భూతల స్వర్గం — ఈ వారం స్పెషల్

భూతల స్వర్గం — ఈ వారం స్పెషల్

  • 10/05/2015
  •  -బి.వి.ప్రసాద్

అత్యంత ప్రాచీన, అత్యాధునిక సమాజాలకు ప్రతీక సింగపూర్. అక్కడ ఏమీ తయారుకాదు, కాని ప్రతీదీ దొరుకుతుంది. ప్రజల్లో నిజాయితీ, పాలనలో పారదర్శకత, ప్రభుత్వంలో చిత్తశుద్ధి. చివరికి ప్రజలు అంతా సుఖసంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో సింగపూర్ ఈ రోజు అగ్రరాజ్యాలకు సైతం ఆదర్శవంతంగా ఎదిగింది. ఈ ఎదుగుదల రాత్రికి రాత్రి జరిగింది కాదు, ‘దేశం కోసం’ అనే భావన ప్రజల్లో నరనరాన జీర్ణించుకుపోయి దాదాపు 700 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతూ, ప్రపంచం పట్టించుకోని దశలో అక్కడి ప్రజలే తమను తాము సంస్కరించుకునే ప్రయత్నం ఈ రోజు అత్యధిక జీడీపీ స్థాయికి తీసుకువచ్చింది. శతాబ్దాల చరిత్ర ఉన్నా, అత్యంత వేగంగా అభివృద్ధిని సాధించింది మాత్రం గత 50 ఏళ్లలోనే. పూలౌ ఉజోంగ్..పూలౌచంగ్ గానూ కాలక్రమంలో సింగపురగా మారిన అతి చిన్న జనావాస ప్రాంతమే సింగపూర్. ప్రపంచంలో అతి చిన్న పట్టణమే ఒక దేశంగా ఉన్న సింగపూర్ చుట్టూ సముద్రమే. దేశ భూభాగాన్ని పెంచే అవకాశం లేదు. ఏం చేద్దామన్నా సరిపడా భూమి లేదు, ఏదీ ఉత్పత్తి కాదు, గనులు, చమురు వంటి సహజ సంపద లేదు, పరిశ్రమలు లేవు, పెడదామంటే చోటు లేదు ఇలాంటి అననుకూల పరిస్థితులను కూడా సింగపూర్ తమకు అనుకూలంగా మలుచుకుంది. జనాభా పెరిగితే వారి కనీస అవసరాలు తీర్చేందుకు సరిపడా ఆకాశాన్నంటే హర్మ్యాలు, అందులోని అంతస్తుల్లో పచ్చదనం, సౌకర్యవంతమైన జీవనానికి కావల్సిన పరిసరాలతో అలరారేలా సింగపూర్ అభివృద్ధి చెందింది. ఆధునిక అవసరాలను ముందుగా ఊహించడం, తదనుగుణమైన వ్యూహాలతో ముందుకు సాగడం వల్లనే సింగపూర్ ఇపుడు ప్రపంచంలో నెంబర్ వన్‌గా ఉంది. అమెరికా, చైనా, రష్యా వంటి అగ్రదేశాలను సైతం బెంబేలెత్తిస్తున్న అభివృద్ధితో సింగపూర్ ముందుకు దూసుకుపోతోంది. అసలు ఈ సింగపూర్ ఇంతలా ఎలా అభివృద్ధి సాధించింది? అందరికీ ఎలా ఆదర్శప్రాయమైంది అనేది అందరి మెదళ్లలో మెదిలే ప్రశ్న. మలేషియాకు దక్షిణాన 704 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న దక్షిణాసియాలోని అతి చిన్న దేశం సింగపూర్. దీని అధికారిక పేరు రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్. ఒక చిన్న ద్వీపమే ఈ మహానగరం- ఈ మహాదేశం. ఇందులో ప్రధాన ద్వీపంతో కలిపి 63 ద్వీపాలున్నాయి. ప్రారంభంలో ఈ ద్వీపం ‘సుమత్రన్ శ్రీ వజయ్’ సామ్రాజ్యంలో ‘తమ్‌సెక్’ అంటే సముద్ర పురం అనే జపనీస్ పేరుతో వ్యవహరించేవారు. క్రీ.పూ 2వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకూ వ్యాపార కేంద్రంగా ఇది విలసిల్లింది. 16వ శతాబ్దం నుండి 19 శతాబ్దం వరకూ ఇది జోహార్లో భాగంగా ఉంది. 1819 సంవత్సరం జనవరి 29న ఈ ద్వీపానికి వచ్చిన థోమస్ స్టాన్ ఫోర్డ్సు రాఫిల్స్ భౌగోళికంగా సింగపూర్ వ్యాపారానికి అత్యంత అనుకూలమైన ప్రదేశంగా గుర్తించి ఈస్టిండియా కంపెనీ తరఫున బ్రిటిష్ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి పరిచే ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందమే దేశంలో ఆధునిక యుగానికి నాంది పలికింది. అంతర్జాతీయంగా ఇక్కడకు వచ్చి నివసించే వారిపై పౌరసత్వ కట్టుబాట్లు నిర్బంధం లేని కారణంగా వివిధ సంస్కృతులకు చెందిన ప్రజలు ఇక్కడ స్థిరపడటం ఆరంభం అయింది. 1819లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ అడుగుపెట్టేసరికి ఇది మలయ్, ఒరాంగ్ లాట్ జాలర్లు నివసించే చిన్న గ్రామం. బ్రిటిష్ వాళ్లు దీనిని రవాణాకు వాడుకున్నారు. 1867 నాటికి ఇది బ్రిటిష్ సామ్రాజ్యపు ఛత్రం కిందకు వచ్చింది. బ్రిటిష్ కాలనీ ఆరంభం నగర నిర్మాణ వ్యూహాలతో నగరాన్ని సంస్కృతి పరంగా విభజించింది. సింగపూర్ నదీ ప్రాంతం వ్యాపారులకు, బ్యాంకర్లకు ఆలంబనగా మారింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఫిబ్రవరి 15 తర్వాత ఆరు రోజుల యుద్ధం అనంతరం జపాన్ దీనిని స్వాధీనం చేసుకుంది. 1945 సెప్టెంబర్ 12న తిరిగి బ్రిటిష్ వారి పరమైంది. 1963లో మలేషియా ఏర్పడినపుడు దానిలో భాగంగా ఉండి రెండేళ్ల తర్వాత సైద్ధాంతిక విభేదాలతో విడిపోయి 1965 ఆగస్టు 9న స్వతంత్ర గణతంత్ర దేశంగా మారింది. అదే ఏడాది సెప్టెంబర్ 21న ఐక్యరాజ్యసమితిలో 117వ దేశంగా చేరింది. 1970లో అలీన ఉద్యమంలో చేరింది. తీవ్రమైన నిరుద్యోగం, గృహ సంక్షోభం ఎదుర్కొంటూ సింగపూర్ ఆధునికతపై దృష్టిసారించింది. తయారీ పరిశ్రమ స్థాపన, అతిపెద్ద ప్రజా గృహ భూముల అభివృద్ధి, ప్రజా శిక్షణపై పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టింది. స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాతనే సింగపూర్ జీవన శైలి గణనీయంగా మెరుగుపడింది. ఈ అభివృద్ధిలో వ్యవస్థాపక పితామహుడు లీ క్వాస్ యు లీ కృషి అనన్యసామాన్యం. తన ప్రగతి శీల విధానాలతో సింగపూర్ దిశ, దశను మార్చేశాడు. ఇష్టంలేని విభజనతో ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న సింగపూర్‌ను లీక్వాస్ యూ అభివృద్ధిలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిపారు. విదేశీ పెట్టుబడులు, మరో పక్క ప్రభుత్వ విధానాలన్నీ యంత్రీకరించడం, ఎలక్ట్రానిక్ పద్ధతులు అమల్లోకి రావడం, ఐటి కంపెనీలు ఏర్పాటై ఆధునిక ఆర్ధిక రంగం ఉద్భవించింది. అనతి కాలంలోనే ఉన్నతమైన అభివృద్ధి సాధించి స్వేచ్ఛామార్కెట్ ఉన్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. శక్తివంతమైన అంతర్జాతీయ వాణిజ్య బంధాలు, జపాన్ కాకుండా ఆసియాలో అత్యధిక తలసరి ఆదాయంతో గరిష్ట స్వదేశీ ఉత్పాదనను కలిగి, ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా మారింది. ఐదు దశాబ్దాలుగా అభివృద్ధి సింగపూర్‌కు శతాబ్దాల చరిత్ర ఉంది…కాని అభివృద్ధిలో మాత్రం ఈ 50 ఏళ్లలోనే తన సత్తా చూపింది. సింగపూర్ అంటే రెండు మలయ్ పదాల కలయక. సింగ అంటే సింహం, పుర అంటే పురము అనే పదాలతో ఆ పేరు వచ్చింది. చారిత్రక ఆధారాల ప్రకారం 14వ శతాబ్దపు సుమత్ర ద్వీప యువరాజు సంగ్ నిల ఉతమ తుపానులో చిక్కుకుని ఈ దీవిలో అడుగుపెట్టినపుడు అతనికి ఒక మృగం కనిపించింది. సింహం తలలా ఒక వింత జంతువు కనిపించినందుకు ఈ పేరు పెట్టారని చెబుతుంటారు. విచిత్రం ఏమంటే సింగపూర్‌లో సింహాలు లేవు, ఉన్నవల్లా మలయ్ పులులే. అన్ని రంగాల్లో.. నెంబర్ వన్ అందర్నీ ఆకర్షిస్తున్న సింగపూర్ నేడు ఏ రంగంలో తీసుకున్నా నెంబర్ వన్. ఉత్తమ పారిశుద్ధ్య నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం, ఐటి రంగాల్లో ప్రపంచంలోనే మేటి. అక్కడ ప్రభుత్వం విధించిన నియమనిబంధనలు, పౌరుల్లో జవాబుదారీతనం, నిజాయితీయే దీనికి కారణం. స్థూల జాతీయ ఉత్పత్తిలో సింగపూర్ ప్రపంచ దేశాల్లో ఆర్ధికంగా 13వ స్థానంలో నిలిచేలా చేసింది అదే. ఎకనామిస్టు పత్రిక సర్వే ప్రకారం ఆసియా దేశాల్లో అతి ఉత్తమమైనది సింగపూర్ , ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది. వ్యాపార, ఆర్ధిక రంగాల్లో, అభివృద్ధి చెందిన సింగపూర్ ఇటీవలే ‘కాసినోవా’ అని పిలిచే పాశ్చాత్యుల జూదగృహాన్ని నిర్మించడంతో, ధనవంతులైన వ్యాపారవేత్తలను బాగా ఆకర్షిస్తోంది. అంతేగాక, అత్యంత విలాసాలకు పెట్టింది పేరుగా చక్కటి పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన ఈ దేశంలో చైనా, మలయ్, భారత్‌లకు చెందిన వారు ఎక్కువగా స్థిరపడటంతో విభిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. విలాస జీవనం పర్యాటకరంగంలోనే కాదు, విద్య, ఆరోగ్యరంగాల్లోనూ సింగపూర్ అభివృద్ధి పథంలో ఉండటంతో విదేశీయులను సైతం పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తూ వైద్య ఆరోగ్య పర్యాటక కేంద్రంగా మారింది. ఆ దేశం ఆర్ధిక వనరుల్లో పర్యాటక రంగం ప్రధాన భూమికను పోషిస్తోంది. తేలికగా వీసాలు సింగపూర్ వెళ్లేవారికి విమానాశ్రయాల్లోనే తాత్కాలిక వీసాను మంజూరు చేసే ఏర్పాటు ఉంది. చాలా సులువుగానే పర్యాటక వీసాలను మంజూరు చేయడం కూడా అనేక మందిని సింగపూర్ వైపు ఆకర్షితులయ్యేలా చేస్తోంది. అన్నీ చూడాల్సినవే సింగపూర్ వెళ్లామంటే ఒకటో రెండో కాదు, అన్నీ చూడాల్సినవే ఉంటాయి. అతిపెద్ద విలాసవంతమైన భవనాలు, పర్యాటక కేంద్రాలు, షాపింగ్ మాల్స్, కాసినోవా, నైట్ సఫారి, సాంటోసా ద్వీపకల్పం, అండర్ సీ వరల్డ్ వంటివి ప్రతీదీ తప్పనిసరిగా చూడాల్సినవే. నిజానికి అన్నీ చూడాలంటే నెలల సమయం చాలదు. పర్యాటక ప్రాంతాల్లో ముఖ్యంగా చెప్పుకోవల్సింది అండర్ సీ వరల్డ్. భూగర్భంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో అనేక సముద్ర ప్రాణుల్ని సజీవంగా చూసే ఏర్పాటు ఉంది. రాత్రి పూట అద్భుతమైన లేజర్ షోలు నిర్వహిస్తుంటారు. సింగపూర్ సముద్ర తీరాన రేవు నుండి క్రూయిజ్‌లలో సగం రోజు లేదా దీర్ఘకాలం పాటు పడవ ప్రయాణం చేయవచ్చు. ఈ టూర్‌లొ సింగపూర్‌కు చెందిన ఇతర దీవులను సందర్శించవచ్చు. అలాగే డాల్ఫిన్ షోలను తిలకించవచ్చు. రెండోది నైట్ సఫారి. ఇందులో రాత్రివేళల్లో జంతుప్రదర్శనశాల చూసే ఏర్పాటు ఉంది. ఇందులో ఆకర్షణీయమైన ప్రదర్శన శాలలు ఉంటాయి. రాత్రి వేళల్లో జంతువులను వాటి సహజమైన జీవనాన్ని చూడటం పర్యాటకులకు వింత అనుభూతిని కల్పిస్తుంది. మూడోది పక్షుల పార్కు చాలా అద్భుతంగా ఉంటుంది. పక్షులతో రకరకాల విన్యాసాలు చేయిస్తుంటారు. అత్యంత అపురూపమైన లేత కాషాయరంగు హంసలకు సింగపూర్ నిలయం. పార్కు మొత్తం చూడడానికి చక్కటి రైలు ప్రయాణం ఉంది. స్కైటవర్లో సందర్శకులకు టవర్ పై భాగానికి తీసుకువెళ్లి కిందకు దించుతారు. పైకి వెళ్లినపుడు సింగపూర్‌కే గాక చుట్టూ ఉండే ఇండోనేషియా, మలేషియాలను కూడా చూడగలుగుతాం. ఇది ఒక అద్భుమైన అనుభవం అవుతుంది. నాలుగో ప్రత్యేకత సెంటోసా ద్వీపం. ఈ ద్వీపానికి కేబుల్ కారులో వెళ్లొచ్చు. తిరిగి రావడానికి బస్సు మార్గాన్ని ఉపయోగిస్తుంటారు. సింగపూర్‌లో భాగంగా మారిన సెంటోసా ద్వీపంలో సింగపూర్ జాతీయ చిహ్నమైన మెర్ మెయిడ్ కింది భాగం చేప, పై భాగం సింహంతో కూడి ఉంటుంది. ఈ మెర్‌మెయిడ్‌ను చూడటం మరిచిపోలేని అనుభూతి. సందర్శకులను మెర్ మెయిడ్ తలభాగం వరకూ లిఫ్ట్‌లో తీసుకువెళ్తారు. ముందుగా ఒక చిన్న ప్రదర్శన ఉంటుంది. ఇక్కడ సంప్రదాయ భవనంలో సింగపూర్ చరిత్రను లేజర్‌షో సహాయంతో ప్రదర్శిస్తారు. అతి సహజమైన పరిస్థితిలో జీవం ఉట్టిపడే బొమ్మల మధ్య నావ ప్రయాణం మరిచిపోలేనిది. అనేక సంప్రదాయాల్లో ప్రతిబింబించే బొమ్మలతో కూడిన ప్రదర్శన శాలలను ఇక్కడ చూడవచ్చు. లిటిల్ ఇండియా, చైనా టౌన్, ముస్త్ఫా కాంప్లెక్స్, సింగపూర్ కాంప్లెక్, సన్‌టెక్ , సెరంగూన్ రోడ్‌లో దేవాలయాలు చూస్తుంటే మనం భారతదేశంలోనే ఉన్నామా అని అనిపిస్తుంది. పండగ సమయాల్లో అంగడి వీధులను చూడముచ్చటగా అలంకరిస్తారు. హరిత విప్లవం సింగపూర్ పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాణం పెడుతుంది. భవనాలు, జలాశయాలు, రహదారులు మినహాయిస్తే మిగిలిన ప్రాంతం అంతా పచ్చగానే కనిపిస్తుంది. ఏ మాత్రం స్థలం ఉన్నా అక్కడ అందమైన రంగురంగుల ఫలాలు, పుష్పాలను ఇచ్చే మొక్కలను పెంచుతారు. అంతే కాదు వాటి నిర్వహణ కూడా పకడ్బందీగా ఉంటుంది. అది ఎంత వరకూ అంటే 90వ అంతస్తులో కూడా మొక్కలను పెంచే సంస్కృతి అలవడింది. చిట్టచివరి అంతస్తులో కూడా తొట్టెల్లో మొక్కలు పెంచుతారు. తాగునీటికి సమస్య ఉన్నా మొక్కల నీటికి సింగపూర్ వెరవడం లేదు. ఈ కారణంగానే ఒకప్పటి అధ్వాన్న దేశం ఇప్పుడు అద్భుతంగా మారిపోయింది. ప్రపంచ గమ్యస్ధానం సింగపూర్ ప్రపంచంలోని అన్ని దేశాలూ ఇపుడు సింగపూర్ వైపు చూస్తున్నాయి. ఒకపుడు ప్రపంచంలోని మెళుకువలతో అత్యంతవేగంగా అభివృద్ధి సాధించిన సింగపూర్ నేడు ప్రపంచానికే పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగింది. సింగపూర్ ఒక ముఖ్యమైన రవాణా కేంద్రంగా, అతిపెద్ద పర్యాటక గమ్యస్థానంగా నేడు మారిపోయింది. ఈ పరిణామం అంత తేలికగా జరగలేదు. ఐరోపా వలస రాజ్యాల దాడులు, పోర్చుగీసు, డచ్ వారి ఆధిపత్యం, అరబ్బులు, చైనీయులు, జపనీయులు ఒకరేమిటి చాలా దేశాలు దాడులకు దిగడంతో ఉంటుందా ఊడుతుందా అనే రీతిలో అనుకోకుండా స్వాతంత్య్రం పొందిన తర్వాత సింగపూర్ అస్థిరతతో కూడిన భవిష్యత్‌ను చవిచూసింది. ఒక పక్క ఇండోనేషియా ఒత్తిడులను ఎదుర్కొంటూనే సింగపూర్ తన సత్తా చూపింది. ఒక చిన్న ద్వీపం విజయవంతమైన దేశంగా ఎలా ఎదుగుతుందని అంతా హేళన చేయడం సింగపూర్ ఉనికే ప్రశ్నించింది. దీనికి తోడు సార్వభౌమాధికార సమస్యలతో నిరుద్యోగం, గృహవసతి, విద్య, సహజవనరుల కొరత, భూమి కొరత ఒత్తిడిని కలిగించే సమస్యలుగా ఉండేవి. నిరుద్యోగం కూడా విపరీతంగా పెరిగి పౌర అశాంతికి కారణం అవుతుందేమో అనే పరిస్థితుల్లో సింగపూర్ వ్యూహకర్తలు ఆ దేశాన్ని గాడిలో పెట్టారు. పరిశ్రమలు, సేవా రంగం పెరగడం, నౌకానిర్మాణం, ఎగుమతులు, ఉన్నతమైన వస్తువుల ఉత్పత్తి , వాణిజ్య పెరుగుదల, చమురు శుద్ధి కర్మాగారాల ఏర్పాటుతో దేశం దశ తిరిగిపోయింది. ప్రభుత్వం విద్యావిధానం మీద భారీగా పెట్టుబడులు పెట్టి ఆంగ్లభాషా బోధనను అవలంబించింది. స్థానిక పరిశ్రమలకు సరిపోయే పోటీతత్వం ఉన్న పనిబలాన్ని అభివృద్ధి చేయడానికి అభ్యాససిద్ధితో కూడిన శిక్షణను అందించింది. స్వాతంత్య్రం వచ్చిన 15 ఏళ్లలో సింగపూర్ అనూహ్యమైన ప్రగతిని సాధించింది. 1980లో చవకగా కార్మికులను కలిగి ఉన్న పొరుగువారితో పోటీ పడటానికి సింగపూర్ తన పరిశ్రమలను సాంకేతికంగా ఉన్నతమైనవిగా నవీకరించడం మొదలుపెట్టింది. వాఫెర్ ఫ్యాబ్రికేషన్ వంటి ఆధునిక పద్ధతులను తీసుకువచ్చింది. 1981 నాటికి సింగపూర్ ఎయిర్‌లైన్స్ అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌గా అభివృద్ధి చెందింది. సింగపూర్ నౌకాశ్రయం అత్యంత రద్దీగా ఉండే నౌకాశ్రయాల్లో ఒకటిగా అయింది. ఆంగ్‌మో కియో వంటి నూతన పట్టణాల రూపకల్పన చేసి ప్రభుత్వ నివాస గృహాలను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. సింగపూర్‌లో 90 శాతం మంది ఈ అపార్టుమెంట్లలోనే నివసిస్తారు. 1987లో మొదటి మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ పనిచేయడం మొదలైంది. దీంతో నగరంలో చాలా ప్రదేశాలను చాలా తేలికగా కలిపింది. రాజకీయ సుస్థిరత రాజకీయ ప్రసార సాధనాల మీద కఠినమైన నియంత్రణ ఉంటుంది. చట్టవిరుద్ధ నిరసనలకు సైతం మరణదండన వంటి తీవ్రమైన శిక్షలు ఉంటాయి. సింగపూర్‌పై పీపుల్స్ ఆక్షన్ పార్టీ ప్రభావం చాలానే ఉంది. ప్రస్తుతం 175 దేశాలతో ఈ దేశం దౌత్యసంబంధాలను కొనసాగిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో, కామనె్వల్త్‌లో, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్టు ఏషియన్ కంట్రీస్‌లో సభ్యత్వం ఉంది. యుకెతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియాలతో కలిసి ఐదు దేశాల రక్షణ ఒప్పందంతో సురక్షితంగా ఉంది. మరో పక్క అమెరికాతోనూ సింగపూర్ మంచి సంబంధాలనే కొనసాగిస్తోంది. మొత్తం సింగపూర్ జనాభా 55 లక్షలు. ఇందులో విదేశీయులే 20లక్షలకు పైగా ఉంటారు. చైనీయులు 75 శాతం, మలయా వారు 13.6 శాతం, భారతీయులు 9 శాతం ఉన్నారు. నేరాలు తగ్గినా తీవ్రవాద భయం సింగపూర్‌లో పటిష్టమైన చట్టాలతో నేరాలను గణనీయంగా తగ్గించగలిగినా, సింగపూర్‌కు తీవ్రవాద భయం మాత్రం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. సింగపూర్ రాయబార కార్యాలయాల మీద దాడులను దృష్టిలో ఉంచుకుని శక్తివంతమైన తీవ్రవాద నిరోధక చర్యలను చేపట్టింది. ముందు చూపుతో… సింగపూర్ చాలా చిన్న ద్వీపం, కాని ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు హేమా హేమీ దేశాలతో పోటీపడేలా సింగపూర్ ఎదగడానికి కారణం రాజకీయ చిత్తశుద్ధి. వంద ఏళ్ల తర్వాత, 200 ఏళ్ల తర్వాత దేశం పరిస్థితి ఏమిటనే ఆలోచనలను ఇపుడే చేయడమే. పెద్ద పెద్ద ఆలోచనలు చేయడమేకాదు, వాటిని తక్షణం అమలుచేసి ఫలితాలను ప్రజలకు చూపించడంతో పాలకుల వ్యవహారంపై తలదూర్చకుండా స్థానికంగా ఉన్న వారు అభివృద్ధి కారకాలుగా మారిపోయారు. ప్రతి ఒక్కరూ పనిచేయాలి, దేశాభివృద్ధికి తోడ్పడాలి. ఈ మాట ఎవరో చెప్పనక్కర్లేదు. ప్రతి పౌరుడూ తన గురుతర బాధ్యతగా గుర్తుంచుకుంటాడు. పని, వ్యాపకం అనే రెండు అంశాలు ఇతర విషయాలపై దృష్టిపెట్టనివ్వకుండా చేస్తున్నాయ. సింగపూర్ ప్రధానంగా పర్యాటకం, షాపింగ్, విమానరంగం, నౌకారవాణా, నౌకానిర్మాణ రంగం, ఐటి రంగాల్లో అగ్రస్థానంలోకి చేరుకుంది. ఉన్న భూభాగాన్ని ప్రజల జీవనానికి, పెట్రోకెమికల్ పరిశ్రమలకు, పోర్టులకు, ఎయిర్‌పోర్టులకు, రవాణా వ్యవస్థకు ఒక ప్రణాళిక ప్రకారం వినియోగించుకుంటున్నారు. భూవిస్తరణ ఇలా… జురాన్గ్, సెంటోసా, పులవ్ టెక్నాగ్ దీవి, పులవ్ యుబిన్ దీవులు విస్తీర్ణంలో కొంచెం పెద్దవి. మిగిలిన దీవులు చాలా చిన్నవే. జురాన్గ్ దీనివి పెట్రో కెమికల్ పరిశ్రమలకు వాడుకుంటున్నారు. సెంటోసా దీవిని పర్యాటక ఆకర్షణకు వాడుకుంటున్నారు. పులవ్ టెక్నాగ్ దీవిని రక్షణ సంబంధ వ్యవహారాలకు ఉపయోగించుకుంటున్నారు. పులవ్ యుబిన్ దీవిలో ఆధునిక అవసారాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టారు. 166 మీటర్లు ఎత్తున్న బుకిత్ తిమాహ్ హిల్ సింగపూర్‌లో చాలా ఎత్తయిన ప్రదేశం. ఉత్తరాన సింగపూర్ కాజ్‌వే, తువాస్ సెకండ్ లింగ్ అనే రెండు మానవ నిర్మిత వారధులున్నాయి. నగర నిర్మాణాలకు కొంత భూమిని వినియోగించాల్సి రావడంతో నెమ్మదిగా ప్రభుత్వం భూమి విస్తరణపై దృష్టి పెట్టింది. 581 చదరపు కిలోమీటర్లు నుండి నేడు 704 చదరపు కిలోమీటర్లకు భూమిని విస్తరించగలిగింది. త్వరలో మరో వంద కిలోమీటర్లు భూమిని విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది. చిన్నచిన్న మట్టిదిబ్బలుగా ఉన్న దీవులు ప్రధాన దీవుల్లో కలుస్తూ భౌగోళిక రూపురేఖలు మారుతున్నాయి. * ఆదాయం కోట్లు, తాగునీటికి పాట్లు భారతీయ సంప్రదాయం ప్రకారం ఎవరైనా ఇంటికి వస్తే మంచినీటితో స్వాగతం పలుకుతాం. కాని అక్కడ మంచినీరు తప్ప ఏం అడిగినా ఇస్తాం అనే రీతిలో ఉంటుంది. దానికి కారణం తలసరి వార్షిక ఆదాయం కోట్లలో ఉన్నా సింగపూర్ ప్రజలకు పెద్ద శాపం తాగునీటి సమస్య. ఇపుడా సమస్యను అధిగమించింది. అయినా తాగునీటి ధర ఖరీదే. సింగపూర్ ప్రజల నీటి అవసరాలను చాలా వరకూ వర్షపు నీటి రిజర్వాయిర్లతో తీరుస్తుంటారు.. మిగిలిన నీరు మలేషియా నుండి సరఫరా అవుతుంది. బ్రిటిష్ ప్రభుత్వకాలంలో చేసుకున్న నీటి ఒప్పందాలు ఇరు దేశాల మధ్య దీర్ఘకాల వివాదాలకు కారణమవుతునే ఉన్నాయి. ఆ కష్టాల నుండి గట్టెక్కడానికి సింగపూర్ ఆధునికతను అందిపుచ్చుకుని రీసైక్లింగ్ ప్లాంట్లపై దృష్టిసారించింది. దీంతో వెలుపలి నుండి సరఫరా అవుతున్న నీటి దిగుమతిని కొంచెం కొంచెంగా తగ్గిస్తున్నారు. సింగపూర్‌లో 19 నీటి రిజర్వాయిర్లు, 19 నీటి శుద్ధికరణ విభాగాలు, 14 నీటినిల్వ రిజర్వాయిర్లు ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరీనా బరేజ్ పనులు పూర్తకావచ్చాయి. మలేషియాతో చేసుకున్న నీటి ఒప్పందాలు కొన్ని 2011లో ముగిశాయి. మరికొన్ని 2061లో ముగియనున్నాయి. దానికి తోడు మలేషియా చేస్తున్న డిమాండ్‌ను తోసిరాజని సింగపూర్ సొంత జలవనరుల కోసం ప్రయాసపడుతోంది. దేశంలోనే నీటి వనరులను అభివృద్ధి చేసుకుంటూ స్వయం సమృద్ధితో ముందుకు సాగాలని యోచిస్తోంది. జనాభాకు రెట్టింపు పర్యాటకులు సింగపూర్ పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించడం తద్వారా వచ్చే ఆదాయంతో దేశ ఆర్ధికవ్యవస్థను చక్కదిద్దుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. స్థానిక ప్రజల ఆర్ధిక అవసరాలను నిర్బంధ పొదుపు చర్యలను శాసించడం ద్వారా ప్రభుత్వంపై ఏ దశలోనూ వారు ఆధారపడకుండా చూసుకుంటోంది. అనుత్పాదక రంగాల్లో ఎవరికీ ఎలాంటి రాయితీలను అమలు చేయడం లేదు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, పెన్షన్లు, ఉచిత గృహాలు వంటి పథకాలకు ఇక్కడ తావు లేదు. ఎంట్రీ పోర్టు వ్యాపార విధానాల వల్ల తన ఆర్ధిక రంగాన్ని పరిపుష్టం చేసుకుంది. అంతర్జాతీయ వ్యాపార రంగంలో నాలుగు సింహాలుగా అభివర్ణించబడే దేశాల్లో సింగపూర్ ఒకటి. మిగిలినవి హాంకాంగ్, తైవాన్, కొరియా. సింగపూర్ దేశానికి 25 శాతం పైబడి ఆదాయం కర్మాగారాల ద్వారానే వస్తుంది. ఎలక్ట్రానిక్స్, రిఫైనరీ, రసాయనాలు, మెకానికల్ ఇంజనీరింగ్ ఉత్పత్తులు, బయోమెడికల్ సైన్స్ రంగాల్లోనే ఎక్కువ కర్మాగారాలున్నాయి. ప్రపంచ ఫౌండ్రీ వేఫర్ వాడకంలో 10 శాతం సింగపూర్ ఉత్పత్తుల వల్లనే లభించింది. సింగపూర్ రేవు అత్యంత చురుకైన అంతర్జాతీయ రేవుగా గుర్తింపు పొందింది. వ్యాపారపరంగా లండన్, న్యూయార్క్, టోక్కోకు సమానంగా సింగపూర్ ఓడరేవు ప్రసిద్ధి గాంచింది. తలసరి ఆదాయం 80వేల పైమాటే. నిరుద్యోగం చాలా స్వల్పం. ప్రతి ఏటా కోటి మంది వరకూ సింగపూర్‌కు వస్తుంటారు. 165 మీటర్లు ఎత్తుండే ఫెర్రీవీల్, సముద్రతీరంలో ఉద్యానవనాలు, మరీనా దక్షిణ తీరాన నిర్మించిన పొడవైన డబుల్ హైలెక్స్ బ్రిడ్జీలు, సందర్శకులను సౌకర్యవంతమైన ఫుడ్‌ఫెస్టివల్స్ ఆకర్షిస్తున్నాయి. మరో పక్క కేవలం వైద్య చికిత్సలకే దాదాపు పది లక్షల మందికి పైగా సింగపూర్ వస్తుంటారు. వ్యాపారం, వైద్య చికిత్స, వినోద కార్యక్రమాలపై వచ్చే యాత్రికుల సంఖ్య బాగా పెరగడంతో ఆహార రంగం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. కఠిన శిక్షలు సింగపూర్ చట్టం బ్రిటిష్ చట్టాన్ని అనుసరించేదే అయినా అధికారంలో ఉన్న పార్టీ – పిఎపి మాత్రం పాశ్చాత్య దేశాల సంపూర్ణ ప్రజాస్వాతంత్య్రపు విలువలు పాటించడంలో కొంత వరకూ విముఖత వ్యక్తం చూపిస్తూనే ఉంది. విభిన్న సంస్కృతుల , మతాల ,్భషల ప్రజలు నివసిస్తున్న దేశం కనుక అల్ప సంఖ్యాకులను రెచ్చగొట్టేవి, ప్రశాంతతకు భంగం కలిగించేవి, ప్రజాశ్రేయస్సుకు ప్రతికూలమైనట్టి వ్యాఖ్యలను నిషేధిస్తూ వాక్ స్వాతంత్య్రాన్ని కట్టుబాటులోనే ఉంచుతోంది. అల్పసంఖ్యాకులను రెచ్చగొట్టేవిధంగా బ్లాగుల్లో, వ్యాఖ్యానాలు రాసిన ముగ్గురు బ్లాగర్లపై చర్యలు తీసుకుంది. అధిక జరిమానాలు, కొరడా దెబ్బలు లాంటి శిక్షలు ఇంకా అమలులో ఉన్నాయి. హత్యలు, హానికరమైన మత్తుపదార్ధాలకు సంబంధించిన నేరాలకు ఉరిశిక్ష విధించడం మామూలు విషయమే. ప్రపంచంలో అధికశాతం ఉరిశిక్షలు అమలవుతున్న దేశాల్లో సింగపూర్‌ది అగ్రస్థానం . ఉరిశిక్షల అమలులో అంతర్జాతీయ మానవ హక్కుల విమర్శలు ఎదుర్కొంటున్న సింగపూర్ ప్రభుత్వం తమ దేశంలో అమలు చేయాల్సిన చట్టంపై తమకు పూర్తి సంపూర్ణ హక్కు ఉందని వాదిస్తూ తమ చర్యలను సమర్ధించుకుంటోంది.

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.