్న ప్రచారోద్యమం నానాటికీ ఊపందుకుంటోంది. అభిప్రాయ సేకరణ కోసం ట్రాయ్ విడుదల చేసిన ప్రశ్నావళికి జవాబిస్తూ వీరు రూపొందించిన ప్రతాన్ని అందుబాటులో పెట్టి దానినే నెటిజన్లంతా ట్రాయ్‌కు పంపాల్సిందిగా ఈ సంస్థలు చేసిన విజ్ఞప్తికి అద్భుతమైన స్పందన కన్పించింది. సర్వే చెబుతున్నది ఇదీ.. నెట్ న్యూట్రాలిటీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం, ట్రాయ్ వ్యవహారశైలిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. లోకల్ సర్కిల్స్ అనే సామాజిక మీడియా నిర్వహించిన తాజా సర్వేలో 77 శాతం మంది నెట్ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. కాల్‌డ్రాప్, పూర్ డేటా తదితర సర్వీసుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిశీలించడంలో కేంద్రం, ట్రాయ్ విఫలమైనట్లు సర్వేలో అధిక సంఖ్యాకులు ఆరోపించారు. ఈ సర్వేలో ఐదు ప్రశ్నలపై 35వేల మంది అభిప్రాయాలు సేకరించగా, వారిలో నెట్‌న్యూట్రాలిటీ ఉండాల్సిందేనని 20వేల మంది మద్దతు ప్రకటించారు. డేటా సర్వీసు, వాల్యూయాడెడ్ సర్వీసుకు సంబంధించి టెలికం కంపెనీలు వసూళ్లు చేస్తున్న ఛార్జీలపై 53శాతంమంది అనుమానం వ్యక్తం చేశారు. సెలబ్రిటీల మద్దతు ‘ఇంటర్నెట్ సమానత్వాన్ని పరిరక్షించండం’టూ దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు సైతం నెటిజన్లకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ‘ఆప్’ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు ‘ట్వీట్’ చేశారు. టెలికాం కంపెనీల వాదనలను సమర్థించేలా వ్యవహరిస్తున్న ‘ట్రాయ్’ దూకుడుకు పగ్గాలు వేయాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు దిగ్విజయ్ సింగ్ (కాంగ్రెస్), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), ఆదిత్య ఠాక్రే (శివసేన) వంటి రాజకీయ నాయకులు ఇప్పటికే ‘ట్రాయ్’ తీరుపై నిరసన గళం వినిపించారు. బాలీవుడ్‌కు చెందిన షారుఖ్ ఖాన్, ఫర్హాన్ అక్తర్, కునాల్ ఖేమ్, విశాల్ దధాని, సిద్ధార్థ మల్హోత్రా, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, ఆలియా భట్, అర్జున్ కపూర్, పరీణతి చోప్రా వంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇప్పటికే ‘ట్రాయ్’కి లేఖలు రాశారు. పలువురు మీడియా సంస్థల ప్రతినిధులు, పత్రికాధిపతులు కూడా నెటిజన్ల పోరుకు మద్దతు ప్రకటించారు. భద్రతపై ‘యాప్స్’ ప్రభావం..? నెట్ సమానత్వంపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ‘ట్రాయ్’ సరికొత్త వాదనలను తెరపైకి తెచ్చింది. నెట్ ఆధారిత కాల్స్, మెసేజీలకు కొన్ని అప్లికేషన్లు స్వేచ్ఛగా అవకాశం కల్పిస్తున్నందున వ్యక్తిగత, దేశ భద్రతపై ప్రభావం పడుతుందని, ఈ విషయాలపైనా నెటిజన్లు స్పందించాలని ‘ట్రాయ్’ కోరుతోంది. ఉబెర్, ఓలా వంటి వెబ్‌సైట్లు టాక్సీ సర్వీసులను ‘యాప్స్’ ద్వారా అందుబాటులోకి తెస్తున్నాయని ‘ట్రాయ్’ గుర్తు చేస్తోంది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా ఇటీవల ఢిల్లీతో పాటు పలు నగరాల్లో ఉబెర్ టాక్సీలను నిలిపివేసిన నేపథ్యంలో ‘ట్రాయ్’ ఈ వాదన వినిపించడం గమనార్హం. కోట్లాది రూపాయల్లో వ్యాపార లావాదేవీలు జరుపుతున్న ఈ-కామర్స్ సైట్లు పన్నులు, లైసెన్సింగ్‌కు సంబంధించి స్థానిక నిబంధనలను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వాలకు, వినియోగదారులకు నష్టం జరగకుండా ఉండాలంటే కొన్ని విధి విధానాలు ఉండాలని ‘ట్రాయ్’ భావిస్తోంది. వాట్సాప్, స్కైపె, వైబెర్, గూగుల్ టాక్ వంటి ‘యాప్స్’ విషయంలోనూ నియమ నిబంధనలు అవసరమని ‘ట్రాయ్’ ప్రతిపాదిస్తోంది. వినియోగదారుడు ఉండే ప్రాంతాన్ని తెలియజేసేలా జిపిఎస్ వంటి యాప్స్ ఉపయోగపడుతున్నాయని, ఇలాంటి సమాచారం తెలియడం వల్ల నేరాలు జరిగేందుకు అవకాశం ఉందని ఆ సంస్థ వాదిస్తోంది. దేశ భద్రతతో పాటు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు సమాచారం అందుబాటులో ఉంటోందని, ఈ విషయాలన్నింటిపై చర్చ జరిగితే నివారణోపాయాలు కనుగొనవచ్చని ‘ట్రాయ్’ ఇటీవల విడుదల చేసిన పత్రంలో పేర్కొంది. వీడియోగేమ్స్‌తో మద్దతు మన దేశంలో ఇప్పుడైతే వేడిపుట్టింది కానీ విదేశాల్లో ఈ సమస్యపై ఎప్పుడో ఉద్యమాలు పుట్టాయి. అమెరికాలో ఆ మధ్య ఇలాంటి పరిస్థితి ఏర్పడినపుడు ఆ దేశ అధ్యక్షుడు బారక్ ఒబామా స్వయంగా ‘నెట్ న్యూట్రాలిటీ’ కోసం మద్దతు ప్రకటించారు. ఎఫ్‌సిసి రూపొందించిన నిబంధనావళిని సరళీకృతం చేయాలని ఆయన సూచించారు. పాశ్చాత్య దేశాల్లో ఆ వేడి తగ్గినా ప్రకంపనలు ఇంకా ఉన్నాయి. తాజాగా నెట్ న్యూట్రాలిటీ అవసరాన్ని అర్థమయ్యేలా వివరిస్తూ, ఇంటర్నెట్ నియంత్రణవల్ల కలిగే నష్టాలను వివరిస్తూ కొందరు విద్యార్థులు ఓ వీడియోగేమ్‌ను రూపొందించారు. అది మార్కెట్‌లో హాట్‌కేక్‌లా అమ్ముడవుతోంది. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ ఉతాహ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ ఆర్ట్స్ అండ్ ఇంజనీరింగ్‌కు చెందిన విద్యార్థులు కొందరు ‘404 సైట్’ పేరిట వీడియోగేమ్‌ను విడుదల చేశారు.ఇది ఉచితంగా అందరికీ అందుబాటులోకి తెచ్చారు. 3డి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో వినియోగించారు.


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.