ఆనంద రామాయణ విశేషాలు -8

ఆనంద రామాయణ విశేషాలు -8

శ్రీరాముడు గ్రహణ స్నానానికి కురుక్షేత్రం వెళ్ళటం

ఒకసారి శ్రీరాముడు సీతా లక్ష్మణ భారత శత్రుఘ్న సమేతుడై పుష్పక విమానం ఎక్కి సూర్య గ్రహణ స్నానానికి కురుక్షేత్రానికి వెళ్ళాడు .అప్పటికే దేవ గాంధర్వ కి౦పు రుషలాదులందరూ అక్కడికి చేరుకొన్నారు .అన్ని ఆశ్రమాలనుండి మునులూ విచ్చేశారు .నానాదేశ రాజులూ వచ్చారు .శ్రీరాముడు సీతా సమేతంగా గ్రహణ స్నానం చేశాడు .గజ ,తురగ ఉస్ట్ర మొదలైనవానిని దానం గా సమర్పించాడు .రాజులు విలువైన కానుకలు రామునికి సమర్పించారు .సీతా రామ దర్శనానికికై అందరూ ఉవ్విళ్లూరుతున్నారు .జానకీదేవి రాజపత్నులను ఆలింగనం చేసుకొని కుశల ప్రశ్నలతో వారిని సంతృప్తి పరచింది .మునిపత్నులకు నమస్కరించి ఉచితాసనాలపై వారిని కూర్చుండ బెట్టింది .

సీతా లోపాముద్ర సంవాదం

సీతాదేవి ముని పత్నులఎడ చూపుతున్న గౌరవ మర్యాదలకు పొంగిపోయిన అగస్త్యమహర్షి భార్య లోపాముద్ర సీతను ఆమె పెండ్లి నాటినుండి ఇప్పటివరకు జరిగిన కధను  వివరించమని  కోరింది .సీత అన్ని విషయాలు ఆసక్తికరంగా వివరించింది .అంతా విన్న లోపాముద్ర ‘’జానకీ !అంతా బాగానే ఉంది .కాని ఒక విషయ౦  లో మీ ఆయన అనవసరంగా కష్టపడ్డాడేమోనని పించింది  .సముద్రంపై సేతువును కట్టటానికి అంత కష్టపడాలా ? మావారు కు౦భసంభవులు అగస్త్యమహర్షికి చెప్పి ఉంటె ,ఆ సముద్ర జలాన్ని మూడు గుక్కల్లో తాగేసి లంకకు దారి ఏర్పరచేవారుకదా?కోతిమూకకు సేతువుకట్టే శ్రమ ఉండేదికాదు కదా ?’’అని సన్నాయి నొక్కులు నొక్కింది .లోపాముద్రా దేవి చాలా గర్వంతో తనభర్త అగస్త్యమహర్షి గొప్పతనాన్ని గురించి చెప్పిందని గ్రహించిన సీతా దేవి నవ్వి ఆమెతో ‘’తల్లీ అగస్త్య అర్ధాంగి లోపాముద్రా దేవీ !నా భర్త శ్రీరాముడు సేతువును చాలా తేలికగానే సక్రమంగానే కట్టారు .మీరు కూడా వినండి రాజపత్నులారా ! సవివరంగా ఆ విషయం మీ అందరికి వివరిస్తాను .శ్రీరాముడు మీరు అనుకొన్నట్లు చేతకాని వాడేమీకాదు.రామ బాణం ఎక్కు పెట్టి సముద్రుడిని శోషింప జేయగల మహా  సమర్ధుడు నా రాముడు .కాని అలా చేస్తే సాగరం లోని అనేక జీవ రాశులకు అపాయంకలిగి హత్యా దోషం కలుగుతుందని సందేహించాడు .ఒక వేళ రాముడు ఆకాశ గమనం తో సముద్రాన్ని దాటితే అప్పుడు రావణుడు శ్రీరాముని మనుష్యమాత్రునిగా ఎలా భావిస్తాడు ?ఇదీకాక భక్తుడైన హనుమ వీపుమీద ఎక్కి సాగర ఉల్లంఘనం చేసి లంకకు వెళ్ళగల సమర్దుడే కదాఅంటారేమో  ! అప్పుడు రామ పౌరుషాన్ని లోకం ఏ విధంగా భావిస్తుంది ?పోనీ ఈదుకుంటూ సముద్రం దాట వచ్చు కదా అని అనుకొంటే ‘’బ్రాహ్మణ మూత్రం అయిన సముద్రాన్ని మనం దాట రాదు’’ అని శంకించాడు .-‘’పీతోయం జలధిః పూర్వం శ్రుతం క్రోదా దగస్తినా –మూత్ర ద్వారా ర్బహిస్త్యస్త సమాత్ క్షారత్వ మాగతః –సర్వదా మూత్రవత్ క్షారస్స కదం పాతు మర్హతి –స రుషి ర్మమ వాక్యేన చులకం తు కరిష్యతి ‘’.

‘’అయినా మీ ఆయన మా ఆయన చేత ప్రార్ధనీయుడే .కాదన లేను .నీ భర్త అగస్త్యముని కోపంతో ఈ సాగరాన్ని పానం చేశాడని విన్నాను.లోకాలు తల్లడిల్లి మహర్షిని ప్రార్ధిస్తే తన మూత్రం ద్వారా సాగరాన్ని బయటికి వదిలాడని లోకానికి తెలిసిన విషయమేకదా.అందుకే తీయగా ఉండే సముద్రజలం అగస్త్య మూత్రం తో  ఉప్పగా మారి క్షార జలధి అనే పేరు వచ్చింది .ఈ సంగతి నీకు తెలియనిదికాదు .’’మూత్రపానం బ్రాహ్మణేన స్వకార్యార్ధం నిజొక్తిభిః ‘’ అలాంటి మూత్ర రూప సాగరాన్ని నా భర్త  ఇక్ష్వాకు ప్రభువు రాఘవ స్వామి మళ్ళీ ఎలా పానం చేస్తాడమ్మా!ఒక వేల నువ్వు హితం చెప్పినట్లే నేను నా రాముని నీ భర్త అగస్త్యమునిని వేడుకొని సముద్రజలాన్ని ‘’చులికీక్రుత సర్వ పాదోది జలం’’గా చేయమని కోరినా ,అయన అంటే నీ భర్త అగస్త్యుడు మళ్ళీ ఎల్లా తన మూత్రాన్నే పానం చేయగలడు?’’ఇది లోక ధర్మ విరుద్ధంకదా మాతా ! లోకం  ఏమను కొంటుంది?  ‘’రాముడు సొంత కార్యం కోసం పాపం  నిష్టా గరిస్టూడైనబ్రాహ్మణుడి చేత  స్వమూత్ర పానం చేయించాడు ‘’అనే లోక నింద పడమంటావా .అపకీర్తి మూట గట్టుకోమంటావా ? ! ఇది న్యాయమా ?అందుకే రాముడు ధర్మ స్వరూపుడు కనుక నీ భర్త అగస్త్యుని ప్రార్ధించలేదు . ఇన్ని రకాలుగా అలోచించి వానర మూకల చేత సేతు బంధాన్ని చేయిన్చాడుధర్మ మూర్తి రామ మూర్తి .ఇంతవరకు ఎవరూ చేయని సాహసం చేసి సేతు నిర్మాణం గావించి చిరకీర్తి పొందాడు రాముడు .ఏ రామునిచేత సముద్రం లో రాళ్ళు సంతరి౦ప బడ్డాయో అలాంటి వాడు కదా’’ దాశరధి’’ అని నా భర్త శ్లాఘింప బడ్డాడు  కీర్తింప బడ్డాడు !‘’అని సీతా సాధ్వి సవినయంగా మనవి చేసింది .లోపాముద్ర ఈ సమాధానికి  ఓడిపోయి తలవంచుకొని నిలబడింది .మునిపత్ని ఖిన్నురాలుకకుండా ఆమెపై తన కున్న అపూర్వ గౌరవాన్ని ప్రకటిస్తూ లోపాముద్రాదేవిని యధోచితంగా సత్కరించి మిగిలిన మునిపత్నులనూ పూజించి అందరి ఆశీస్సులు అందుకొన్నది .ఇంకా మునిపత్ని మనసులో ఏమైనా కోపం ఉందేమోనని సీతాదేవి ఆమె చెంతకు చేరి ‘’అమ్మా లోపాముద్రా దేవీ ! పరమ పవిత్రురాలివి నువ్వు .నేను చాలా అపరాధం చేశాను .అంత పరుషంగా నేను మాట్లాడి ఉండి ఉండాల్సినదికాదేమో . ప్రసంగ వశం లో, పరవశం లో శ్రీరామ గుణగానాన్ని చేశాను .ఆయన పౌరుషాన్ని ప్రకటించాను. అంతే నీ మీద నాకు ఏ విధమైన ద్వేష భావమూ లేదు .మహర్షి అగస్త్యులవారివలననే నా భర్త శ్రీరామునికి అంతటి పరాక్రమ పౌరుషాలు లభించాయని నాకు తెలుసు .నన్ను మన్నించమ్మా మనసులో ఏమీ భేదభావం నాపై ఉంచుకోకు తల్లీ  ‘’అని పాదాలపై పడి ప్రార్ధించి స్వస్త చిత్తను చేసి యధోచిత సత్కారాలు అందించి లోపాముద్రాది మునిపత్నులకు  వీడ్కోలు పలికింది సీతా సాధ్వి .

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -21-5-15- ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.