’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘24(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా )’)
ఆత్మీయ స్వాగతం – పుష్ప వృష్టి
‘’అందరూ వచ్చి వరుసగా నా మెడలో దండలు వేస్తున్నారు .పుష్ప వృష్టి కురిపిస్తున్నారు ఆ పూలలో నన్ను ముంచేశారు .ఆ పువ్వుల పరిమళం తో బాటు వారందరి ఆత్మీయ సురభిళం నన్ను పరవశింప జేసింది .ఈ’’ హార భారం ‘’ నేను మోయలేనంత బరువుగా ఉంది. కుంగి పోతానేమోనని పించింది .దాదాపు అన్నిరంగుల ,రకాల దండలూ కలిపి 45 దాకా ఉండచ్చు .ఒక పెద్దాయన నాదగ్గరకు వచ్చి వంగి నమస్కరించి ‘’లాల్ గోవింద్ ! నేను గుర్తున్నానా ?మనిద్దరం స్కూల్ లో కలిసి చదువుకొన్నాం ‘’అన్నాడు .’అరే భగవాన్ ! స్కూల్ లోనా ?అని ఆశ్చర్య పడ్డాను .నెమ్మదిగా జ్ఞాపకం వచ్చి పలకరించాను .యెంత అభిమానం నా మీద ?ఇంత దూరం నాకోసం వచ్చాడా శ్రమపడి అనుకొన్నాను .నిజంగా అతను నాకు జ్ఞాపకం లేడు. కాని ప్రేమగా పలకరించి కబుర్లు అడిగాను .నాకు గుర్తున్నదల్లా’’ కుమార్ ‘’ఒక్కడు మాత్రమె .దయ గల అతనికళ్ళు,వణికే చేతులు ఆప్యాయంగా నన్ను చుట్టేసుకోవటం జ్ఞాపకమున్నాయి ఆతను ఉన్నాడా?ఏం చేస్తున్నాడు ?ప్రశ్నలు నాలోసుళ్ళు తిరిగాయి ,అప్పుడు నాలో ఏదో కొంత భాగం జాగ్రుతమైంది .ఇండియా అంతా ఇక్కడికి రాలేదుకదా ! సముద్రం దాటి బయటి దేశాలకు వెళ్ళిన నన్ను సాంప్రదాయ బ్రాహ్మణులు ఆహ్వానిస్తారా ?అని ప్రశ్నలు నాలో చెల రేగాయి .’’
‘’ కమ్యూనిస్ట్ లు , వామ భావ సంస్థల వారు నాకు ఆత్మీయంగా స్వాగతం పలికారు .ఇప్పుడు అంతా బాగానే ఉంది .పరిస్తితులు సర్దుకోన్నాయనిపించింది .నేను నిజమైన భారత దేశం లోనే ఉన్నాను ,ఏదో ఊహా లోకం లో లేను అని తెలిసింది . కమ్యూనిస్ట్ లు వామ పక్షాల వారు ఉన్నారు అంటే ఇండియాలో రైటిస్ట్ భావాల వారూ ఉన్నారన్నమాట .కనుక ఇండియా కు మార్గం అంత సులభమైనదికాదు అనుకొన్నాను .ఈ కళ్ళు ,ఈ నవ్వులు నాకు చిరపరిచితాలే .జో ,అలేక్సీలు ,గుయనీస్ చెడ్డి అందరు ఒకసారి గుర్తుకొచ్చారు .దయా హ్రుదయుడు దేనికీ లొంగని స్వభావుడు అయిన మా నాన్న ఆత్మబలం ,స్థిర సంకల్పం జ్ఞాపకం వచ్చాయి .మానవ గౌరవాన్ని కాపాడుకోవటం కోసం అది పొందిన ప్రతి దాన్నీ విసర్జించటం కాదు ,దూరం గా ఇంకా దూరంగా ముందుకు వెళ్ళటమే .భారత దేశమా మళ్ళీ మనం కలుసుకొన్నందుకు మహదానందం గా ఉంది ‘’.నా సోదర సోదరీమణులారా !ఇదిగో నేనొచ్చేశా .మీ ముందున్నా.నేనే నేను నేనే . భారతీయుడిని ,సోవియెట్ యూనియన్ పౌరుడిని .అందుకే నేను మీకు ‘’హలో బ్రదర్’’ లా ‘’డబుల్ బ్రదర్’’ ని .తేడా ఏమీ లేదు .ఒక వ్యక్తికీ రెండు మాత్రు దేశాలు ఉన్నాయి అంటే భవిష్యత్తులో ప్రపంచమంతా ప్రజలంద మాతృదేశం అవుతుందన్నమాట .’’
‘’మీ ముందు నేను వినమ్రంగా నిలబడి ఉన్నాను .ఈ భూమిమీదనే నిలిచి ఉన్నాను .కాని నా పాదం ఒకటి ఇండియా లో ,రెండవది రష్యాలో ఉంది .ఈ రెండు స్థిరమైన బలమైన ఆధారాల మీదనే నిలిచి ఉన్నాయి .ఇలా నిలబడి చూస్తుంటే భవిష్యత్తు నా కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తోంది .ప్రకాశ వంతమైన ప్రపంచాలు నాముందు ఆవిష్కారం అయినట్లు గోచరిస్తోంది .అవి ‘’స్ప్రింగ్ బీటిల్స్ ‘’లాగా ‘’స్పుత్నిక్ ‘’ల లాగా నా చుట్టూ ఎగురు తున్నట్లు అనిపిస్తున్నాయి .నా భుజాలపై వెలుగు లీనే సప్త వర్ణ ఇంద్ర ధనుస్సు కాంతు లీను తోంది .సూర్యుడిని నా దోసిట్లో పట్టుకొన్నాను .అది భూమిపై వెచ్చదనాన్నిఅందరికీ అందిస్తోంది .’’
ఎంత భావ గర్భితం గా కవి తాత్మకంగా రామయ్య గారు తన అనుభూతిని వివరించారో మనకు తెలుస్తోంది ఆయనలో ఒక సైంటిస్ట్ మాత్రమేకాదు ఉత్తమ భావుకుడు ఉత్తమకవి మనకు దర్శన మిస్తారు . .
భారత్ లో యాత్రా సందర్శనం
‘’ఇండియాలో నా పర్యటన అంతా ఎక్కడా ఆపులేకండా నాన్ స్టాప్ గాఉత్సవంలాగా సాగిపోయింది .దీనికి నేను ఎవరికి కృతజ్ఞతలు తెలపాలో అర్ధం కాలేదు .అదృష్టం అందామా అంటే నాకు దానిపై నమ్మకం లేదే !దేవుని దయ అనుకొందామా అంటే నా ఒంటికి వాళ్ళు పడరే .’’చాన్స్’’ అను కొంటె ఏ సమస్యా ఉండదు .నా పర్యటనను ప్రగతి శీల వ్యక్తులు,సంస్థలు ఏర్పాటు చేసి నిర్వహించారు .రోజులు గడుస్తున్న కొద్దీ నాకు నమ్మకం కుదిరింది .ఇండియాకు నాపై నమ్మకం కలిగింది అనుకొన్నాను . అవును అది సాధ్యమే .అతను చేయ గలిగాడు .మనం కూడా చేయగలం .అతను సాధించాడు అన్నీ. మనమూ ప్రయత్నం చేస్తే సాధించి తీరుతాం అనుకొన్నారు ప్రజలు నన్ను చూసి అనిపించింది .
‘’ ఆంద్ర దేశం లో నా స్వగ్రామం ఉయ్యూరు వెళ్ళేదారిలో మా రైలు అనుకోకుండా ఒక చోట ఆగింది .అక్కడేమైనా రోడ్డు ప్రమాదం జరిగిందేమోననుకోన్నాను .అది యాక్సి డెంట్ ను మించిన విషయం అయింది .రైతు ప్రతినిధులు మా కంపార్ట్ మెంట్ లోకి ఒక్క సారి దూసుకు వచ్చారు .నా దగ్గరకొచ్చి ఆత్మీయ స్పర్శ తో కౌగిలించుకొని నాపేరు చెక్కిన విలువైన గడియారాన్ని నాకు కానుకగా ఇచ్చారు .ఎవరు వీళ్ళు ?నన్నెప్పుడూ చూడలేదే ?అందులో ఏ ఒక్కరూ నాకు తెలిసిన వారు కాదే?నేను వస్తున్నట్లు వాళ్లకు ఎలా తెలిసింది ?అదీ నాకు తెలియ లేదు .రైలు ఆగటానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు ?నాకు అసలేదీ తెలియదు .వాళ్లకు నేనొక’’ ప్రతీక ‘’ను అయ్యాను అనుకొన్నాను .కీర్తి చాలా బరువైనది .మళ్ళీ పూల దండలు ,అభి మానపు పలకరింపులు ,పూల జల్లులు . కృతజ్ఞత తో తడిసి ముద్ద అయ్యాను.ఇంతటి అభిమానానికి నేను అర్హుడినా?మొదలైన ప్రశ్నలు నన్ను కలవర పెడుతున్నాయి . వంగి వంగి నమస్కారాలు, కులాసా పలకరింపులు , ,స్వాగతాలు అన్నీ ఆర్భాటం గా ఉన్నాయి .వారిలో ఏదో తెలీని ఉత్సాహం ,ఉత్సుకత ,ఆనందం తాండవిస్తోంది .అభిమానం కురిపించి మరీ నన్ను కుంగ దీసేస్తున్నారు .అ మనుషుల కళ్ళు తలలు ముఖాలు నవ్వులే నాకు కనిపించాయి .ఇంతకంటే మహోత్కృష్టమైన ఆనందం ,సంతోషం ,అనుభూతి మరెప్పుడూ నేను అనుభవించలేదు .మనసంతా ఆనంద కోలాహలం గా ఉంది .ప్రతి సారీ నాకు యువకులే కనిపిస్తున్నారు .వాళ్ళను చూస్తుంటే నేనూ యువకుడిగా మారిపోయానని పించింది .ఇండియా నుండి మళ్ళీ మాస్కో చేరిన తర్వాత నాకు సన్నిహితులు నవ్వుతూ ‘’మీరు అక్కడ ముసలి తనాన్ని వదిలేసి యవ్వనాన్ని మోసుకొచ్చారు ‘’అని జోక్ చేశారు దానికి నేను ‘’అవును .నిజమే .నేను యాభై ఏళ్ళు వెనక్కు వెళ్లాను ‘’అన్నాను నేనూ నవ్వుతూ .అంతటి ఉత్సాహం నాకు నా ఇండియా ప్రయాణం కలగ జేసి నన్ను యవ్వన వంతుడిని చేసింది మానసికం గా .ధన్య వాదాలు భారత మాతా ధన్యవాదాలు ఆంద్ర మాతా ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-15 ఉయ్యూరు