ఒకప్పటి భూలోక స్వర్గం నేపాల్ -ఇప్పుడు ప్రత్యక్ష నరకం

నేపాల్‌కు బాసటగా…

  • 30/04/2015
TAGS:

చేష్టలుడిగిన నేపాల్‌లో మళ్లీ చైతన్యం చిగురిస్తోంది. పునశ్చైతన్యం పొందిన నేపాల్ ప్రజల కళ్ల ఎదుట దిగంతాలకు వ్యాపించిన దిగ్భ్రాంతికర దృశ్యమాలిక ఆవిష్కృతమై ఉంది. ఏప్రిల్ 25వ తేదీన ప్రకంపించిన భూమి సృష్టించిన విలయ విషాదం నుండి నేపాల్ విముక్తం కావడానికి ఎంత సమయం పడుతుందన్నది ఊహకందని వైపరీత్యం! నేపాల్‌ను ఆదుకోవడానికి భారతదేశం యత్నిస్తుండడం సహజ సాంస్కృతిక జాతీయాత్మ ప్రతిస్పందన మాత్రమే…ఉభయ దేశాల మధ్య, ఉభయ దేశాల ప్రజల మధ్య, ప్రజల హృదయాల మధ్య, చరిత్రల మధ్య తాత్కాలిక రాజకీయ, భౌతిక వాస్తవాలకు అతీతమైన సనాతన మమకార బంధం నెలకొని ఉంది. ఈ పరస్పర మహోపకారానికి ప్రాతిపదిక ఉభయ దేశాల ప్రజల సమాన సంస్కృతి, సమాన జీవన లక్ష్యం…కష్ట సుఖాలలో, సుఖ దుఃఖాలలో, జయాపజయాలలో, శత్రు మిత్ర విచక్షణ భావాలలో కన్యాకుమారినుండి గౌరీశంకర హిమ శృంగం వరకు విస్తరించి ఉన్న ఉభయ దేశాల ప్రజలు సమాన స్పందనకు ప్రతిస్పందనకు లోను కావడం యుగయుగాల చరిత్ర. ఈ చరిత్రలో ఇది భయంకర విషాద ఘట్టం…ఈ విషాదం నేపాల్ రాజకీయ సీమలకు పరిమితమైన ప్రజలది మాత్రమే కాదు…్భరతీయులది కూడ! ఈ ‘కూడిక’ ఊపిరాడని స్థితిలో ఉక్కిరి బిక్కిరి అయి పడి ఉన్న భూకంప పీడితులకు హిమాలయమంత ఉపశమనం. మన దేశంలోని జాతీయతా సంస్థలకు చెందిన వేలాదిమంది కార్యకర్తలు నేపాల్‌వైపు కదలి వెడుతున్నారు. ప్రకంపన పీడితుల కన్నీళ్లు తుడవడానికి కటిబుద్ధలౌతున్నారు! నేపాల్ ప్రధాని సుశీల్ కుమార్ కోయిరాలా దిగ్భ్రాంతికి గురై వౌనం వహించిన సమయంలో తేరుకున్నది మన ప్రధాని నరేంద్ర మోదీ. తేరుకున్న వెంటనే మన వాయుసేన రంగంలోకి దూకింది. సహాయక కార్యకలాపలను ఆరంభించింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్ తదితర సంఘ పరివార సంస్థలు, అనేక ఇతర జాతీయతా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పెద్దఎత్తున చేపట్టిన సహాయ కార్యకలాపాలు నేపాల్ ప్రజలతో భారతీయులకు గల మమకార బంధానికి ప్రతీకలు! మన దేశంలోనే ఈ భయంకర భూకంపం సంభవించిందని మనం భావిస్తున్నాము. ప్రచార మాధ్యమాలలోను సామాజిక మాధ్యమాలలోను భూకంప బాధితుల కడగండ్ల గురించి పెద్ద ఎత్తున జరుగుతున్న విశే్లషణలు విపత్తులలో ఉభయ దేశాల సమాన స్పందనకు మరో సంకేతం..నేపాల్ ప్రజలు భారతీయుల ఆత్మబంధువులు..సమాన సాంస్కృతిక పరివారంలోని సన్నిహిత సహచరులు..
ఈ ఆత్మీయ బంధువుల అగచాట్లు మన అగచాట్లు! నేపాల్‌లోని ప్రకంపనాలకు పెల్లుబికిన అగ్నికణాలు మన గుండెలను దహిస్తున్నాయి. మన కళ్లను రక్తాస్రుపూరితం చేస్తున్నాయి. నేపాల్‌లోని మొత్తం డెబ్బయి ఐదు జిల్లాలలో నలబయి చోట్ల ప్రతి పట్టణంలోను గ్రామంలోను ఇళ్లు కుప్పకూలిపోయాయి! రహదారుల పక్కన కూలిన ఇళ్ల శిథిలాలు గోచరిస్తున్నాయి..శిథిలాల కింద మానవ దేహాల శకలాలు కనిపిస్తున్నాయి. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఐదు వేల మందికి పైగా అకాల మృత్యుపాలైనట్టు ఇప్పటికే ధ్రువపడింది. మృతుల సంఖ్య పదివేలు దాటవచ్చునని నేపాల్ ప్రధాని స్వయంగా ప్రకటించడం ప్రకంపన భయంకరత్వానికి నిదర్శనం. నాలుగు రోజులు గడిచినప్పటికీ భూగర్భం ప్రకంపన ప్రభావంనుండి విముక్తం కాలేదు. మంగళ వారం సైతం మట్టి చరియలు విరిగి పడిపోయాయి. వాటికింద రెండువందల మంది కూరుకుని పోయారు. 1934 నాటి భూకంపానికి పదివేల మందికి పైగా బలయ్యారు. బిహార్, నేపాల్ ప్రాంతాలకు ఆ ‘కంపం’ విస్తరించింది. ప్రస్తుతం నేపాల్‌లోను మన దేశలోని మూడు రాష్ట్రాలలోను సంభవించిన ప్రకంపన విలయం అదే స్థాయిలో ప్రాణాలను తీసిందన్న భయాందోళనలు కొనసాగుతున్నాయి! ప్రకంపనల తీవ్రత, ప్రభావం సమసిపోకపోవడంతో విధ్వంసం జరిగిన ప్రాంతాలలోని ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతుండడం మరో వైపరీత్యం. మంగళవారంనాడు రాజధాని ఖాట్మండు నగరంనుంచి మాత్రమే ఎనబయి వేలమంది ఇతర ప్రాంతాలకు మారుమూల గ్రామాలకు తరలిపోవడం జనం భయవిముక్తులు కాలేదనడానికి చిహ్నం…
మరోసారి భూమి కంపించవచ్చునన్నది నిర్వాసితులై పోతున్న వారి భయం. ఈ భయాన్ని మాన్పి మళ్లీ భూకంపం సంభవించబోదన్న విశ్వాసం కల్పించడానికి అధికారులు సిద్ధంగా లేరు శాస్తవ్రేత్తలు నోరు విప్పడంలేదు. కదలిపోతున్న పునాదిపై నిలుచుని ఉండడం ప్రమాదకరమన్న భావం భూకంప పీడితుల గుండెలలో గూడుకట్టుకుంది! జీవితంపట్ల విశ్వాసం సడలిపోవడం కంటే భయంకర విషాదం మరొకటిలేదు! శిథిలమైన ప్రాంతాలలో అంటురోగాలు ఇతర వ్యాధులు వ్యాపించవచ్చునన్న పుకార్లు కూడా విషాద గ్రస్తులను మరింత భయకంపితులను చేస్తున్నాయి. భోజనం ఎప్పుడు దొరుకుతుందో తెలియని స్థితి..దప్పికైనా తీర్చుకోవడానికి వీలులేని దుస్థితి! ఈ దుస్థితిని అక్రమ లాభార్జనకు వినియోగించుకొనడం రాక్షసత్వం, క్రూరమైన పైశాచికత్వం! కానీ ఇలాంటి పిశాచాలు, నర రాక్షసులు కూడ ‘వ్యాపారుల’ రూపమెత్తి పీడితులను మరింతగా పీడించడం మానవీయమునకే మచ్చ. ఇంతటి ఘోర విపత్తు సమయంలో సైతం లభ్యమాన వస్తువుల ధరలను పెంచి అమ్ముతున్నవారు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నవారు నేపాల్ నగరాలలో కోకొల్లలుగా తయారయ్యారు. ప్రాకృతిక వైపరీత్యాలను సైతం తన ప్రాబల్య విస్తరణ కోసం ఉపయోగించుకోవాలన్న చైనా ప్రభుత్వం నేపాల్‌లో మనం సాగిస్తున్న సహాయ కలాపాల పట్ల పరోక్షంగా వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది. సహాయం పేరుతో భారత చైనాలు నేపాల్ బాధితుల మధ్య తమ ప్రాబల్యం పెంచుకుంటున్నాయన్న వార్తలను ఎవరో ప్రచారం చేశారట. ఎవరు చేశారన్నది మాత్రం చైనా చెప్పడంలేదు! సహాయం అందచేయడం విషయంలో తమకూ భారత్‌కూ మధ్య పోటీ లేదన్న అనవసరమైన స్పష్టీకరణను బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రిత్వ కార్యాలయంవారు విడుదల చేయడం విడ్డూరం! తాము భారత్‌తో కలిసి సహాయ కలాపాలను నిర్వహిస్తామని నేపాల్‌ను ఆదుకోవడం అంతర్జాతీయ సమాజంలోని అన్ని దేశాల బాధ్యత అని చైనా విదేశాంగ వారు చెప్పుకొస్తున్నారు. ఇలా చెప్పడం ద్వారా భారత నేపాల్ మధ్యగల ప్రత్యేక స్నేహ సంబంధాల ప్రాధాన్యం తగ్గించడనికి చైనా యత్నిస్తోంది!
నేపాల్ భూకంప పీడితులను ఆదుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయునిది. విరాళాలు సమర్పించడం, కార్యకర్తలుగా నేపాల్‌కు కదలివెళ్లడం, సామాజిక మాధ్యమాల ద్వారా సమస్యను వివరించి విరాళాలు సేకరించి పంపడం-ఇలాంటి సహాయం కార్యక్రమాలు ఎన్నో మనం చేపట్టవచ్చు! ఎనబయి లక్షల మంది నేపాలీలు భూకంప పీడితులు. వీరిలో దాదాపు పదిహేను లక్షలమందికి భోజనం లభించడం లేదట! కనీసం అరవై వేల కోట్ల రూపాయల నిధులు పునరావాసానికి పునర్ నిర్మాణానికి అవసరమట! ఎవరెంత ఇవ్వగలరు?

 


 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.