కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘27(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)
రష్యాకు తిరుగు ప్రయాణం
‘’ ఇండియా వదిలి వెళ్ళేటప్పుడు శ్రీపాద్ అమృత డాంగే ‘’మీకు సర్వదా కృతజ్ఞులం .మీరు ఇండియా –రష్యా మిత్రత్వానికి చాలా తోడ్పడ్డారు .ప్రతి ,ప్రతి నిధి బృందం ఇలా చేయ లేదు .అదీ మీ ప్రత్యేకత .’’అన్నాడు నాతో .నాకు ఆశ్చర్యమేసింది .నేనేమీ రాజకీయ ఉద్దేశ్యం తో రాలేదే .నేనేది అనుకున్నానో, దేన్నీ ఆలోచించానో అదే చెప్పాను .అచ్చమైన నిజాలే మాట్లాడాను .ఇండియా సర్వతోముఖంగా ,విద్యా ,సాంస్కృతిక రంగాలలో సంతోషంగా అభి వృద్ధి చెందాలని నా ఆకాంక్ష .దీనికోసం భారతీయ ప్రజలందరూ సోవియట్ ప్రజలు లాగా ఐకమత్యం తో ఒకే కుటుంబంగా కలిసి పని చేసి ,మనుషులను విడదీసే ,అపోహలు అదృశ్యమై ,కులమత వర్గ భాషావ రోధాలను తుడిచిపెట్టి అధిగమించాలని నే కోరుతున్నా. ప్రజలకు తాము మాత్రమె తమ కొత్త దేశాన్ని నిర్మించగల౦ అనే నమ్మకం రావాలి . దీని వల్లనే సగుణాత్మక మార్పులు వస్తాయి .వారిలోని ప్రతీక శక్తుల కబంధ హస్తాలను చేదించుకొని బయటికి రావాలి .గతానికి చెందిన విలువైనది అయిన ప్రతి దానినీ కాపాడుకోవాలి .బానిసత్వ భావలనుండి బయట పడాలి .ఒకరిపై మరొకరికి అపనమ్మకం ఉండరాదు .భారత దేశ చరిత్రలో ఉత్తమమైన వాటిని ,జీవితానికి వెలుగు నిచ్చేవాటిని ,శాంతి ని పెంచే వాటిని గౌరవించాలి .ప్రతి తరం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ,సరైన అవగాహన తో ప్రతి వ్యక్తీ ప్రగతికి,దేశాభ్యుదయమే ధ్యేయంగా ముందుకు కదలాలి ..మీ కుటుంబం మానవ కుటుంబం అనే భావన మనసులో స్తిరమై ఉండాలి .అందుకే ఇతరులతో మంచి మర్యాదలతో ప్రవర్తింఛి వారిమేలుకు కృషి చేసే సుగుణం అలవడాలి .పతనం చెందటం చాలా తేలికే .కాని లేచి నిలబడి ముందుకు సాగటం కష్ట సాధ్యమైన విషయమని గుర్తించాలి .ఇదే ప్రతిమనిషికి తగిన, విలువైన మార్గం .వేరే మార్గాలలో వెడితే అసహనం, అసూయ, యుద్ధాలే గతి .ఈ విషయాలు నా భారత ప్రజలకు నచ్చి గుండెలను తాకితే వారూ నా వంటి వారే నని అనుకొంటాను .ఇండియాకు నేను వచ్చించి ఏదో ఉద్యమం నడుపుదామనికాదు .నేను చాలా ఉదాత్త భావనతో వచ్చాను .నా మాత్రు దేశాన్ని నాజీవిత౦ పొద్దు బారి పోతున్న వేళ కనులారా చూద్దామని ,మాత్రమె ఆశతో వచ్చాను .ఇండియా యువతను చూసిన తర్వాత నాలో యవ్వనాన్ని నింపుకొన్నానని పించింది .
‘’రామయ్య ఇండియన్ ,కాని ఒక్క ఇండియా వాడు మాత్రమేకాదు .ఆయన ఇండియా –రష్యా మిశ్రమ వ్యక్తీ . ఆయనలో ఉన్న ఈ భారతీయ పునాది అపూర్వమైనది .ఆయనే ‘’నేను ఇండియాను నాకు జన్మ నిచ్చినందుకుప్రేమిస్తాను అంటాడు. ఇది ఆదర్శ మాత్రు ప్రేమ ‘’అని నా గురించి అందరూ చెప్పేమాట నాకూ నిజమేనని పిస్తుంది .ఇండియా రావటం వేరు ,ఇక్కడ జీవించటం వేరు నా దృష్టిలో . .నేను ఇన్నేళ్ళు రష్యాలో పని చేశాను. కాదు సేవచేశాను .అది కాంట్రాక్ట్ పని కాదు .నేనేదో గొప్పవాడినని , ఏదో అద్భుతాలు సాధించానని గొప్పలు చెప్పుకోవటానికి రాలేదు .చాలా వినయ విదేయతలతో వచ్చాను .అర్ధం చేసుకోవటానికే వచ్చాను .నా జీవితం సార్ధకమయింది. ఈ అనుభవం ఒక జీవితకాలం నాలో గొప్పగా నిలిచిపోతుంది. ధన్యుడిని నేను .అందరూ దీన్ని అర్ధం చేసుకోలేరు .కాని నావిషయం లో ఇది నూటికి నూరు పాళ్ళు యదార్ధం .’’
‘’జీవిత చరమాంకం లో యెంత సుదీర్ఘ కాలం జీవించినా మిగిలిన కాలం చాలా స్వల్పమనిపిస్తుంది .ఇంత సుదీర్ఘ జీవన యానం లో నేనెప్పుడూ జబ్బు పడి ఎరుగను .ఇప్పుడూ రోగ గ్రస్తుడినికాను అదే నా అదృష్టమేమో !కాని ఊపిరి పీల్చటం కొంచెం కష్టంగా ఉంది .నీరస౦గా కూడా ఉంది .’’ఛా వెధవ నీరసం’’ .పక్షుల కిలకిలారావాలు నాకు శక్తినిస్తాయి. ఆనందాన్ని ,సంతోషాన్ని ,అందజేస్తాయి .అపూర్వ సందేశమేదో ఇస్తున్నట్లనిపిస్తుంది .నేను విషాదానికి గురి అయితే ఇక ఎక్కువ కాలం బతకను .ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది .కనుక నిరాశ చెందటానికి నాకు ఏ కారణమూ కనిపించదు .’’
‘’ నాకు దక్కినవన్నీ మీకు ఇచ్చి పోతున్నాను .నేనెలా జీవి౦చానో దాన్ని కూడా .నేను చాలా కన్సర్వేటివ్ ను అంటే సంప్రదాయ బద్ధుడిని .అవకాశాలున్నంత వరకు నేను నాతండ్రి నాకు వారసత్వంగా అందజేసిన సనాతన సంప్రదాయాన్ని పాటించాను .ఆయన లాగా నేను కూడా ఒకే చోట కొన్ని దశాబ్దాలున్నాను కదలకుండా .ఆయనలాగే నేనూ నా అర్ధాంగిని ప్రేమించాను .కాని జీవితం లో ‘’ఒక వ్యక్తీ పై ఉన్న ప్రేమ’’ను మర్చి పోలేక పోయాను .నేను కా౦క్ష లున్న మనిషిని కాదు .ఇతరులకున్నదానికంటే నేనెప్పుడూ అధికం గా నాకు కావాలని కోరుకో లేదు .’’
‘’ అనుక్షణం విధి నిర్వహణలో గడపటం వలన నేను నా వెనుక జ్ఞాపకాల ఆస్తిని, కొన్ని సైంటిఫిక్ ఆర్టికల్స్ మాత్రమె నా వారికి వదిలి పెట్టి వెడుతున్నాను .నా జీవిత చరిత్ర రాసుకోవటం లో సఫలుడిని కాలేక పోయాను .’’ధీరీ ఆఫ్ ప్లాస్టిక్ మీడియం’’ ఉపన్యాసాలలో ,జ్ఞాపకాలలో ‘’చెల్లా చెదురుగా ఉండి పోయింది .దాన్ని పూర్తిగా కంఠతా పట్టలేక పోయాను .’’
‘’ఇదంత పెద్ద ప్రాముఖ్యమైన విషయ౦ కాదు ఒక్కసారి గతం లోకి వెళ్లి చూస్తె నేను చేసిన పొరబాట్లు ,తప్పులు వైఫల్యాలు కనిపిస్తాయి .అయితే వాటి గురించి ఎవరినీ క్షమాపణలు కోరను .జరిగిందేదో జరిగి పోయింది . నేనెంచుకొన్న నా మార్గం కఠిన తరమైనది .కాని అది తిన్నని రహదారి. రాజమార్గమే. నా అంత రాత్మకు వ్యతి రేకం గా ఏ ఒక్కపనీ చేయలేదునేను .ఎవరినీ మోసగించలేదు .ఎవరికీ ద్రోహం చేయలేదు .నాకు నేను విధేయుడిగా ఉండటం వలన ఇన్ని విజయాలు సాధించగలిగానని నేను విశ్వ సిస్తాను .నా జీవితాన్ని వ్యర్ధంగా గడపలేదన్న సంపూర్ణ నమ్మకం నాకుంది .ఇది చాలు ఈ జీవికి .నేను చాలా సంత్రుప్తి కరమైన సార్ధక జీవితాన్ని గడిపాను .ఇంత కంటే కావాల్సింది ఇంకే ముంది ?
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-15 –ఉయ్యూరు