వంగసీమ ‘పంచాయతీ’…

వంగసీమ ‘పంచాయతీ’…

  • 01/05/2015
TAGS:

పశ్చిమ బెంగాల్ పురపాలక నగర పాలక మండలులకు జరిగిన ఎన్నికలలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించడం ఆశ్చర్యకరం కాదు. మమతా బెనర్జీ పట్ల బెంగాల్‌లోని అట్టడుగుస్థాయి ప్రజలకు అభిమానం పెరగం ఈ ఘన విజయానికి కారణం! ఇలా పెరగడానికి ప్రధాన కారణం గత శాసనసభ ఎన్నికలలోను, లోక్‌సభ ఎన్నికలలోను తృణమూల్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ప్రచారం పొందిన భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ పలుకుబడి పతనమైపోతుండడం! 2011 నాటి శాసనసభ ఎన్నికలలో మార్క్సిస్టు పార్టీ వారికి ఓట్లు వేసిన వారిలో చాలామంది ఆ పార్టీకి దూరం అవుతుండడం నాలుగేళ్ల చరిత్ర! ఇలా దూరమవుతున్నవారిలో అత్యధికులు తృణమూల్ కాంగ్రెస్‌కు దగ్గరయ్యారన్నది స్థానిక సమర ఫలితాల వల్ల నిగ్గుతేలిన నిజం. ఇలా మార్క్సిస్టు పార్టీకి వామపక్షాలకు దూరమైన వారిలో అత్యధికులు 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ వోటర్లుగా మారారన్నది నిర్ధారిత నిజం. అందువల్లనే భాజపా వోట్ల సంఖ్య అప్పుడు పదిహేడు శాతానికి పెరిగాయి. అయితే జాతీయస్థాయి ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు మధ్య ఉన్న తేడా ఇప్పుడు మరింతగా ప్రస్ఫుటించింది. 2014 నాటి లోక్‌సభ ఎన్నికల స్థాయిలో ప్రస్తుతం భాజపా విజయం సాధించలేకపోయింది. నలబయి రెండు లోక్‌సభ స్థానాలలో రెండింటిని కైవసం చేసుకున్న భాజపా అప్పుడు మార్క్సిస్టు పార్టీతో సంఖ్యా సమానత్వం సాధించగలిగింది. మార్క్సిస్టు పార్టీకి కూడ లోక్‌సభ ఎన్నికలలో రెండు మాత్రమే దక్కాయి. పెరుగుతున్న పార్టీగా భాజపా, అంతరించి పోతున్న పక్షంగా మార్క్సిస్టు పార్టీ లోక్‌సభ ఎన్నికలలో పేరుగాంచాయి. ఈ పెరుగుదల-్భజపా వారి పెరుగుదల-ఇప్పుడు జరిగిన స్థానిక సమరంలో ప్రస్ఫుటించకపోవడానికి ప్రధాన కారణం లోక్‌సభ ఎన్నికల సమయంలోను, పురపాలక సంస్థల ఎన్నికల సమయంలోను వోటర్లు విభిన్నమైన సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం కావచ్చు! ఈ ప్రాధాన్య తారతమ్యం మరోసారి తృణమూల్ కాంగ్రెస్‌కు ఘనవిజయం చేకూర్చిపెట్టింది. మమతా బెనర్జీ ‘నియంతృత్వం’ గురించి కానీ, తృణమూల్ కాంగ్రెస్ వారి ‘రాజకీయ దౌర్జన్యం’ గురించి సామాన్య వోటర్లు పట్టించుకోలేదని ఈ ఎన్నికల ఫలితాలవల్ల మరోసారి ధ్రువపడింది! అంతేకాదు ‘శారద’ చిట్‌ఫండ్ అవినీతిలో తృణమూల్ పార్టీకి సంబంధం ఉందని జరిగిపోయిన ప్రచారం కూడ వోటర్లను ప్రభావితం చేయలేదు! వర్ధమాన్ జిల్లాలో బంగ్లాదేశీయ ఉగ్రవాదులు జరిపించిన బీభత్స కలాపాలను, రాష్టమ్రంతటా చాపకింది విషంలా విస్తరించిన జిహాదీ విద్రోహులను నిరోధించడంలో జరిగిన వైఫల్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే చెందదని కూడ ఈ ఎన్నికల ఫలితాలవల్ల తేటతెల్లమైంది! అందువల్లనే తృణమూల్ ఘనవిజయం సాధించింది!
ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న రాజకీయ పట్ల సహజంగా వ్యతిరేకత ఏర్పడడానికి ఎంతకాలం పడుతుందన్నది కూడ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒక ఎన్నికలో ఘనవిజయం సాధించిన పార్టీ పట్ల క్రమంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. అందువల్లనే పదేళ్లపాటు అధికారం నిర్వహించిన పార్టీల పలుకుబడి తగ్గుతోంది! ఇలా తగ్గడంవల్ల చట్టసభలలో ఆయా పార్టీలకున్న సంఖ్య మాత్రమే తగ్గుతుందా? లేక మెజారిటీ కోల్పోవడం జరుగుతుందా? అన్నది తగ్గుదల తీవ్రతపై ఆధారపడి ఉంది! తృణమూల్ కాంగ్రెస్ పట్ల వోటర్లలో ‘అధికార వ్యతిరేకత’ ఏర్పడలేదు. లేదని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. పైగా తృణమూల్ పలుకుబడి మరింతగా పెరిగింది. వామపక్షాలకు ప్రధానంగా మార్క్సిస్టు పార్టీకి 2011 వరకు వోట్లు వేసిన వారు తృణమూల్‌కు ఈ ఎన్నికలలో వోట్లు వేసారు. భాజపా ఎదగకపోవడానికి ఇదీ కారణం. లోక్‌సభ ఎన్నికల సమయంలో వలె ‘వామ’ వోటర్లు ఇప్పుడు భాజపాకు బదిలీ కాలేదు. తొంబయి రెండు పురపాలక నగర పాలక మండలులకు ఎన్నికలు జరుగగా భాజపాకు సున్న స్థానాలలో మెజారిటీ లభించడానికి ఇదీ కారణం! లోక్‌సభా సమరాన్ని ప్రభావితం చేయగలిగిన ప్రధాని నరేంద్ర మోదీ ఆకర్షణ అట్టడుగు స్థాయికి విస్తరించలేదు. ఫలితంగా వామపక్షాలకు జరిగిన నష్టం తృణమూల్ విజయ విస్తృతిని మరింత పెంచింది. 2010లో అరవై ఆరు మండలులలో సంపూర్ణ మెజారిటీ సాధించిన తృణమూల్ ఇప్పుడు డెబ్బయి ఒక్క చోట్ల విజయం సాధించడం పలుకుబడి పెరిగిందన్నదానికి ప్రమాణం! 2090 స్థానిక విభాగాలలో 1425 తృణమూల్ కైవసం కావడం పార్టీ మూలాలు మరింత బలపడినాయన్నదానికి నిదర్శనం!
తృణమూల్ పార్టీవారు శారదా చిట్‌ఫండ్ అవినీతి రెండేళ్లకు పైగా తృణమూల్ పార్టీని అప్రతిష్టపాలు చేసింది! పార్టీకి చెందిన శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మంత్రులు ఇతర రాజకీయ వేత్తలు ఆరోపణగ్రస్తులయ్యారు, అభియోగగ్రస్తులయ్యారు. కేంద్ర ప్రభుత్వం తమ పార్టీని అప్రతిష్టపాలు చేయడానికై శారద అవినీతిలో తమ సహచరులను ఇరికించిందన్నది తృణమూల్ పార్టీ చేసిన ప్రచారం. శారద అవినీతి నిధులు వర్ధమాన్ జిల్లాలో పేలుళ్లు జరిపిన జిహాదీ టెర్రరిస్టులకు సైతం దక్కాయన్న ఆరోపణలు కూడ కొనసాగుతున్నాయి. ఈ టెర్రరిస్టులు బంగ్లాదేశ్‌నుండి చొరబడిపోయిన జిహాదీ మతోన్మాదులు! బంగ్లాదేశ్‌నుండి అక్రమంగా చొరబడిన వారిని అక్కున చేర్చుకుని వోటర్లుగా నమోదు చేయించిన ఆరోపణలు అన్ని పార్టీలకు వ్యతిరేకంగా వినిపిస్తునే ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎక్కువగా వినిపించాయి. మమతా బెనర్జీ నియంతవలె వ్యవహరిస్తోందని ప్రత్యర్థి రాజకీయ పార్టీల వారిని ప్రచార మాధ్యమాలవారిని హింసాకాండకు వేధింపులకు గురి చేస్తోందని కూడ ఆరోపణలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభావంతో భాజపా ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందన్నది లోక్‌సభ ఎన్నికల నాటినుండి ఏర్పడిన భావం! 2016లో జరిగే శాసనసభ ఎన్నికల తరువాత పశ్చిమ బెంగాల్‌లో భాజపా ప్రభుత్వం ఏర్పడిపోవచ్చునని, లేదా అతి పెద్ద పార్టీ భాజపా అవతరించవచ్చునని ఉత్సాహవంతులు మాధ్యమాలలో ప్రచారం చేసారు. కనీసం ప్రధాన ప్రతిపక్షంగా నైనా భాజపా శాసనసభలో అవతరిస్తుందన్నది అందరికీ కలిగిన విశ్వాసం. ఇదంతా హుళక్కి అయింది. కాంగ్రెస్ మూడవస్థానంలోను భాజపా నాలుగవ స్థానంలో, వామపక్ష కూటమి రెండవ స్థానంలో ఉండడం యథాతథ స్థితికి నిదర్శనం! భాజపా గెలిచిన వార్డుల సంఖ్య 2010నాటి 85 నుండి 186కు పెరగడమొక్కటే జరిగిన మహా పరివర్తన! వామ కూటమి బలం మరింత తగ్గడం ఆశ్చర్యకరం కాదు.
వాల్‌మార్ట్‌వంటి విదేశీయ సంస్థలు చిల్లర వ్యాపారంలో చొరబడడానికి వీలు కల్పించడం వల్ల తమ పలుకుబడి తగ్గిందని 2013లో బెంగాల్ కాంగ్రెస్ నేతలు బహిరంగంగా వాపోయారు. 2014లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుని పోవడానికి ఈ చిల్లర విదేశీయ వ్యాపారం కూడ ఒక కారణం! బెంగాల్‌లో ఎదిగినట్టే ఎదిగిన భాజపా మళ్లీ కూలబడడానికి కారణం భూమి సేకరణ సవరణ బిల్లు కూడ ఒక కారణం కావచ్చు! వ్యవసాయదారుల భూమిని పారిశ్రామిక వేత్తలకు అప్పగించే విధానాన్ని మమతమ్మ మొదటినుంచీ వ్యతిరేకిస్తోంది. ఈ వ్యతిరేక ప్రాతిపదికగానే 2011లో బెంగాల్ శాసనసభ ఎన్నికలలో ఘనవిజయం సాధిం చింది. 1977 నుంచి ‘ఏలిన’ వామ కూటమి కుప్పకూలింది!

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.