సాహిత్య విమర్శకు చివరి ప్రతినిధి

సాహిత్య విమర్శకు చివరి ప్రతినిధి

ఇదివరకే ఎవరో రాసిన, చెప్పేసిన, అంశాలనే పునఃపునః ప్రదర్శించే ఎత్తిపోతల సిద్ధాంత గ్రంథాలకు ఎం.ఫిల్‌, డాక్టరేట్లు ప్రదానం చేసే తెలుగు రాష్ర్టాల్లోని విశ్వ విద్యాలయాలకు నరసింహమూర్తి లాంటి పరిశోధక ప్రభాకరుడు కనిపించరు. 
పెద్దాయన యు.ఎ. (ఉపాధ్యాయుల అప్పల) నరసింహమూర్తి గారితో పరిచయ భాగ్యం ఎనభైల నాటిది. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చదువుతున్నప్పుడు నా మిత్రుడు విజయనగరం జిల్లా వాసి డా. సూర్యనారాయణ ద్వారా పరిచయం. నా మొదటి కవితా సంపుటి వెలువడినపుడు సాంబశివరావు వంటి వారితో పాటు నా కవిత్వాన్ని విశేషంగా అభిమానించిన వారు నరసింహమూర్తి గారు. నా విశాఖ విద్యార్థి జీవితంలో ఎప్పుడు విజయనగరం సభలకు, సమ్మేళనాలకు వెళ్లినా వాటిల్లో ఆయన ప్రమేయం తప్పక వుండేది! నా కవిత్వాభిమానం వారిచేత 2008లో పెద్ద విశ్లేషణా వ్యాసమే రాయించింది.

ఆరోగ్యకరమైన తెలుగు సాహి త్య విమర్శకు ఆఖరు ప్రతినిధి నరసింహమూర్తిగారు. కోవెల సంపత్కుమార, జి.వి. సుబ్రహ్మణ్యం, వడలి మందేశ్వర్రావు, చేకూరి రామారావు, ముదిగొండ వీరభద్రయ్య వారి సహ విమర్శకులు. ఆయన మూలాలు ఎంత సంప్రదాయలోతుల్లో వున్నాయో, ఆయన ఆలోచనలూ,ప్రతిపాదనలూ అంత ఆధునికంగా ఉంటాయి. అందుకు సాక్ష్యం – జీవిత కాలంలో ఆయన సాగించిన సాహిత్య విమర్శా ప్రస్థానం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎస్వీ జోగారావు పర్యవేక్షణలో ‘ఔచిత్య ప్రస్థానము – పింగళి సూరన’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందారు. బహుశా ఔచిత్యాన్ని ఔపోసన పట్టడం వల్లనేమో ఆయన తన జీవితంలోనూ, రచనల్లోనూ ఎన్నడూ అనౌచిత్యానికి చోటు యివ్వలేదు. ఆయన రచించిన ‘కవిత్వ దర్శనం’ అటు కవులకు, ఇటు కవిత్వ అధ్యయనపరులకు ఒక కరదీపిక వంటిది. సృజన, ఊహ, కల్పన, బుద్ధి, సౌందర్యం, ఔచి త్యం, ధార, ఉన్మాదం వంటి దాదాపు ఇరవై అంశాలను కవిత్వంతో జోడించి చెప్పడంలో ఆయన తెలుగు పద్యాలతో పాటు, ఇటు సంస్కృతశ్లోకాలు, అటు ఆంగ్ల కవుల నిర్వచనాలను సందర్భానుసారం ఉటంకించడం చూస్తే ఆయన ఎంత అధ్యయనశీలో అర్థమవుతుంది. నన్నెచోడుని కుమార సంభవంపై ఆయన రాసిన గ్రంథం ఆంధ్ర విశ్వవిద్యాలయం తన స్వర్ణోత్సవ ప్రచురణగా వెలువరించడం విశేషం.

తెలుగు కథకు పాఠ్యాంశం అయిన చాగంటి సోమయాజులు కథలపై ఆయన రచించిన ‘కథా శిల్పి చాసో’ గ్రంథం కథా విమర్శకులకు మార్గదర్శనం చేయడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పురస్కారం అందుకొంది. వివిధ సందర్భాల్లో ఆయన రాసిన సాహిత్య వ్యాసాలు ‘రంగుటద్దాల గది’, ‘చర్వణ’ పేరుతో వెలువడ్డాయి. వీటిల్లో సమకాలీన సాహిత్య సందర్భాలపై ఆయన నిక్కచ్చి అభిప్రాయాలను గమనించవచ్చు. తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి కృషిచేసిన సారస్వత మూర్తుల జీవిత చరిత్రలను ఆయన గ్రంథస్థం చేసారు. ఆ క్రమంలో వచ్చినవే ‘మానవల్లి రామకృష్ణ కవి’ గ్రంథాన్ని సాహిత్య అకాడెమీ ప్రచురించగా, ‘గిడుగు రామ్మూర్తి పంతులు’పై గ్రంథాన్ని స్వీయ ముద్రణగా వెలువరించారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాను పుట్టిన గడ్డ మీదే పుట్టిన తెలుగుల దీపధారి గురజాడ అప్పారావు గారంటే మూర్తి గారికి కంఠదఘ్న ప్రేమ – అందుకే ‘కన్యాశుల్కము’ నాటకాన్ని పంతొమ్మిదో శతాబ్దపు ఆధునిక భారతీయ నాటకాలతో పోల్చి ఆయన రూపొందించిన గ్రంథం, తొలినాటి విశ్వవిద్యాలయ ఆచార్యులు, తులనాత్మక సాహిత్యాన్ని తామే పరిచయం చేసామనే ఆచార్యులు, తెలుగు అధ్యయన శాఖలకు తులనాత్మకం అనే తోకలు తగిలించుకునే వారందరూ తల వొంచుకుని సిగ్గుపడే రచన ‘కన్యాశుల్కం- ఆధునిక భారతీయ నాటకాలు’ గ్రంథం. ఈ పరిశోధన కోసం ఆయన, బెంగాలీ, అస్సామీ, గుజరాతీ, మరాఠీ, హిందీ, ఒరియా, కన్నడ నాటక రంగ ప్రముఖులను స్వయంగా కలుసుకొని చర్చించడం, పాశ్చాత్య నాటక రంగ సాహిత్యాన్ని అవలోకనం చెయ్యడం ఆయన తప్ప మరొకరు చెయ్యలేని పనులు. శ్రీరంగం నారాయణబాబు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ‘రుధిరజ్యోతి’ కావ్య సంకలనం – కానీ, నారాయణబాబు రచించిన కథలు, నాటికలు, సాహిత్య వ్యాసాలను సేకరించి, నారాయణబాబులోని మరో సాహిత్య కోణాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చెయ్యడమే కాక, ఆ గ్రంథానికి ‘నారాయణ చక్రం’ పేరుతో మంచి విశ్లేషణాత్మక పీఠిక అందించారు మూర్తి గారు. ఇన్నీ చేసారంటే, రాసారంటే ఆయన మౌలికంగా సృజనకారుడు అయి వుండాలి. అక్షరాల నిజం. ఆయన తొలుత కవి. పిదప విమర్శకుడు. అందుకు నిదర్శనం ‘యశోధర’ లఘు కావ్యం నుంచి, ఇటీవల పత్రికల్లో అరకొరగా ప్రచురితమైన ఆయన వచన కవితలు. ఆర్‌.ఎస్‌. సుదర్శనం, దీశెట్టి కేశవరావు వంటి కవులను మింగేసినట్టుగానే విమర్శ మూర్తిగారిని మింగేసింది – ఆయన అంతరంగంలో అంతటి కవి కాబట్టే సుప్రసిద్ధ ఒరియా కవి జయంత మహాపాత్ర కవితలను హృదయానికి దగ్గరగా అనువదించగలిగారు. ఈ అనువాద కవితలను ఒకటి సాహిత్య అకాడెమీ ప్రచురించగా, మరొకటి పాలపిట్ట ప్రచురించింది.
ప్రపంచ ప్రసిద్ధి పొందిన నోబెల్‌ సాహిత్య పురస్కార విజేతల ప్రసంగాలను, ‘నోబెల్‌ సాహిత్య పురస్కార ఉపన్యాసములు’ పేరుతో తెలుగులోకి అనువదించి ప్రపంచ రచయితల భావధారను తెలుగు ప్రజలకు పరిచయం చేసారు. వీటన్నింటికీ మించి తన జీవిత సాఫల్య కృషి ఫలితమా అన్నట్టుగా ఆయన 2014లో వెలువరించిన ‘తెలుగు వచన శైలి’ గ్రంథం దాదాపు వెయ్యి పుటలతో తెలుగు భాషలో ప్రవర్తిల్లిన వచనశైలీ విన్యాసాలను తనదైన శైలిలో ఆవిష్కరించింది.

కేంద్రంలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పేరుమీద వున్న ఫెలోషి్‌పకు ఎంపికయిన ఒకే ఒక తెలుగు రచయిత నరసింహమూర్తి గారు. నెలకు యాభైవేల రూపాయల గౌరవ వేతనంతో ‘భారతీయ ధార్మికత’ మీద ఆయన చేస్తున్న రచన మధ్యలోనే ఆగిపోవడం గొప్ప లోటు.

తెలుగు నేల మీద కవులూ, రచయితలకూ మరణాంతరం పేరొస్తుందన్న మహాకవి శ్రీశ్రీ మాట నిన్న గురజాడకు వర్తిస్తే, నేడు నరసింహమూర్తికి వర్తిస్తుంది. రెండు అట్టల మధ్య అందమైన అబద్ధాలను, ఇదివరకే ఎవరో రాసిన, చెప్పేసిన, అంశాలనే పునఃపునః ప్రదర్శించే ఎత్తిపోతల సిద్ధాంత గ్రంథాలకు ఎం.ఫిల్‌, డాక్టరేట్లు ప్రదానం చేసే, తెలుగు రాష్ర్టాల్లోని విశ్వవిద్యాలయాలకు నరసింహమూర్తి లాంటి పరిశోధక ప్రభాకరుడు కనిపించరు. కేవలం అకాడెమీ అవార్డులే కాదు, డి.లిట్‌ లే కాదు, తెలుగు సాహిత్య విమర్శకు ఆయన చేసిన సేవకు పద్మశ్రీలు ఆయన పాదాలముందు వినమ్రంగా చేతులు కట్టుకు నిలబడాల్సిందే! అందుకు తెలుగు సమాజం, సాహిత్యం ఇంకా ఎంతో ఎదగాల్సి వుంది.
 శిఖామణి
98482025261

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.