ఆనంద రామాయణ విశేషాలు -5
దేవపత్నులు గోపికలుగా జన్మించే వరం
శ్రీరాముడు సరయూ నదీ తీరం లో చైత్రమాసం లో పట గృహం(డేరా) లో ఉన్నాడు .సీతాదేవి అక్కడలేదు ఈ సంగతి తెలిసిన అయోధ్య వాసులు నానా దేశ వాసులు ,రామతీర్దానికి చైత్ర స్నానానికి వచ్చారు దేవ యక్ష రాక్షస కిన్నెర కింపురుషులు గంధర్వులూ నాగులు మునులు రాజులు ,అప్సరసలు ,కామరూపం లో ఉన్న దేవతలు అందరూ వచ్చారు .శ్రీరాముని దివ్య సుందర రూపాన్ని చూసి వారందరూ పులకించిపోయారు .వారిలో వారు మాట్లాడుకొని అర్ధ రాత్రి దేవ పత్నులు రామ దర్శనానికి వచ్చారు .భటులు అనుమతినివ్వలేదు .అప్పుడు వారంతా ‘’మాకు ఇప్పటికిప్పుడు శ్రీరామ దర్శనం లభించకపోతే సరయు నదిలో పడి ప్రాణ త్యాగం చేసుకొంటాం ‘’అని బెదిరించారు వాళ్ళు కంగారుపడి రాముడికి నివేదించారు .రాముడు వెంటనే అక్కడికి చేరుకొన్నాడు .రామ దర్శనం తో ధన్యత చెందారు .ఇంతమంది ఇక్కడికి ఒక్కసారిగా రావటానికి కారణమేమిటి అని వారిని అడిగాడు రాముడు .
వారందరూ సిగ్గులమొగ్గలై తలలు వంచుకొని కామ ప్రేరితులమై తాము అక్కడికి వచ్చామని శ్రీరామునితో క్రీడించాలని మనసునిండా కోరికతో ఉన్నామని దాచుకోకుండా చెప్పారు .దానికి శ్రీరాముడు నవ్వి ‘’ఈ జన్మ లో నేను ఏక పత్నీ వ్రతుడిని .నియమ భంగం చేయను .మీరు వెళ్ళిపొండి ‘’అని చెప్పాడు .వారందరి మనసు గాయపడింది తట్టుకోలేక పోయారు .అందరూకలిసి సరయూనదీ ఇసుక తిన్నెలమీద మూర్చ పోయారు .అలామూర్చ నొందిన ఆ దేవపత్నులపై జాలికలిగి ధర్మాత్ముడైన రాముడు వారితో ‘’’కామినులారా !నేను ద్వాపర యుగం లో నంద గోపుడు పాలించే గోకులం లో శ్రీకృష్ణుడిగా పెరుగుతాను .ఇంద్రుడే నందుడుగా జన్మిస్తాడు .అప్పుడు దేవతలందరూ నా వరప్రసాదం చేత గోపాలకులుగా పుడతారు .మీరందరూ గోపికలుగా జన్మిస్తారు . మీరు ఇప్పుడుకోరిన మీ కోరికను నేను నెరవేర్చి మీకందరికీ ఆనందాన్ని చేకూరుస్తాను .మీతో కాలిందీ నదీ తీరంలో అర్ధ రాత్రి వేళల్లో ఇసుక తిన్నెలమీద పుష్పవనాలలో రాసక్రీడలు సలుపుతాను .మిమ్మల్ని తనియింపజేసి, తరింప జేస్తాను నామాట నమ్మండి ‘’అని నచ్చ చెప్పాడు .రామ వాక్యం పై ఉన్న నమ్మకం తో వారందరూ విశ్వసించి నమస్కరించి ఆశతో వెనుదిరిగి వెళ్ళిపోయారు .’’తా మూర్చాం విహ్వాలా దృష్ట్వా రామో విహ్వల మానసః –నారీ స్సంతోషయన్ ప్రాహ హే నారయ స్శ్రూయతాం మమ –వాక్యం ఖేదావహం చోద్య ద్వాపరే కృష్ణ రూప దృక్ –అహం వ్రజే భవిష్యామి నంద గోపేశ పాలితే –తదా దేవాస్తూ గోపాలా భావి మద్వర దానతః –భవిష్యన్తి సురేశశ్చనంద స్తత్ర భవిష్యతి –భవిష్యద తదా యూయం గోపికా స్సకలాఃవ్రజే –యుష్మాకం పూర యిష్యామి యదేచ్చం వాంచితం తదా –రాసక్రీడాం హి యుష్మాభిః కరిష్యామి న సంశయః – వృందావనేతు కాలింద్యాం సైకతే నిశివై చిరం –భావద్వో స్వస్త చిత్తాశ్చ గచ్చ ద్వం స్వస్థలం ముదా ‘’
గుణవతి సత్యభామగా జన్మించటం
కృతయుగాంతం లో మాయ పురిలో వేద వేదంగ పారంగతుడైన దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు .అతిధి సత్కారాలలో నిత్యాగ్ని హోత్రం లో శ్రేష్టుడు .సూర్యోపాసి .సూర్య తేజస్సు చేత ప్రకాశించేవాడు .ముసలివాడైన దేవశర్మకు అందాల రాసి అయిన గుణవతి అనే కుమార్తె ఉంది .ఆమెను శిష్యుడైన చంద్ర శర్మ కిచ్చి వివాహం చేశాడు .కూతురూ అల్లుడూ చాలా అన్యోన్యంగా జీవిస్తూ దేవశర్మకు సేవ చేస్తున్నారు .ఒక రోజు మామా అల్లుడు సమిధలు వగైరా సేకరించి తీసుకొని రావటానికిహిమవత్పర్వత సానువులలో ఉన్న అడవికి వెళ్ళారు .అప్పుడు అనుకోకుండా ఒక రాక్షసుడు వారికి కనిపించాడు భయపడి పారిపోవాలని ప్రయత్నం చేసి పరిగెత్త లేక ఆగిపొయారుఇద్దరూ .దయలేని రాక్షసుడు వారిద్దరిని చంపి తినేశాడు .ఆ క్షేత్ర మహాత్మ్యం వలన వారిని విష్ణు దూతలు దేవలోకానికి తీసుకొని పోయారు .సూర్య పూజ నిత్యం చేసేవారుకనుక విష్ణు మూర్తి వారిపై ప్రసన్నంగా ఉన్నాడు .వారికి విష్ణులోక ప్రాప్తికల్గించాడు .
తండ్రిని, భర్తను రాక్షసుడు చంపడాన్న వార్త గుణవతికి తెలిసింది .ఆమె కన్నీరు మున్నీరుగా విలపించి ఉన్న వస్తువులనన్నిటిని అమ్మివేసి వారిద్దరికీ ఉత్తర క్రియలు నిర్వర్తించింది .మనసులో ఏ కోరికా లేకుండా జితెన్ద్రియురాలై విష్ణు భక్తీ పరాయణురాలై ఏకాదశీ వ్రతం ,కార్తీక విష్ణుసేవా ,మాఘ స్నానం వైశాఖ స్నానాలు పూజలు ,విష్ణ్వాలయం లో సేవ ,స్వస్తికాదుల నివేదన నిత్య విష్ణు పూజ అనే ఎనిమిది రకాల ‘’విష్ణు వ్రతాన్ని ‘’శ్రద్ధగా చిత్త శుద్ధితో భక్తితో ఆచరిస్తోంది .సరయూ నదీ మహాత్మ్యాన్ని వినిఅక్కడి రామ తీర్దానికి చేరి చైత్రమాస వ్రతం ఆచరిస్తోంది .సరయూనదీ సైకత పట గృహం లో శ్రీరాముడున్నాడని తెలిసి అర్ఘ్యపాద్యాదులతో అర్చించాలని వెళ్ళింది .భటులకు మనసులోని మాట తెలియజేసి వారి అనుమతితో గుడారం లోకి చేరుకొన్నది .అక్కడ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో శ్రీరాముడు సర్వాలంకార శోభితుడై దర్శనమిచ్చాడు .ఆ దివ్య మోహన రూపాన్ని చూసి గుణవతి పులకించి పోయి సాష్టాంగ నమస్కారం చేసింది .రామునికి అర్ఘ్యపాద్యాదులిచ్చి భక్తితో పూజించింది .ఆమె సేవలకు పరమ ప్రీతుడైన రాముడు మనసులోని కోరిక ను గురించి ఆమెను అడిగాడు .
గుణవతి ‘’శ్రీ రామా!వేలకొలదిగా నీకు దాసీజనం ఉన్నారు .నీ సేవలో వారందరూ ధన్యులవుతున్నారు.నన్ను కూడా వారిలో ఒకరిగా స్వీకరించి నీ సేవా భాగ్యాన్ని నాకు కలిగించు ‘’అని ప్రార్ధించింది .రాముడు ఆమెతో ‘’బ్రాహ్మణ స్త్రీవైన నువ్వ్వు ఇలా కోరడం ఆశ్చర్యంగా ఉందినాకు .నా సేవలో తరించాలని నీకు నిశ్చయంగా మనసులో ఉంటె వేరొక జన్మలో దాన్ని తీరుస్తాను .ఈజన్మలో సాధ్యం కాదు .నేను ద్వాపరయుగం లో ద్వారకా పట్టణం లో శ్రీ కృష్ణావతారం లో ఉంటాను. మీ తండ్రి దేవ శర్మ సత్రాజిత్తుగా జన్మిస్తాడు .నువ్వు ఆయన పుత్రిక సత్యభామగా జన్మిస్తావు .అప్పుడు నిత్యం నా సేవ చేస్తూ పూజిస్తూ ధన్యత నొందుతావు .తన్ను ఆరాధిస్తూ ప్రేమిస్తావు .నేను నిన్ను వివాహం చేసుకొంటాను నీ భర్త నాకు సఖుడైన అక్రూరుడుగా జన్మిస్తాడు .సత్యభామా విధేయుడు అని అందరూ నన్ను అనుకోనేంత గా మన దాంపత్యం వర్ధిల్లుతుంది .ఇక ఇంటికి వెళ్ళు ‘’అని వరమిస్తాడు .
ఎంతో సంతోషించిన గుణవతి ఇంటికి చేరి చైత్రవ్రతాన్ని క్రమం తప్పకుండా చేస్తూ ఒక సారి తోటి జనం తో కలిసి హరిద్వారానికి యాత్రగా వెళ్ళింది .అక్కడే ఉంటూ విష్ణు చిత్తం తో ధర్మాచరణ చేస్తూ ఒక రోజు జ్వరపడి గంగా స్నానం చేస్తూ అందులో శరీరాన్ని వదిలేసింది .స్వర్గం చేరి చాలాకాలం సుఖాలను అనుభ వించింది .ద్వాపరం రాగానే సత్రాజిత్తు కుమార్తె సత్యభామగా జన్మించి శ్రీ కృష్ణ సేవలో తరించి ఆయననే వివాహమాడి ‘’మీరజాలగలడా నాయానతి వ్రత విదానమహిమన్ ‘’అని కృష్ణుడిని కొంగుకు కట్టేసుకొని’’ సత్యాపతి ‘’అనే బిరుదాన్ని నల్లనయ్యకు వచ్చేట్లు చేసిన ఘటికురాలైంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-5-15-ఉయ్యూరు