|
జగన్నాథ రథచక్రాలను భూ మార్గం పట్టించిన శ్రీశ్రీ ఒకవైపు- స్ర్తీని మహోన్నతంగా చూడాలనుకుని విప్లవాత్మక భావాలను తట్టిలేపిన చలం మరోవైపు. సాహిత్య ప్రక్రియల్లో, సాహితీ వస్తువు ఎంపికలో, జీవికలో ఎక్కడా సారూప్యతలు కనిపించని రెండు సాహితీ దిగ్గజాల మధ్య అంతటి సాన్నిహిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? కలిసి చర్చోపచర్చల్లో పాల్గొన్న దాఖలాలు పెద్దగా లేకపోయినా, సన్నిహితంగా మెలిగిన సందర్భాలూ కనిపించకపోయినా ఒకరంటే మరొకరికి అవ్యాజమైన ప్రేమాభిమానాలు ఎందుకున్నాయి? చలంతోనో, శ్రీశ్రీతోనో వెన్నంటి నడిచిన వారు మాత్రమే చెప్పగలిగిన వివరమిది. చలంతో పాటు రమణాశ్రమంలో అనేక సంవత్సరాలు వుండిపోయి, తరువాత సౌరిస్‌తో కలిసి భీమిలి వచ్చి స్థిరపడిన చిక్కాల కృష్ణారావును పలకరించినప్పుడు, ఉబికుబికి వస్తున్న గత స్మృతుల ప్రవాహం ఆగాగి సాగింది. చలంగారి పోస్ట్ బాక్స్ నంబరు తొమ్మిది. రోజూ దానిలో పడే ఉత్తరాలను తీసుకువచ్చే బాధ్యత నాదే. ఉదయం ఎనిమిది గంటలకల్లా ఉత్తరాల కోసం వెళ్ళేవాడిని. ఓ రోజు శ్రీశ్రీ రాసిన కార్డు వచ్చింది. ఆయన చలంను ‘చలం మహర్షి’ అని సంబోధించే వారు. ఆ కార్డుపై ఏక వాక్యం… ‘రేపు మీ దగ్గరకు వస్తున్నాను…’ అంతే. ఆ మరుసటి రోజు ఎవరి పనుల్లో వారు వున్నారు. ఈ లోగా ఓ జట్కా ఆగింది. అప్పటి వరకూ చదువుతున్న పుస్తకాన్ని అలాగే చదువుకుంటూ జట్కా బండిని అలవోకగా దిగేశారు శ్రీశ్రీ. పుస్తకంలో నుంచి తలెత్తకుండానే నేరుగా ఇంటి లోకి నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఆయన ముందే నేను నడుస్తున్నాను. గడప దగ్గరలో చలం కూర్చుని వున్నారు. ఆయనను కలవటానికి వస్తున్నానని లేఖ రాసిన శ్రీశ్రీ ఆయనను గమనించకుండానే, పుస్తకంతో నేరుగా వంటగదిలోకి వెళ్ళిపోయారు. నేను శ్రీశ్రీతో ‘చలంగారు అక్కడ కూర్చుని వున్నారు’ అంటూ ఓ ముక్క మాత్రమే చెప్పాను. నేరుగా చలం దగ్గరకు వెళ్ళిన శ్రీశ్రీ ‘ఇది చూశారా!? ఎలా రాశాడో?!’ అంటూ తాను చదువుతూ వచ్చిన పుస్తకంలోని ఓ భాగాన్ని చలంకు చదివి వినిపించారు. అది వింటున్న చలం ముఖంలోనూ, చదువుతున్న శ్రీశ్రీ ముఖంలోనూ ఆనందంతో కూడిన ఓ వెలుగు కనిపించింది. ఆయన ఆ రోజు కేవలం దానిని ఆయనకు చదివి వినిపించటానికే వచ్చారు. అలా వారిద్దరూ కలిసినప్పుడు ఎలాంటి ఫార్మాలిటీస్ వుండేవి కావు. ఎవరి ప్రపంచంలో వారు వుంటూనే అవసరమైన మేర పంచుకునే వారనిపించింది. మరోసారి మరో కార్డు, ఏక వాక్యంతో ‘చలం మహర్షికి, అందరూ అటే… శ్రీశ్రీ.’ అంతే. ‘అందరూ అటే’ అన్న మాటను ఎలా అర్థం చేసుకోవాలి? ఎన్ని అర్థాలు వున్నాయో?! ఆ తరువాత దానికి కొనసాగింపుగా అన్నట్లుగా మరో కార్డు వచ్చింది. దానిలోనే అంతే ఒకే ఒక ముక్క ‘నా భార్య రమణ మహర్షి ఆశ్రమానికి బయలుదేరింది’. దాని తరువాత మరో కార్డు… ‘నేనూ వస్తున్నా’. ఎంతో మంది ఆశ్రమం దారి పట్టారు, మేమూ అదే బాట పట్టాం అన్న భావన అప్పటికి కాని పరిపూర్ణం కాలేదు. చలం స్ర్తీని మహోన్నతంగా నిలిపి ఆరాధిస్తే, శ్రీశ్రీ విప్లవ కవిత్వంతో ఉద్రేకంతో, ఉద్వేగంతో ‘ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి -నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి- హరోం హరోం హర హర హర హరోం హర హర అని కదలండి- అంటూ పరుగుపెట్టించాడు. చలాన్ని అమితంగా ప్రేమించే ఓ వ్యక్తి ఆశ్రమానికి వచ్చారు. చలంతో అవీఇవీ మాట్లాడుతుంటే టాపిక్ శ్రీశ్రీపైకి మళ్ళింది. అంతా విన్న ఆ వ్యక్తి ‘శ్రీశ్రీ గురించి అవీ ఇవీ వద్దు ఒక్క మాటలో ఆయనేమిటో చెప్పండి’’ అంటూ అడిగారు. వెంటనే చలం ‘జారిపడ్డ గంధర్వుడంటాను…’ అన్నారు. ఎన్ని అర్థాలతో నిండిన మాటో కదా అనిపించింది.
శ్రీశ్రీ, చలం-ఇద్దరూ ఆ కాలంలో భాషలో నిష్ణాతులు. అయితే నిత్య జీవితంపై శ్రీశ్రీకి గమనిక వుండేది. చలంకు పట్టేది కాదు. అంతేనా… చలం స్ర్తీని ఆరాధనగా తీసుకుని సమున్నతంగా చూస్తే, శ్రీశ్రీ ప్రత్యేక స్థానం ఇవ్వలేదు. శ్రీశ్రీ వర్గాన్ని ఆవేశంగా తీసుకున్నారు. అదే సమయంలో ఇద్దరి జీవితాలలో ఓ సారూప్యత కూడా వుంది. ఇద్దరూ ఆర్థికంగా ఇబ్బందులు పడిన వారే. ఇద్దరూ డబ్బుకు ప్రలోభపడలేదు. కీర్తి ప్రతిష్ఠలకు ఇద్దరూ పాకులాడలేదు. శ్రీశ్రీ అంటే చలానికి ఓ సాఫ్ట్ కార్నర్ వుండేది. దానిని ఎవరూ తప్పించలేరు. ఎందుకు? వారిద్దరినీ కలిపి వుంచిన బంధమేమిటి? అన్న ప్రశ్నకు బయట నుంచి ఇప్పుడు సమాధానం చెప్పటం కష్టమే. సరికాదు కూడా. ఇక్కడో విషయం ప్రస్తుతంగా ప్రస్తావించాలి. మహాకవి శ్రీశ్రీ, తెలుగు సాహిత్యంలో పేరడీలకు, ఆద్యుడుగా భావించే జలసత్రం రుక్మిణీనాథ శాసి్త్ర ఉరఫ్ జరుక్ శాసి్త్ర మంచి మిత్రులు. చెన్నైలోని పానగల్ పార్కులో ఒకే సిగిరెట్టు, టీ షేర్ చేసుకునేటంత సాన్నిహిత్యం వారిది. శ్రీశ్రీ మహాప్రస్థానం వ్రాయటం పూర్తి అయ్యింది. ఆ వ్రాతప్రతిని జరుక్ శాస్ర్తి నేరుగా చలం వద్దకు తీసుకువచ్చారు. అప్పటికి తెలుగుదేశంలో వున్న ఎంతో మంది ప్రసిద్ధులు చెన్నైలో అందుబాటులోనే వుండేవారు. వారందరినీ కాదని, చలం వద్దకు రావటం వెనుక కారణం గురించి ఒక్క క్షణమాలోచిస్తే, చలం, శ్రీశ్రీల బంధాన్ని ఆయన అర్థం చేసుకునే తీసుకువచ్చారని స్ఫురిస్తుంది. శాసి్త్ర తీసుకువచ్చిన వ్రాతప్రతిని చదివిన తరువాత చలం అంతే లోతుగా యోగ్యతాపత్రాన్ని రాశారు. వచన రచనలో చలం ఎంత పొదుపుగా, తక్కువ పదాలను వాడారో, శ్రీశ్రీ తాను రాసిన కవితలలో అంతకన్నా బహుతక్కువ మాటలనే వాడారు.
శ్రీశ్రీ, చలంల మధ్య అంతటి బంధమున్నా, ప్రళయం వచ్చేస్తోందని, ఈశ్వరుని దర్శనమయ్యిందని చలం రాసిన రాతలను శ్రీశ్రీ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఎన్నో గొప్ప విషయాలను రాసిన చలం ఇలాంటి వాటిని చెప్పటాన్ని ఆయన జీర్ణం చేసుకోలేకపోయారని అనుకుంటాను. చలం, శ్రీశ్రీల గురించి మాట్లాడుకునేటప్పుడు, సాహిత్యాన్ని చూస్తున్నామా? సంస్కరణలను, సంఘటనలను చూస్తున్నామా? అన్నది ముఖ్యం. శ్రీశ్రీ కవిత్వం, చలం స్ర్తీ… రెండింటి ఆధారంగానే వాళ్ళ ఔన్నత్యాన్ని చూస్తున్నాం. అయితే, నిత్య జీవితంలో ఆ రెండు విషయాలనీ ప్రపం చం ఎంత పేలవంగా, ఎగతాళిగా, దుర్భలంగా చూస్తోందో, ఆ మహాత్ములు పరస్పరం కావలించుకుని చూస్తూనే వున్నారు.
పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగులో శివతాండవం గేయ కావ్యాన్ని రాశారు. ఆ కావ్యంలోని మాత్రాఛందస్సులోని శబ్దసౌందర్యం, ఆయన గాత్ర మాధుర్యం అద్భుతం. ఓ సారి రమణమహర్షి ఆశ్రమానికి వచ్చారు నారాయణాచార్యులు. శివతాండవం గేయకావ్యంలోని కొన్ని భాగాలను ఆయన పాడారు. ఎప్పుడూ ఎవ్వ రినీ, ఏ పాటనీ రెండోసారి పాడమని అడగని చలం ఆ రోజు ‘మరలా పాడతారా?’ అని అడిగారు. ఎంతగానో సంతోషించిన నారాయణాచార్యులు ఆ గేయాన్ని మరోసారి పాడారు. చాలామందికి తెలిని మరో విషం వుంది. సుబ్రహ్మణ్యం దేవర వద్ద చలం సంగీతాన్ని నేర్చుకుని పాడేవారు.
ఓసారి చలంగారిని పిచ్చికుక్క కరిచింది. ఇంజక్షన్లకు ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి. నిత్యం వచ్చే పోస్టు కార్డులకు ప్రత్యుత్తరమిచ్చే అలవాటు వున్న చలం అదే సమయంలో ఓ ఉత్తరానికి ప్రత్యుత్తరమిస్తూ పిచ్చికుక్క కరిచిన విషయాన్ని కూడా రాశారు. ఆ తరువాత అది అలా అలా పాకింది. అది చివరికి చలాన్ని పిచ్చికుక్క కరిచిందని శ్రీశ్రీ అన్నాడంటూ ప్రచారం అయ్యింది. అంత జరిగినా వారిద్దరి మధ్యా ఎలాంటి భేదభావనా నేను గమనించలేదు. చలం బయటకు వచ్చి రమణ మహర్షి గురించి ప్రచారం చేసి వుంటే నేడు తెలుగు రాష్ర్టాలలో పరిస్థితి వేరుగా వుండేది. భగవాన్ రమణ మహర్షి తత్వం, దివ్యత్వం ప్రజలకు మరింతగా బోధపడి చేరువయ్యేది.
ఓ సారి రాత్రిపూట శ్రీశ్రీ వచ్చారు. భోజనాలు అయిన తరువాత మా ఇద్దరి మధ్యా సంభాషణ ఇలా సాగింది. ‘సిగిరెట్టు కాల్చవచ్చా?’. లోపలా, బయటా అన్న విషయాన్ని వివరించకుండా గోప్యత పాటించారాయన. ‘ఇక్కడ ఎవ్వరూ కాల్చరు…’ నా సమాధానం. ఆయన, ‘బయట వర్షం పడుతోంది కదా?!’ అన్నారు. అయితే నేను గొడుగు తెస్తానని లోపలికి వెళ్ళి తెచ్చి గొడుగువేసి పట్టుకున్నాను. ఆయన సిగిరెట్టు పీలుస్తున్నారు. పూర్తయిన తరువాత ఇంటి వరండాలో చలంగారి దగ్గర కూర్చున్నారు. ఆయనతో మాట్లాడుతూ, ‘‘కృష్ణారావు నన్ను ఛత్రపతి శ్రీశ్రీని చేశాడు’’ అన్నారు. జోకులు వేసినప్పుడు శ్రీశ్రీ ప్రకటితంగా నవ్వడం నేను చూడలేదు. అయితే చలం మాత్రం ఎవరు మాట్లాడుతున్నా ఎంతో ఆస్వాదిస్తూ వినేవారు. చిత్రకూతుళ్ళు చలంతో ఆడుకునే వారు. ఆయన ముఖానికి పసుపు రాసి, బొట్టుపెట్టేవారు. ఆయనజుత్తుకు జడలు వేసేవారు. వారి ఆటలను చలం ఎంతగానో ఎంజాయ్ చేసేవారు. అయితే ఎవరన్నా పుట్టిన రోజు వేడుకలను చేస్తామంటే మాత్రం చలంకు చాలా కోపం వచ్చేది. ఎంతోదూరం నుంచి అభిమానంతో నూతన వస్ర్తాలను తీసుకువచ్చి ఇచ్చినా వాటిని ఆరోజు అస్సలు వేసుకునేవారే కాదు.
తిరువణ్ణామలైలోని రమణ మహర్షి ఆశ్రమం చుట్టూతా ఎంతో మంది పెద్దలు ఇళ్ళు కట్టుకుని వున్నారు. ఆశ్రమానికి ఎంతో మంది రాజకీయ, సినీ ప్రముఖులు వస్తూండేవారు. వాణిశ్రీ తరచుగా వచ్చేవారు. మరో నటి శారద కూడా. నటి సుకన్య స్వతంత్రంగా వుండేది. ఎవరినీ పేరూ, ఊరు ఏనాడూ అడగని నాకు చాలా మంది తెలియదు. ఓ సారి చలంగారి కుటీరం పక్కనే వున్న మరో కుటీరంలోకి ఘంటసాల, సంగీతరావు, ఆత్రేయ దిగారు. కరెంటు లేదు. నిద్రపట్టని ఘంటసాల గదిలో ఓ మూల వున్న తీగలు తెగిన తంబూరా తీసుకుని అష్టపదులు గానం చేశారు.
చెన్నైలో తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. మండలి వెంకటకృష్ణారావు స్వయంగా ఆశ్రమానికి వచ్చారు. చలంతో, మిమ్మల్ని సన్మానించుకోవాలని అనుకుంటున్నామని చెబుతూ చెన్నై రావాలంటూ అభ్యర్థించారు. అయితే వాటికి పూర్తి దూరంగా వుండే చలం సున్నితంగా తిరస్కరించారు. నా కృష్ణ వస్తాడు అంటూ నన్ను చూపించారు. మండలి వారు నాతో చెన్నై రాగానే ఫోన్ చేయండి, అన్ని సౌకర్యాలూ నేను చూసుకుంటాను అని చెప్పారు. అలాగే వెళ్ళాను. నాడు వారిచ్చిన షీల్డ్‌ను మాతోపాటే భీమిలి తీసుకువచ్చాం. సౌరిస్ ఆశ్రమంలో ఇప్పటికీ ఆ షీల్డ్ పదిలంగా వుంది.
స్వేచ్ఛా రచన : చిగురుపాటి సతీష్ బాబు (నేడు చలం జయంతి) |