’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘31(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)
హైదరాబాద్ చేరుకొన్న రామయ్య
తన తమ్ముడు సీతా రామయ్య 42 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇండియాకు ఉయ్యూరుకు వస్తున్నందుకు పెద్దన్నగారు అనంత రామ శాస్త్రిగారికి మహదానందం గా ఉంది .ఆయన బంధు వర్గానికీ పరమాందంగా ఉన్నది .అందరూ హైదరాబాద్ విమానాశ్రయం లో ఘన స్వాగతం ఇచ్చారు .అందరిలో ‘’నా అన్నయ్య ‘’ను గుర్తుపట్టి రామయ్యగారు వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి పాదాలపై పడి వినమ్రంగా నమస్కరించారు .ఆప్యాయం గా అన్నదమ్ములు కౌగలి౦చుకొన్నారు .అమెరికాలో ఉండగా పంపబడిన శ్రీమతి జ్యోతిష్మతి ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు .రామయ్యగారు కమ్మని తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్య పరచారు ..సూరి వారి కుటుంబానికి రామయ్యగారిని తీసుకొని వెళ్ళారు .లెక్కలేనన్ని పూల దండలు వేసి రామయ్య గారికి ఆత్మీయ స్వాగతం చెప్పి అనంతరామయ్యగారి అల్లుడిగారింటికి పెద్ద ఊరేగింపుగా తీసుకొని వెళ్ళారు . నలభై రెండేళ్ళ క్రితం రామయ్య గారు ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లాలని ఉందని చెబితే ,అన్న అనంతరామయ్యగారు ఆయన్ను ఆశీర్వ దించి ,వెళ్ళటానికి అంగీకరించి మద్రాస్ ఓడ రేవుకు వెళ్లి వీడ్కోలు చెప్పారు .ఆనాడు సంప్రదాయ హిందువులు సముద్రం దాటి ఇతర దేశాలకు వెళ్ళటం నిషిద్ధం .మరో అన్నగారు వెంకటప్పయ్య శర్మగారు రామయ్యగారు విదేశాలకు వెళ్ళటాన్ని ఒప్పుకోలేదు ఆనాడు .అలాంటి పరిస్తితులలో దేశం కానీ దేశానికి వెళ్ళిన రామయ్య ఇప్పుడు మళ్ళీ 42 ఏళ్ళ తర్వాత ,42 రోజులు మాత్రమె ఇండియాలో గడపటానికి స్వదేశానికి రావటం అందర్నీ సంతోష పరచింది .రామయ్య గారు సంస్కృత శ్లోకాలు అప్పగిస్తున్నారు .సంధ్య వందనం నిర్వహిస్తున్నారు .’’కమ్మకమ్మని ఎర్రెర్రని ఘాటు ఆవకాయ’’ను అన్నం లో కలుపుకొని లాగిస్తున్నారు .నిజమైన ఆంధ్రుడనే అని మాటలద్వారా ,చేతల ద్వారా రుజువు చేసుకొన్నారు .అందరి మనస్సులో శాశ్వత స్థానాన్ని సంపాదించారు .ఇంటి కోడళ్ళు రామయ్యగారికి నూనె రాసి ,సున్నిపిండి నలుగు పెట్టి కుంకుడుకాయ రసం తో వేడివేడి నీటి తో తలంటి పోశారు .రామయ్యగారి’’ హోమ్ కమింగ్ ‘’ఒక పండుగలాగా జరిగింది . హైదరాబాద్ లోప్రాంతీయ రిసెర్చ్ లేబరేటరి,ఉస్మానియా విశ్వ విద్యాలయమ్ ,ఆకాశ వాణి కేంద్రాలను సందర్శించి అక్కడి అభివృద్ధిని అడిగి తెలుసుకొని అభినందించి ఆనందించారు .కోలచల కుటుంబం రామయ్యగారి తిరుపతి ,శ్రీశైల క్షేత్ర దర్శనం ఏర్పాటు చేసింది .ఆ రెండు క్షేత్రాలలో భక్తిగా రామయ్యగారు పూజాదికాలు నిర్వహించి అలౌకికానందాను భూతికి లోనయ్యారు .
రామయ్య గారు హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చారు .అక్కడ ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకురాలు ,డాక్టర్ శ్రీమతి అచ్చమాంబ గారిని సందర్శించారు .
ఉయ్యూరొచ్చిన రామయ్య-పౌరసమ్మానం
విజయవాడ నుంచి స్వగ్రామం ఉయ్యూరు చేరుకొన్నారు .మే నెల 21 వ తేదీన రామయ్యగారికి డాక్టర్ మిక్కిలి నేని సాంబశివ రావు ,ఆధ్వర్యం లో ఉయ్యూరు గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్ ,గ్రామ పెద్దలు కలిసి ఘనమైన పౌరసన్మానం చేశారు .మే 24 న రామయ్య గారు ఆంద్ర యువకులకు ఒక సందేశాన్ని రికార్డ్ చేశారు .అందులో ఆంద్ర యువత కు సోవియట్ తో స్నేహం తో ఉండటానికి ఇష్ట పడుతున్నందుకు మనసార అభినందించారు .భారత దేశ భవిష్యత్తు యువత మాత్రమే తీర్చి దిద్దుతుంది అన్నారు .ఇండో సోవియట్ స్నేహం చిరకాలం వర్ధిల్లాలి ‘’అని ఆశాభావం వెలిబుచ్చారు .
గుంటూరులో
గుంటూరులో ఆంద్ర యూత్ ఫెడరేషన్ రామయ్యగారిని ఆప్యాయంగా ఆహ్వానించి గొప్ప పౌర సత్కారం నిర్వహించారు .దీనికి స్థానిక ఇండో -సోవియట్ సాంస్కృతిక సంస్థ సహకరించింది .అందంగా అలంకరింపబడిన విశాలమైన ప్రాంగణం అంతా విపరీతంగా వచ్చి చేరిన యువత తో నిండిపోయి కనుల పండువుగా కనిపించింది. ఉరకలెత్తే యువత ఉత్సాహం రామయ్యగారిని విశేషం గా ఆకర్షించింది .నవభారత నిర్మాణానికి వీరే నిజమైన స్తంభాలు అనుకొన్నారు .లోపల చోటు దొరకక ఏంతో మంది హాలు బయట ఉండిపోయి చూడాల్సి వచ్చింది .ఇంత మందిని ఆకర్షించిన రామయ్యగారు ధన్య జీవులని పించారు . విద్య ,ఉద్యోగం వినోదం వగైరాలు రష్యాలో యువతకు ఎలా అందుబాటులో ఉన్నాయని వేదికపై ఉన్న రామయ్యగారిని వారు ప్రశ్నించారు .అన్ని ప్రశ్నలకు తడుముకోకుండా అనర్గళం గా అచ్చమైన ,మధురమైన తెలుగు పదజాలంతో సమాధానాలు చెప్పి రామయ్య యువతను సంత్రుప్త పరచి వారి హృదయాలలో గొప్ప శాశ్వత స్థానం సంపాదించారు .దాదాపు అర్ధ శతాబ్దం ఇండియాకు దూరంగా ఉన్నప్పటికీ ,భారత దేశ సాంస్కృతిక వారసత్వం పై రామయ్యగారికి ఉన్న అవగాహనకు ముక్కు మీద వేలేసుకొన్నారు .
మద్రాస్ లో మధుర సన్నివేశాలు
రామయ్యగారు బెంగుళూరు యాత్ర నుండి మే 28 న మద్రాస్ చేరుకొన్నారు . .మర్నాడు హిందూ పత్రికకు ఇంటర్వ్యు ఇచ్చారు .మర్నాడే దాన్ని ఆ పత్రిక ప్రచురించింది. అందులో ‘’మన జాతీయ భావన అంటే విశాల దృక్పధం తో మన యువ సైంటిస్ట్ లను ఇతర దేశాలలో నివాసం ఉండేట్లు అంగీకరించి పంపించటమే అవ్వాలి .న్యాయానికి మన దేశానికి శాస్త్రీయ ప్రతిభ ఎక్కడినుంచో రానక్కరలేదు మనకే ఏంటో విజ్ఞానం ఉంది .కాని ఇతర దేశాలకు మన శాస్త్ర సాంకేతిక జ్ఞానాన్ని అంద జేస్తున్నందుకు వారి ప్రగతిలో భాగ స్వాములం అవుతున్నందుకు మనం గర్వ పడాలి .సైన్స్ లో ,పరిశ్రమలలో అభ్యుదయం లో సోవియట్ యూనియన్ ఉండటం ఇండియాకు సర్వ విధాల అవసరమేకాక చాలా మంచిది కూదా .ఇప్పుడు అందరి ద్రుష్టి ,,ఆలోచన అంతా ‘’సహాయం –తోడ్పడటం ‘’పైనే ఉంది .ఈ రెండు మాటల మంత్రాన్నే జపిస్తున్నారు .’’అని రామయ్య గారు చెప్పినట్లు రాసింది.
బొంబాయి –అక్కడినుండి తిరిగి రష్యాకు
రామయ్యగారు మద్రాస్ నుండి బొంబాయి కి జూన్ 1 న బయల్దేరి వెళ్లారు .బొంబాయి ఆకాశ వాణికి ఒక ప్రసంగం రికార్డ్ చేశారు .అక్కడి నుండి బయల్దేరి మే నెల 5 వ తేదీ కి రష్యాలోని మాస్కో నగరానికి చేరుకొన్నారు .
రామయ్యగారి జీవన సంధ్య
మాస్కో చేరిన కోలచల సీతారామయ్య అనే ‘’కాన్ స్టాన్టిన్ సేర్జియోవిచ్ ‘’జీవిత౦ చివరికాలం లో ‘’సెంట్రల్ సైంటిఫిక్ రిసెర్చ్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ ఆటోమొబైల్ అండ్ రోడ్ బిల్డింగ్స్ ‘’సంస్థలో పని చేశారు .ఫిజిక్స్ ,కెమిస్ట్రీ లలో విశేష ప్రతిభా వంతులైన రామయ్యగారు ప్రముఖ ‘’సైంటిఫిక్ అడ్వైజర్ (శాస్త్రీయ సలహాదారు ) గా ను ,అనేక సైంటిఫిక్ కౌన్సిల్స్ కు సలహాదారుగాను విశేష సేవలు అందజేశారు .
ఆల్బర్ట్ అయిన్ స్టీన్ తో పోలిక
వృద్ధాప్యం మీద పడుతున్నప్పటికీ చివరి రోజుల్లో సైతం రామయ్య గారు ఎంతో సృజన శీలతను ప్రదర్శించారు .మనకు అప్పటిదాకా తెలిసిన మూడు స్తితులు కాక నాలుగో స్తితి ఉందని భావించి ,దేర్మో న్యూక్లియ చర్యలలో’’ ప్లాస్మా ‘’అనేది ఏర్పడుతుందని ఊహించి చెప్పారు .కాని దురదృష్ట వశాత్తు అది రుజువు కాక ముందే రామయ్యగారు కానిపోవటం విచారకరం .ప్రముఖ విజ్ఞాని ,సైంటిస్ట్ ఆల్బర్ట్ అయిన్ స్టీన్ కూడా తాను ఊహించిన చెప్పిన సిద్దా౦తలనన్నిటిని ఒక చోట చేర్చి ఏక సూత్రత సాధించి కొత్త సిద్ధాంతాన్ని ప్రదిపాదించే లోపలే మరణించాడు ఈ ఇద్దరు మేధావి సైంటిస్ట్ ల జీవితాలలో యాదృచ్చికం గా ఇలా జరగటం ఆశ్చర్యం గా ఉంటుంది .మానవ జాతికి మహత్తర విజ్ఞానం అందకుండానే వారిద్దరూ చనిపోవటం విచార కరం .
రామయ్యగారి ‘’ప్లాస్టిక్ ధీరీ ‘’సిద్ధాంతం రామయ్య గారు వదిలి వెళ్ళిన ఉపన్యాస రికార్డులనుండి సేకరించి సంపూర్ణ స్తితికి తేవాలి .రామయ్య గారు రష్యన్ భాషా జర్నల్స్ లో రష్యన్ భాషలో రాసిన పత్రాలను సేకరించి ఇంగ్లీష్ భాష లోకి అనువదించాలి .యంత్రాల నిర్మాణం లో రామయ్యగారు అవలంబించిన పద్ధతులనుపయోగించి కొత్త యంత్ర నిర్మాణాన్ని ఇండియా లోను రష్యాలోను ‘’ట్రైబాలజిస్ట్ ‘’లు రూపొందిస్తున్నారు .
రాం రాం
రామయ్యగారు ఊపిరి తిత్తుల సంబంధ మైన ఉబ్బసవ్యాది (బ్రాన్కైల్ ఆస్తమా )తో చాలాకాలం బాధ పడ్డారు .దీనితో ఊపిరి తిత్తులు ఉబ్బి శ్వాస పీల్చుకోవటం కష్టమైన ‘’ఎ౦ఫిసేమా’’ జబ్బు ఇబ్బంది పెట్టింది .దీనికి తోడూ డబల్ టైఫాయిడ్ వచ్చి మీద పడింది . జీవితం లో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని ధైర్యం గా నిలబడిన రామయ్యగారి గుండె ఇక తట్టుకోలేక ,కొట్టుకోలేక పోయింది .29-9-1977 న మాస్కో లో రామయ్య గారి హ్రదయ స్పందన ఆగిపోయి శాశ్వతం గా మనకు దూరమైపోయారు .ఆయన చితా భస్మం మాస్కో క్రిమేటోరియం చాపెల్ లో భద్రపరచారు .
దీనితో మూడు ఫోటోలు జత చేశాను చూడండి
కెమోటాలజి పిత’
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-5-15 –ఉయ్యూరు