- హాస్యనటి హేమ చెప్పిన షూటింగ్ ముచ్చట్లు
‘స్వాతి చినుకులు’ సినిమాలో చిన్న పాత్రతో తెలుగుతెరకు పరిచయమైంది హేమ. మాటకారితనంతో పాటు కాస్త అమాయకత్వం కలబోసిన నవ్వుతో ఆమె చేసిన ప్రతి పాత్రా పేక్షకులకు గుర్తుండిపోయేదే. ‘అతడు’లో బ్రహ్మీకి భార్యగా, ‘మల్లీశ్వరి’లో వెంకటేష్‌ను తిట్టిపోసుకునే కొలీగ్‌గా, ‘జులాయి’లో ఇలియానా సవతితల్లిగా రకరకాల పాత్రలతో తెలుగులో తనకు రిప్లేస్మెంట్ లేదని నిరూపించుకుంది. చిరంజీవి నుండి సాయిధర్మతేజ వరకూ ఎందరో హీరోలతో 200 చిత్రాలకు పైగా నటించిన హేమ చెప్పిన షూటింగ్ ముచ్చట్లే ఇవి.
చిరంజీవి మీద అభిమానంతో సినిమాల్లోకి వచ్చాను. బాలకృష్ణ గారి ‘రౌడీ ఇన్స్పెక్టర్’ నాకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. అందులో రౌడీలు తరుముతుంటే నటి కిన్నెర నన్ను సైకిల్ మీద కూర్చోపెట్టుకుని తొక్కుతూ తీసుకువెళ్ళాలి. ఈ సీన్ తీయటం అయ్యేటప్పటికి నాకు నడుం నొప్పి వచ్చేసింది. ఇదే సీన్ చివర మా ఇద్దరినీ కలిపి ఒకే గోతిలో ఒకరిపై ఒకరిని పడుకోబెట్టి పాతేస్తారు. ఆ సీన్ చేస్తున్నప్పుడు మట్టంతా నోట్లోకి ముక్కు, కళ్లల్లోకి వెళ్లిపోయి ఊపిరి తీసుకోవడానికి చాలా బాధపడ్డాను. కానీ సినిమా రిలీజ్ అయ్యాక నాకు మంచి పేరొచ్చింది.
ఏనుగు కొట్టిన దెబ్బ
‘మురారి’ సినిమాతో నా రెండో ఇన్నింగ్స్ మొదలైంది. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు ఒక పెంపుడు ఏనుగు ఉంటుంది. షూటింగ్ గేప్ లో నటుడు చిన్నా నావెనుకగా వచ్చి ఏనుగుకు గుగ్గిళ్ళు పెట్టబోయాడు. అది నా మీదకు వచ్చేసి తొండంతో గట్టిగా కొట్టింది. అంతే భయంతో పెద్దగా అరిచి పడిపోయాను. అక్కడున్నవాళ్ళంతా చిన్నాను తిట్టేసారు. ఈ సినిమాలో నటించిన ఆడవాళ్ళందరినీ సులువుగా గుర్తుపట్టడానికి వీలుగా కృష్ణవంశీగారు అందరికీ తలా ఒక రంగు చీర కేటాయించారు. సరిగ్గా నాకు ఇచ్చిన రంగు చీరనే లక్ష్మిగారు కట్టుకు వచ్చేవారు. ఆవిడను మార్చమని అనలేక నన్నే వేరే రంగు చీర కట్టుకు రమ్మనేవారు వంశీగారు. ఇలా చాలాసార్లు జరిగింది.
మహేష్‌బాబు నన్ను ఆంజనేయుడ్ని చేశారు
‘అతడు’ సినిమా అనగానే బ్రహ్మానందంగారికి , నాకు మధ్య ఉన్న కాఫీ కప్పు సీను టక్కున గుర్తుకు వస్తుంది ఎవరికైనా అక్కడే ఎడిట్ చేసిన సీన్ ఒకటి ఉంది. బ్రహ్మానందంగారు ఊరి నుండి రాగానే ఇంట్లో ఉన్న నన్ను పిలుస్తూ కాలి షూ విసురుగా నా మీదకు వచ్చేలా విడవాలి. అయితే ఆయన షూని కాస్త వేగంగా విడిచేసరికి అది నా మీదకు వచ్చి ముఖానికి బలంగా తగిలింది. దాంతో నా మూతి పెద్దగా వాచిపోయింది. అక్కడ ఉన్నవాళ్ళంతా కంగారుపడిపోయారు. త్రివిక్రమ్‌గారయితే ఇక నేను ఎప్పుడూ ఆడవాళ్ళను కొట్టే సీను రాయనన్నారు. ‘‘పక్కనే కృష్ణవంశీ ‘శ్రీ ఆంజనేయం’ షూటింగ్ జరుగుతోంది, అక్కడ ఆంజనేయుడు లేడట ఈవిడను పంపించేద్దాం కరెక్టుగా సూటవుతుంది’’ అంటూ మహేష్‌బాబు నామీద జోకులేసారు కూడా. అప్పటికి అంతా నన్ను నవ్వించినా ఆ నొప్పితో రెండురోజులు బాధపడ్డాను.
త్వరగా పడుకోవడం మానేసాను
నాకు చిన్నతనం నుండీ రాత్రి త్వరగా పడుకోవడం అలవాటు. ‘అతడు’ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అలాగే భోజనం అయున కాసేపటికి పక్క ఎక్కేసాను. షూటింగ్లో భాగంగా నేను పడుకున్న మంచం కింద కుంపటి పెట్టారు. వెచ్చగా ఉంది కదా అని నేను మెదలకుండా పడుకున్నాను. మొదటిరోజు ఎవరూ పట్టించుకోలేదు. కానీ తర్వాత రోజు మహేష్‌బాబు నా భోజనం కాగానే ‘‘ఆ! హేమక్క పడుకుంటుందికానీ మంచంవేసి, కుంపటి పెట్టేయండ్రా’’ అంటూ ఏడిపించేసరికి నాకు సిగ్గేసి ఇక ఆ సినిమా పూర్తయ్యేవరకూ అందరితో పాటు లేటుగానే పడుకునేదాన్ని. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎంత ఎంజాయ్ చేసామో! అక్కడే వంట చేసుకుని తినేవాళ్ళం. త్రివిక్రమ్‌గారికి పప్పు టమాటా, మహేష్ బాబుకి రసం, బ్రహ్మనందానికి ఆలు ఫ్రై ఇవన్నీ నేను, సుధక్క కలిసి చేసేవాళ్ళం.
వెంకటేష్ తనను తాను తిట్టుకున్నారు
‘మల్లీశ్వరి’ సినిమాలో వెంకటేష్‌గారిని బాగా తిట్టే పాత్ర నాది. అలా తిట్టాలంటే నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆ విషయం తెలిసి వెంకటేష్‌గారు సడెన్‌గా నా ముందుకు వచ్చి ‘‘హేమ నువ్వు నన్ను ‘సచ్చినోడా’ అన్నావట, ‘ఈడికేం పోయేకాలం’ అంటున్నావట’’ అంటూ ఆయన్ని ఆయనే తెగ తిట్టేసుకున్నారు. నేను పడుతున్న భయాన్ని పోగొట్టి అక్కడి వాతావరణాన్ని తేలిక చేసేసారు. మల్లీశ్వరి రిలీజ్ అయ్యాక మా ఇద్దరి కాంబినేషన్లో సీన్లన్నీ బాగా పండాయన్నారు అంతా. ఆ సినిమాతో నేను కామెడీ, సెంటిమెంట్ ఏదన్నా చేయగలనన్న ధైర్యం వచ్చింది. ఆ తరువాత వెనుతిరిగి చూసుకోలేదు. ఈ పాత్రకు హేమ సరిపోతుంది అని నన్ను నమ్మి పిలిచి పాత్రలు ఇచ్చిన వాళ్ళే తప్ప నేను కోరి అవకాశం ఇవ్వమని ఎవర్నయినా అడిగింది చాలా తక్కువ. సినిమాల మీద ఇష్టం నన్ను ఇంకా నా అదృష్టాన్ని పరీక్షించుకునేలా చేసిందేకానీ నన్ను నిరాశపరచలేదు. మీకు వినిపించే మా నవ్వుల వెనుక కనిపించని కన్నీళ్ళు కష్టాలు చాలా ఉంటాయి. వాటన్నింటి మధ్య మీరు కొట్టే చప్పట్లే ఇంకా మంచిపాత్రలు చేయాలన్న ఆత్మబలాన్ని మాకు ఇస్తాయి.
– శివాని